" ధ్యానమహాచక్రంలో ఉన్నత అత్మల సంచారం "

 

వైజాగ్‌లో జరిగిన ధ్యానమహాచక్రానికి నెల్లూరు జిల్లా గూడూరు నుంచి మేము పదిమందిమి కలసి వెళ్ళాము. రోజూ ఉదయం 5గంటల ప్రాతఃకాల ధ్యానానికి ప్రాంగణానికి చేరుకుంటే.. ఇక చీకటి పడ్డాక తిరిగి యూనివర్సిటీలోని మా బసకు చేరుకునేవాళ్ళం. మధ్యాహ్నమంతా ప్రోగ్రాముల చూస్తూనో, "గంగ-2" దగ్గర కూర్చునో, స్టాల్స్ దగ్గర తిరుగుతూనో కాలం గడిపేసేవాళ్ళం. "గంగ-2" మా "స్పాట్" అన్నమాట. 7వరోజున ప్రాతఃకాలం ధ్యానమైపోయి, టిఫిన్‍లు పూర్తి చేసి స్పాట్‌కి చేరుకున్నాక.. దాదాపు 10.00 గంటల ప్రాంతంలో జరిగింది ఆ ఘట్టం!!

కబుర్లు చెప్పుకుంటూ, వచ్చిన వాళ్ళతో ఆధ్యాత్మిక చర్చ చేస్తూ ఎవరికి ఏ పని తగిలితే ఆ పని చేస్తూ.. నా ఫ్రెండ్ "లక్ష్మి", నేను అలా స్టాల్స్ వైపు వెళ్ళాం. అప్పుడు ఒకామె చేతిలో తెల్లటి హ్యాండ్‌బ్యాగ్‌తో, నెత్తిన రాగి పిరమిడ్‌తో "గంగ-2" దగ్గరికి వచ్చింది. మా పెద్దక్క దగ్గరకు వచ్చి "ఇక్కడ కూర్చోవచ్చా?" అని అడిగింది. "సరే" అన్న పెద్దక్క దగ్గర వాటర్‌బాటిల్ చూసి.. "నీళ్ళు తాగవచ్చా?" అని అడిగింది. సరేనన్నది అక్కయ్య.

"ఈ బాటిల్‌ని తీసుకోవచ్చా? మీకు లేకపోతే తీసుకోను; మీకు ఉంటేనే తీసుకుంటా" అన్నది. "తీసుకో" అంది అక్కయ్య. ఆమె నీళ్ళు తాగి "ధ్యానం చేస్తారా? ఎప్పటి నుంచి చేస్తున్నారు?! అంటూ ఆరా తీసింది.

"నాలుగు సంవత్సరాలుగా చేస్తున్నాను" అన్నది ప్రమీలమ్మ. "నేను 11 రోజుల నుంచే చేస్తున్నాను" అన్నదామె. మళ్ళీ "నేను మా నాన్న కోసం వెతుకుతున్నాను. మా నాన్న కనపడలేదు. మేము కొండవతల ప్రహ్లాదపురంలో రూము తీసుకున్నాము. ఈ పది రోజులకు 3,500 రూపాయలు. అమ్మ అక్కడుంది, నాన్న కోసం వెతుకుతున్నాను. నాన్న తింటేనే అమ్మ తింటుంది. అమ్మ తినకుండా నేనెలా తింటాను? అందుకే నేను నీళ్ళు తాగుతున్నాను" అని నీళ్ళు తాగి మూత పెడుతూ "చాలమంది మూత తీసిపారేస్తారు. దానిలోకి దుమ్ము పోతుంది. మూతపెట్టి పడేస్తే ఇంకెవరైనా దానిని వాడుకుంటారు కదా. నేను ఇక్కడే ఉంటాను. కిచన్‌లో ఉంటాను. ఇక్కడ అందరూ లగేజి పెట్టుకుంటారు కదా. నేనే చూసుకోవాలి ఆ సామాను పోకుండా. టాయెలెట్స్ దగ్గర కూడా నేనే చూసుకోవాలి. పొద్దున నాలుగు గంటలకు వచ్చి రాత్రి పది గంటల వరకు ఇక్కడే ఉంటాను.. సింహాద్రిలో 5,6, వందల సెల్లుల తెస్తారు. నేనే దగ్గరుండి వాటన్నింటినీ ఛార్జ్ పెట్టించి వాళ్ళందరికీ జాగ్రత్తగా ఇస్తాను.

