" నా బిడ్డ నాతోనే వున్నాడు "

 

నా పేరు ఝాన్సీ. మాది హైదరాబాద్. నాకు జీవితంలో అన్నీ వున్నాయి. ఏ లోటూ లేదు. బంగారం లాంటి ఇద్దరు కొడుకులు. మంచి భర్త. బిజినెస్. దేనికీ లోటు లేదు. జీవితం ఎంతో సంతోషంగా 'మూడు పువ్వులు ఆరు కాయలు'గా ప్రశాంతంగా హాయిగా సాగుతోంది. అలాంటి మా కుటుంబంలోకి పెనుభూతంలా 'మృత్యువు' వచ్చి పెద్ద కొడుకుని మింగేసింది. బెంగుళూర్‌లో B.B.M. రెండవ సంవత్సరం పరీక్షలు వ్రాసి వచ్చిన ఐదు రోజులకు జూన్ 2, 2007 సాయంత్రం అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వున్న సమయంలో ఏం జరిగిందో? ఎలా జరిగిందో? ఎందుకు జరిగిందో? కన్నుమూసి తెరిసేలోపు ఐదు నిమిషాలక్రితం వరకు మాట్లాడిన మనిషి అయిదవ అంతస్థు బాల్కనీలో నుంచి క్రిందపడి మరణించడం జరిగింది. డిగ్రీ అయిన తర్వాత పై చదువులకి అమెరికా వెళ్ళవలసిన 19 సంవత్సరాల కొడుకు కళ్ళముందే మరణించడం మా కుటుంబాన్ని అతలాకుతలం చేసింది. ఆ షాక్ నుంచి నేను తేరుకోలేకపోయాను. కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తూ 24 గంటలు నిద్రలేక, తిండిలేక, గుండెదడ, భయం, వణుకుతో నాలుగు నెలలు నరకయాతనతో చిత్రహింస అనుభవించాను.

ఎంతోమంది డాక్టర్లను కలిసాను. అందరూ ఒక్కటే మాట "మనోవ్యాధికి మందే లేదు; మీరే ధైర్యం తెచ్చుకోవాలి" అని చెప్పి నిద్రమాత్రలు ఇచ్చేవారు. రామచంద్రమిషన్, రామకృష్ణామిషన్, చినజీయర్‌స్వామి, బ్రహ్మకుమారీస్ ఇలా ఎందరినో కలిసాను. కానీ ప్రశాంతత అనేది రాలేదు. భయం, గుండెదడ తగ్గలేదు. ఎంతో డిప్రెషన్‌లోకి వెళ్ళాను. నేను ఎన్నో పూజలు చేసాను. వ్రతాలు చేసాను. దానధర్మాలు చేసాను. గుళ్ళు, గోపురాలు తిరిగేవాళ్ళం. సదా సన్మార్గంలో వుండే మాకు దేవుడు ఎందుకు ఇంత శిక్ష విధించాడు? దేవుడికి మేము ఏం తక్కువచేశాం? ఎందుకు నా కొడుకుని తీసుకువెళ్ళాడు? ఎవరైనా మహానుభావుడు కనిపిస్తే అడగాలి. నాకు సమాధానం చెప్పాలి. హిమాలయాలకు వెళ్తే అక్కడే ఋషులు ఉంటారట. వాళ్ళను అడగాలి. ఇలా నాకు ఆలోచనలు వచ్చేవి. దేవుడిని తిట్టి ఇంట్లో వున్న ఫోటోలు, దేవుడు పుస్తకాలు, మందిరం అన్నీ బయటికి పంపివేసాను. ఎప్పుడూ చుట్టూ నలుగురు ఉండాలి. అందరికీ ఫోన్లు చేస్తూ రమ్మని పిలిచేదాన్ని. నన్ను ఎలా దారికి తేవాలో, ఎలా మామూలు మనిషిని చేయాలో తెలియక మా కుటుంబ సభ్యులు నాతోపాటుగా నరకయాతన అనుభవించారు.

