" ధ్యానంతోనే విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించవచ్చు "

 

నా పేరు రవికుమార్. వృత్తిరీత్యా నేను రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, పోలీసు శిక్షణాలయంలో DSP గా పనిచేస్తున్నాను. ధ్యానం గురించీ, మహానుభావుల ఆధ్యాత్మిక విజ్ఞానం గురించీ TV-1 ఛానెల్‌లో డా|| V. హరికుమార్ గారి ద్వారా విని ప్రభావితుడనై మా బెటాలియన్‌లోని ట్రైనీపోలీసులకు వారిచే రెండుసార్లు ధ్యాన శిక్షణ ఇప్పించాను.

ఇలా వారికి ట్రైనింగ్ ఇప్పిస్తూ.. వారితో పాటే..నేను కూడా రోజుకు గంటసేపు ధ్యానసాధన చేస్తూండటం వల్ల నా అంతరంగంలో కూడా అద్భుతమైన మార్పులు రావడం మొదలయ్యింది. కంప్లైంట్స్ ఇవ్వడానికి పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులు చెప్పేది ఇప్పుడు నేను ఓపిగ్గా వినగలుగుతున్నాను. నాలో సహనశక్తి బాగా పెరిగి .. అధికారదర్పం అన్నది ప్రక్కన పెట్టి సమయోచితంగా వారి సమస్యలను పరిష్కరించగలుగుతున్నాను.

ఇలా చక్కటి సమన్వయంతో నేను నా పనితీరును మెరుగుపరచుకోవడంతో.. పై అధికారుల నుంచే కాకుండా నాతోటి ఉద్యోగస్థుల నుంచి కూడా నేను ప్రశంసలను పొందుతూన్నాను. ఎంతో వత్తిడి ఉండే నా జీవితం కేవలం రెండు నెలల ధ్యానసాధనతో శాంతంగా మారి.. నా ముఖంపై సహజమైన చిరునవ్వు మళ్ళీ వచ్చేసింది.

ఇంతకముందు "ఏదైనా సరే.. నాకే చెందాలి" అని అనిపించే నా ధోరణి మారిపోయి.. నేను ప్రక్కవాళ్ళకు కూడా నా సహకారాన్నీ, సంతోషాన్నీ అందించే విధంగా మార్పు చెందాను. ఉద్యోగరీత్యా నాలో అలవడిన అనవసర కాఠిన్యం...నా స్వభావంలా మారిపోయిందని బాధపడుతోన్న మా కుటుంబసభ్యులు.. నా మాటల్లో వచ్చిన శాంతం, మృదుత్వం మరి సరళత్వం చూసి సంతోషపడుతున్నారు. ట్రైనింగ్ బ్యాచ్‌లోని ట్రైనీ పోలీసులు కూడా ... నేను వాళ్ళతో ఒక స్నేహితుడిలా కలిసిపోయి వాళ్ళకు కావాల్సిన డిపార్ట్‌మెంట్ పరమైన సబ్జెక్టును వివరిస్తూంటే.. వారు కూడా ఎంతో సంతోషపడుతున్నారు.

డా|| హరిగారి ద్వారా బ్రహ్మర్షి పత్రీజీ ధ్యాన సందేశాలతో కూడిన పుస్తకాలు, సి.డిలు, మరి ఇతర దేశవిదేశాల నవీన ఆధ్యాత్మిక పుస్తకాలను తీసుకుని ఖాళీసమయాల్లో చదువుతూ జీవితాన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకుంటున్నాను.

డా|| హరిగారు నిర్వహించిన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ వర్క్‌షాప్‌లో పాల్గొని నా గతజన్మలను నేను చూసుకున్నాను. భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని తుపాకీ గుండు తగిలినా చలించకుండా వందలాది మందిని కాపాడిని ఒక అధికారిగా ఒకానొక జన్మలో నన్ను నేను చూసుకున్నాను. నేను చేసిన గొప్ప పనికి ఊర్థ్వ‌లోకాలకు చేరిన తరువాత షిర్డీసాయి నన్ను మళ్ళీ ఈ జన్మలో పోలీస్ అధికారిగా జన్మించి బాధ్యతలను నిర్వహించమని ఆదేశించడం నాకు తెలిసింది. మళ్ళీ అంతటి గురువు ఆదేశంతో ఈ జన్మలో కూడా నాకు ఎంతో ఇష్టమైన ప్రజాసంరక్షణ విభాగపు అధికారిగా జన్మతీసుకోవడంలోని నా జన్మకారణం కూడా అర్థం అయిన తరువాత.. ఇక నా ఆనందానికి హద్దే లేదు.

నా జీవిత లక్ష్యంలో భాగంగానె పోలీస్ ట్రైనింగ్ అకాడెమీ అధికారిగా మా ట్రైనీ పోలీసులకు దేహదారుఢ్య శిక్షణతో పాటు ధ్యాన ఆధ్యాత్మిక శిక్షణను కూడా ఇస్తూ వారిని పరిపూర్ణమైన అధికారులుగా తీర్చిదిద్దుతున్నాను.

చాలా తక్కువ సమయంలో నన్ను కుటుంబపరంగా, వృత్తిపరంగా మరి వ్యక్తిగతంగా కూడా ఉన్నంతంగా మలచిన ఆనాపానసతి ధ్యానానికీ మరి ఆ ధ్యానవిద్యను అందరికీ అందజేస్తూ సమాజంలో శాంతి భద్రతల స్థాపనకు విశేషంగా కృషిచేస్తోన్న బ్రహ్మర్షి పత్రీజీ కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

 

రవికుమర్
వికారాబాద్
రంగారెడ్డిజిల్లా

Go to top