" శ్వాస మీద ధ్యాస వుంటే.. విశ్వం మనదే "

 

 

నా పేరు విజయలక్ష్మి.

మా వారు పెన్మెత్స అప్పలరాజు గారు అటవీశాఖలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నాకు మొదటి గురువు నా భర్త. నాకు ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు మనుమలు ఒక మనవరాలు ఉన్నారు. మా స్వగ్రామం లంకలకోడేరు.

నేను ఏడవ తరగతి వరకు చదువుకున్న సాధారణ గృహిణిని. నాకు ఐదు సంవత్సరాల వయస్సు వున్నప్పుడే నా తల్లి, 13 సంవత్సరాల వయస్సు వున్నప్పుడు.. నా తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి నేను దైవం మీదే ఆధారపడ్డాను.

40 సంవత్సరాల క్రితం వరకు నేను దేవుడు గురించి నా లోపలే వెతికేదాన్ని.. మరి నా హృదయంలో నుంచి నాకు ఏవో మాటలు వినిపిస్తూండేవి. అప్పటి నుంచి నాకు ఏ కష్టం వచ్చినా "లోపల ఉన్న భగవంతుడే నన్ను రక్షిస్తాడు" అన్న నమ్మకం నాకు ఎక్కువగా ఉండేది. ధర్మం, దానం, దైవం అన్నీ భగవంతుడే అనీ ఆ ధర్మంతో మమేకం అయినప్పటినుంచి ఆ ధర్మమే నన్ను నడుపుతోంది. అహింసా సిద్ధాంతాన్ని నమ్ముకుని నాకు మంచి నేర్పించిన వారందరి పట్ల కృతజ్ఞతతో ఉంటాను మరి ఆ కృతజ్ఞతే నన్ను నన్నుగా మార్చింది.

1974 నుంచి నామ ధ్యానం చేసాను మరి 2011 అక్టోబర్ నుంచి శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాను. ఇన్నాళ్ళూ "నేను వేరు.. భగవంతుడు వేరు" అనే భావం నాలో వుండేది. కానీ 2011 డిసెంబర్‌లో జరిగిన ధ్యానమహాచక్రం-2 అఖండ ధ్యానంలో పాల్గొన్న తరువాత "ఈ సృష్టిలో వున్న చైతన్యం అంతా కూడా భగవంతుడే అందులో నేను కూడా ఒక భాగమే" అని నాకు అర్థం అయ్యింది!

ధ్యానం ద్వారా నన్ను నేను తెలుసుకుని నేను నేనుగా మారాను. అనంతమైన సృష్టిలో అనంతమైన శక్తిని వదులుకుని ఇన్నాళ్ళుగా నేను.. "నేను" అనే ఇరుకులో పడి ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఇప్పుడు "నేనే అంతా, అంతా నేనే" అన్న భావంతో నా హృదయం విశాలం అయ్యి నా నుంచి ఇక సందేహాలు రావడం ఆగింది. "నేను ఆత్మను" అనుకుంటే నాకు అనంతమైన ఆత్మశక్తి వస్తుంది. నేను "విజయలక్ష్మిని"అనే దేహభావంతో వుంటే కేవలం శక్తి వచ్చినట్లు మాత్రమే కనబడుతుంది అని నాకు అర్థం అయ్యింది.

ఇప్పుడు నాకు సుఖం, దుఃఖం అన్న దానికి తేడాలేదు ఆణిముత్యాలు సముద్ర గర్భంలో ఉంటాయి కానీ అలలలో వుండవు. అలాగే ఆణిముత్యాలాంటి, జ్జానం, అనుభవం మన అంతరంగంలోనే వుంటాయి. మన లోపల ఎంత గొప్ప నిధి ఉందో లోపలికి వెళ్ళి చూస్తేకానీ మనకు తెలియదు దానికి ధ్యానం ఒక్కటే మార్గం.

శ్వాస మీద ధ్యాస వుంది అంటే సృష్టిపట్ల మనకు విశ్వాసం ఉన్నట్లే .. విశ్వాసం వుంటే విశ్వం మనదే .. ద్వారా ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నాకు అందించిన బ్రహ్మర్షి పత్రీజీకి కృతజ్ఞతలు.

 

విజయలక్ష్మి
వనస్థలిపురం
హైదరాబాద్

Go to top