" నేనున్నాను "

 

నా పేరు Y.రామారెడ్డి(ధ్యాన గద్ధర్). మహబూబ్‌నగర్ పట్టణం. మహబూబ్‌నగర్ జిల్లా. దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. అప్రయత్నంగా నేనెవరో తెలియకుండానే నాకు గురువు గారు గొప్ప వరంగా నన్ను మహబూబ్‌నగర్ జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ అధ్యక్షుడిగా ఉండమని ఆదేశించారు. " ఏయ్ నీలో పవర్ కనిపిస్తోంది. ఎందుకు యూజ్ చేయకూడదు?" అని ఒకసారి గర్జించగానే నాలో వుండే చెడు మొత్తం కడిగేసుకుపోయింది. "ధ్యానాంధ్రప్రదేశ్ 2004 కల్లా కావాలి" అన్నమరుక్షణమే "2003 నాటికే 'ధ్యాన మహబూబ్‌నగర్' ఇస్తాను" అని వేదికపై ప్రకటించి 2003 ఆగస్టు 12 వతేదీన మూడురోజుల "ధ్యాన యజ్ఞం" వైభవంగా జరిపాము. "ధ్యాన మహబూబ్‌నగర్" రాష్ట్రంలోనే ప్రథమ జిల్లాగా ప్రకటించారు గురువు గారు. ఇది నాకు చాలా గర్వకారణం.

మహాశివరాత్రి రోజు అత్యంత వైభవంగా ఎంతో సుందరంగా అలంకరించిన వేదికపై పత్రీజీతో సమానంగా అనర్గళంగా ప్రసంగించే భాగ్యం నాకు దొరకటం... నా జన్మ ధన్యమైనట్లే. నా భాషణ నాకు తెలియకుండానే ఒకటిన్నర గంట ధారాళమైన వాగ్ధాటితో ఆ పరమశివుడికి నా పద్య కావ్యంతో అర్చన చేసి అందరి మన్ననలను పొందాను. అది మరువలేని శివార్చన నా జీవితంలో. అందరూ ముక్కంటిగా మారటానికి చేస్తున్న పత్రి గారి ధ్యాన యజ్ఞంలో ప్రతి మానవుడు పరమశివుడే కదా. "భూమి మీద నిజమైన ఆస్తికుడు అనేవాడు.. దేవుడున్నాడు వెతికి పట్టుకో అనే బోధకుడు.. ఒక్క పిరమిడ్ మాస్టర్ మాత్రమే" అని చెప్పక తప్పదు. సర్వం మనలో వుంది. సర్వశక్తులు మనలో వున్నాయి. శ్వాసను గమనిస్తే చాలు సర్వం సిద్ధిస్తుంది అన్నదే ఆనాపానసతి సిద్ధాంతం."మానవుడే మాధవుడు" అనే సత్యం ఆనాపానసతి సాధనతోనే సువిదితమవుతుంది. శ్రీ కాళహస్తి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారు అన్ని వసతులతో పాటు రుచికరమైన భోజనాలు, పరిసరాల పరిశుభ్రత, ఆలనా-పాలనా అంతా ఆత్మీయంగా చూసుకున్నారు. మేడమ్ సుమతి గారు, మేడమ్ శాంతి గారు ఇలా ఎందరో మాస్టర్స్ చేసిన సేవలు అమోఘం.

"ట్రెక్కింగ్‌లో పిరమిడ్ మ్యారేజ్"

శ్రీ శర్మగారు తన కుటుంబ సమేతంగా వడ్డించిన శివరాత్రి భోజన నైవేద్యం అమృతం. తదుపరి 2.00 గంటల నుంచి 6.00 గంటల వరకు 'వేయిలింగాలకోన' ప్రకృతి ధ్యాన విహారయాత్ర. ఆ కోనల్లో, కొండల్లో, అడవుల్లో అద్భుతంగా శ్రీ మహేష్ అరుణ గార్ల 'పిరమిడ్ మ్యారేజ్' అత్యంత అద్భుతంగా జగమెరిగిన బ్రాహ్మణుడి చేత చాలా ఆనందంగా మిఠాయిలు పంచుతూ జరిగిపోయింది. శివరాత్రి రోజు ఇలా అడువుల్లో మొదటి పిరమిడ్ పెళ్ళి అని చెప్పవచ్చు. 2006, సెప్టెంబర్ 18 వ తేదీన నన్ను మరచి నేను ధ్యానంలో నా భావనా సంద్రాన్ని పద్య కావ్యంగా ప్రపంచానికి అందించే భాగ్యం నాకు కలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఉదయం 4.00 నుంచి రాత్రి 8.00 వరకు కలం ఆగకుండా 100 పద్యాలు వ్రాశాను. ఆ రోజు నాకు 'ఆజ్ఞా చక్రం' లో విపరీతమైన కదలికలు, చాలా నొప్పిగా మరి చెప్పలేని ఆనందం జీవితంలో ఎన్నడూ పొందని ఆనందాన్ని, అనుభూతిని పొందాను. ఈ వ్రాసిన పద్యాలు నేను ఎక్కడ ఏ వేదిక మీద పాడినా అందరూ పరమానందభరితులై అయ్యారు. నేడు మన రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ప్రపంచమంతా తిరిగి సజ్జన సాంగత్యం చేయాలని నా ఆశ. నేను వ్రాసిన ఈ పద్యాలు మొదటి పద్యం చివరి పద్యం వ్రాస్తున్నాను. నేను వ్రాశాను. కానీ ఎవరో యోగులు వ్రాయించారు.

"గాయమొక్కచోట మందొక్కఛోట
గాయమున్నచోట మందులేదె?
మనసు ఒక్కచోట మనువొక్క చోట
మనువు వున్నచోట మనస్సు లేదె?
మనసు నిల్పనేని నీవె మహాయోగి,
యోగిరామ, ధ్యానయోగిరామ.

"వందనమర్పింప ధ్యాన తల్లికి నేను
యోగిరామ ధ్యాన శతకంబు వ్రాయ
నాడీమండలమంత ధ్యాన జ్ఞానము చేరి
అద్భుతంబును గ్రోల అనుభవంబులు రాగ
ఆనందముతోడ కదిలిపోయె నా కలము చూడు
పత్రిగారికి ఇది ప్రతిగా ఒనర్చి
ధ్యానపూజ చేయ ధన్యుడనయ్యా,
యోగిరామ, ధ్యాన యోగిరామ."

 

 

Y.రామిరెడ్డి
అధ్యక్షులు, మహబూబ్‌నగర్

Go to top