" ప్రమాదంలోంచి సురక్షితంగా బయటపడ్డాం "

 

నా పేరు రామారావు. 23-12-2011 రాత్రి 11.45 ని|| లకు నేను, నా భార్య కవిత మరి బావ సీతారాం నాయక్ గారు కలిసి హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో విశాఖపట్టణం బయలుదేరాం. "విశ్వకళ్యాణం కోసం బ్రహ్మర్షి పత్రీజీ జరుపుతోన్న ధ్యానమహాచక్రం మహాయజ్ఞం లో లక్షలాది మంది పాల్గొని పునీతం అవుతున్నారు. మనం కూడా కనీసం ఒక్కరోజైనా అందులో పాల్గొని వద్దాం" అని బయలుదేరిన మా ఆనందానికి అవధులు లేవు.

హైదరాబాద్ L.B. నగర్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మాకు అర్థమైంది.. ఆ బస్సు డ్రైవర్.. బస్సును సరిగ్గా నడపడం లేదని. మాతో పాటు ప్రయాణీకులందరిలో ఆందోళన! సమయం దాదాపు అర్థరాత్రి 1.40 ని|| లకు హైదరాబాద్ నుంచి 85 కి.మీ దూరంలో.. "నార్క్‌ట్‌పల్లి-కామినేని మెడికల్ కాలేజీ" కి దగ్గర్లో ఒక్కసారిగా కుదుపుకు లోనైన బస్సు.. డ్రైవర్ అదుపు తప్పి రోడ్డు పైనుంచి దొర్లుకుంటూ వెళ్ళి 25 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. బస్సులో 45 మంది ప్రయాణీకులతో పాటు నా భార్య కవిత మరి బావ సీతారాం బస్సులోంచి క్రిందకు పడిపోయారు. నేను సీట్ల మధ్యన పడిపోయాను. బస్సు పడ్డ స్థలంలో ఒక హైటెన్షన్ విద్యుత్ లైను కూడా ఉంది కానీ.. ఎవరో ఆపినట్లు దాని దగ్గరి వరకు వచ్చిన బస్సు ఒక్క అడుగుదూరంలో ఆగిపోయింది.

ఏం జరిగిందో తెలుసుకునే లోపు హాహాకారాలతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. దాదాపు అర్థరాత్రి 2 గం|| ప్రాంతంలో పోలీసు వాహనం అక్కడికి వచ్చి అందర్నీ దగ్గర్లోనే ఉన్న కామినేని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకుని వెళ్ళారు.

బస్సు లోయల్లో తల్లక్రిందలుగా పడిన తీరు దగ్గర్లోని హైటెన్షన్ విద్యుత్తు వైరూ చుసిన పోలీస్ అధికారులు ఎంతో ఆశ్చర్యానికి గురై.. "ఇంత జరిగినా ప్రయాణీకులందరూ ఏవో చిన్నదెబ్బలు తప్ప ఎంతో సురక్షితంగా ఉండడం చాలా గొప్ప మిరాకిల్" అన్నారు. "ప్రయాణీకుల్లో ఎవరో గొప్ప అదృష్టవంతులు ఉండి ఉండవచ్చు అందుకే పెద్ద ప్రమాదం తప్పింది" అని వారు అనుకుంటూంటే నేను.. విశాఖపట్టణం లో జరుగుతోన్న ధ్యానమహాచక్రం గురించి వారికి తెలిపి.. ప్రమాదంలోంచి బయటపడినందుకు నా ఆనందాన్ని వ్యక్తపరచాను.

" ఏది ఏమైనా అనుకున్నట్లుగా ధ్యానమహాచక్రానికి వెళ్ళే తీరాలి" అని 24-12-2011 తెల్లవారు జామునే మళ్ళీ నార్కట్‌పల్లి మెడికల్ కాలేజీ నుంచి బయలుదేరి.. రాత్రి 9.00గం||ల కు విశాఖపట్టణం చేరుకున్నాం. 25-12-2011 ప్రాతఃకల ధ్యానం తరువాత బ్రహ్మర్షి పత్రీజీ "కరుణాధర్మం" గురించి ఇచ్చిన సందేశం విని మాకు పట్టలేని భాష్పాలు వచ్చేసాయి.

అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని మా ఇంటి యజమాని ఫోన్ చేసి "నీ మోటారు సైకిల్ ని ఎవరో ఎత్తుకుపోయారు; వెంటనే వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇవ్వు" అని చెప్పాడు. ఏ రకమైన ఆందోళన లేకుండా నేను "పోతే పోనీ" అనుకుంటూ సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి హాయిగా అందరితో పాటు కూర్చుని సామూహిక ధ్యానం చేసాను.

మళ్ళీ మర్నాడు సెల్ ఆన్ చేయగానే మా ఇంటి వోనర్ ఫోన్ చేసి "ఎవరో కుర్రాళ్ళు మోటార్ సైకిల్‌ని యధాస్థానంలో పెట్టేసి వెళ్ళిపోయారు" అని చెప్పాడు. ఇది మరొక గొప్ప అద్భుతం.

బ్రహ్మర్షి పత్రీజీని కలిసి ఈ విషయాలన్నీ తెలుపగా వారు నా భుజం తట్టి "మీరు చెయ్యాల్సింది చేస్తూ ఉంటే మీ గురించిన బాగోగులు మీ వాళే చూసుకుంటారు" అని చెప్పారు.

అంటే.. "మేము చెయ్యాల్సింది ఇంకా ఇంకా ఎంతో ఉంది" అన్న కర్తవ్యం మాకు స్ఫురణకు వచ్చి.. హైదరాబాద్ తిరిగి రాగానే మళ్ళీ ధ్యానప్రచారం ముమ్మరం చేసాం.

 

R. రామారావు
హైదరాబాద్
సెల్ : +91 9440751771

Go to top