" నన్ను నేను మలుచుకున్నాను "

 

యువ పిరమిడ్ మస్టర్ జీవన్‌తో ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా వుంది. సికింద్రాబాద్ కార్ఖానా 'ఓమ్నా' మేడమ్ ఇంట్లో చిరంజీవి క్లాస్ విన్నప్పుడు "ఇతని అనుభవాలు ఏ సీనియర్ మోస్ట్ మాస్టర్‌కూ తగ్గవు" అని అర్థమయింది. ఇతడి తపన, తీవ్ర ధ్యాన సాధన, పట్టుదల, సాధించుకున్న వైన యువతనీ, ఇతర పైమా మాస్టర్లనీ మరి సీనియర్లందరినీ కూడా ఇంప్రెస్ చేస్తుందని నా విశ్వాసం.

మారం శివప్రసాద్


 

నా తల్లి పేరు రమాదేవి. తండ్రి రాంబాబు. నా చిన్నతనమంతా నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకూ వికాస్‌‍భారతి స్కూల్లో డాక్టర్ V.రామచంద్రరావు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. చిన్నప్పటి నుంచి నా మెంటాలిటీ డిఫరెంట్‌గా వుండేది. ఎప్పుడూ "నాకేమీ చేతకాదు, నేనేమీ చేయలేను" అనే ఇన్‌ఫీరియరిటీ కాంప్లెక్స్ వుండేది. టెన్త్‌క్లాస్ ఒకసారి ఫెయిల్ అయి, సెకెండ్ అటెమ్‌ప్ట్‌లో అతి కష్టం మీద పాస్ అయ్యాను. ఇంటర్‌లో జాయిన్ అయిన తరువాత నాలుగు సంవత్సరాల్లో కూడా పూర్తి చేయలేకపోయా. అసలు నాకు పుస్తకాలంటేనే ఎలర్జీ. చదువు మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. ఆ దిగులుతో ఆరోగ్యం బాగా దెబ్బతింది. మూడుసార్లు జాండిస్ వచ్చింది. "నా తల్లిదండ్రలను కష్టపెట్టడం, మా నాన్న డబ్బు వృధా చేయడం తప్ప నేనేమీ సాధించలేకపోయాను" అనే డిప్రెషన్‌లో పడిపోయాను. అది ఎక్కువై ఆత్మహత్యా ప్రయత్నానికీ దారితీసింది.

స్లీపింగ్ టాబ్‌లెట్స్ తెచ్చుకుని 25 టాబ్లెట్లు ఒకేసారి వేసుకున్నాను. అవి ఎంత డోస్‌వో మాత్రం నాకు తెలీదు. మా తల్లిదండ్రులకు ఒక ఉత్తరం వ్రాసిపెట్టాను: "మీ మీద కోపంతోనో మరి ఏ ఇతర కారణం తోనో నేను చావడం లేదు. నా జీవితం మీద నాకు విసుగుపుట్టింది. నేను ఏమీ సాధించలేకపోయాను... మీకు బరువుకావడం తప్ప. నేను మరోజన్మ తీసుకుని మరొక క్రొత్త జీవితం ప్రారంభించదలుచుకున్నాను" అని వ్రాశాను. టాబ్లెట్స్ వేసుకుని బాగా నిద్రపోయాను.

