"అమ్మ శరీరం నుంచి దివ్యజ్యోతి వచ్చి మెల్లగా మహావతార్ బాబాజీ గుండెలో చేరింది"

 

మానవ భాషలో .. అత్యద్భుతమైన, అత్యంత మధురమైన, అత్యంత శక్తివంతమైన మాట 'అమ్మ'. ప్రతి ఆత్మ శరీరధారణ చేసే సమయంలో తనకు కావలసిన తల్లిదండ్రులను ఎంచుకుంటుందని మన అందరికీ తెలుసు. మన గురువు బ్రహ్మర్షి పత్రీజీ గారి ఆత్మ తన ఆత్మ సాధన కోసం ఎంచుకున్న అత్యంత పునీతమైన శరీరం మన సావిత్రీదేవీగారు. ఏ జీవికైనా తల్లే మొట్టమొదటి గురువు. తొలిముద్ద తినిపించిన, తొలి మాట పలికించిన, తొలి నడక నడిపించిన గురువు 'అమ్మ'. కాబట్టి ఈ అమ్మ మన గురువుకే గురువు.

ఈ పుణ్యమాత సరిగ్గా ధనుర్మాసపు గురువారం పాడ్యమి శుభ ఘడియలలో తన జ్యేష్ఠ పుత్రిక ఒడిలో హాయిగా ఆఖరి శ్వాస వదిలారు. 'అమ్మ' ఎన్నో జన్మల పుణ్యం ఈ ఆఖరి జన్మలో మన పత్రీజీ గారిని మనకు అప్పజెప్పడంతో ఆమెకు మళ్ళీ జన్మతీసుకునే అవసరం లేకుండా పోయింది. ఈ రోజు మనమంతా ఇంత హాయిగా, ఆనందంగా పత్రీజీ గారి వేణువు సంగీతాన్ని వింటున్నాం అంటే దానికి కారణం మన 'అమ్మే'. ఈ మహామాతకు ఏమిచ్చి మనం ఋణం తీర్చుకోగలం?.

డిసెంబర్ 21 వతేదీ ... గురువారం... సాయంత్రం 6.00 గంటలకు S.R.నగర్ కేర్ సెంటర్ నుంచి రమణ గారు వచ్చి నాకు "పత్రీజీ గారి అమ్మగారు మధ్యాహ్నం 3.15 నిమిషాలకు శరీరం విడిచిపెట్టారు" అని చెప్పారు. నేను వెంటనే బయలుదేరి సార్ ఇంటికి వెళ్ళాను. కారులో ఉన్నంతసేపు ధ్యానం చేస్తూనే వెళ్ళాను. నవంబర్‌లో సార్ పుట్టిన రోజుకి అందరూ విజయవాడకు బయలుదేరుతుండగా సార్ నన్ను "విజయవాడకు వస్తున్నారా మేడమ్?" అని అడిగారు. నేను "రావటం లేదు సార్" అని చెప్పాను. అప్పుడు సార్ "మేడమ్, మీరు ఇంటి లోపలికి వెళ్ళి మా అమ్మ గారితో కొంత సమయం గడపాలి" అని చెప్పారు. అప్పుడు నేను పత్రీజీ గారి అమ్మ, మన అందరి అమ్మ అయినటువంటి సావిత్రీదేవి గారితో కొంత సమయం గడపడం జరిగింది. ఈ విధంగా ఆ మహాపుణ్యాత్మురాలికి సేవ చేసే భాగ్యం నాకు కలిపించినందుకు పత్రీజీ గారికి ఎంతైనా కృతజ్ఞురాలను.

డిసెంబర్ 21

ఆ రోజు ఇంటికి వెళ్ళి కాళ్ళ మీద పూలదండ వేస్తూంటే అమ్మ ముఖం మీద చిరునవ్వు కనిపించింది. లోపలికి వెళ్ళి మేమమందరం ధ్యానం చేసాం. తరువాత స్వర్ణమాల గారికి చెప్పి బయటకు వస్తూండగా సార్ వేణువు వాయిస్తున్నారు. అమ్మ శరీరం చుట్టూ అందరూ ధ్యానం చేస్తున్నారు. వెంటనే నన్ను సార్ కూర్చోమని సైగ చేసారు. నేను కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళాను. రెండు నిమిషాల్లోనే హిమాలయ పర్వతాలు... కొన్ని గుహలు... కనిపించాయి. ఒక గుహ ముందు 'మహావతార్ బాబాజీ' నిలబడి వున్నారు. అప్పుడు అమ్మ శరీరం నుంచి ఒక దివ్యమైన జ్యోతి బయటకు వచ్చి మెల్లగా బాబాజీ గుండెలో చేరింది.