ఇలాంటి సమయంలో ఒకసారి మా ఇంటిదగ్గర A.V.కాలేజ్ గ్రౌండ్‌లో Old Age People కి అక్టోబర్ 1, 2007 న ఆటల పోటీలు జరుగుతున్నాయి. మైక్‌లో అనౌన్స్‌మెంట్ విని చూద్దాం అని మా వాళ్ళు నన్ను తీసుకువెళ్ళారు. అక్కడ బ్యానర్ మీద "ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస", "మానసిక ప్రశాంతత". "శారీరక ఆరోగ్యం" అని వుంది. దానిని చూసి అక్కడ వున్న సార్‌ని అడిగి నా విషయం మొత్తం చెప్పాను. ఆయన "అమ్మా, మీకు కర్మసిద్ధాంతం తెలియాలి. ముందు మీరు 'తులసీదళం' అనే పుస్తకం చదవండి" అని చెప్పి ఆ పుస్తకాన్ని నాకు ఇచ్చారు. "ఈ రోజు ఇక్కడ క్లాస్ వుంది, రండి" అని చెప్పారు. ఆ రోజు అక్కడ జరిగిన క్లాస్‌కి వెళ్ళాను. ఆ సార్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ వెంకటరమణ. ఆ తర్వాత "అమ్మా, మీరు రోజూ రెండు సార్లు ధ్యానం చెయ్యండి. మీకు ఇంటికి వచ్చి కూడా క్లాస్ చెప్తాం" అని ఫోన్ నెంబర్ ఇచ్చారు. నేను నాలుగురోజులు ఇంట్లో ధ్యానం చేసుకుంటూ... 'తులసీదళం'పుస్తకం చదవడం మొదలుపెట్టాను. నాకు కొంచెం ప్రశాంతంగా అనిపించింది. సార్‌కి పోన్ చేసి ఇంటికి పిలిచాను. వెంకటరమణ సార్ మళ్ళీ ఇంటికి వచ్చి క్లాస్ చెప్పి సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్ లోని పిరమిడ్ సెంటర్ గురించి చెప్పారు. తర్వాత నేను రోజూ పిరమిడ్ కేర్ సెంటర్‌కి వెళ్ళి శ్రీ S.రాజశేఖర్ సార్‌ను కలిసి ధ్యానం నిరంతరంగా చేయడం మొదలుపెట్టాను.

నేను ఆనాపానసతి పిరమిడ్ ధ్యానంలోకి వచ్చిన కొద్దికాలంలోనే 'భయం, 'దడ', 'వణుకు' అన్నీ తగ్గి శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రశాంతతని పొందాను. అసలు సత్యాన్ని తెలుసుకోగలిగాను. 'జనన మరణ చక్రం' గురించి, 'కర్మసిద్ధాంతం' గురించి,'ఎవరి లైఫ్ డిజైన్ వారిదే' .... అని ఇలా కొద్ది కొద్దిగా అయినా సరే.. నిజమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగాను. ఈ విషయంలో శ్రీ రాజశేఖర్ సార్ సహకారం చాలా పొందాను. ఆయనకు నేను ఆజన్మాంతం ఋణపడి వుంటాను. ధ్యానంలోకి వచ్చిన ఆరునెలల కాలంలోనే ఎన్నెన్నో ధ్యానానుభవాలు. రాష్ట్రపతి రోడ్ సెంటర్‌లో ద్యానంలోకి కూర్చున్న మొదటిరోజే మా బాబు నాకు 'షిరిడీ సాయిబాబా' లాగా కనిపించాడు. 45 రోజులకి మళ్ళీ ధ్యానంలో నా దగ్గరికి వచ్చి క్రింద కూర్చుని :

" అమ్మా, నువ్వు అన్ని ఫంక్షన్స్‌కీ వెళ్ళు
అందరితో మాట్లాడు, అందరితో
కలిసి సంతోషంగా వుండు "

... అని చెప్పాడు. ఇలా చాలా చాలా అనుభవాలు వచ్చాయి. సంక్రాంతి వెళ్ళిన తరువాత జనవరి 17, 2007 న మా ఊరిలో నేను ధ్యానం చేస్తూ వుండగా మా బాబు కూడా ధ్యానం చేస్తూ నుదుటి మీద పెద్ద వెలుగుతో, ఒక ఋషి లాగా కనిపించాడు.

"అమ్మా, ఎన్నో గుళ్ళు తిరిగావు.
ఎన్నో పూజలు చేసావు. దేవుడి కోసం
ఎంతో అన్వేషణ చేసావు. మీ కళ్ళముందే
వున్నాడు నడచివచ్చే దేవుడు పత్రిసార్
రూపంలో మీ ఇంటి ప్రక్కనే వున్నాడు".... అని చెప్పాడు.