గాఢ నిద్రవచ్చింది. ఆ నిద్రలో ఒక కల. ఒక గోల్డ్ కలర్ పాము బాగా లావుగా, దాదాపు ఏడడగుల పొడవు వుంది. అది నన్ను మింగింది. అయితే నేను దాని తోకలో నుంచి బయటికి వచ్చాను. తెల్లవారి ఎనిమిది గంటలకు అమ్మ లేపితే లేచాను. లేవగానే "నేను చచ్చిపోయాను" అనే ఫీలింగ్‌తో వున్నాను. కానీ బ్రతికే వున్నాను. "నేనెలా బ్రతికాను? అని తక్కువ పవర్ వున్న నిద్రమాత్రలా? మరి ఎవరైనా ఆస్ట్రల్ మాస్టర్స్ ఆ పాము రూపంలో వచ్చి నన్ను కాపాడారా? నాకు అర్థం కాలేదు. ఆ తరువాత డిప్రెషన్ మరింత ఎక్కువయింది. ఇంటి నుంచి పారిపోవాలనే ఆలోచనా తరంగాలు వెంబడించేవి.ఆ సమయంలో అమ్మ మెడిటేషన్ చేయడం ప్రారంభించింది. నన్నూ చేయమని బలవంతం చేసింది. అమ్మ ఖచ్చితంగా ఒక గంట మెడిటేషన్ చేసేది. అమ్మ ఎదురుగా అయిదు నిమిషాలు కూర్చుని మళ్ళీ గంట పూర్తయ్యే లోపల అమ్మ ఎదురుగా కళ్ళూ మూసుకుని కూర్చునేవాడిని.

"ఈ వయస్సులోనే నాకు ధ్యానం ఏంటి?"

మా ఇంటికి ఎంతోమంది మహిళలు ధ్యానం చేయడానికి రావడం మొదలుపెట్టారు. నాకు ఇంట్లో ప్రైవెసీ పోయింది. T.V. అంటే నాకు చాలా ఇష్టం. T.V. పెట్టుకోవడానికి కుదరడం లేదు. అమ్మ మీద, పత్రిసార్ మీద బాగా కోపం వచ్చింది. అసలు పత్రిసార్ అంటే నాకు ఇష్టం వుండేది కాదు. ద్వేషించేవాడిని. "ఈ వయస్సులోనే నాకు ధ్యానం ఏంటి?" అని అమ్మపై కోపం చేసుకునేవాడిని. పత్రిసార్ పై కోపం తీర్చుకోవాలని అనుకునేవాడిని. మరి సార్ పై కోపం తీర్చుకోవాలంటే నేనొక గొప్ప యోగిని కావాలి. దానికి తీవ్రసాధన చేయాలి. ఇలా డిప్రెషన్ వైపు నుంచి నా ఆలోచనలు క్రమంగా ధ్యానం వైపు మళ్ళడం ప్రారంభించాయి. సన్నగా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఐదు, ఆరు తరగతుల చదువుతున్నప్పటి గుర్తు. ఏదైనా నోటి నుంచి వస్తే అది జరిగేది. సడెన్‌గా ఎప్పుడైనా "ఈ రోజు బస్సు రాదు" అనుకునేవాడిని. బస్సు టైర్ పంక్చర్ అయి కానీ, రిపేర్ అయి కానీ, సిటిలో ఏదైనా బంద్ లాంటి వాటి వల్ల కానీ బస్సు వచ్చేది కాదు.

అలాగే స్కూల్ పెట్టి పదిసంవత్సరాలు అయిన సందర్భంగా దశమ వార్షికోత్సవం చేశారు. అప్పుడు 'ఇండియా మ్యాప్' వచ్చేట్లుగా ఏవో విత్తనాలు చల్లారు. "ఇవి మొలవవు" అనిపించింది. అస్సలు మొలవలేదు. ఇలా మెడిటేషన్ లోకి రాకముందు వరకు జరిగింది. రామచంద్రరావు సార్ వాళ్ళ అబ్బాయి రవి నాకంటే పెద్దవాడైనా నాకు చాలా మంచి ఫ్రెండ్. అతడికి నాలుగేళ్ళక్రితం పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ కావడానికి ముందే ఎందుకో ఒకరోజు అతడు నడుస్తూ వుంటే ఆ కాలులో ఏదో ఒక వైవిధ్యం కనిపించింది. "ఈ కాలు విరుగుతుంది" అన్నాను. అన్నట్లే ఆ కాలుకి చాలా మేజర్ ఫ్రాక్చర్ అయింది.