ఈ విషయం మీ అందరికీ వివరిస్తున్న ఈ సమయంలో కూడా.. ఆ దృశ్యం.. నా కళ్ళముందే కనిపిస్తోంది. ఆ జ్యోతి గుండెలోకి వెళ్ళగానే బాబాజీ ముఖంలో చిరునవ్వు కదలాడింది. ఆయన నా వంక చూసి గుహలోకి వెళ్ళిపోయారు. నా వొళ్ళంతా పులకరించింది. తరువాత అమ్మ ముఖంలో ముందు వున్నంత తేజస్సు కనిపించలేదు. అప్పుడు సార్ కూడా అక్కడలేరు. వెనుక పెరట్లోకి వెళ్ళిపోయారు. నేను సార్ దగ్గరికి వెళ్ళగానే "రండి మేడమ్, మీ మెస్సేజ్ కోసమే ఎదురుచూస్తున్నాను" అన్నారు. అప్పుడు నా అనుభవం వివరించాను. "yes మేడమ్, జరిగింది ఇదే. మీరు చూడగలిగారు" అన్నారు. ఆ తరువాత నేను ఇంటికి వచ్చేశాను. ఆ రాత్రంతా బాబాజీ గారే కనిపిస్తున్నారు.

"వెనక్కు తిరిగైనా చూడకుండా..."

మరుసటిరోజు స్మశానవాటిక బయట ఫుట్‌పాత్ మీద పత్రీజీ ధ్యానంలో కూర్చోగా మేమందరం కూడా కూర్చుని ధ్యానం చేశాం. అప్పుడు బాబాజీ అమ్మ దగ్గరకు వచ్చి కుడిచేయి నడుం మీద మరో చేత్తో అమ్మ చేయి పట్టుకుని గుహలోకి తీసుకువెళ్ళారు. అప్పుడు అమ్మ ధీమాగా ఒక మహారాణిలా వెనక్కు తిరిగైనా చూడకుండా గుహలోకి వెళ్ళిపోయారు. మేమంతా మిగతా కార్యక్రమాలను ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయాం. మరుసటి రోజు ఉదయం సార్ షిరిడీ వెళ్తూ... నన్ను నా అభిప్రాయం 'ధ్యానాంధ్రప్రదేశ్'కు వ్రాయమన్నారు.

"అనుభవం ఎలా మొదలుపెట్టాలా?" అని ఆలోచిస్తూ వుండగా నాకు తెలియకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోయాను. ధ్యానంలో నాకు అమ్మ ఎరుపు రంగు బోర్డర్ కలిగిన పచ్చని చీర ధరించి తలలో పూలు, చేతిలో గాజులతో ఆమె ముఖం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. గుహ బయట పత్రీజీ శ్రీకృష్ణుడులా నిలబడి వేణువు వాయిస్తున్నట్లు అనుభవం వచ్చింది.

"ఏటు చూసినా బాబాజీయే"

ఈ క్షణం కూడా ఎటుచూసినా బాబాజీయే కనిపిస్తున్నారు. నాలో ఏదో తెలియని అనుభూతి కలుగుతోంది. ఏ పని చేసినా, ఎటు చూసినా బాబాజీయే. నా శరీరంలోని అణువణువులో ఏదో పులకరింత, ఏదో మైమరపు. అమ్మ శరీరం వదిలి నాకు బాబాజీని ఇచ్చి వెళ్ళినట్లుంది. ఈ అనుభవం ఎంత వివరించినా తక్కువే. నేను నా జీవితంలో సదా అమ్మకు ఋణపడి వుంటాను.

పత్రీజీ లాంటి మహాపురుషుణ్ణి మన అందరికీ అందించిన అమ్మకు మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ... సెలవు.

 

గారపాటి లలిత
సంజీవరెడ్డినగర్
హైదరాబాద్

Go to top