" నా శక్తిమేరకు..ఈజిప్టు‌లో ధ్యానప్రచారం చేస్తున్నాను "

 

నా పేరు మాధవి. నేను 1986 లో ఆంధ్రప్రదేశ్ లోని కడప పట్టణంలో జన్మతీసుకుని.. 2007 లో JNTU హైదరాబాద్ నుంచి ఫైన్ ఆర్ట్స్‌లో నా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను. 2008 లో నా ఆత్మసహచరుడు "రమేష్ గజ్జల" ను కలుసుకోవడం మరి 2008 నవంబర్‌లో మా వివాహం జరగడం.. అక్కడి నుంచి నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు కావడం జరిగింది.

వివాహం తరువాత మేము ఇద్దరం.. ఈజిప్టు దేశం‌లోని కైరో పట్టణానికి ఉద్యోగరీత్యా రావడం యాదృచ్ఛికమే అయినా అది నా ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప మలుపు! శక్తి క్షేత్రాలయిన గ్రేట్ పిరమిడ్‌లకు నిలయమైన ఈజిప్టు నిజంగా దేవ భూమిగా చెప్పుకోవచ్చు! అప్పటికి నాకు ఇంకా ధ్యానం గురించి అవగాహన ఏ మాత్రం లేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇండియాకు వచ్చినప్పుడు మా ఇంట్లో జరిగే ధ్యానం క్లాసులకు పెద్దగా హాజరుకాకపోయేదానిని! ధ్యానంలో కూర్చున్నా.. చిరాకుతో మధ్యలోనే లేచేదాన్ని.

2010 లో మా మామగారు.. కడప పిరమిడ్ మాస్టర్ శ్రీ రామసుబ్బారెడ్డి గారు మరి మా అత్తగారు కైరోకు రావడం జరిగింది. అప్పుడు నేను మా మామగారి దగ్గర కూర్చుని ఎన్నెన్నో ఆధ్యాత్మిక విషయాలను చర్చించేదాన్ని. అప్పట్లో నాకు చాలా తీవ్రమైన మోకాలి నొప్పి ఉండేది. మా మామగారు చెప్పినట్లు నేను ధ్యానంలో కూర్చుని మనస్సులో మాత్రం.. "నేను చేసే ధ్యానం నిజంగా సరియైనదీ మరి సత్యపూర్వకమైందీ అయితే నా మోకాలి నొప్పిని అది పూర్తిగా తగ్గించాలి" అనుకుని తీవ్రసాధన చేసాను. ఆశ్చర్యకరంగా నా మొదటిరోజు ధ్యానంలోనే నన్ను ఎన్నాళ్ళుగా బాధిస్తోన్న మోకాలి నొప్పినుంచి నేను విముక్తి పొందాను!

నా ఫ్రెండ్స్ అందరికీ ధ్యానంలో ఉన్న అద్భుతమైన స్వస్థతా శక్తిని గురించి తెలియజేసి మే 5వ తేది 2010 న మా ఇంట్లో 20 మంది ఈజిప్టు పౌరులతో మొట్టమొదటి ధ్యాన శిక్షణా తరగతిని ఏర్పాటు చేసాను. మా మామగారు తెలుగులో చెప్పిన ఆనాపానసతి ధ్యాన సమాచారాన్నంతా నేను ఇంగ్లీషులోకి అనువాదం చేసి వారితో ధ్యానం చేయించాను. ఇలా నాకు ధ్యానం నేర్పించి .. నాతో ధ్యానప్రచారానికి ఈజిప్టు‌లో శ్రీకారం చుట్టిన నా మొట్టమొదటి గురువు మరి మా మామగారు శ్రీ రామసుబ్బారెడ్డిగారికి నా వినయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను!