"పూర్తి ఇష్టంతో మెడిటేషన్"

అంతకుముందు ధ్యానం నటించేవాడిని... అది కాస్తా ఆగస్ట్ 1, 1999 నుంచి నా ఇష్టంతో ధ్యానం చేయడం మొదలుపెట్టాను. మొట్టమొదటిసారి పూర్తి ఇష్టంతో మూడుగంటలు మెడిటేషన్ చేసాను. కూర్చున్న అయిదు నిమిషాలకే నిశ్చలస్థితి వచ్చింది. అది మూడుగంటల వరకు కంటిన్యూ అయింది.. అంటే లేచే దాకా. ధ్యానంలో అంతులేని ఆనందానుభూతి. ఏదో ఒక వాయిస్ వినపడింది: "ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏది అర్థం కాకుండా తపిస్తున్నావో, ఏది నీ మార్గమో అది నీకు ధ్యానంలో దొరుకుతుంది" అని. "నిజమే" అనిపించింది. అప్పటినుంచి రెగ్యులర్‌గా రోజుకు మూడుగంటలు మెడిటేషన్ చేసేవాడిని.

నేను తీవ్రసాధన మొదలుపెట్టిన రోజే పత్రిసార్ ను మొట్టమొదట చూసాను. మా ఇంట్లో సెంటర్ మొదలుపెట్టిన రోజది. ఆ రోజు నన్ను మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళమంది మా అమ్మ. నేను ససేమిరా వెళ్ళనన్నాను. " నేను పత్రిసార్‌ను చూడాలి. విజయలక్ష్మీ ఆంటీ ఆయన్ను గురించి 'తిడతాడు, కొడతాడు' అని చెప్పింది... అదేంటో చూడాలి" అన్నాను. సార్ మా ఇంటికి వచ్చారు. క్లాస్ మొదలయింది. అందరినీ మెడిటేషన్‌లో కూర్చోబెట్టారు. నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నట్లు నటిస్తున్నాను. కాసేపట్లో ఫ్లూట్ వాయించడం మొదలుపెట్టారు. "ఇది టేప్‌రికార్డరా? లేక నిజంగా ఫ్లూట్ వాయిస్తున్నారా?" అని కళ్ళు తెరచి చూసాను. ఆయన ఫ్లూట్ వాయిస్తున్నారు. కళ్ళు తెరచిన నా వైపు "కొడతాను" అన్నట్లు సంజ్ఞ చేశారు. "మా ఇంటికి వచ్చి ఈ ముసలాయన నన్ను కొట్టేదేంటి?" అని కోపంతో మా పెద్దమ్మా వాళ్ళింటికి వెళ్ళిపోయి రాత్రి 11.00 గంటలకు తిరిగివచ్చాను.

రాత్రి నిద్రపోయే ముందు ప్రతిరోజు స్లీపింగ్ పిల్ వేసుకునేవాడిని... నిద్రరాకపోవడం వల్ల. మమ్మీ చెప్పేది "ధ్యానం చెయ్యి నిద్రవస్తుంది" అని. ఆ రోజు ధ్యానం చేసి "నిద్ర రాదు" అని మమ్మీకి నిరూపించాలనుకున్నాను. "ఈ విధంగానైనా పత్రిసార్ మీద కోపం తీర్చుకుందాం, మమ్మీతో వాదన పెట్టకోవాలని" అనుకున్నాను. అలా అనుకుంటూనే నిద్రపోయాను. మాత్ర వేసుకోలేదు. కరెక్టుగా అరగంటకు మెలకువ వచ్చింది. ఇంక నిద్ర రాలేదు. ఎలాగూ ధ్యానం చేయాలని అనుకున్నాను కదా అని మొదలుపెట్టాను. ఇంతకుముందు చెప్పినట్లుగా అయిదు నిమిషాల్లో డీప్ స్టేటస్ లోకి వెళ్ళిపోయాను. మూడుగంటల అద్భుత ధ్యానం తర్వాత మెలకువ వచ్చింది. ఆ తరువాత బాగా నిద్రపట్టింది.

