" ధ్యాన యజ్ఞాలలో అస్ట్రల్ మాస్టర్స్ "

 

నా పేరు విజయదుర్గ. జనించిందీ, పెరిగిందీ విజయవాడలో. ధ్యానంలోకి అడుగుపెట్టి ఈ 2007 ఏప్రిల్‌కు ఎనిమిది సంవత్సరాలు. పత్రిసార్‌తో పరిచయం రాజమండ్రిలో. మొదటి అనుభవం ... సార్ నా ఎదురుగా కూర్చుని "ధ్యానం చెయ్యండి మేడమ్" అనగానే వెంటనే ధ్యానంలోకి వెళ్ళాను. అప్పుడు నాకు నడుమునొప్పిగా వుంది. తక్షణమే సార్ లోంచి జీసస్‌క్రైస్ట్ పెద్ద ఆకారంలో వచ్చి నా వెన్నును సవరించారు. వెంటనే హీల్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడుమునొప్పి అంటే తెలియదు. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఏడెనిమిది గంటలు ధ్యానంలో కూర్చోవటమే నా పని.

ఒకరోజు నేను ధ్యానంలో ఉండగా సార్ నా ముందు కూర్చుని "మేడమ్, ఈ రోజు నుంచి మీరు నా రైట్ హ్యాండ్. మీ నుంచి నాకు శక్తి కావాలి." అన్నప్పుడు నా శక్తి ఏమిటో నాకు తెలిసింది. నేను చాలా సంతోషంగా నా పని చేసుకుంటూ, సార్ నాకు ఇచ్చే ఆస్ట్రల్ వర్క్ పర్‌ఫెక్ట్‌గా చేస్తూ... నా జీవితాన్ని ఈ ధ్యానం ద్వారా నేను, నా భర్త, మా బాబు చాలా సాధించాం. సార్ నిర్వహించే ధ్యానయజ్ఞాల పట్ల నేను చాలా నేర్చుకున్నాను.

2006 షిరిడీ ధ్యానయజ్ఞానికి వచ్చేసినటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్‌తో నేను పొందిన అనుభవం వర్ణనాతీతం. నేను కర్నూలు ధ్యానయజ్ఞానికి వెళ్ళినప్పుడు ఆకాశంలో రెండు హస్తాలు ఒకటి సార్, రెండవది నాది అని తెలిసినప్పుడు ఒళ్ళు పులకరించింది. విజయవాడలో బుద్ధిస్ట్ మాంక్స్, ఇంకా చాలా మంది మాస్టర్స్ వచ్చి ఆ యజ్ఞాన్ని సఫలీకృతం చేసారు. తిరుపతి లో యజ్ఞానికి కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ వున్న భవనాలు అన్నీ పిరమిడ్స్‌లా కనిపించి తరువాత ఆ యజ్ఞవాటికంతా ఋషులు తమ కమండలంలోని నీటితో శుద్ధి చేసారు. అలాగే హైదరాబాద్ లో ఆస్ట్రల్ మాస్టర్స్ వచ్చి చక్కగా జరిపించారు. మరి ప్రతి యజ్ఞానికి వారు పత్రీజీని పొగడటం నేను వర్ణించలేను.

ఒకరోజు నాకు సత్యసాయిబాబా కనిపించి నా దగ్గర నుంచి "మీ ట్రస్ట్‌కు ఫండ్స్ ఇస్తాను" అన్నారు. షిరిడీ బాబా ఒకరోజు కలలోకి వచ్చి "నన్ను మరచిపోయావా అమ్మా?" అన్నారు. అదేవిధంగా నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ వచ్చి నా ముందు కూర్చుని నా ధ్యానాన్ని తిలకిస్తూ "తల్లీ, నువ్వు ధ్యానం చేస్తుంది లోకకళ్యాణం కోసం... చాలా ఆనందంగా వుంది" అంటూ మెచ్చుకుని వెళ్ళిపోతారు. "నాకు ప్రతిరోజూ శక్తి కావాలి నాయనా" అనగానే వచ్చే మొదటి వ్యక్తి ఆంజనేయస్వామి. ఈ విధంగా ధ్యానంలో ఉన్నప్పుడు వొళ్ళంతా నొప్పులతో బాధగా వున్నప్పుడు హీల్ చేయటానికి వచ్చే మహానుభావుడు జీసస్‌క్రైస్ట్. అలా ప్రతి మాస్టర్ ధ్యానంలో కావల్సిన శక్తిని ఇస్తూ వస్తున్నారు. నేను పిలవగానే ప్రతిరోజూ విజయేశ్వరీదేవి వచ్చి ఒళ్ళు పట్టే మహానుభావురాలు.