"మీకు తెలుసా? నావి 6,800 డబ్బులు పోయాయి!" అనగానే వింటున్న వాళ్ళంతా కాస్త కదలిపోయారు! "పక్కామెది నెక్లెస్ పోయింది. తర్వాత ఇంకో ఆమెది నల్లపూసల దండ పోయింది. అన్నీ దొరుకుతాయి. సగం విరగ్గొట్టిన బాటిల్ దొరికితే దాన్ని తొట్లో ముంచుకుని నీళ్ళు తాగి అక్కడ పెట్టి బాత్‌రూంలోకి వెళ్ళివచ్చా. నేను వచ్చేసరికి దాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారు. 31 ఉదయం అన్నీ దొరుకుతాయి. 5 పైసలు పోగొట్టుకున్నా దొరుకుతాయి" అంది.

మళ్ళీ "ఇప్పుడు నా దగ్గర ఎంత డబ్బుందో తెలుసా?" అంటూ తన బ్యాగ్‌లో నుంచి అరచేతిలోకి చిల్లర వంపుకుంది. చేతి నిండా కాయిన్లు. " ఇవేం సరిపోతాయి మా ఇంటికి వెళ్ళడానికి? నీ కెంత కావాలో చెప్పు ఇస్తాను. లక్ష రూపాయలైన ఇస్తాను. చెప్పు.. ఇస్తాను" అలా మాట్లడేస్తూనే ఉంది. ఎవ్వరికీ ఏం మాట్లాడడానికి తోచలేదు.

"మా నాన్న కనపడలేదు" అని అంటూనే వున్నది మధ్య మధ్యలో. "స్టేజీ మీద అనౌన్స్ చేయించవచ్చు కదా?" అని అంటే "అడిగాను, కుదరలేదు" అన్నది.

"నువ్వు మెస్ దగ్గర ఉంటాను అన్నావు కదా.. మరి అక్కడే భోజనం ఎందుకు చేయలేదు?" అని అడిగితే "నేను అక్కడ తినను. నాకు ఆకలి అయినప్పుడు ఈ పండ్లు తింటాను." అంటూ తన దగ్గరన్న హ్యాండ్‌బ్యాగ్‌లో నుంచి పండ్ల కవరును బయటికి తీసి చూపించింది. ఒక కవరు నిండా కమలాపండ్లు, చామంతులున్నాయి. "మా అమ్మ తినలేదు.. కాబట్టి ఇప్పుడు తినలేదు. మా అమ్మ తింటేనే తింటాను" మళ్ళీ అదే మాట!

ఆమె మాట తీరుకు మా వాళ్ళంతా. "అప్పటికే ఆమెకు పాపం ఏదొ పెద్ద ‘షాక్’ వల్ల మతి చలించి వుంది" అన్న నిర్ణయానికి వచ్చేసారు. అందుకే "ఆమెకు సాయం చేయాలి" అన్న సానుభూతితో "మాతొ కలసి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేస్తావా?" అని ప్రమీలమ్మ అడిగింది. "ఎందుకు చెయ్యనూ? చేస్తాను! అని కూర్చుంది.

తన చుట్టు వున్న ఐదారుగురు ధ్యానానికి కూర్చున్నారు. ప్రమీలమ్మ, శంకరమ్మ, ఉదయలక్ష్మి, వెంకమ్మ, పెద్దక్కయ్య అందరూ కళ్ళు మూసుకున్నారు. చెప్పులు వేసుకోని ఉన్న వాళ్ళను గమనించి "చెప్పులు తీసేయండి; చెప్పులు వేసుకుంటే ప్రయోజనం ఉండదేమో?" అన్నది. చెప్పులు తీసేసి ధ్యానానికి కూర్చున్నారు. కూర్చోగానే ప్రమీలమ్మకు "మమ్మల్నిలా ధ్యానంలో కూర్చోబెట్టేసి ఈ బ్యాగులు అవీ దొబ్బుకుపోదు కదా" అనిపించిందట.