"ధ్యానంపై మక్కువ ప్రారంభమైంది"

ఆ గాఢమైన ధ్యానానుభూతితో నాలో ధ్యానంపై మక్కువ ప్రారంభమైంది. క్రమంగా అది పత్రిసార్ పట్ల ఇష్టంగా మారింది. ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడుగంటలు అలా మూడు నెలలు చేసాను. ఒకరోజు సార్ క్లాస్‌కి వెళ్ళాను. "డే టైమ్ ఫిజికల్ లైఫ్, నైట్ టైమ్ స్పిరిచ్యువల్ లైఫ్ గడిపేవాడే యోగి" అని సార్ ఆ క్లాస్‌లో చెప్పారు. నేను ఎప్పటినుంచో "యోగిగా మారాలి" అని అనుకునేవాడిని కదా. "తీవ్ర సాధన చేసి యోగిగా మారాలి" అని అప్పుడు మళ్ళీ అనుకున్నాను. అయితే మూడు గంటల ధ్యానం చేసిన వెంతనే నిద్ర వచ్చేది. ఉదయం లేచిన తరువాత కోపం వచ్చేది. మా ఇంట్లో పత్రిసార్ ఫోటో చూస్తూ "తీవ్రసాధన చేయడానికి మీరు సహాయం చేయవచ్చు కదా." అని కోపంగా అడగడం మొదలుపెట్టాను.

కొన్ని రోజులకి మూడుగంటల ధ్యానం చేసిన తరువాత నిద్రరావడం మొదలుపెడితే సార్ ధ్యానంలో కనిపించి చెంప మీద 'ఫట్' మని కొట్టేవారు. మబ్బు దిగి మళ్ళీ ధ్యానం కంటిన్యూ చేసేవాడిని. అలా రాత్రి ఆరుగంటలు ధ్యానం చేయడం అలవాటయింది. అలా రెండు మూడు నెలలు కంటిన్యూ అయింది. అప్పుడు నాకు "నేను నిద్రను జయించాను" అనే ఫీలింగ్ కలిగింది. అవేర్‌నెస్ మొదలయింది. ఎప్పుడైతే డిప్రెషన్ పోయిందో, ఎప్పుడైతే తీవ్ర ధ్యానం వల్ల నా మీద నాకు విశ్వాసం మొదలయిందో అప్పుడు నాకు "ఇంటర్ పూర్తిచేయాలి" అనిపించింది. 2000 సంవత్సరంలో చైతన్య కాలేజీలో మళ్ళీ ఇంటర్ రెండవ సంవత్సరం జాయిన్ అయి పాసయ్యాను. అప్పుడు నా పట్ల నాకు పూర్తి ఇష్టం కలిగింది.

"శ్రీ చంద్రశేఖరశర్మ గారు"

ప్రతి గురువారం మా ఇంట్లో క్లాసుకి పిరమిడ్ సీనియర్ మాస్టర్ శ్రీ చంద్రశేఖర్‌శర్మ గారు వచ్చేవారు. క్రమంగా వారి పరిచయం గాఢస్నేహంగా మారింది. నేను "ఆరు గంటలు ధ్యానం చేస్తున్నాను" అని చెబితే ఆయన తాను "ఏడు గంటలు చేస్తున్నాను" అనేవారు. నేను ఏడు గంటలు చేయడం మొదలుపెడితే వారు "పది గంటలు చేస్తున్నాను" అనేవారు. క్రమంగా అది రోజుకు పద్దెనిమిది గంటల ధ్యానంగా మారింది. అలా రోజుకు పద్దెనిమిది గంటలు దాదాపు మూడు నెలల ధ్యానం చేసాను. నేను లేచేవరకు లేపవద్దని మమ్మీకి, మా తమ్ముడు ధ్రువకు చెప్పి ధ్యానానికి కూర్చునేవాడిని. అప్పుడప్పుడు ఒక లైట్ అంటే కాంతి కనిపించేది. ఆ కాంతిని మెస్సేజ్ ఇమ్మని అడిగితే "వెయిట్ అండ్ సీ" అని రిప్లై వచ్చేది.

