" పత్రీజీ.. ఒక నడుస్తోన్న విజ్ఞానకోశం "

 

కార్పొరేట్ రంగానికి చెందిన ఆర్థిక వ్యవహారాల నిపుణులు శ్రీ దాట్ల హనుమంతరాజుగారు .. తమ జీవితప్రస్థానంలో ఎన్నెన్నో విజయశిఖరాలను అధిరోహించారు. సెక్రటేరియల్ ఽ కాంప్లియన్స్ కు లీగల్ సలహాదారులుగా .. వ్యాపారరంగంలో విజయకేతనాలను ఎగురవేసిన ఎందరెందరో వ్యాపార దిగ్గజాలకు సన్నిహితంగా మెలిగిన వీరు .. " ప్రాపంచిక విజయాలన్నీ తాత్కాలికాలే, ఆధ్యాత్మిక విజయాలే శాశ్వతమైనవి " అంటూ ఇన్నర్‌వ్యూ ద్వారా తమ మనోభావాలను మనతో పంచుకుంటున్నారు. శ్రీదాట్ల హనుమంతరాజు గారికి కృతజ్ఞతలు ..

T. వాణి


వాణి : బ్రహ్మర్షి పత్రీజీ ప్రత్యేక ఆదేశం మేరకు మీ ఇన్నర్ వ్యూని ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు అందిస్తున్నాం! మీ ధ్యానజీవితం గురించి తెలియచేయండి సార్?

హనుమంత రాజు : నా పేరు దాట్ల హనుమంతరాజు; మాది గుంటూరు జిల్లా.. అమరావతి దగ్గర బలుసుపాడు గ్రామం. మా నాన్నగారు దాట్ల గోవిందరాజు గారు వ్యవసాయదారులు..మరి మా అమ్మ శ్రీమతి అనసూయమ్మగారు సాధారణ గృహిణి. నా భార్య శ్రీమతి లక్ష్మి, అమ్మాయి డాక్టర్ స్వాతి ప్రియ మరి మా అబ్బాయి పవన్కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా అమెరికాలో పనిచేస్తూన్నాడు.

నా చిన్నతనం చాలావరకు మా అమ్మమ్మగారైన శ్రీమతి ఉప్పలపాటి వెంకాయమ్మగారి దగ్గరే గడిచింది. ఆమె విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ. స్థిరచిత్తంతో ఆమె వ్యవహారాలను నడిపేతీరు నాకు గొప్ప స్పూర్తిని ఇచ్చేది. ప్రతిఒక్కపని.. అది ఎంత చిన్నదైనా..మరెంత పెద్దదైనా.. దానిని ఆమె పూర్తి చేసేవిధానం ఎంతో అంకితభావంతో కూడుకుని ఉండేది. "గొప్ప ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని నేను ఈ రోజు గడుపుతున్నాను." అంటే ..దానికి కారణం.. ఒక విధంగా మా అమ్మమ్మ వ్యక్తిత్వం యొక్క ప్రభావం నా పై బలంగా ముద్రపడటమే అని చెప్పవచ్చు.

నా హైస్కూల్ చదువు తరువాత అమరావతి ప్రభుత్వ కాలేజీలో నా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాను. అక్కడే ప్రముఖ సాహితీవేత్త శ్రీవావిలాల సుబ్బారావుగారు మాకు తెలుగు లెక్చరర్‌గా ఉండేవారు. ఆ తరువాత నేను JNTU నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని డిస్టింక్షన్‌లో పాసయ్యాను. ఇన్సిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా (ICSI) ఫెలో మెంబర్‌గా చేరి CS, CA,మరి CWA విద్యార్థులకు దేశవిదేశాల్లోని యూనివర్సిటీలకు గౌరవ ఆచార్యుడిగా నేను పనిచేస్తున్నాను.

ICSI లో కోశాధికారిగా, వైస్ ఛైర్మన్‌గా మరి దక్షిణ భారతదేశపు విభాగానికి ఛైర్మన్‌గా నేను పనిచేసాను. 2009లో ICSI అధ్యక్షుడిగా.. గౌరవప్రదమైన హోదాను పొందడం.. నా ప్రాపంచిక జీవితంలో గొప్ప విజయం. పార్లమెంట్ చట్ట సభ విధివిధానాలను అనుసరించి ఆ పదవికిగాను నాకు కేంద్రమంత్రి హోదా లభించింది. 2009 సంవత్సరానికి గాను ICSI అధ్యక్షుడిగా అత్యున్నతమైన రాష్ట్రపతిఅవార్డను కూడా భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభాపాటిల్ గారి చేతుల మీదుగా అందుకున్నాను.