ఆ తరువాత 2010 జూన్ నెలలో నేను ఇండియాకు వచ్చినప్పుడు కడప పట్టణంలో బ్రహ్మర్షి పత్రీజీ ని కలవడం జరిగింది. ఒకానొక పెళ్ళివిందు సందర్భంగా అక్కడికి విచ్చేస్తోన్న "పత్రీజీని ప్రత్యక్షంగా కలువబోతున్నాము" అన్న భావనే నన్ను ఉద్విగ్నతకు లోను చేసింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేయబడిన ధ్యాన శిక్షణా తరగతిలో బ్రహ్మర్షి పత్రీజీ వేణుగానంలో ధ్యానం చేసిన నేను .. ఎంతో చక్కటి అనుభూతిని పొందాను. అనంతరం సుమారు 1000 మంది ఆహూతుల సమక్షంలో బ్రహర్షి పత్రీజీ నన్ను స్టేజీపైకి రావలసిందిగా పిలిచారు. విపరీతమైన టెన్షన్‌తో స్టేజీపైకి వెళ్ళిన నేను .. బ్రహ్మర్షి పత్రీజీ నా భుజాన్ని తట్టడంతోనే .. జీరో మైండ్ స్థితికి వెళ్ళిపోయి .. మళ్ళీ తేరుకుని ... ధ్యానంలో నా అనుభవం, కైరోలో నా ధ్యాన ప్రచారం అంతా అనర్గళంగా చెప్పేసాను. అనంతరం నన్ను అభినందించిన పత్రీజీ కేవలం మా కోసమే కడప వచ్చారని తెలుసుకుని ఆశ్చర్యపోయాం ..

ఇక కైరో తిరిగి వచ్చిన తరవాత 2010 సెప్టంబర్లో పత్రీజీ ఈజిప్టు సందర్శనకు కావాలసిన ఏర్పాట్లుచేస్తూ ఇంకాస్త పెద్దఇంటికి కూడా మారడం జరిగింది. కైరోతో పాటు .. ఈజిప్టులోని ఇతర ప్రాంతాల్లో ధ్యాన శిక్షణా తరగతుల ఏర్పాట్లు చేస్తూ ఒకవైపు మా ఇంటికి విచ్చేస్తున్న విశిష్ట అతిధి బ్రహ్మర్షి పత్రీజీ గడుపుపబోయే రోజులను తలచుకుంటూ ఇంకోవైపు .. అద్భుతం ఉండేది మా ఇద్దరికీ ..

పత్రీజీ ఆత్మీయ సాంగత్యం మరి వారి చేతి వంట మాకు మధురానుభూతులను పంచింది! ముంబయి పిరమిడ్ మాస్టర్ షీలా మేడమ్ చక్కటి సహాకారంతో ధ్యానశిక్షణా తరగతులను మేము అద్భుతంగా నిర్వహించాం. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థిని కావడంతో నేను ఆయిల్ కలర్స్‌తో కూడిన కాన్వాస్ పై పత్రీజీ చేతి ముద్రలను తీసుకోగా .. వారు దానిక్రింద మా సెంటర్ పేరు "Breath Energy Health Medtation" అని పేరు వ్రాసి.. సంతకం కూడా చేసారు. వారివెంట ఇండియా నుంచి వచ్చిన మన పిరమిడ్ మాస్టర్లందరూ కూడా తమ తమ వ్రేళ్ళ ముద్రలను కాన్వాస్ పై ఇచ్చి సంతకాలు పెట్టారు!

ఆ తరువాత 2011 లో బెంగళూరు మైత్రేయబుద్ధ మెగా పిరమిడ్ సందర్శించి ఆ శక్తిక్షేత్రంలో ధ్యానం చేసి అక్కడే శ్రీనివాస్ గారు కన్నడ భాషలో నిర్వహిస్తోన్న సేత్ వర్క్‌షాపుకు హాజరయి..నా పూర్వజన్మకు సంబంధించిన ఒక కర్మ ఫలితాన్ని నిర్మూలించుకున్నాను.