"నాలెడ్జ్ కావాలా? విజ్‌డమ్ కావాలా"

ఇలా చేస్తున్నప్పుడు నేను యోగిని అవ్వాలి అంటే చాలా ఎక్కువ సమయం ధ్యానం చెయ్యాలి, ఎక్కువ ఎనర్జీ పొందాలి. విశ్వంలో ఎంతొ జ్ఞానం వుంది, దాన్ని పొందాలి. అంటే మహర్షులు చేసినట్లుగా నేను కనీసం ఒక సంవత్సరం ధ్యానం చేయాలని సంకల్పించుకున్నాను... 2000 సంవత్సరంలో ఇంట్లోనే. అందరికీ కఠినంగా "డిస్టర్బ్ చేయవద్దు" అని చెప్పి ఒకరోజు రూమ్‌లో కూర్చుని రాత్రి ధ్యానం మొదలుపెట్టాను. ఖచ్చితంగా ఒక సంవత్సరంపాటు ధ్యానం చేయాలనే దృఢ సంకల్పంతో కూర్చున్నాను. 18 గంటల ధ్యానం తర్వాత ధ్యానంలో పత్రీజీ కనిపించి "నువ్వు ఎందుకు ఇంత తీవ్రసాధన చేస్తున్నావు?" అని అడిగారు. "యోగిని కావాలి" అని అన్నాను. "నువ్వు యోగివి కావడానికి నీకు నాలెడ్జ్ కావాలా? విజ్‌డమ్‌ కావాలా?" అని అడిగారు. "విజ్‌డమ్ కావాలి" అని చెప్పాను.

"నువ్వు ఒక సంవత్సరం ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ పొందుతావో మరి ఒక్కరికి ధ్యానం బోధిస్తే అంత విజ్‌డమ్ వస్తుంది. అంటే బుద్ధి అంత పరిపక్వమవుతుంది" అని చెప్పి అదృశ్యమయ్యారు. వారు అలా చెప్పగానే నేను ధ్యానం నుంచి లేచాను. అప్పటినుంచి ధ్యానం గురించి చెప్పడం మొదలుపెట్టాను. ఈ పద్దెనిమిది గంటల ధ్యానంలోనే మొట్టమొదటిసారి ఆస్ట్రల్ ట్రావెల్ జరిగింది. ఆకాషిక్ రికార్డ్స్‌లో నా గురించి నేను తెలుసుకున్నాను. టైమ్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసుకున్నాను. "ఎక్కువ సమయం ధ్యానం చేయాలి" అనుకున్నప్పుడు టైమ్ మానేజ్‌మెంట్ అనే కాన్సెప్ట్ నాకు ఉపకరించింది. మూడు గంటలు ధ్యానం చేసిన తరువాత మెలకువ వస్తే లేవకుండా మళ్ళీ శ్వాసను గమనించేవాడిని. మళ్ళీ ఒక మూడుగంటలు చేయగలిగేవాడిని అలా నాకు నేను సజేషన్స్ ఇచ్చుకుంటూ ఎక్కువ సమయం ధ్యానంలో కూర్చోవడం అనే మెడిటేషన్ టైమ్ మానేజ్‌మెంట్ తెలుసుకున్నాను. దీన్ని భౌతిక జీవితంలో సాధించడం అవసరం అనిపించింది.

నాకు నేచర్‌తో కలిసి వుండడం అంటే చాలా ఇష్టం. బహుశా అది చిన్నారిపురంలో సహజ ప్రకృతిలో చదువుకోవడం వల్ల అలవడిందేమో. ధ్యానంలోకి రాకముందు కూడా ఎప్పుడు పడుకుని ఆకాశం వైపు గంటకు పైగా ఊరికే చూస్తూ కూర్చునేవాడిని. అధిక ధ్యానసాధన చేసిన తరువాత ఒకరోజు ఇలాగే ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాను. ఒక పక్షి ఆకాశంలో ఒక రెక్క తరువాత మరొక రెక్క ఎగురవేస్తూ వెళ్తూండడం కనిపించింది. ఆ పక్షి వైపు చూస్తూ వుంటే "స్పిరిచ్యువాలిటీ ఒక రెక్క... ఫిజికల్ లైఫ్ మరొక రెక్క... రెండు రెక్కలూ పనిచేస్తూంటేనే పక్షి ఎగరగలుగుతుంది... రెండూ సమానంగా అనుభవిస్తూ బ్యాలెన్స్ అయినప్పుడే జీవితంలో పరిపూర్ణత" అని ఎవరో చెప్పినట్లు అనిపించింది. అప్పటినుంచి భౌతికంగా కూడా సాధించుకోవాలని నాకు అనిపించింది. అదే నన్ను ఫోటోగ్రఫీ కోర్స్ చేయడానికి పురికొల్పింది.