మేం హైదరాబాద్ వచ్చి ఒకసంవత్సరం అయింది. ఒకరోజు రాత్రి 11.00 గంటలకు మా వారికి గుండెనొప్పి వచ్చింది. ఆ సంగతి నాకు తెల్సింది. కానీ, ఆయన చెప్పలేదు. ఆ తక్షణమే నా ప్రక్కన జీసస్‌క్రైస్ట్, పత్రిసార్ కూర్చుని నా చేత ఆయనకు హీలింగ్ చేయించారు. 11.00 గంటల నుంచి 3.00 గంటల వరకు అలా హీలింగ్ జరిగింది. తరువాత అప్పటివరకు ఆయన పెద్దగా అరుస్తూ, నేను అరుస్తూ తెల్లవారుజామున నిద్రలోకి జారుకున్నాను. తరువాత నేను, మావారు సార్‌తో కలిసి కర్నూలు ధ్యానయజ్ఞానికి వెళ్ళేటప్పుడు సార్ "స్వామీ నీ ఇంజిన్ రీబోరింగ్‌కి వచ్చింది. నువ్వు నిమ్స్ లోనో, అపోలో లోనో జాయిన్ అవ్వాల్సింది కానీ నీ ధ్యానం నిన్ను కాపాడింది" అన్నారు.

ఆ మాట విన్న వెంటనే నాకు కళ్ళల్లో ఆనందంతో నీరు వచ్చింది. హైదరాబాద్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నా డ్యూటీ సార్ వాళ్ళ అమ్మగారితో వుండి మెడిటేషన్ చేస్తూ నా అనుభవాలు చెప్తూ ఆనందించేవాళ్ళం. మొదటిసారి సార్ బర్త్‌డేకి నేను రాలేదు. రెండవసారి హైదరాబాద్‌లో బర్త్‌డేకి వచ్చినప్పుడు నేను పొందిన అనుభవం: సార్ ఫంక్షన్స్ అన్నీ ఆస్ట్రల్‌గా జరిగిన తర్వాత ఈ భూమి మీద జరుగుతాయి. బర్త్‌డే అప్పుడు ఆ మహానుభావురాలు సావిత్రీదేవి ఎవరో తెలుసా మేరీమాత. ఆమె బంగారు మెట్లు దిగుతూ తన బాహువుల్లో ఆ బిడ్డ అయిన జీసస్‌క్రైస్ట్‌ను మనకు అందించారు. సార్ యొక్క అన్ని విశ్వరూపాలు నా మొదటి, రెండవ సిట్టింగ్‌లో చూశాను. గతజన్మలో షిరిడీ బాబా ఈ జన్మలో పత్రీజీ మరి భోలాశంకరుడు. ఇటువంటి గొప్ప వ్యక్తిని మనం ఇంక పొందలేం ఏ జన్మకూ. షిరిడీ ధ్యానయజ్ఞానికి ముందు బాబా ధ్యానంలో కనిపించి "యజ్ఞాన్ని అద్భుతంగా జరిగేటట్లు చూస్తాను. మీ పత్రిసార్ ప్రక్కనే వుండి నేను జరిపిస్తాను. షిరిడీ ధ్యానయజ్ఞం చాలా అద్భుతం" అన్నారు. మాస్టర్స్ అందరూ అటెండ్ అయ్యారు.

సావిత్రీదేవి... మన తల్లి... ఈ యజ్ఞాన్ని తిలకిస్తూ చాలా ఆనందించారు. మన నాయకులు గాంధీ, మదర్‌థెరిసా, ఎన్టీరామారావు ... ఇంకా చాలామంది వచ్చి యజ్ఞాన్ని జరిపించారు. బాబా గారు 31 వతేదీ ఉదయం ఊర్థ్వలోకాలకు వెళ్ళటం నేను, నాతో చాలా మంది మాస్టర్స్ ఎంజాయ్ చేశాం.

 

G.విజయదుర్గ
A-101, యునైటెడ్ అవెన్యూ అపార్ట్‌మెంట్
(సౌత్ ఎండ్), లీలా నగర్, అమీర్‌పేట, హైదరాబాద్

Go to top