అంతే విపరీతంగా వైబ్రేషన్స్ వచ్చి తనను లాగటం మొదలుపెట్టేసరికి తట్టుకోలేక కళ్ళు తెరిచేసింది. ఆమె అందరినీ సీరియస్‌గా గమనిస్తోంది కళ్ళు తెరుచుకుని! తనను ఒకింత కోపంగానే చూసి తర్వాత కూలయిందని ప్రమీలమ్మకు అర్థమైంది. ప్రమీలమ్మ ఫీలింగ్స్‌లో మార్పు వచ్చేసింది.

"ఏం పని చేస్తావు?" అని అడిగితే "మందుల పై అట్ట తయారు చేస్తాము" అంటూ అదెలా తయారు చేస్తారో చెప్పి "దానికి ఆరుగురు కలసి తయారు చేస్తారు" అనీ, అదంతా తానే చూసుకోవాలనీ చెప్పింది. "అంటే నువ్వు సూపర్‌వైజర్‌వా?" అని అడిగితే "కాదు. వాళ్ళల్లో ఒకదాన్ని నేను. ఆ పని చేస్తే నాకెంతిస్తారో తెలుసా? 60 రూపాయలు. తర్వాత ఇంటికి వెళ్ళి రాత్రంతా బట్టలు కుడతాను. బట్టలు కుడితే నాకెంత వస్తుందో తెలుసా? నాలుగు వందలు."

"అరగంట పడుకుంతా; అది కూడా ఎలానో తెలుసా? ధ్యానం చేస్తూ!" "ఏమిటీ? అరగంట పడుకుంటావా?" అని కాస్త వ్యంగ్యంగానే అడిగింది ప్రమీలమ్మ.

"అరగంట ధ్యానం చేస్తే మూడు గంటలు నిద్ర పోయినట్లు" అంటూ లేచి నిలబడి ఉదయలక్ష్మి చేయి పట్టుకుని "అడ్వాన్స్‌డ్ హ్యాపీ న్యూ ఇయర్" అన్నది.

"థ్యాంక్స్ అండ్ సేమ్ టు యు" అన్న ఉదయలక్ష్మి‌తో "ఇంగ్లీషు వద్దు, తెలుగు తెలుగు" అన్నదామె వెంటనే.

"ఈమె కేమన్న పిచ్చా, తనేమో ఇంగ్లీషు పదాలు వాడవచ్చా? మేమేమో వాడకూడదా?! " అనుకున్నవాళ్ళు లేకపోలేదు.

పండ్లు, పూలన్న కవరును వూపిస్తూ "ఇది ఎందుకు కొనుక్కోవచ్చానో తెలుసా మీలాంటి వాళ్ళకు ఇవ్వడానికి. 15రూపాయలు పెట్టి కొనుక్కోచ్చాను. ఎవరైనా అడిగితే ఇస్తాను. లేకపోతే ఇవ్వను" అన్నది; ప్రమీలకు అడిగి పూలు తీసుకునే అలవాటు ఉన్నది కాని.. ఎందుకో అడగలేదు తను. అందుకే కాబోలు రెండు సార్లు ఆ మాట అన్నది "అమ్ములు" ఆమెను చూస్తూ.

అందరినీ లెక్క పెట్టి "మొత్తం పది. ఒకరిదేముందిలే. తొమ్మిది నవగ్రహాలంటే నాకు చాలా ఇష్టం" అన్నది.

అప్పుడు వచ్చామక్కడికి లక్ష్మి, నేను, "మా మేడ్‌మ్" అంటూ పరిచయం చేసింది ప్రమీలమ్మ నన్ను ఆమెకు. అప్పుడామె నన్ను పరికించినట్లుచూసింది. తినడానికేమో ఇస్తే "అమ్మ తనకుండా నేను తింటానా?" అని తినలేదు.

