" ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి సర్జరీ చేసారు "

 

నా పేరు బొద్దులూరి నాగేంద్రమ్మ. నాకు గత ఐదు సంవత్సరాల నుంచి తలనొప్పి వచ్చేది. రెండుమూడుసార్లు మంగళగిరి N.R.I. హాస్పిటల్‌లో చూపించడం జరిగింది. కానీ ఏమీ సమస్యలేదని చెప్పి పంపించారు. శంకర్ నేత్రాలయం వారిని కూడా సంప్రదించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ లేదని చెప్పారు. అయినా కూడా రుగ్మత ప్రభావం తగ్గకపోవడం అనేకమంది డాక్టర్లను కలవడం, శారీరకంగానూ, ఆర్థికంగానూ ఎంతో వ్యయప్రయాసలను అనుభవించాను. చివరకు నిమ్స్ కూడా కూడా వెళ్ళడం జరిగింది. వారు బ్రెయిన్‌లో రక్తనాళంలో రక్తం గడ్డకట్టిందనీ, ఆపరేషన్ చేస్తే నాలుగులక్షల దాకా ఖర్చు అవుతుందనీ, అయినా శరీరం చచ్చుబడవచ్చు లేదా చనిపోవటం అయినా జరగవచ్చు అని చెప్పారు. చివరికి నా అల్లుడు మరి పిరమిడ్ మాస్టర్ భానుప్రసాద్ గారి ద్వారా "ధ్యానం వలన అద్భుతంగా వ్యాధులు నయమవుతాయి" అని తెలిసి తుళ్ళూరు మండలం నెక్కల్లులో వున్న పిరమిడ్ ధ్యానకేంద్రానికి వెళ్ళటం జరిగింది. నెక్కల్లు పిరమిడ్ ఫౌండర్ అయిన శ్రీ అబ్బురి కోటేశ్వరరావు గారు నాలోని నిరుత్సాహాన్ని పోగొట్టి ఎంతో ప్రోత్సహించి ధ్యానాసక్తిని కలిగించారు. పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు కలిగిన ధ్యానానుభవాన్ని మీకు వివరిస్తాను.

నా తలలో... వెనుక భాగంలో ఎవరో లేడీ డాక్టర్ ఓపెన్ చేసి మరికొంతమంది డాక్టర్ల సహాయంతో శస్త్రచికిత్స చేయటం నేను చూడటం జరిగింది. తర్వాత వాళ్ళు నన్ను మంచినీరు త్రాగి మొహం కడుగుకొమ్మని చెప్పారు.

తర్వాత ఏమయిందో నాకు తెలీదు. కింగ్ ఛాంబర్‌లో వున్న నేను స్పృహ వచ్చేసరికి క్రిందకి ఎలా వచ్చానో నాకు తెలియదు. ఈ అనుభవాన్ని అబ్బూరి కోటేశ్వరరావు గారికి చెప్పినప్పుడు "ధ్యానంలో ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి సర్జరీ చేయటం జరిగింది" అని చెప్పారు. "పత్రి సార్ ఆదేశానుసారం నేను 45 రోజులు ధ్యాన సాధన చేసి సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా వుండటంతో నా జన్మ ధన్యమైంది" అని సగర్వంగా చెప్తున్నాను. అప్పటినుంచి రోజూ నేను ఐదు లేక ఆరు గంటలు ధ్యాన సాధన చేస్తున్నాను. ధ్యానంలో పత్రిసార్ వేణుగానం ఆలపిస్తున్న అనుభవం కలుగుతుంది. నిజంగా నాకిది ఒక పునర్జన్మగా భావిస్తున్నాను. అప్పటి నుంచి నేను ఒక్కదాన్నే కాదు ఈ ఆనందాన్నీ, ధ్యానానుభవాలనూ అందరికీ పంచాలనే ఉద్దేశ్యంతో మా గ్రామం పెదవడ్లపూడిలో అందరినీ ధ్యానులుగా మార్చాలని ప్రయత్నించి సఫలమవుతున్నాను.

 

బొద్దులూరి నాగేంద్రమ్మ
పెదవడ్లపూడి, మంగళగిరిమండలం
గుంటూరు జిల్లా

Go to top