" భక్తిమార్గం నుంచి ధ్యానమార్గం వైపు "

డాక్టర్ V. సత్యన్నారాయణమూర్తి, జగిత్యాల గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ

 

డాక్టర్ V. సత్యనారయణమూర్తి... Dr. V.S.N. మూర్తి గారు...కరీంనగర్ జిల్లా జగిత్యాలలో చాలా సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సర్జన్ అయిన వీరు సున్నిత స్వభావులు. సహనశీలి. 1998 దాకా సాయి భక్తిమార్గంలో సమాజానికి విశేష సేవలందించారు. 1998 తరువాత పత్రీజీ సాంగత్యంతో ధ్యానయోగి అయ్యారు! జగిత్యాల పట్టణంలో మంచిపేరు కలిగిన వీరు వారి నర్సింగ్‌హోమ్ పైన పిరమిడ్ నిర్మించి, ‘ధ్యానవైద్యం’ చేస్తూ, మెడికల్ డాక్టర్లందరికీ ఆదర్శప్రాయులయ్యారు! బ్రహ్మర్షి పత్రీజీ ఆదేశం మేరకు "ధ్యానజగత్" అనే మ్యాగజైన్‌ను 2005వ సంవత్సరం వరకు నడిపారు. వీరి కుటుంబమంతా ధ్యాన కుటుంబమే! Dr. V.S.N. మూర్తి గారు "పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్" లో ప్రముఖపాత్ర వహిస్తున్న అత్మజ్ఞాని! ఈ ఇంటర్వ్యూ ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులందరినీ మరింత ఎన్‌లైటెన్ చేయగలదని ఆకాంక్ష!

మారం శివప్రసాద్


మారం : మీకు ఆత్మప్రణామాలు! మీరు ఎప్పుడు మొట్టమొదటిసారి ధ్యానం చేయడం ప్రారంభించారు? పత్రీజీని మొట్టమొదటగా ఎప్పుడు కలుసుకున్నారు??

V.S.N. మూర్తి : 06-07-1998 న బ్రహర్షి పత్రీజీని యాదృచ్ఛికంగా కలుసుకోవడం జీవితంలో మరపురాని, మరువలేని రోజు! ఎందుకంటే అంతకు పదిరోజుల ముందే దిల్‌షుక్‌నగర్‌లోని "షిరిడీసాయి దేవాలయం" ఎదురుగుండా బుక్‌స్టాల్‌లో తిరుపతి నుండి పబ్లిక్ అవుతున్న "ధ్యానలహరి" మ్యాగజైన్‌ను చూడటం జరిగింది. అందులో పత్రీజీ గారి గురించి, పిరమిడ్‌లో ధ్యానం గురించి నేను మొట్టమొదటిసారిగా తెలుసుకున్నాను. "సందేహాలకు సంప్రదించండి" అని "V. సాయికుమార్ రెడ్డి" తిరుపతి అడ్రస్ వుంది. నేను ఒక ఉత్తరం వ్రాశాను ఆయనకి. ఆయన వెంటనే V.P.P. ద్వారా కొన్ని పంపారు.

ఆ బుక్స్ చదివి నేనెంతో ప్రభావితుడనయ్యాను. ఆధ్యాత్మికతలో "భక్తిమార్గం" కంటే పెద్దమలుపు "ధ్యానం" అనే ఒక చిన్నభావం కలిగింది నాలో. "సుభాష్ పత్రి" గారిని చూడాలనే తలంపు కలిగింది. జూలై 6న, 1998లో, ఉదయం 7గంటలకు పత్రీజీని కలిసిన తర్వాత, దాదాపు పది సంవత్సరాలుగా నేను బ్రహ్మర్షి పత్రీజీతో మమేకమయి వుంటున్నాను! ఈ పది సంవత్సరాలలో వారి ద్వారా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను!

మారం : మీ స్పిరిచ్యువల్ బ్యాక్‍గ్రౌండ్ గురించి, దత్త సాంప్రదాయాన్ని గురించి చెప్పండి!