లక్ష్మి ఇచ్చిన బిస్కెట్లు అందరూ తీసుకున్నారు గాని "అమ్ములు" తీసుకోలేదు. కానీ ప్రమీల తినేటప్పుడు చిన్న ముక్క కింద పడింది. అది ఏరుకుని సంచిలో వేసుకుంది అమ్ములు. అది ఎవరూ సరిగ్గా గమనించలేదు ప్రమీల తప్ప. "అమ్ములు ఏమి తినలేదు" అన్నారెవరో. వెంటనే "ఎందుకు తిననూ". అంటూ సంచిలో నుంచి ఆ బిస్కెట్ ముక్కను తీసి చూపి నోట్లో వేసుకుని కరకర నమిలి తిన్నది. ప్రమీల తన పర్సులో నుంచి ఏదో తీసుకుంటుండగా ఒక చిన్న టాబ్లెట్ కింద పడింది. దానిని తను తీసిపడేద్దామనుకునే లోపల అమ్ములు తీసేసుకుంది.

"నా కాలిలో చీల గుచ్చుకుంది. నీరొచ్చింది కాలికి" అని కాలు చూపింది. కాలంతా వాచిపోయి గాయం భయంకరంగా కనిపిస్తోంది. మేకు కొడితే రెండోవైపు పేళ్ళు లేచిన చెక్కలాగా ఉంది గాయం. అయితే నేను గమనించింది ఏమిటంటే ఆ గాయం చుట్టూ ఉండాల్సిన ఎరుపుదనం లేదు. చర్మం మామూలుగా ఉంది. అందరూ ఆమె గాయాన్నీ, వాచిన ఆమె కాలును చూస్తూంటే ఆమె మాత్రం చుట్టూ చూస్తోంది పందిట్లోకి. ఆమె దృష్టి గాయం మీద లేనేలేదు.

"మా నాన్న కోసం ఒక బహుమతి కొన్నాను; అదేంటో చెప్పుకోండి చూద్దాం" అంది.

ఇద్దరు ముగ్గురు ఏవేవో ఊహించి చెప్పారు. కాదన్నది. ఇక ఎవ్వరూ ఏమీ చెప్పలేదు. దాంతో తనే తన బ్యాగ్‌లో నుంచి ఒక సీడీ బాక్స్ తీసి చూపింది. దాని మీద "మ్యూజిక్ ఫర్ మెడిటేషన్" అని వున్నది! "ఇది బాగా పని చేస్తుందా? చెక్ చేసి తీసుకున్నావా?" అని అడిగారు. "మేడమ్‌లాంటి వాళ్ళ చేయి తగిలితే ఇంటికి వెళ్ళాక పని చేస్తుందేమో" అన్నది. ఆ సీడీ బాక్స్‌ను మధ్యలో ఎవరో అందుకుని నాకు అందించారు. నేను దానిని ఒకసారి అటు ఇటు తిప్పి చూసి తిరిగి ఇచ్చేసాను.

కొంచెం సేపయ్యాక "ఈ టాబ్లెట్ మీరైతే చెత్త బుట్టలో వేస్తారు; నేను ఈ చెత్త బుట్టలో వేస్తాను" అన్నది పొట్ట చూపిస్తూ "ఎందుకంటే కనపడినవన్నీ ఈ చెత్తబుట్టలోనే కదా వేస్తాము; ఈ టాబ్లెట్ వేసుకుంటే నా కాలునొప్పి తగ్గుతుంది." అంటూ దానిని మింగేసింది. అంతకు ముందు ఎవరో "నీ కాలు బాగాలేదు కదా. డాక్టరు దగ్గరికి వెళ్ళకూడదా?" అనంటే "నేను మందులు వాడను" అన్నది. ఇప్పుడేమో..

"అమ్ములు" ఏమీ తినలేదు కాబట్టి ఎదైనా చేత తినిపించాలని గట్టిగా నిర్ణయించుకున్న ప్రమీలమ్మ ఒక లడ్డు తీసి నా చేతికిచ్చి "మా మేడమ్‍గారి చేతి మీదుగా తీసుకో" అన్నది. అమ్ములు "నేనే తీసుకుంటాను" అంటూ కుర్చీలో నుంచి లేచింది ఉత్సాహంగా. ఆమెకు కాలు బాగాలేదు కాబట్టి అందరిలో సానుభూతి పెల్లుబుకుతోంది ఆమె పట్ల. అందుకే ఆమె కుర్చీల మధ్య నుంచి నేరుగా నా దగ్గరికి రావడానికి కుర్చీలు జరపబోయారు. "వద్దు వద్దు.నేనే వెళతాను" అంటూ లేచి.. ఉదయలక్ష్మి కూర్చుని ఉన్న కుర్చీ వెనుక చుట్టుకుని నా దగ్గరికి రావడానికి నానా అవస్థ పడుతూ వచ్చింది. అడుగు వెయ్యలేక వెయ్యలేక వేసింది. నా దగ్గరికి వచ్చి నా నుంచి స్వయంగా లడ్డును అందుకుని నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చింది నిలబడే. నేను చిరునవ్వుతో తన కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాను! తను ఒక్క క్షణం తర్వాత నిటారుగా నిలబడి కళ్ళు మూసుకుని కొంతసేపు అలాగే ఉండిపోయింది. ఏం ఫీలవుతోందో తెలీదు గాని ఏదో చాలా గాడంగా ఫీలవుతోందని మాత్రం అర్థమైంది.