"ఫోటోగ్రఫీ అంటే చాల ఇష్టం"

నాకు ఐదవ తరగతి నుంచే ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఒకసారి ఈనాడులో వచ్చిన ఒక ఆర్టికల్‌లో కిర్లియన్ ఫోటోగ్రఫీ గురించి చదివి వినిపించుకున్నాను. అప్పటి నుంచే మనస్సులో ఫోటోగ్రఫీ చేయాలనే ముద్ర పడిపోయింది. వయస్సు పెరిగేకొద్దీ ధ్యానంలోకి వచ్చిన తరువాత "కిర్లియన్ ఫోటోగ్రఫీ" ద్వారా ఎనర్జీని ఫోటోగ్రాఫ్ చేయాలనే గాఢసంకల్పం కలిగింది. అదే నన్ను B.F.A. కోర్సులో చేర్చింది. హార్డ్‌వర్క్‌తోనే ఇంటర్మీడియట్ ఎలాగో పూర్తిచేసిన నేను క్రమంగా ధ్యానసాధన వల్ల వర్క్‌ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఇలా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టిన తరువాత రిజల్ట్స్ అద్భుతంగా రావడం మొదలుపెట్టాయి. అది నాకు B.F.A. లో అదీ ఫోటోగ్రఫీలో సీటు రావడం ఋజువయింది.

"నా తల్లిదంద్రుల ప్రోత్సాహం"

నాకు ఆరు, ఏదు సంవత్సరాల వయస్సు వున్నప్పుడు మా డాడీ ఫ్రెండ్ ఒకాయన ఫోటోలు బాగా తీసేవాడు. ఆయన తీసే ఫోటోలు చూసి నాకు ఎంతో ఇష్టం కలిగేది. అప్పటి నుంచి ఆ మోజు క్రమంగా పెరిగింది. అదే నన్ను ఫోటోగ్రఫీలో డిగ్రీ కోర్స్ చేయడానికి ప్రోత్సహించింది. స్వేచ్ఛగా నేను చేయాలనుకున్న కోర్సులో చేరడానికి నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, నా తమ్ముడి ఎంకరేజ్‌మెంట్ ముఖ్య కారణం. ఈ కోర్సు JNTU లో, ఉస్మానియా అఫ్లియేటెడ్ కాలేజ్ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో మాత్రమే వుంది JNTU కి వెళ్ళి ఫోటోగ్రఫీకి సంబంధించిన కోర్సు మెటీరియల్ ఒక సీనియర్ స్టూడెంట్ దగ్గర రెండువేలు పెట్టి సేకరించాను. ఎప్పటికప్పుడు అతని దగ్గర గైడెన్స్ తీసుకునేవాడిని, చర్చించేవాడిని. అయితే అతడు ఇచ్చిన కోర్స్ మెటీరియల్‌ని అస్సలు తిరగేయలేదు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ దగ్గరపడిన తరువాత ఇప్పుడు మేము కట్టుకున్న ఇంటికి శంఖుస్థాపన జరిగింది. పత్రి మేడమ్ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎగ్జామ్‌కి వెళ్ళకుండా శంఖుస్థాపనకు వుండాలనుకున్నాను.