V.S.N. మూర్తి : మా నాన్నగారు చిన్నప్పటి నుండే భక్తిమార్గంలో వుండేవారు. వేసవి సలవుల్లో రాత్రిపూట మా అన్నకు, నాకు, మా తమ్ముడికి కూడా రామాయణం, మహాభారతం, భాగవతం చెప్పేవారు. నా ఏడవ సంవత్సరం నుండే ఈ టచ్ నాకువుంది. నా పదవ సంవత్సరం నుండే రామాయణాన్ని ఎప్పుడూ జపిస్తూ వుండేవాడిని! అంతేగాక మా నాన్నగారు సత్యసాయి భక్తులు. పత్రీజీ ఇంటి దగ్గర్లోని "శివం"లో నా చిన్నతనంలోనే సత్యసాయిబాబా భజనల్లో పాల్గొన్నాను. ఆ తర్వాత నేను M.B.B.S., ఆ పైన M.S. చదివాను. క్రమేణ నాలో భక్తిభావం పెరుగుతూ వచ్చింది. తేదీ 24-12-08 న పుట్టపర్తి సందర్శించాను మొట్టమొదటిసారిగా. అప్పటినుండి దాదాపు పదేళ్ళు పత్రిసార్‌ను సందర్శించేవరకు నేను "సత్యసాయి మార్గం" లో అనుంగు భక్త పరమాణువుగా ప్రభావితుడయ్యాను. సత్యసాయి భక్తులందరూ ’షిర్డీబాబా, సత్యసాయి అభేదం" అని నమ్ముతారు. ఆ విధవంగా ఎన్నోసార్లు షిర్డీ మరి పుట్టపర్తి వెళ్ళాను నేను.

జగిత్యాలలో నేను ఎన్నో ఉచిత వైద్య సేవా శిబిరాలను ఏర్పాటు చేశాను. అలాగే దాదాపు 18 సంవత్సరాల పాటు ప్రతి గురువారం ఉచిత వైద్యచికిత్స చేశాను. నా భార్య అత్తామామలు "దత్త సాంప్రదాయం" లో వున్నావారు. ఆ రకంగా శ్రీ గణపతి సచ్చిదానందస్వామి పరిచయం అయింది. షిర్డీబాబా, సత్యసాయిబాబా, దత్తాత్రేయులవారు.. అంతా ఒకే స్వరూపమని విశ్వసించి, ఆ ఆనందాన్నీ నేను పొందాను. ఆపైన, పత్రీజీని కలిసిన తర్వాత, "ధ్యానమార్గం" లో స్థిరపడినందుకు నేను గర్విస్తున్నాను. భక్తి ముదిరితే ధ్యానమే మరి!

మారం : పత్రిసార్‌ను కలుసుకున్న తర్వాత మీ అనుభూతులు ఎలా వున్నాయి? మీ క్లయింట్స్ పట్ల మీ పద్ధతి?

V.S.N. మూర్తి : "భక్తిమార్గం" లో వున్నప్పుడు ఏదో ఒక మూల ఒక ఖాళీవనం వుండేది. అంటే ఒక గ్యాప్ "ఇంకా ఏదో ఏదో పొందవలసి వుంది! పత్రీజీని కలిసిన తరాత నేను చాలా బాగా ధ్యానసాధన చేశాను. ఎన్నో ధ్యాన అనుభవాలు వున్నాయి. అలా అలా సాధన, బోధన తర్వాత నేను తెలుసుకున్నదేమంటే "నేను సాధరణమైన వాడినేమీకాదు. నేనూ ఆసాధారణమైన యోగినే! ఈ సొసైటీకి, ఈ ప్రపంచానికి నేను అందించవలసిందెంతో వుంది! అహం బ్రహ్మస్మి" అని తెలుసుకున్నాను! ధ్యానంలోకి రాకముందు నా దగ్గరకు చికిత్సకు వచ్చిన వాళ్ళపట్ల "మానవసేవయే అయితే-మాధవసేవ" అనే దృక్పధం వుండేది. ధ్యానంలో స్థిరపడి, ఆత్మజ్ఞానం కల్గి "మమాత్మ సర్వభుతాత్మా" అనే భావన కలిగిన తర్వాత, నా పేషంట్లను నేను నాలాగానే భావిస్తున్నాను పత్రీజీ కాన్సెప్ట్ "మాదవసేవే మానవసేవ" గా ఇప్పుడు జీవిస్తున్నాను! వెరసి అప్పుడూ, ఇప్పుడూ కూడా చాలా తృప్తిగా నేను ప్రాక్టీసు చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా ఆనందంగా వున్నాను.

మారం : మీరు మీ నర్సింగ్ హోమ్‌పైన పిరమిడ్ కట్టారు. మీకు పిరమిడ్ కట్టాలని ఎందుకనిపించింది? ఎప్పుడు ప్రారంభం అయిందది?