ఆ తరువాత ఒకరోజు హిమాయత్‌నగర్ ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్‌లో పత్రిసార్‌ను కలవడం, ఆయనతో ఎక్కువసేపు మాట్లాడడం జరిగింది. అప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఆ తరువాత ఇంకా చాల అనుభవాలు వచ్చాయి. మార్చి 8 న గురువారం సాయంత్రం నేను హిమాయత్‌నగర్‌లోని ధ్యాన కేంద్రంలో ధ్యానం చేస్తూ వుండగా ఫస్ట్ పత్రిసార్ పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ కనిపించారు. తరువాత మేరీమాత విగ్రహం, జీసస్‌ను ఒడిలో ఉంచుకుని కనిపించారు. తరువాత జీసస్ ఫోటో కనిపించింది. తరువాత సాక్షాత్తు మా బాబు రేవంత్ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. అంతకుముందు కనబదినా నేను ఏమీ అడిగేదాన్ని కాదు. పిరమిడ్ మాస్టర్స్ "ఎవరు కనబడినా ప్రశ్న వేయాలి" అని చెప్పేవారు. అప్పుడు నేను "ఎందుకు వచ్చావు? ఏమైనా చెబుతావా? నువు నన్ను ఏం బాగుచేశావు? వెళ్ళిపో" అన్నాను. వాడు నవ్వాడు. నా అజ్ఞానాన్ని చూసి తరువాత...

" అమ్మా, నువ్వు ఇంతవరకు ఎవరినో
ఒకరిని దగ్గర పెట్టుకుని భయపడుతూ
వున్నావు. ఈ రోజు నాయనమ్మను కూడా
పంపించి ధైర్యంగా ఇంట్లో వున్నావు.
అందుకే వచ్చాను. మెడిటేషన్ వల్ల ఎంత
లాభం పొందావో అర్థమయ్యిందా? "

"నాకు మా ఊరు మాధవరంలో పిరమిడ్ కట్టించి 'రేవంత్ పిరమిడ్ ధ్యానకేంద్రం' అని పేరు పెట్టాలి అని వుంది. అంతా నువ్వే చూడాలి, మీ డాడీని ధ్యానంలోకి రప్పించి, ధ్యానం తెలియచేసి పిరమిడ్ కట్టడానికి ప్రేరేపించు" అన్నాను.

బాబు "అవుతుందిలేమ్మా" అన్నాడు.

"మీ డాడీ కూడా ధ్యానంలోకి రావాలి" అన్నాను.

"వస్తార్లే అమ్మా"

"మీ డాడీ బిజినెస్ బాగుండాలి"

"బాగుంటుందిలే అమ్మా"

"మీ తమ్ముడిని నువ్వే చూసుకోవాలి"

"అంతా బాగుంటుందిలే అమ్మా."

(తర్వాత బాబు 'వెళ్ళాలి' అని చూస్తున్నాడు)

"అప్పుడే వెళ్తావా? కాసేపు వుండు"

"నాకేమీ పనులు లేవనుకున్నావా? మళ్ళీ వస్తాను కదా."

నేను వాడు ఏం బట్టలు వేసుకున్నాడా అని చూస్తున్నాను. అప్పటివరకు సరిగ్గా కనిపించలేదు. అప్పుడు సాయిబాబా ప్రక్కన కూర్చుని వున్నాడు. బాబు సాయిబాబా చెయ్యి పట్టుకుని లేపాడు. అప్పుడు బాబు గోల్డ్ కలర్ బట్టలు వేసుకుని తలపాగా పెట్టుకుని ధగధగ మెరిసిపొయే యువరాజులాగా కనిపించాడు. బాబు సాయిబాబా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళటం... నావంక వెనక్కి తిరిగి చెయ్యి ఊపటం... నా కళ్ళారా చూశాను. నేను "బాబా, ఇన్నాళ్ళకి నా బిడ్డని నా దగ్గరికి తీసుకువచ్చారా" అంటూ ధ్యానంలోనే బాబా... బాబా... బాబా.. అంటూ బాబా నామస్మరణ చేసాను. ఇప్పుడు... "నా బిడ్డ నాతోనే వున్నాడు. పైలోకాలలో వుండి నన్ను చూస్తున్నాడు. బాబా దగ్గర హాయిగా వున్నాడు" అనిపిస్తుంది. ఇంతమంది ఆత్మబంధువులను జతచేసి ధ్యానమ్ ద్వారా జ్ఞానాన్ని పొంది ముక్తికి దారిచూపిన నా బిడ్డ రేవంత్‌కి ప్రేమతో ... అమ్మ. అలాగే నా అనుభవాలు అందరితో పంచుకునే అవకాశం కల్పించిన బ్రహ్మర్షి పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ...

 

ఝాన్సీ
హైదరాబాద్

Go to top