డాడీ పిలిచి "ఎలాగూ ఫీజు కట్టావు కదా... హాల్ టికెట్ వచ్చింది, వెళ్ళి అటెంప్ట్ చెయ్యి... సీట్ వస్తే వచ్చింది లేకపోతే లేదు" అని సలహా ఇచ్చారు. సరే అనుకుని అస్సలు చదవని కోర్స్ మెటీరియల్ ఒకసారి తిరగేశాను. ముఖ్యమైన పాయింట్స్ మెమొరీ లోకి వెళ్ళిపోయినట్లు అనిపించింది. JNTU కి వెళ్ళి ఎంట్రెన్స్ వ్రాశాను. అదేరోజు సాయంత్రం రిజల్ట్స్ వచ్చాయి వ్రాసినవారు 300 మంది. నాకు కోర్స్ మెటీరియల్ ఇచ్చిన సీనియర్ స్టూడెంట్ ఫోన్ చేసి "జీవన్, కంగ్రాచ్యులేషన్స్. నీకు 27 వ ర్యాంక్ వచ్చింది" అన్నాడు. నేను నమ్మలేదు. "నాకేంటి 27 వ ర్యాంక్ రావడం ఏంటి? మన ర్యాంకులన్నీ ఎప్పుడూ వెనక నుంచే మనం పాసవ్వడమే మహా విశేషం" అన్నాను.

"కావాలంటే ఇంటర్‌నెట్ చూడు" అన్నాడు అతను. సరే అని నెట్ ఓపెన్ చేసి చూశాను. "27 వ ర్యాంక్" అని వుంది. అక్కడికీ నమ్మకం కుదరక JNTU కి వెళ్ళి అటెండర్‌కి అయిదు వందలు ఇచ్చి లిస్ట్ తీసి చూసాను. "27 వ ర్యాంక్" అనే వుంది. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇక మమ్మీ డాడీ ఆనందానికి హద్దులేదు. ఆత్మహత్యా ప్రయత్నం చేసిన కొడుకు ఈ స్థితికి వచ్చాడని తెలిసిన తల్లిదండ్రుల ఆనందం అంతా వారి కళ్ళల్లో ప్రస్ఫుటమయింది. అప్పుడు అర్థమయింది నాకు భౌతిక జీవితంలో కూడా నా గెలుపు ప్రారంభమయిందని. ఆ తరువాత మా డాడీ ఫ్రెండ్ ఒకాయన నన్ను పిలిచి "జీవన్, JNTU లో 27 వ ర్యాంక్ వచ్చినా కూడా రిజర్వేషన్స్ కోటా ఎక్కువుగా వుంటుంది. లాస్ట్ మూమెంట్‌లో సీటు రాకపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఉస్మానియాలో కూడా అదే కోర్సుకు ఎంట్రెన్స్ వ్రాయి ఎందుకైనా మంచిది" అన్నారు. సరే అని వ్రాశాను. ఆశ్చర్యం. మామూలుగా మార్కులు పది కూడా రాని నాకు ఉస్మానియా ఎంట్రన్స్‌లో 9 వర్యాంక్ వచ్చింది. ఇది నా జీవితంలో మరచిపోలేని మిరాకిల్. ఆశ్చర్యానందానుభూతి.

ఇందులో నాకు నచ్చిన మరో విషయం ఏమిటంటే ఎంతో రిలాక్స్‌డ్‌గా, ఏమాత్రం టెన్షన్ లేకుండా సహజంగా ఈ రెండు ఎంట్రెన్స్‌లను నేను వ్రాశాను. సోల్ ఇన్వాల్వ్‌మెంట్‌తో. అంతకుముందు ఇంటర్ దాకా ఎంతో శ్రమపడవలసి వచ్చేది. ఇప్పుడు నా కోర్స్ ఫోటోగ్రఫీలో ఫైనల్ ఇయర్. ఇంకా ఎంతో రిలాక్స్‌డ్‌గా చదువుతున్నాను ఒక ఆట ఆడినట్లుగా. ఇప్పుడు ఒక సినిమా చూసి రిలాక్స్‌డ్‌గా వుండి నెక్స్ట్ డే ఎగ్జామ్ వ్రాస్తున్నాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఎంజాయ్ చేయడం వల్ల అందులో డెప్త్ తెలుస్తోంది. ఇదంతా ధ్యాన మహత్యమే. అంతకుముందు ఎగ్జామ్స్ అంటే భయం, ఆందోళన, జ్వరం రావడం, మోషన్స్ అవ్వడం జరిగేది. అసిడిటీ ఫామ్ అయ్యి అల్సర్స్ లాగా ఫామ్ అయ్యేది. బ్లాక్ కలర్ వామిటింగ్ అయ్యేది. ఇదంతా టెన్షన్ వల్లనే. ఎప్పుడైతే ధ్యానంలో పూర్తిగా నిమగ్నమయ్యానో నా స్థితి ఒక్కసారిగా ఇంతింతై వటుడింతై అన్నట్లు శ్రమపడి అందుకునే స్థితి నుంచి ఆడుతూ పాడుతూ బెస్ట్ రిజల్ట్స్ పొందే స్థాయికి చేరింది.