V.S.N. మూర్తి : నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత,పుస్తకాలు చదువుతున్నప్పుడు తెలియని ఆనందం, అంతులేని ఆత్మతృప్తి నాకు అనిపించేది. " పిరమిడ్‌లో ధ్యానం చేయడం వల్ల మూడింతల శక్తి ఎక్కువ పొందవచ్చు; పిరమిడ్ శక్తి క్షేత్రాలు, పిరమిడ్ వున్న చోటు శక్తివలయలు ఏర్పడతాయి" అనే జ్ఞానం నేను బుక్స్ ద్వారా, పత్రీజీ ద్వారా చాలా బాగా తెలుసుకున్నాను. కాబట్టి, "నర్సింగ్ హోమ్ పైన పిరమిడ్ కడితే, పేషంట్లు త్వరగా వాళ్ళ వాళ్ళ జబ్బుల నుండి కోలుకుంటారు, చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా ధ్యానం చేసుకోవడానికి బాగ వుపయోగపడుతుంది" అని ఈ పిరమిడ్ కట్టించడం జరిగింది. 27-05-2001 న బ్రహ్మర్షి పత్రీజీ స్వహస్తాల ద్వారా ఈ పిరమిడ్‌కి ప్రారంభోత్సవం చేయించి "బాలాజీ పిరమిడ్ ధ్యానకేంద్రం" అని నామకరణం చేశాం.

మారం : మీకు పిరమిడ్ అనుభవం కర్నూల్లోనే కలిగిందా? మీరు మొదటిసారి పత్రీజీని కర్నూల్లోనే చూశారా?

V.S.N. మూర్తి : అవును! నేను "కర్నూలు బుద్ధా పిరమిడ్" వద్దనే మొదటిసారి పత్రీజీ ని కలుసుకున్నాను. అప్పుడే ఆ పిరమిడ్‌లో మొదటిసారిగా పిరమిడ్ ధ్యానం చేశాను.

మారం : మీ క్లినిక్‌పైన పిరమిడ్‌ను కట్టకముందు, పిరమిడ్‌ను కట్టిన తర్వాత మీ "వృత్తిపరమైన విజయాల" తేడా వుందా?

V.S.N. మూర్తి : భాగ్యవశాత్తూ మెడికల్ ప్రాక్టీస్‌లో నాకు మంచి పేరే వుంది. అయితే పిరమిడ్ నిర్మాణం తర్వాత నా సిక్స్త్ సెన్స్ చాలా పెరిగింది! సాధారణంగా నా దగ్గరికి ఏదైనా కాంప్లికేటెడ్ కేసే వస్తే, నా అంతరంగం నన్ను "కేస్ టేకప్ చేయి" లేదా "వద్దు" అని చెప్పేది. నేను అలాగే చేసేవాడిని. నా అంతరాత్మ ఖచ్చితంగా చెప్పేది ఏ కేస్ టేకప్ చేయాలో లేక వద్దా అని; నేను టేకప్ చేయని కేసులు ఆల్‌మోస్ట్ హైదరాబాద్‌కు వెళ్ళినా, మరెక్కడ వైద్యం చేయించుకున్నా కూడా ఫెయిల్ అవడం నేను గమనించాను. క్రమంగా నాకు బాగా అర్థమయింది పిరమిడ్ కట్టిన తర్వాత నా సిక్స్త్ సెన్స్ ఎంతో బాగా పెరిగిందని! అయితే పిరమిడ్‌ని మా నర్సింగ్ హోమ్‌పైన కట్టిన తర్వాత అంతరాత్మ ప్రేరణ మరీ విశేషంగా ఎక్కువ అయింది!

పిరమిడ్ కట్టి ఏడు సంవత్సరాలు అయింది. అసలు పేషెంట్ నా ఛాంబర్‌లోకి వస్తూనే నాకు "వాళ్ళ సమస్య ఫలానా కావచ్చు" అనిపిస్తుంది. అలాగే ఏ టెస్ట్ చేయకముందే, ఫలానా సమస్య వుంది అనిపించడం, టెస్ట్ చేయించిన తర్వాత అది నిర్ధారణ కావడం జరిగి నాకు చాలా ఆనందం కలుగుతోంది. అలాగే మందులు సూచించడంలో కూడా నాకు ఇన్‌ట్యూషన్ పవర్‌ఫుల్‌గా వుంటోంది.

మీరు ధ్యానం తర్వాత, పిరమిడ్ తరువాత నిజంగానే అద్భుతాలు జరిగాయి. నా అంతరాత్మ గురించి నేను తప్ప ఇంకెవరు చెప్పగలరు?!

