" పాపికొండలు... అత్యద్భుతం "

 

నా పేరు చంద్రశేఖర్. నేను పుట్టిందీ, పెరిగిందీ... ప్రస్తుతం వుంటున్నదీ... కర్నూలులోనే. నేను ఆరు సంవత్సరాల నుంచి ధ్యాన ప్రపంచంలో బ్రతుకుతున్నాను. మొదట అయిష్టంగా ప్రారంభించి ఇప్పుడు ఇష్టంగా చెయ్యడం నేర్చుకున్నాను. ధ్యానం ఎంత బాగా చేస్తే అంత శక్తివంతంగా మనల్ని, మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. మొదట్లో నాకు విపరీతమైన మెడ నొప్పి వుండేది. అసలు ధ్యానం చేయ్యడానికి వీలు కుదిరేది కాదు.

ఒకరోజు ధ్యానం చేస్తూ మాస్టర్స్‌ని సహాయం అడిగాను. "నా మెడ నాకు సహకరించటం లేదు. మెడ నొప్పి తగ్గితే తప్పకుండా ధ్యానం చేస్తాను" అని నేను ప్రామిస్ చేశాను. నా సంకల్పం ఎంతగా పనిచేసిందో ... చాలా విచిత్రంగా రోజురోజుకీ మెడనొప్పి తగ్గిపోయింది. ఆరు సంవత్సరాలలో ఈ ధ్యానం నన్ను ఓ మనిషిగా గుర్తింపుతెచ్చే విధంగా మార్చేసింది. ప్రస్తుతం నా వయస్సు 36 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలలో నేను ఏదో జీవిస్తున్నాను అంటే జీవిస్తున్నాను. అదేవిధంగా గడిపాను. ఓ ఉద్యోగం లేదు, పెళ్ళి లేదు. తినడం, తిరగడం, పడుకోవడం తప్ప మరే పని లేదు. అయితే ధ్యాన ప్రపంచంలోకి వచ్చిన ఆరు సంవత్సరాలలో ధ్యానం నా జీవితాన్ని మార్చేసింది. ఏ పని చేయాలన్నా అయిష్టంగా వుండేది. కానీ ధ్యానంలోకి వచ్చిన తరువాత ఏదీ అయిష్టం అనిపించేది కాదు. అన్నింటినీ ఇష్టంగా మార్చేసింది ధ్యానం. కొరియర్ బిజినెస్ ప్రారంభించాను. ఆ రోజుతో నా జీవితమే మారిపోయింది.

బిజినెస్, తర్వాత పెళ్ళి జరిగింది. జీవితంలో నేను స్థిరపడతాను అని కలలో కూడా అనిపించేది కాదు. కానీ దాన్ని సుసాధ్యం చేసింది కేవలం ఈ ధ్యానమే. నాజీవితాన్ని ఇంత పూలబాటగా మార్చిన మన అందరి గురువు బ్రహ్మర్షి పత్రీజీకి శతకోటి వందనాలు. నా జీవితంలో మరో ఆనందం కలిగించే అంశం 'ట్రెక్కింగ్' సార్ వెంట నేను ఈ ఆరు సంవత్సరాలలో 14 'ట్రెక్కింగ్‌'లకు వెళ్ళాను. తిరుపతి, శ్రీశైలం, పాండిచ్ఛేరి, కన్యాకుమారి, బెంగుళూరు, పాపికొండలు... ఇంకా చాలా... 'ట్రెక్కింగ్' అంటే చాలు... ఎక్కడలేని ఉత్సాహం నాలో ప్రవహిస్తుంది. ఈ మధ్యే జనవరి 21 వతేదీ పాపికొండలు ట్రెక్కింగ్ పత్రీజీ వెంట వెళ్ళాం. గోదావరి నది పైన లాంచీలలో. సుమారు 700 మంది బయలుదేరాం. నిజంగా నా జీవితంలో ఇంత అనుభూతి ఎప్పుడూ అనుభవించలేదు. గోదావరి నదిపై చల్లగాలిలో అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లతో వారి అనుభవాలు తెలుసుకుంటూ ప్రయాణించడం, చర్చించడం, పాటలు పాడుతూ చిన్న, పెద్ద అనే తేడాలు లేకుండా డ్యాన్సులు చేయడం, ఆనందంతో అందరూ ఎగిరిగంతులు వెయ్యడం... అబ్బో వర్ణనాతీతం.

ట్రెక్కింగ్‌ను భద్రాచలం పిరమిడ్ మాస్టర్ మరి D.శివప్రసాద్ గార్లు చాలా అద్భుతంగా నిర్వహించారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ఆ ప్రదేశంలో భోజనవసతులు, నీటివసతి కల్పించడం నిజంగా ధ్యానం వల్లనే సాధ్యం. పత్రిసార్ వేణువు వాయిస్తూ వుంటే ఆ చుట్టూ కొండలు, పొగమంచు, చల్లని చలి గాలి, వాటి క్రింద గోదావరి నదీ ప్రవాహం. వాటి మధ్య ఇసుకలో మేం ధ్యానం చేయడం... నిజంగా ఈ అనుభూతి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాదు. పేరాంటాళ్ళపల్లి, కొల్లూరు, పట్టిసీమ.. ఈ ప్రదేశాలు దర్శించడం నిజంగా అంతా పూర్వజన్మ సుకృతం. నేను ఈ ధ్యాన ప్రపంచంలోకి రాకుండా వుండి వుంటే ఇంత అందమైన ప్రదేశాలు ఇంత అద్భుతమైన ధ్యానశక్తి నాలోకి వచ్చేది కాదు.

ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానం చేయడమే కాకుండా నా తోటివారికి ధ్యానం చెప్తూ వాటి ఫలితాలు కూడా వారి ద్వారా తెలుసుకుని ప్రచారం రోజురోజుకీ పెంచుతున్నాను పత్రీజీకి మరొకసారి ధన్యవాదాలు.

 

D.V.చంద్రశేఖర్
కర్నూలు

Go to top