" కర్మతీరిపోయింది "

 

నా పేరు కనక దుర్గాంబ. మాది హైదరాబాద్. మాది మొదటినుంచి ఆధ్యాత్మికత కుటుంబం. నేనొక ఆధ్యాత్మిక భావాలు గల జీవిని. "నేను ఎందుకు పుట్టాను. అందరిలా పుట్టడం, పెరగడం, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, చావులు ఇంతేనా జీవితం?, నా వల్ల ఎవరికి ఏం ఉపయోగం?, ముక్తిని ఎలా పొందాలి? జనన మరణాల చక్రం నుంచి ఎలా విడివడాలి? భగవంతుడి వైపు ఒక అడుగైనా ఈ జీవితంలో ఎలా వేయాలి?" ఇలా అనేక ప్రశ్నలు, భావాలు కలిగేవి.

ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, వాటి గురించి కొంచెం అవగాహనను పొందటం, "ఎంత నాలెడ్జ్ వున్నా అనుభవపూర్వకంగా వుండాలి" అని తెలుసుకుని నా సాధన మొదలయింది. భక్తిభావన దీనిలో మొదట చాలా ఆనందాన్ని, ప్రేమను పొందాను. తరువాత అడ్డంకులు, అన్ని నెగెటివ్ ఆలోచనలు, నెగెటివ్ పిక్చరైజేషన్ ఇవి తప్పు అని తెలుసు. వాటిని అణచటంకోసం, పోగొట్టుకోవటం కోసం నిరంతర మానసిక పోరాటం... వీటి కారణంగా విపరీతమైన మానసిక వొత్తిడి, అలసట, వాటి రిఫ్లెక్షన్ శరీరం మీద. ఈ విధంగా ఇంచుమించు గత 6,7 సంవత్సరాలుగా బాధపడేదాన్ని. ఆఖరికి "భగవంతుడా, ఈ బాధ భరించలేను... నా జీవితంలో ఒక అడుగు ముందుకు వేయాలనుకుంటే అగాధంలో కూరుకుపోతున్నాను" అని మొరపెట్టుకునేదాన్ని. ఆఖరికి కంప్లీట్‌గా సరెండర్ అయ్యాను ... "నీ ఇష్టం ఎలా వుంచాలనుకుంటావో నీదే ఇష్టం" అని.

మార్చి 19, 2006 న ఒక భక్తురాలి ద్వారా (తర్వాత తెలిసింది ధ్యానస్థితి మీడియంషిప్ ద్వారా అని) సాయి నాకు తన కోరిక తెలిపారు: "అందరూ ధ్యానం చేయాలి అది నా కోరిక" అని. అలాగే "నువ్వు ఎందుకు పుట్టావో తెలుసా, అందరికీ ధ్యానం చెప్పాలి. అదే నీ పుట్టుక యొక్క కారణం" అని. ఇక నీ కర్మ తీరిపోయింది" అని. ఆ విధంగానేను ఈ ధ్యానంలోకి ప్రవేశించడం, ఈ షార్ట్ పీరియడ్‌లో శారీరకంగా, మానసికంగా ప్రశాంతతని పొందుతున్నాను. నేను పొందిన ఈ ధ్యాన లాభాలు తోటి వారు కూడా పొందాలనే తపనతో మా ఇంట్లో ఒక పిరమిడ్ పెట్టి ధ్యానకేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుప్రక్కలవాళ్ళు వాళ్ళకు వీలైన సమయంలో ధ్యానం చేసుకుంటూ వుంటారు. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా తోటివాళ్ళకి ధ్యానం చెప్పటం, నాకు చేతనైన చిన్న చిన్న కార్యక్రమాలు ఏర్పాటు చేయటం జరుగుతోంది.

బ్రహ్మర్షి పత్రీజీ ఆశీస్సులతో నా ఈ అనుభవాన్ని మీ ముందు పొందుపరుస్తున్నాను. అందరూ ధ్యానం చేస్తూ మనమూ, మన చుట్టూ ఉన్నవారినీ, వాతావరణాన్నీ కూడా మన వైబ్రేషన్స్ ద్వారా మంచిగా మార్చాలని కోరుకుంటున్నాను.

 

A. కనకదుర్గ
పరిపాలనాధికారి, M.N.J.&I.O.R.C.C.

హైదరాబాద్

Go to top