మారం : ఒక సందర్భంలో పత్రీజీ మాట్లాడుతూ, "మానవశరీరంలో ‘కన్ను’, ‘పన్ను’.. ఈ రెండు ప్రత్యేకమైన ఆర్గాన్స్. వీటికి సర్జరీ సహాయం తీసుకోవచ్చు! మిగతా ఏ జబ్బులనైనా కూడా ధ్యానం ద్వారా హీల్ చేసుకుని వాటినుండి బయటపడాలి" అని చెప్పారు.

V.S.N. మూర్తి : "సత్యాలు" అనేవి హైయెస్ట్ స్పిరిచ్యువల్ స్టేటస్ నాలెడ్జ్ వున్నవారు చెప్పేవి 100% పర్‌ఫెక్ట్‌గా వుంటాయి. పత్రీజీ చెప్పింది అక్షరసత్యం. అన్నిటికీ మనస్సే ప్రధానం. "నాకు ధ్యానం ద్వారా జబ్బు తగ్గుతుంది" అని విశ్వాసంతో ధ్యానం చేసేవారు తమ జబ్బులు తప్పక తగ్గించుకోగలరు!

ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉదాహరణకు అపెండిసైటిస్, మరి కడుపులోని కొన్ని భాగాలు ఏక్సిడెంట్స్.. ఇలాంటి వాటికి వైద్యం ఆపరేషన్ తప్పనిసరి. మెడికల్ ఎమర్జన్సీస్, సర్జికల్ ఎమర్జెన్సీస్ ..ఇవన్నీ వైద్యుడు మాత్రమే తప్పక నిర్వర్తించవలసిన క్రియ. ఒక ఆలంబనగా వైద్యుడు తప్పక వుపయోగపడతాడు ఈ సమాజానికి. వైద్యోనారాయణో హరిః!

మారం : ఈ రోజు జరుగుతున్న వైద్యం గురించి, అనవసరంగా మందులు ప్రిస్క్రెబ్ చేయడం అయితేనేమి, చిన్న విషయాలకే ఎక్కువ భయపెట్టి ఆపరేషన్లు చేసే విషయమైతే నేమి, ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. మెడికల్ బిల్స్ ప్రజల ఆర్థికశక్తిని మించి వుంటున్నాయి!

V.S.N. మూర్తి : "రకరకాల ఆపరేషన్లు ఈ రోజు హాస్పిటల్ల్‌లో అనవసరంగా జరుగుతున్నాయి" అనేది తప్పక ఒప్పుకోవలసిన విషయం! ఈ రోజు "వైద్యరంగంలో ఎంతో సాధించాము" అని చెప్పుకోవడం ఎంత ఎక్కువగా వుందో..ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం అంతకన్నా ఎక్కువగా వుంది! అమెరికా వాళ్ళు ప్రతిపాదించిన ప్రామాణిక సూత్రాల మీద, జర్నల్స్ మీదా ఆధారపడి నడుస్తోంది ఈ రోజు ప్రపంచంలోకి వైద్యరంగం. ఆధునిక విధానాలు ఎన్నో వచ్చినా సరియైన రోగనిర్ణయం జరగడం లేదు. "మనస్సును చంపుకుని ఎక్కువశాతం డాక్టర్లు ప్రవర్తిస్తున్నారు" అని చెప్పక తప్పదు! దానికి అనుగుణంగానే ట్రీట్‌మెంట్ మరి ఆపరేషన్ల బిల్లులూ చాలా ఎక్కువగానే వుంటున్నాయి, ప్రజలు భరించలేనంతగా!

మారం : ధ్యానం వల్ల మెడిసెన్స్ 70% నుంచి 80% తగ్గించవచ్చు. మరి మాంసాహారం వల్ల జబ్బులు పెరుగుతున్నాయా?