ఆ తర్వాత వ్యవహారంలో తేడా వచ్చింది. అంత కాలు నొప్పితో నడవలేక నడిచిన మనిషిలో చాలా తేడా కనపడడం మొదలైంది. కూర్చోవటంలో, లేవటంలో మార్పు వచ్చింది. నాకు మాటిమాటికీ అనిపించసాగింది. "ఈ వచ్చింది మామూలు వ్యక్తి కాదు, రెండడుగులు వేసి మాయమైపోయే వ్యక్తి" అని! కాబట్టి "తను వెళ్ళేటప్పుడు తప్పకుండా చూడాలి" అనుకున్నాను.

ఆమె మాటలు "నాన్‌లీనియర్" గా ఉన్నాయి. ఏ టాపిక్ ఎప్పుడు, ఎందుకు మారిపోతోందో, తిరిగి ఎప్పుడు ఎందుకు అందుకుంటోందో తెలీటం లేదు కానీ .. ఒక్కటి మాత్రం గమనించారందరూ. ఆమె "పిచ్చిదేమో" నన్న నిర్ణయానికి వచ్చే టైంలో మాటలు మారిపోయి.. "ఈమె ఎవరో పై తలాల ఎనర్జీ మాస్టర్" అనిపించే విధంగా మాట్లాడుతోంది. అలాగే "ఈమె ఎవరో మహనీయురాలేమో" అన్న నిర్ణయానికి వచ్చేసరికి పిచ్చిదనిపించే విధంగా మాటలు! అంత నాన్‌లీనియర్ గా మాట్లాడింది కాబట్టి ఏ మాట ఎప్పుడు మాట్లాడిందో సరిగా చెప్పలేకపోయినా గుర్తున్నంత వరకు అందరం కలసి దీనికి ఒక రూపం ఇచ్చాం.

నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చాక నా ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుని "కాలు నొప్పి పుట్టట్లా. ఎప్పుడు పుడుతుంది నొప్పి? అమ్మ కోప్పడినప్పుడు. అమ్మ ఎప్పుడు కోపడుతుంది? తల్లో పూలు పెట్టుకోకపోతే కోప్పడుతుంది. మొహం కడుక్కోపోతే కోప్పడుతుంది. ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకోకపోతే కోప్పడుతుంది" అంది.

"మా అయనకు నేనంటే ఎంతిష్టమో తెలుసా? నన్నసలు కాలు కింద పెట్టనివ్వడు. అలా చూసుకుంటాడు. నాకీ దెబ్బ తగిలిందని ఆయనకు తెలీదు. తెలిస్తే వచ్చి నన్ను విమానంలో తీసుకెళ్ళిపోతాడు" అన్నది. మాట మాటకూ పొంతలేదు!

తర్వాత తన దగ్గరున్న కవర్‌లో నుంచి ఒక పండు, మూడు పూలు తీసి ప్రమీలమ్మకు ఇవ్వబోయింది తీసుకోమంటూ. ప్రమీలమ్మ "ముందు మా మేడమ్ గారికివ్వు; తర్వాత మేము" అంది అమ్ములు చాలా అధికారికమైన గొంతుతో "మేడమా! మేడమేంటి? అందరూ సమానమే అన్నది.