ఇదంతా కూడా నా జీవితం అనే నాణేనికి ఒకవైపు మాత్రమే!

ఏదైనా నాణేనికి విలువ ఉండాలంటే దాని రెండు వైపులా కూడా నిర్దిష్ట ప్రమాణాలు ముద్రించి ఉండాలి కదా .. అలాగే నా జీవితంలో ప్రాపంచిక విభాగం ఎంతో అద్భుతంగా సాగుతూ.. "ఒక మనిషి ఎంత విజయాన్ని సాధించాలి" అని కోరుకుంటాడో అంత విజయాన్ని అందుకుని కూడా "ఇంకా జీవితంలో ఏదో కోల్పోతున్నాను" అన్న భావనలోవుండేవాడిని. నా విజయాలకు నా స్నేహితులూ, బంధువులూ నన్ను నేనోళ్ళు పొగుడుతూన్నా కూడా ఇంకా ఏదో తెలియని వెలితి నన్ను వెంటాడుతూండేది. "ఆ వెలితి ఏమిటో" అన్నది నేను ధ్యానాభ్యాసం మొదలు పెట్టాక కానీ నాకు తెలియలేదు.

1980 లో నేను కంపెనీ సెక్రెటరీస్ విద్యార్థులకు ఫ్యాక్టల్టీగా ఉన్నప్పుడు ఒక విద్యార్థి అప్పుడప్పుడూ క్లాస్‌కి హాజరు కాకపోయేవాడు. కారణం అడిగితే.. "ధ్యానం క్లాసుకి వెళ్ళాను; ‘సుభాష్ పత్రి గారు’ అని కర్నూలు నుంచి వచ్చి ధ్యానం నేర్పిస్తారు" అని చెప్పేవాడు.

"చదువు మానేసి ఇలా ధ్యానాలు చేస్తూ తిరిగితే ఇక నువ్వు జీవితంలో బాగుపడువు" అని నేను అతడిని మందలించేవాడిని కానీ.. అతడు మాత్రం నా మాట లెక్కచేయకుండా అలా వెళ్తూనే ఉండేవాడు.

ఒకసారి .. 2009 అప్పట్లో నాకు ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చి దేశవిదేశాల ప్రముఖలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, మంత్రులు ప్రశంసలు కురిపిస్తూన్నారు. "ఇంతకంటే గొప్ప గౌరవం ఇక ఏముంటుంది?" అనుకుంటూన్న తరుణంలో..మా బంధువు వెంకట్రామరాజు గారు మెహిదీపట్నంలో జరిగే "స్పిరిచ్యువల్ ఇండియా ఆఫీస్"లో జరుగుతోన్న ధ్యాన శిక్షణా కార్యక్రమానికి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ స్టేజీ మీద దివ్యతేజస్సుతో వెలిగిపోతూ బ్రహ్మర్షి పత్రీజీ కనిపించారు! ఎన్నెన్నో వ్యాపార విజయాలను కైవసం చేసుకుని కోట్లకు పడగలెత్తిన వ్యాపారవేత్తలలో కూడా కనపడని అద్భుతమైన తేజస్సును నేను వారిలో చూసాను ..

కడ్తాల్లో నిర్మించబోయే పిరమిడ్‌ను గురించి ఆ రోజు కార్యక్రమంలో ట్రస్టీలు మాట్లాడుతున్నారు మరి బ్రహ్మర్షి పత్రీజీ కూడా ఆ పిరమిడ్ విశిష్టతను గురించి వివరించారు. అనంతరం జరిగిన ఒక గంట వేణుధ్యానంలో ధ్యానామృతాన్ని గ్రోలిన నాకు .. కళ్ళు తెరవగానే "కడ్తాల్ ట్రస్ట్‌లో నేను కూడా మెంబర్‌గా చేరి.. చారిత్రాత్మకమైన ఆ పిరమిడ్ నిర్మాణంలో పాలుపంచుకోవాలి" అని నాకు ఆత్మపూర్వకంగా అనిపించింది. క్లాస్ అయిపోయిన తరువాత ఎవరి ఇళ్ళకువాళ్ళం వెళ్ళిపోయాం.