V.S.N. మూర్తి : 95% మందులు తగ్గించుకోవచ్చు ఘంటాపథంగా ...ధ్యానం చేసి! చీటికీ మాటికి వైద్యుడిని సంప్రదించవలసిన అవసరమే లేదు ధ్యానం చేస్తే ! గత పది సంవత్సరాల్లో నేను నా పేషెంట్లకి ఎంత వీలయితే అంత మందులు తగ్గించి కూడా ఎన్నో వ్యాధులు నయం చేశాను. "పధ్యం ఏమిటి?" అంటే "పిరమిడ్ పథ్యం" ముందు చెపుతాను నేను! అంటే మాంసం మానమని! ప్రతి పేషెంట్‌కి నేను మాంసాహారం తినవద్దని చెపుతాను! జిజ్ఞాస చూపించిన వారికి ధ్యానం గురించి చెపుతాను. చాలమంది వాళ్ళకు వాళ్ళే చెపుతరు "సార్ - నేను మూడు రోజుల క్రింద చికెన్ తిన్నాను. రక్తం పడుతోంది." "వారంక్రింద ఫ్లానా జంతుమాంసం తిన్నాను. ఛాతీలో, కడుపులో బాధ వుంది" అని! అప్పుడు పత్రీజీ యే గుర్తుకువస్తారు! వారి సూక్తి "మాంసాహారం - పాపాహారం" అని పేషెంట్లకు చెపుతాను నేను. పిరమిడ్ డాక్ట‌ర్‍ని! అలాగే ట్రీట్ చేస్తాను ఖచ్చితంగా!

మారం : మాంసాహారం యొక్క ప్రభావం ఎలా వుంటుంది మానవశరీరం మీద ? మనస్సు మీద??

V.S.N. మూర్తి : మానవశరీరం అసలు మాంసాహార పరంగా తయారు చేయబడలేదు! కేవలం శాకాహార పరంగానే మనిషి శరీరం డిజైన్ చేయబడింది! మన పళ్ళ నిర్మాణం చూస్తే శాకాహార జంతువులు పళ్ళ నిర్మాణం ఒకేలాగా వుండడం గమనించవచ్చు. మనిషి ప్రేవులు బాగా పొడుగ్గా వుంటాయి. శాకాహార జంతువుల ప్రేవులు కూడా మనిషి ప్రేవుల్లా పొడవుగా వుంటాయి. మాంసాహార జంతువులకూ, శాకాహార జంతువులకూ పళ్ళు కానీ, ప్రేవులు కానీ వేరుగా వుంటాయి.

మానసిక పరిస్థితి పైన మాంసాహారం ప్రభావం చాలానే వుంటుంది. మాంసాహారం ఎక్కువగా తిన్న మనుష్యులు కానీ, జంతువుల కానీ తమోగుణంగా వుండడం గమనించవచ్చు. చైతన్యం తక్కువగా వుంటుంది. మాంసాహారం తింటే కోపం ఎక్కువగా వస్తుంది. ఒక పులి గాండ్రించినట్లుగా క్రోధంతో వూగిపోతూ వుంటారు.

మారం : మరి అభివృద్ధి చెందిన దేశాలనీ అంతా "మాంసాహారమయం" గా వున్నాయే? వాళ్ళెందుకు దీన్ని గమనించి ఆచరించడం లేదు?

V.S.N. మూర్తి : చెప్పాను కదా ప్రపంచమంతా అమెరికా చుట్టూ తిరుగుతుందని! మరి వారి అధికార దాహం అందరికీ తెలుసుకదా. దాదాపు మాంసాహార ప్రవృత్తి అంతా నిరంకుశం గానే కనబడుతుంది నిశితంగా గమనిస్తే ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలో నైనా! మాంసాహార జంతువులు, శాకాహార జంతువులు ఎంత తేడాగా వుంటాయో! పులి, సింహం వుంటాయి డామినేటెడ్‌గా. అదే ఏనుగు శాకాహార జంతువు, ఎంత డిగ్నిఫైడ్‌గా వుంటుందో. అలాగే ఎద్దు, ఆవు హిప్పాపొటొమాస్, గుర్రం, గాడిద, బర్రె, దున్న, ఒంటె ఇవన్నీ ఎంత సౌమ్యంగా వుంటాయో! మనుష్యుల్లో కూడా అంతే. మనిషి జంతువుల నుండి తెలుసుకోవలసింది చాలా వుంది!

అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇప్పుడిప్పుడే క్రమంగా శాకాహారం పట్ల మ్రొగ్గుచూపుతున్నాయి! దేసాలలో కుండబ్రద్దలు కొట్టినట్లుగా "శాకాహారమే సేవించాలి" అని డాక్టర్లు చెప్పేరోజు కోసం మనం ఎదురుచూద్దాం!

ధ్యానం ప్రకృతి సిద్ధమైన వైద్యం! శాకాహారం ప్రకృతి సిద్ధమైన పథ్యం! మాంసాహారం పైత్యం! ఇదే నా ప్రిస్క్రిప్షన్!