"అలా కాదు; ముందు మేడమ్‍కి ఇవ్వు" అని ప్రమీలమ్మ అనగా.. తను నా దగ్గరికి వచ్చి.. ఆ పండు, పూలు అందరికీ ఇచ్చింది. నేను నాకు ఇచ్చిన మూడు పూల కాడలను ఒక గుత్తిగా చేసి నా ప్రక్కనే ఉన్న లక్ష్మికి ఇచ్చాను. ఇంతలో ప్రమీలమ్మకమలాపండు వలిచి నిలబడి వున్న అమ్ములుకు తినిపించసాగింది.

చిన్న పిల్లలు ఆడుకుంటే తల్లి వెంటపడి వాళ్ళకు అనుగుణంగా తిరుగుతూ ముద్ద పెట్టినట్లు అమ్ములు ఎటు తిరిగితే అటు వైపుకు చేరుకుని ఆమె నోట్లో ఒక్కోతొన పెడుతోంది ప్రమీలమ్మ. మారుమాట్లాడకుండా అమ్ములు తినసాగింది. కానీ ఆమె చూపు మాత్రం పందిట్లో తిరుగుతోంది. ముఖంలో ఎలాంటి ఎమోషన్ లేదు.. పైగా ఆ చూపులో, ఆ కదలికలో ఒకోసారి రాజసం ఉట్టిపడుతోంది. నేనిచ్చిన పూలకు లక్ష్మి తన పూలు కూడా చేర్చి దారంతో దానిని కట్టి అమ్ములు తల్లో పెట్టింది.

తన రాగి పిరమిడ్ క్యాప్ దినేష్ పెట్టుకున్నాడు కాస్సేపు. ఆమె వెళ్ళేటప్పుడు వాడు తిరిగి ఇచ్చేయబోతే.. వాడినే.. "ఉంచేసుకో" అన్నది. రెండు రూపాయలు పెట్టి మంచి నీళ్ళు కొనుక్కోవడానికే "అమ్మో" అన్న మనిషి 250 రూపాయలు పెట్టి కొన్న క్యాప్‌ని అంత సునాయాసంగా తన కొడుక్కి ఇచ్చేస్తుంటే అనుమానంగా చూసింది. "వచ్చింది మామూలు మనిషి కాదు" అన్న అనుమానం బలపడసాగింది తనకు.

"నేను ఫోటో తీస్తాను రా అమ్ములు" అని ప్రమీలమ్మ అంటే కుర్చీలో నుంచి లేచి నిలబడి "నేనొక్కదాన్నేనా? నేనొక్కదాన్నయితే పడనుగా" అన్నది. "సరేలే. అందరితో కలిసి" అంటూ విడిగానూ, ఇతరులతో కలిపి కూడా ఆమెకు ఫోటోలు తీసారు.

ఫోటోలయ్యాక కాసేపటికి ఆమె బయలుదేరుతూ "మీరిక్కడే ఉంటారా? నేను ఐదు, పది నిమిషాల్లో వస్తాను" అన్నది. ఎందుకిలా అడుగుతోందా అనుకుంటూ "ఉంటాం" అన్నాను తలుపుతూ సాలోచనగా. "మీరు ఉండేట్లయితే ఉండండి.. పనుంటే వెళ్ళిపోండి. నా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తుంటారు. నా స్నేహితులు ఎవరో తెలుసా? కక్కుసు దొడ్లు కడుగుతూంటారే.. వాళ్ళు నా స్నేహితులు" అంటూ లోతుగా చూసింది మా అందరినీ. ఒక్క క్షణం నా లోపలికి నేను చూసుకున్నాను. నా లోపల ఎలాంటి అయిష్టమూ లేదు. తన మాటలు మాకు పరీక్ష అనేది అర్థమైపోయింది అప్పటికే.