చిన్నప్పటినుంచి మా అమ్మమ్మ దాతృత్వపుగుణాన్ని పుణికిపుచ్చుకున్న నేను .. చదువుకునే బీదపిల్లలకు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి కూడా కావలసిన ఆర్థిక సహాయాలను చేస్తూండేవాడిని..కానీ ఈ రోజు "ఆ మహాపిరమిడ్ నిర్మాణంలో ట్రస్టీగా పాలుపంచుకోవాలి" అన్న నా కోరిక నన్ను క్షణం నిలువనీయలేదు.

మళ్ళీ "స్పిరిచ్యువల్ ఇండియా" కార్యాలయానికి వెళ్ళి .. అక్కడి ఇన్‌ఛార్జ్ మల్లికార్జున్‌కి కలిసి "మళ్ళీ గురువుగారిని కలవాలంటే ఎలా?" అని అడిగాను.

"ఈసారి వారు వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను .. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి" అని చెప్పాడు. క్షణం ఒక యుగంలా వాళ్ళ ఫోన్ కోసం ఎదురుచూసాను.

కొన్నాళ్ళ తరువాత మల్లికార్జున్ నుంచి ఫోన్ రాగానే రెక్కలు .. కట్టుకుని గురువుగారి సమక్షంలో వాలిపోయాను.

నన్ను చూస్తూనే వారు ఎంతో ఆదరణతో పలుకరించి .. ప్రక్కనే వున్న గుజరాత్ మాస్టర్ రీటా కెప్టెన్ మేడమ్‍తో మాట్లాడమని చెప్పారు.

నా ప్రొఫైల్ అంతావిన్న రీటా మేడమ్ వెళ్ళి పత్రీజీతో ఏంచెప్పారో తెలియదు కానీ.. నా కోరికను పత్రీజీకి వెల్లిడించక ముందే వారు.. "స్వామీజీ! మీరు మా ట్రస్ట్‌మెంబర్‌గా వుండి .. ట్రస్ట్ యొక్క ఆర్థిక సంబంధమైన లావా దేవీలను ప్రణాళికా బద్ధంగా నిర్వహించకూడదా?" అన్నారు.

అది ఆదేశమో, ఆజ్ఞనో.. మరి వారు నాకు ఇచ్చిన వరమో తెలియదుకానీ .. నా మనస్సులోని కోరికను వారు అడగకనే తీర్చడం .. నాకు చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది. జీవితంలో ఇంతవరకు నెను సాధించిన విజయాలన్నీ ఒక ఎత్తైతే .. ఈ విజయం నాకు మరొక ఎత్తు మరి అది నా సంకల్పబలానికి నిదర్శనం ..

వాణి : చాలా బాగుంది సార్.. మరి ఇక్కడి నుంచి మీ ప్రయాణం ఎలా సాగుతోంది?

హనుమంత రాజు : చాలా అద్భుతంగా.. ఆత్మ తృప్తితో నేను ప్రతిక్షణం నా జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను. కడ్తాల్ మహేశ్వర మహా పిరమిడ్ .. ప్రపంచంలోకెల్లా ఎత్తైనా ధ్యానపిరమిడ్. అది భవిష్యత్తులో హైదరాబాద్ కీర్తికిరీటంలో ఒక వజ్రంలా నిలువబోతోంది. ఆ శక్తిక్షేత్రంలో ధ్యానం చేసిన ఎటువంటివారైనా ఆధ్యాత్మికంగా ఉన్నతదిశగా పరిణామం చెందడం ఖాయం. చక్కటి భవిష్యత్తుని కలిగి రాబోయేకాలంలో ప్రముఖ దర్శనీయస్థలంగా అది మారబోతోంది.

హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ మెంబర్లు అందరూ కూడా ఎంతో అంకితభావంతో నిబద్ధతతో ఈ నిర్మాణం పూర్తి చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. కేవలం సంకల్పబలంతోనే ఈ భూమిపై ఇంత గొప్ప కట్టడాన్ని నిర్మించడం అద్భుతాల్లోకెల్లా మహాద్భుతం .. ధ్యానం నేర్చుకున్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తనంతానుగా, తన బాధ్యతగా ఈ నిర్మాణానికి సహాయపడితే.. ఒక్కోబొట్టు కలిసి మహాసముద్రం అయినట్లు పిరమిడ్‌కి అది మహాసహాయం అవుతుంది.

2012, డిసెంబర్ 21నుంచి 31 .. యావత్ ప్రపంచం ఉద్విగ్నతతో ఎదురుచూస్తోన్న పరమాద్భుతమైన సమయం. భూమిపై మరి మనుష్యుల్లో కూడా ఎన్నెన్నో మార్పులూ మరి ఖగోళ వింతలూ సంభవిస్తాయని NASA తో సహా మరెన్నో పరిశోధనలు తెలియ జేస్తున్నాయి. ఇంతటి సున్నితమైన సమయంలోమనం కడ్తాల్లో జరుపుకోబోయే "ధ్యానమహాచక్రం-3" మరి "ప్రపంచ ధ్యాన మహాసభ" ల నిర్వహణను ఎంతో నమ్మకంతో మనకు అప్పగించడం.. బ్రహ్మర్షి పత్రీజీ కి మనమీద వున్న అపారమైన విశ్వాసానికి నిదర్శనం.

ఇందుకుగాను సమాజంలోని అన్ని వర్గాల వారికి విస్తృతంగా ధ్యానాన్ని చేరవేయడమే మౌలికంగా మనం చేయాల్సిన ముఖ్యమైన కర్తవ్యం!


బ్రహ్మర్షి పత్రీజీ మాట, నడత వారి ఆలోచన అన్నీ కూడా త్రికరణశుద్ధిగా ఉంటూ.. "ఒక నడుస్తోన్న విజ్జానకోశం"లా ఉంటారాయన. ప్లాన్, యాక్షన్ మరి విజన్.. అన్న మూడు ప్రాథమిక అంశాలను సమన్వయ పరుచుకుంటూ మనం ఏ పని చేపట్టినా అది తప్పకుండా విజయవంతం అవుతుంది అన్నది కార్పొరేట్ గవర్నెన్స్‌లో అతి ముఖ్యమైన సూత్రం! ఇదే సూత్రాన్ని మన స్పిరిచ్యువల్ గవర్నెన్స్‌లో కూడా అమలు పరుస్తూ విజయగర్వంతో ముందుకు దూసుకు వెళున్నారు బ్రహ్మర్షి పత్రీజీ. ఒక్కొక్కదేశంలో వారు పిరమిడ్ మాస్టర్ల సమన్వయంతో చేపడుతోన్న ధ్యానప్రచారోద్యమ తీరు..దేశ విదేశాల్లో విజయకేతనాలను ఎగురవేస్తోన్న మల్టీనేషనల్ కంపెనీల సునిశిత పనితీరుకు ఎంతమాత్రం తీసిపోదు.

వాణి : వ్యాపార రంగంలో ఎన్నెన్నో పెద్దపెద్ద మల్టీనేషనల్ కంపనీలనూ మరి వ్యాపార దిగ్గజాలనూ చాలా దగ్గరగా పరిశీలించిన మీకు.. ధ్యానం అక్కడ ఏ విధంగా ఉపయోగపడబోతోందో చెప్పండి?

హనుమంతరాజు : ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మేధోపరంగా ఎంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటూ మరి పటిష్టమైన ఆర్థికవిధానాలతో విజయాలను చవిచూసిన ఎంతో మంది వ్యాపార దిగ్గజాలు కూడా.. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తమ మానసిక సమతుల్యతను కోల్పోతూంటారు. తమలోని దైవత్వం పట్ల వారు ఎరుకను కోల్పోయి .. బీరువుల్లా మారిపోతూంటారు.

ఎప్పడయితే వాళ్ళు తమ చిన్నతనం నుంచే చదువుతో పాటు నిరంతర ధ్యానసాధన మరి చక్కటి ఆత్మజ్ఞానాన్ని కూడా అందుకుంటూ ఉంటారో.. అప్పుడు వారి సామర్థ్యం బహుముఖంగా విస్తరిస్తుంది. నిరంతరం ఒడిదుడుకులకు లోనయ్యే వ్యాపార రంగంలో వాళ్ళు స్థిర చిత్తంతో వ్యవహరించగలుగుతారు.

కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా తమ తమ సంస్థల్లోని ఉద్యోగులకు ప్రతిరోజు కొంత సమయాన్ని ధ్యాన సాధనకు కేటాయిస్తే .. వారిలో పనిసామర్థ్యం పెరిగి చక్కటి సుహృద్భావ వాతావరణంలో వారు పనిచేయగలుగుతారు. తమ బాగోగుల గురించి శ్రద్ద తీసుకుంటోన్న యాజమాన్యం పట్ల వాళ్ళు కూడా కృతజ్ఞతతో వుంటారు.

ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాలను ఆయా సంస్థల్లో నిర్వహించడం వల్ల ప్రతిఒక్కరూ తమ ఆత్మ నిజస్థితిని గుర్తించుకుంటూ.. కర్మసిద్ధాంతం పట్ల ఎరుకతో తమ జీవితాలను వున్నతీకరించుకుంటారు. ఏ రకంగా చూసినా .. సమాజంలోని ప్రతి ఒక్క రంగంలో కూడా ఆధ్యాత్మికత ప్రవేశిస్తేనే .. శారీరక, మానసిక మరి ఆత్మపరమైన ఆరోగ్యంతో అవి విలసిల్లుతాయి. భవిష్య బీమానిధి ఖాతా లాగా .. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక బీమా నిధిని ఖాతాను కూడా తెరుచుకుని అందులో తమ పుణ్యాన్ని జమచేసుకుంటూ వుండాలి. ఇది ఉద్యోగులూ మరి యజమాన్యాల యొక్క ఉమ్మడి బాధ్యత.

వాణి : చాలా బాగా చెప్పారు! మీరు ప్రముఖ దిన పత్రిక "వార్త" లో ఫైనాన్స్ కాలమ్నిస్ట్ కదా! ధ్యానాంధ్రప్రదేశ్ పత్రిక గురించి..

హనుమంత రాజు : నేను గత 15 సంవత్సరాలుగా "వార్త" దినపత్రికలో "కాలమ్నిస్ట్" గా ఉన్నాను. ICSI లో ప్రస్తుతం చలామణిలో వున్న సిలబస్ నేను రూపొందించిందే. ఇంకా ప్రముఖ ఆర్థికసలహాదారులు శ్రీ P.V. రత్నం గారితోకలిసి అకౌంటెన్సీ మరి ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్లో ఎన్నో పుస్తకాలు రచించాను. ఇవన్నీకాక నేను ఎన్నెన్నో సంస్థలకు చెందిన జర్నల్స్‌ను మరి మ్యాగజైన్స్‌ను చదువుతూంటాను.

అవన్నీ నా ప్రాపంచిక జీవితానికి అవసరం అయిన సమాచారంతో నిండిఉంటాయి. అయితే "ధ్యానాంధ్రప్రదేశ్ మాస పత్రిక" నాకు ఆధ్యాత్మిక పరంగానే కాదు ప్రాపంచికంగా కూడా ఎంతెంతో సమచారాన్ని అందిస్తోంది. ఒక్కోసారి అందులోని శాస్త్రీయమైన కాన్సెప్టులను నేను విజిటింగ్ ఫ్యాకల్టీగా వెళ్ళే కంపెనీ సెక్రెటరీస్, CA, CWA క్లాసుల్లోని విద్యార్థులకు ఉదహరిస్తూంటాను కూడా. అంతటి అద్భుతమైన ఆధ్యాత్మికతతో కూడిన వ్యక్తిత్వ వికాసపు ఆర్టికల్స్‌ను కలిగివున్న పత్రిక అది! ముఖ్యంగా అందులోని పత్రీజీ సందేశాలు .. ప్రతిఒక్కటీ ఆణిముత్యాలే .. ఒక్క పేజీ కూడా వదలకుండా చదువుతాను. ఎంతో విలువైన పత్రిక అది. ప్రతి ఒక్కరూ దానిని క్రమం తప్పక చదవాలి అని నా కోరిక.

 

దాట్ల హనుమంతరాజు
ఇ-మెయిల్ : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top