మారం : మెడికల్ డాక్టర్స్ యొక్క సెమినార్స్ మరి మీటింగ్స్‌లో మీరు ధ్యానాన్ని ప్రతిపాదిస్తూ వుంటారా?

V.S.N. మూర్తి : 2007 వ సంవత్సరం మార్చిలో నేను అండమాన్ వెళ్ళాను. అండమాన్స్ మాస్టర్స్ సహకారంతో నేను లాప్‌టాప్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. కంప్లీట్ హెల్త్ పైన డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్‌కి, స్టూడెంట్స్‌కి ఇచ్చిన ప్రెజెంటేషన్ వల్ల అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది! అట్లాగే ఈ జనవరి 30న సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో అక్కడి సూపరింటెండేంట్ ఇతర డాక్టర్లు, వైద్య విద్యార్థులకు ధ్యానం గురించి చెప్పడం జరిగింది. జగిత్యాలలో "ఇండియన్ మెడికల్ అసోసియేషన్" అని మా డాక్టర్స్ గ్రూప్ వుంది. ప్రతినెలా మీటింగ్ జరుగుతూ వుంటుంది. "కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్" అని జరుగుతుంది. అక్కడ నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను మెడిటేషన్ & వెజిటేరియనిజమ్ మీద. అలాగే కరీంనగర్ జిల్లాలో 200 మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్‌కి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను త్వరలో!

మారం :"ధ్యాన గ్రామీణం" గురించి చెప్పండి!

మూర్తి : 1989 నుండి 1998 దాకా నేను సత్యసాయి సంస్థలో వున్నప్పటి తరువాత, పల్లెటూళ్ళలో వైద్యశిబిరం నిర్వహించినపుడు వచ్చిన ప్రతి ఒక్కరికీ 15 నిమిషాలు ధ్యానం చేయించి, ఆ తరువాత వాళ్ళకు ట్రీట్ చేసాను. జగిత్యాల దగ్గరలో మూడు పల్లెటూళ్ళు వున్నాయి. "పూడూరు", "గొల్లపల్లి", "అల్లిపురం" అని.. "ఉచిత ధ్యాన, వైద్యశిబిరాలు" అని పేరు పెట్టి కొంతకాలం నేను గ్రామాల్లో ధ్యానప్రచారం చేస్తూ, ఉచిత వైద్యం చేశాను. చాలాకాలం నుండే గ్రామాల్లో ధ్యానం గురించి నాలో చాలా తపన వుంది.

మారం : స్పిరిచ్యువల్ ఎడ్యుకేషన్‌ని ప్రత్యామ్నాయ వైద్యవిధానంగా మెడిసిన్‌గా మెడికల్ కాలేజీలో ప్రవేశిపెట్టడం పట్ల మీ అభిప్రాయం?

V.S.N. మూర్తి : పత్రీజీ ఇదివరకు "దేవాలయాలు అన్నీ ధ్యానాలయాలు అవుతాయి" అన్నారు. మరి మనం ఈ మధ్యకాలంలో ఎన్నో దేవలయాల్లో యాజమాన్యం యొక్క అనుమతితోనే ధ్యానం బోధిస్తున్నాం కదా! అలాగే ప్రతి హాస్పిటల్‌లోనూ ముందు ధ్యానం చేయించి, ఆ తర్వాత టెస్టింగ్ చేసే కాలం త్వరలోనే వస్తుందని నా అభిప్రాయం!

W.H.O - ప్రపంచ ఆరోగ్య సంస్థ -ఇచ్చిన నిర్వచనంలో కూడా ఫిజికల్ & మెంటల్ హెల్త్‌తో బాటు "స్పిరిచ్యువల్ హెల్త్" కూడా వుండాలి! మరి "స్పిరిచ్యువల్ హెల్త్" వచ్చేది "ధ్యానం" ద్వారానే కదా! వైద్యాలయాలు కూడా ధ్యానాలయాలు అవుతాయి త్వరలోనే! మొన్న ఆ మధ్య నేను గోదావరిఖనిలో ప్రెజంటేషన్ ఇచ్చాను. అక్కడికి నలుగురు సీనియర్ డాక్టర్లు వచ్చారు. వాళ్ళ సందేహాలెన్నో వాళ్ళు నా ముందుంచి, నా సమాధానాలు విని అప్రతిభులయ్యారు! "వైద్యశాస్త్ర దృక్పథంలో శాస్త్రీయంగా ధ్యానం గురించి, శాకాహారం గురించి మమ్మల్ని చాలా కన్విన్స్ చేశారు" అని వారు ప్రశంసించారు! అలాగే నేను విజయవాడ, మంగళగిరి ఇలా వెళ్ళినచోటల్లా డాక్టర్లకు, ఇతరులకు ధ్యానం గురించి చెపుతూనే వున్నాను.