ఇక రెట్టించిన ఉత్సాహంతో నేను మళ్ళీ కైరో తిరిగి వచ్చి ఇండియా నుంచి తెచ్చుకున్న రకరకాల పాంప్లెట్లతో నా ధ్యానప్రచారం మొదలుపెట్టాను. ఇంటర్నెట్‌లోని ఫేస్‌బుక్ సహాయంతో "డిస్కవర్ ఇండియా ఇన్ ఈజిప్టు" అనే సంస్థ తో కలిసి.. వారి సహకారంతో 2011 సెప్టెంబర్‌లో బ్రహ్మర్షి పత్రీజీ ఈజిప్టుకు వచ్చినప్పుడు మరిన్ని అద్భుతమైన క్లాసులను విస్తృతంగా ఏర్పాటుచేశాం వీటిలో ముఖ్యమైంది నైలునది ఒడ్డున ఉన్న బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన అతి పెద్ద ధ్యాన సభ! ఎంతో మంది అక్కడ హాజరయి పత్రీజీ వేణుధ్యానంలో చక్కటి అనుభూతిని పొందామని ఫేస్ బుక్‌లో తెలియజేయడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. దాదాపు 200 మంది పాల్గొన్న ఆ సభలో నా స్నేహితురాలు "డోయా"... పత్రీజీ ఆంగ్ల ప్రసంగాన్ని ఈజిప్టు భాషలోకి అనువదించింది.

అదే రోజు సాయంత్రం ఏర్పాటు చేసిన మరొక కార్యక్రమ నిర్వహణలో బిజీగా ఉన్న నేను.. వంట మాటే మరిచాను! మా ఇంట్లోనే 20 మంది ఈజిప్టు మాస్టర్లతో ఏర్పాటుచేసిన ఆ కార్యక్రమం అనంతరం వంట ప్రయత్నం చేస్తోన్న నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పిన పత్రీజీ.. తామే స్వయంగా అంతమందికీ వండి..ప్రేమపూర్వకంగా కొసరి కొసరి తినిపించారు! అవసరంలో ఆదుకునే అమ్మ.. నాకు ఆరోజు వారిలో కనిపించింది.

పత్రీజీ తిరిగి ఇండియా వెళ్తోంటే నాకు ఎంతో దిగులు వేసింది. విమానాశ్రయంలో వారికి వీడ్కోలు ఇస్తూ దుఃఖంతో హృదయం భారమైన నేను వారిని.. "మిమ్మల్ని హత్తుకోవచ్చా?" అని అడిగాను.

సర్ నన్ను ఎంతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని "నన్ను ఇన్నిరోజులు బాగా చూసుకున్నందుకు థాంక్స్ మేడమ్" అన్నారు. ఇక నేను ఏడ్చేసాను. సార్ నా కళ్ళు తుడుస్తూ.. "ఇక నుంచి నేను సంవత్సరానికి రెండుసార్లు ఈజిప్టు వస్తాను. సరేనా?" అని నన్ను అనునయించారు. వారి ప్రేమకు కొలమానమే లేదు ..

ధ్యానంలో నాకు నచ్చిన సందేశం ప్రకారం ప్రస్తుతం నేను కైరోలో ఉన్న గర్భిణీస్త్రీలకు ధ్యానం నేర్పిస్తూన్నాను. ఇందుకు సంబంధించిన సమాచారాన్నంతా సేకరించుకున్న నేను..వారికి ధ్యానావశ్యకతను విస్తృతంగా తెలియజేస్తూన్నాను.

నా ఫ్రెండ్ "డోయా" సహాయంతో నైలు నది ఒడ్డున ఉన్న పార్కులో నిరంతరం ధ్యాన శిక్షణా తరగతులు జరుపుకోవడానికి సంబంధిత అధికారులను కలిసినప్పుడు వారు ఏ మాత్రం రుసుము లేకుండా మాకు అనుమతి ఇవ్వడం చాలా ఆశ్చర్యకరమైన విషయం .. కైరోలోని స్కూళ్ళల్లో మరి జనరల్ హాస్పిటల్స్, కేన్సర్ హాస్పిటల్స్ మరి గ్రామాల్లో మేము నిర్వహిస్తోన్న ధ్యానప్రచార కార్యక్రమాలకు అద్భుతమైన స్పందన వస్తోంది.

"2012 డిసెంబర్ వరకు.. నా శక్తి మేరకు నేను ఈజిప్టులో ఎంత ధ్యానప్రచారం చెయ్యగలనో అంతా పూర్తి చేస్తాను" అని బ్రహ్మర్షి పత్రీజీ కి మరి పిరమిడ్ సొసైటీ మాస్టర్‌లకూ మాట ఇస్తున్నాను.

 

G.మాధవి
ఈజిప్ట్
Email : This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Go to top