"నా పేరు హేమలక్ష్మి.. కానీ ‘అమ్ములు’ అని పిలవండి. మీరు ఎప్పుడు తలచుకుంటే అప్పుడు, ఎక్కడ తలచుకుంటే అక్కడ ప్రత్యక్షమవుతాను" అంటూ వెళ్ళడానికి ఉద్యుక్తురాలైంది. ప్రత్యక్షమవుతానన్న పదాన్ని ఉపయోగించిన ఆమెను చూస్తూ లక్ష్మి "వచ్చింది మహావతార్ బాబాజీనా?" అనుకున్నది అనుమానంగా. రెండడుగులు వేసిన అమ్ములు తల వెనక్కి తిప్పి తనని అలా చూసి దగ్గరికి వచ్చి చిరునవ్వుతో షేక్‌హ్యాండిచ్చింది! లక్ష్మికి షేక్ హ్యాండిస్తోంటే నా ఇన్నర్ కూడా చేయి చాచింది తన షేక్‌హ్యాండ్ కోసం. అది గమనించి అప్పుడు నేను భౌతికంగా చేతిని చాపాను. ఆమె నా చేతిని అందుకుని కరచాలనం చేసి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు చూడాలనుకున్న నేను.. సరిగ్గా అదే సమయానికి ప్రక్కన ఎవరో మాట్లాడేసరికి ఇటు చూసి తిరిగి చూసేసరికి ఆమె కనపడలేదు! "ఆమె అడుగులు చాల వేగంగా పడుతున్నాయి" అని గమనించారు కొందరు. ఆమె నడకకు కొంత దూరం వరకు గమనించినవారికి సైతం ఆమె ఎలా వెళ్ళిపోయిందో తెలీలేదు. తిరిగి చూస్తే ఆమె పందిట్లో ఆమె మళ్ళీ ఎక్కడా కనపడలేదు. అంత వేగంగా వెళ్ళే అవకాశం ఆమెకు లేదు.

దీనిని గురించి గంటల తరబడి చర్చించుకున్నాము. ఇది జరిగింది 7వరోజున. 9వరోజున "గంగ-2" దగ్గరే కూర్చుని మాట్లాడుకుంటూంటే ఉన్నట్లుండి "పత్రిసార్ ఇటే వస్తున్నారు" అన్నారు మా వాళ్ళు! పత్రీజీ మా వైపు చూసి నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. మాటల్లో చెప్పాను "అమ్ములు" సంగతి. విని ఆశ్చర్యపోయారు సార్. "నేనసలు ఇటు వైపు రావలసినవాడిని కాదు ఇప్పుడు. అటు నేరుగా వెళ్ళాల్సిన వాడిని అసలెందుకు ఇటు తిరిగి వచ్చానో నాకే తెలీటం లేదు. తప్పకుండా ఈ అనుభవాన్ని ‘ధ్యానాంధ్రప్రదేశ్’ కి రాయండి" అని చెప్పారు. మా పుస్తకం "సాధనలో సరిగమలు" ఆయనకు స్వయంగా ఇచ్చే అవకాశం కలిగినందుకు మేమందరం చాలా చాలా సంతోషించి వారితో ఫోటోలు దిగాం!

ఇంటికి వచ్చేసాక ఒక్క విషయం బాగా అర్థమైంది. "అమ్ములు" అనుభవంలో మాకో పరీక్ష కూడా ఉంది. ధ్యానాల్లోకి దిగాక రూపాన్ని పక్కన పెట్టేసాం, నామాన్ని పక్కన పెట్టేసాం, విగ్రహాన్ని పక్కన పెట్టేసాం, పటాన్ని పక్కన పెట్టేసాం. కానీ "అమ్ములు" వీటిల్లో ఏదీ కాదు. తను భౌతికంగా కనపడిన రూపం, నామం. పైగా తనే స్వయంగా మాట ఇచ్చింది వస్తానని. దీనికి మేము తల వంచరాదు. అవసర సమయంలో సహజంగా అమ్ములు గుర్తుకు రావచ్చు, "అమ్ములూ! వస్తానన్నావు కదా పిలిస్తే.. వచ్చి సాయం చేయి" అని అవసరం ఉన్నప్పుడు అడిగే అవకాశం ఉన్నది. దానికి కూడా అతీతంగా ఎదగాలి. దానికి ఇది పరీక్ష. మాలోని శక్తిని మేము తెలుసుకుంటూ ఎదగాలే తప్ప వస్తానని మాటిచ్చింది కాబట్టి పిలిచేసే బలహీనతకు లొంగరాదు.

పరీక్షలు ఇలా కూడా ఉంటాయన్నమాట!!

 

D. రేవతీ దేవి
గూడూరు
నెల్లూరు జిల్లా

Go to top