మారం : బుద్ధత్వం గురించి తెలియజేయండి!

V.S.N. మూర్తి : నేను ఒకప్పుడు గొప్ప భక్తుడిని. అయితే నేను ధ్యానం మొదలు పెట్టిన ఒక రెండు సంవత్సరాల కాలంలోనే "నేను ఒక పరమాత్మ స్వరూపుడిని" అని నేను తెలుసుకున్నాను! నేను ఒక ఎన్‌లైటెన్డ్ యోగిగా నన్ను నేను భావిస్తున్నాను!

ధ్యానసాధనతో బాటు, ఎప్పుడూ ధ్యానప్రచారం గురించి ఆలోచిస్తూ, ధ్యానప్రచారం చేస్తూ వుంటాను నేను. "బుద్ధుడి కంటే ఏమాత్రమూ నేను తక్కువ కాదు" అని పూర్తిగా విశ్వసిస్తాను నేను.

మారం : మనస్సుకు సంబంధించిన రుగ్మతలు ఆటోమేటిక్‌గా శరీరంలో ఏ భాగాలు అయితే వీక్‌గా వుంటాయో, వాటిమీద తమ ప్రభావం చూపుతాయి అంటారు; వివరించండి!

V.S.N. మూర్తి : మీరు చెప్పింది 100% కరెక్ట్! మనస్సు నిర్మలంగా వుంటే జబ్బులూ రావు. "నిర్" "మలం" లోనే వుంది అంతా! మనస్సు ప్రభావం వెంటనే శరీరంపై పడుతుంది.

గుండెజబ్బులు, మూత్రపిండాల జబ్బులు, శ్వాసకోస సంబంధమైన జబ్బులు, హార్మోన్లకు సంబంధించిన జబ్బులు, రోగనిరోధకశక్తికి సంబంధించిన జబ్బులు ఇలా అన్నీ "మానసిక జనితమైన జబ్బులు" అని, అలాగే గాస్ట్రిక్ అల్సర్స్, హైపర్ టెన్షన్స్, ఇన్‌డైజెషన్ ఇవన్నీ కూడా "మనస్సు ద్వారా వచ్చేవి" అని సశాస్త్రీయంగా నిరూపించబడింది.

ఏనాడో మన పూర్వ ఋషులు, పతంజలి సోదాహరణంగా వివరించండి చెప్పారు: "మనస్సు ప్రశాంతంగా వుంటే ఏ జబ్బులూ రావు" అని! "విశ్వశక్తి" అనేది బీజరూపంలో శరీరంలో వుంటే కూడా, అది స్వయం సంవృద్ధిగా మర్రిచెట్టుస్థాయికి అభివృద్ధి చేసుకుని, మనం పూర్ణ ఆరోగ్యవంతులం. కాగలం అన్నది నా అనుభవజ్ఞానం కూడా!

మారం : 1998లో చూసిన పత్రీజీకి 2008 లో పత్రీజీకి మీరు గమనించిన తేడా??

V.S.N. మూర్తి : అప్పటికీ ఇపటికీ పత్రీజీ శక్తిస్థాయి ఎన్నోరెట్లు పెరిగింది! అప్పటితో పోల్చుకుంటే 1999 నుండి మనకు ధ్యాన మహాయజ్ఞాలు వచ్చాయి. 2004 కు "ధ్యానాంధ్రప్రదేశ్", 2008 "ధ్యానభారత్", 2010 కి "పిరమిడ్ ఆంధ్రప్రదేశ్" ఇప్పుడు 2010 కి "ధ్యానగ్రామీణం" అన్నారు. మరి 2012 "ధ్యానజగత్" వుండనే వుంది. మరి ఎప్పటికప్పుడు వారు విశ్వవ్యాప్తమైన ఎన్నో పెద్ద ప్రాజెక్టులు సంకల్పిస్తున్నారు. పూర్తి చేయిస్తున్నారు. పూర్తి చేస్తున్నారు.