"చిన్నప్పటి నుంచే పిల్లలు ధ్యానం చేయాలి"

పత్రిసార్ చెప్పినట్లుగా చిన్నప్పటి నుంచే పిల్లలు ధ్యానం చేస్తే చదువు గురించి ఏమాత్రం టెన్షన్ పడకుండా ఆడుతూ, పాడుతూ చదువుకుంటూ స్టడీస్‌ని ఎంజాయ్ చెయ్యవచ్చు. డాక్టర్ దగ్గరికి పోకుండా జీవించవచ్చు. నాకు గతంలో వచ్చిన అనారోగ్యం అంతా కేవలం టెన్షన్ వల్లనే. దాదాపు చాలామంది విద్యార్ధుల ఇతరుల పరిస్థితి ఇదే. 2001 లో పత్రిసార్ మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక పుస్తకం ఇచ్చారు అది "సెర్చ్ ఫర్ ది ట్రూత్" (రూత్ మాంట్‌గోరీ). ఒక్క పేజీ చదివాను. అస్సలు ఏమీ అర్థం కాలేదు. ఒక్క ముక్క కూడా. బాగా కోపం వచ్చి ఆ పుస్తకం చించేసాను. పుస్తకం చించిన తర్వాత మెడిటేషన్‌లో కూర్చున్నాను. ఒక అరగంటలో ఒక వాయిస్ వినిపించింది:

"ఐ యామ్ రూత్ మాంట్‌గోరీ. యు సే యు

నెవర్ అండర్‌స్టాండ్ దిస్ బుక్. సో ఐ హావ్ కేమ్

టు యువర్ కాన్షియస్ టు గివ్ ది ఎస్సెన్స్ ఆఫ్ దిస్ బుక్"

అని, ఆ బుక్‌లోని మ్యాటర్ అయిన మీడియమ్‌షిప్స్ గురించి, వాకిన్స్ గురించి ఇంకా చాలా విషయాలు వివరంగా నాకు చక్కగా అర్థం అయ్యేలా వివరించి చెప్పారు. దాదాపు మా ఇద్దరి భావ ప్రసారం మూడు నాలుగు గంటలు జరిగి వుంటుంది. అయితే నేను దీన్ని నమ్మే స్థితిలో లేను. "ఇది నా మైండ్ ప్లే" అనుకున్నాను.

"మాస్టర్ రామచంద్రరావు గారు"

నాకు చిన్నప్పటి నుంచి చదువుకున్న మా మాస్టర్ రామచంద్రరావు(అభయ్ ఇంటర్నేషనల్) వికాస్ భారతి ఛైర్మన్ దగ్గర చాలా చనువు. ఆయన మాకు బంధువు కూడా. ఆయన వద్దకు వెళ్ళీ నాకు వచ్చిన మెస్సేజ్ గురించి వివరంగా వారికి చెప్పాను.

ఆయన శ్రద్ధగా విని " ' సెర్చ్ ఫర్ ట్రూత్' పుస్తకం లోదా ఇదంతా" నీకు ధ్యానంలో చెప్పిన మాస్టర్ రూత్ అవునా?" అని అడిగారు. "అవును" అన్నాను. "నేను ఈ పుస్తకం చాలాసార్లు చదివాను. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుని నాకు చెప్పినదాంట్లో పదిశాతం కూడా నాకు ఇన్నిసార్లు చదివినా... నేను ఎంత మేధావినైనా... నాకే అర్థం కాలేదు" అని నన్ను ఆయన ఎంతో అభినందించారు.

 

P.జీవన్
సికింద్రాబాద్

Go to top