అప్పుడు ఆ స్థాయికి తగినట్లుగా తిరిగేవారు. ఇప్పుడు ప్రపంచమంతాతిరుగుతున్నారు! మరింత ద్విగుణీకృతమైన విశ్వాసంతో సాగిపోతున్నారు! మనందరినీ మరింత వుత్తేజంతో తనతో పాటు నడిపిస్తున్నారు! పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎంతో శక్తివంతంగా, ఎంతో వుత్సాహంగా ముందుకు సాగిపోతున్నారు!

 

మారం : మీ కుటుంబం గురించి చెప్పండి!

V.S.N. మూర్తి : మా నాన్నగారి 1991లో కాలం చేశారు. వారు చాలా నిజాయితీగలవారు. మా అమ్మ చాలా అద్భుతమైన మహిళ. చక్కగా ధ్యానం చేస్తూ వుంటుంది! నా భార్య "గిరిజా అన్నపూర్ణ" నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత రెండు మూడు సంవత్సరాలకు పత్రీజీ రెగ్యులర్‌గా జగిత్యాలకు ధ్యానసభల గురించి రావడం వల్ల, ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్‌ను చదవడం వల్ల తాను కూడా ధ్యానం చేయడం మొదలు పెట్టింది. ఆ తరువాత నేను ఆశ్చర్యపోయే విధంగా నా భార్య ఎందరికో ధ్యానం చేయమని చెప్పింది! గత సంవత్సరం ఏడవ మానసరోవర యాత్రలో కూడా పాల్గొని వచ్చింది! పత్రిగారితో బాటు తను కూడా అద్భుతమైన అనుభవాలు పొందింది! జగిత్యాలలో మహిళామండలిలో కూడా అందరితో ధ్యానం చేయిస్తోంది!

మా అమ్మాయి, మా అల్లుడు లండన్‌లో వుంటారు. వారు ధ్యానం చేస్తారు. మా అబ్బాయి B.D.S చేస్తున్నాడు. ధ్యానం చేస్తాడు!

మారం : ధ్యానం - సంగీతం పైన మీ అభిప్రాయం?!

V.S.N. మూర్తి : సంగీతం అనేది ధ్యానంలోకి త్వరగా తీసుకెళ్ళే మహా ఉపకరణం అని నా అభిప్రాయం. మనస్సుకి హాయినిస్తూ, మనస్సును నిర్మల స్థితిలో తీసుకెళుతూ, పూర్తిగా ధ్యానలగ్నం చెయ్యగలిగిన మాధ్యమం సంగీతం తప్ప మరేదీ లేదు! "నాదం" అనేది ధ్యానానికి ఎంతైనా అవసరం!

మారం : ఒక ‘ప్రశ్న’ గా కాకుండా మీరింకేమైనా చెప్పాలనుకుంటున్నారా?

V.S.N. మూర్తి : ఒక మామూలు మనిషి ధ్యానప్రచారం చేస్తే వచ్చే ఫలితం కంటే ఒక డాక్టర్ చెప్తే వచ్చే ఫలితం ఎక్కువ. ఒక డాక్టర్ చెప్పే ఫలితం కంటే ఒక అధికారవర్గం ద్వారా జరిగే ధ్యానప్రచారం వల్ల ఫలితం చాలా చాలా ఎక్కువ. ఆధ్యాత్మిక వాదులు పాలించేవారు కావాలని ఒకప్పుడు సోక్రటీస్ చెప్పాడు. అదే ఆశయంతో మన పత్రీజీ "పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా" ను స్థాపించారు. ఆధ్యాత్మిక వాధులు పాలించేవారైనా కావాలి! లేదా పాలించేవారు ఆధ్యాత్మికులుగానైనా మారాలి! అప్పుడే ఈ కుళ్ళిపోయిన వ్యవస్థ బాగుపడుతుంది!

మారం : "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకులకు మీ సందేశం?

V.S.N. మూర్తి : ప్రతి పాఠకుడు, ప్రతి పిరమిడ్ మాస్టర్ "ధ్యానాంధ్రప్రదేశ్" పాఠకుల్ని విధిగా పెంచడానికి కృషి చేయాలి! పత్రీజీ యొక్క కాన్సెప్ట్స్ మొత్తం రంగరించి అందించబడుతున్నాయి. "ధ్యానాంధ్రప్రదేశ్" మ్యాగజైన్ ద్వారా, ఎప్పటికప్పుడు! ఇతర పుస్తకాలు ఏవి చదవలేని వారు కూడా ప్రతినెలా "ధ్యానాంధ్రప్రదేశ్" పుస్తకం ఒక్కటి చదివినా చాలు! అంత జ్ఞానం వుంది మ్యాగజైన్‌లో!

Go to top