" నాద ధ్యానం - ధ్యానం - సంగీతం "

 

శ్రీ పుచ్చా వెంకటసూర్యశేషయ్యశాస్త్రి, హైదరాబాద్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్. పత్రీజీ ద్వారా 'శాస్త్రి' గా పిలువబడే "సంగీత నిధి"... "సంగీత కళాతపస్వి"... "సంగీత కళావిద్వన్మణి"... "సంగీత ప్రవీణ" ... మరెన్నో బిరుదులు సంపాదించుకున్న ఈ స్వరసామ్రాట్ బ్రహ్మర్షి పత్రీజీకి ముప్పై సంవత్సరాల నుంచి సన్నిహిత మిత్రులు. సంగీత, వేణుగాన నిధులైన వీరిరువురూ సరస్వతీ పుత్రులు. ఒకరంటే మరొకరికి అమిత గౌరవం. ఇష్టం. అమెరికా, ఇంగ్లండ్ మరి ప్రపంచ దేశాలలో శాస్త్రి గారు అనేక సంగీత కచేరీలు చేసారు. పాశ్చాత్యులను సైతం వారి గంధర్వ గానంలో ఓలలాడించిన మహా సంగీత ఋషి.

శ్రీ శేషయ్య శాస్త్రి గారు మృదుస్వభావి. విజయనగరం, మంథని, వరంగల్, హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ 1992 నుంచి సంగీత కళాశాలల ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం హైదరాబాద్ రామకోఠిలోని త్యాగరాయ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ఆంధ్రాయూనివర్సిటిలోనూ మరి తెలుగు యూనివర్సిటీలోనూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్‌గా వున్నారు. ఎంతో బిజీగా వుండే వీరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్లకు తమ అనుభవాలను, సంగీతజ్ఞానాన్ని, బ్రహ్మర్షి పత్రీజీతో గల వారి చిరకాల స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ... వారి మేలు కలయికలోని కొన్ని విశేషాలను మనకు అందించారు... శ్రీ శాస్త్రి గారు... హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మారం శివప్రసాద్ చేసిన ఇంటర్వ్యూ... విశేషాలు... ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు...

ఎడిటర్


మారం శివప్రసాద్ : శేషయ్యశాస్త్రి గారూ, ఆత్మప్రణామాలు, బ్రహ్మర్షి పత్రీజీతో మీ తొలిపరిచయం ఎలా జరిగింది?

శేషయ్య శాస్త్రి : 1974-75 ప్రాంతాల్లో బ్రహ్మర్షి పత్రీజీ కుటుంబం నివసించే బాగ్‌అంబర్‌పేట లోనే మేము కూడా ఉండేవాళ్ళం. అప్పటికే కర్నాటక సంగీతంలో నా డిప్లొమా పూర్తయింది. నేను పత్రీజీ గారి ఇంటి మీదుగానే మెయిన్‌రోడ్‌కి వస్తూ పోతూ వుంటే ... సాయంత్ర వేళలో.. ముఖ్యంగా చీకటిపడిన తరువాత వాళ్ళింటి మీదుగా పోతూ ఉన్నప్పుడు ఫ్లూట్ వాయిద్యం వినిపించేది. దాదాపు ప్రతిరోజూ వినిపించేది. అలా వింటూ వున్నప్పుడు... కాంభోజి రాగంలో.. విన్నప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యేవాడిని. అలా వింటూ... "ఎవరు వేణుగానం చేసేది?" ... అని విచారిస్తే "సావిత్రమ్మ గారి అబ్బాయి ఫ్లూట్ వాయిస్తాడు" అని తెలిసింది. ఆ అబ్బాయి Ag.M.Sc. చేశాడని తెలిసింది. ఒకరోజు సుభాష్ గారు నాకు బజార్లో కనిపించారు. "మనమిద్దరం కాసేపు మాట్లాడుకుందామా" అని నన్ను అడిగారు. O.K. అన్నాను నేను. వాళ్ళింటికే వెళ్ళాం. నేను సంగీతం పాడాను. ఆయన వేణువు ఆలపించారు. నా సంగీతం వారికి చాలా నచ్చింది. వారి ఫ్లూట్ నాకు ఎన్నోరోజుల నుంచే నచ్చింది. "రోజూ సాయంత్రం ఇంటి ముందు నుంచి వెళ్తూ మీ ఫ్లూట్ వింటూ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ రోజు ఇంకా ఎక్కువ ఆనందం కలిగింది" అన్నాను. అలా జరిగింది మా తొలిపరిచయం.

మారం శివప్రసాద్ : ఆ రోజు ఏం మాట్లాడుకున్నారో గుర్తుందా?

శేషయ్య శాస్త్రి : రైల్వేస్‌లో పనిచేసే T.S.చంద్రశేఖరన్ గారి దగ్గర్ ఫ్లూట్ నేర్చుకున్నట్లు చెప్పారాయన. వారి గురువు గారైన T.S.చంద్రశేఖరన్ గారి గురించి నేనసలు వినలేదు. "ఇంత బాగా ఫ్లూట్ నేర్పిన మహనీయులకు ఎంతో ప్రచారం ఉండవలసింది... మరి వీరి గురువు అజ్ఞాతంగా వున్నారు" అనిపించింది.

మారం శివప్రసాద్ : మీ స్నేహం అలాగే కొనసాగిందా? ఇంకా మీ ఇతర స్నేహితుల గురించి చెప్తారా?

శేషయ్య శాస్త్రి : మేం తరుచూ కలుసుకునేవాళ్ళం. ఆ తరువాత ఎన్నో సంగీత ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళం. మేము దాదాపు పదిమంది సంగీత ప్రియులైన స్నేహితులం కలుసుకునేవాళ్ళం తరుచుగా. నేను, పత్రీజీ, R.V.రాధాక్రిష్ణ (గాత్రం), సింగ్ (గాత్రం), గౌడ్ (గాత్రం), ఆంజనేయశర్మ (మృదంగం), గౌరీశంకర్ (గాత్రం), సింగ్ (గాత్రం) మరికొందరు కలిసి రోజూ సాయంత్రం 6.00 గంటల నుంచి 9.00 గంటల వరకు కాచిగూడ చౌరస్తాలోని R.V.రాధాక్రిష్ణ గారి ఇంట్లో కలుసుకునేవాళ్ళం. పాడుకునేవాళ్ళం. రాధాక్రిష్ణఅమ్మ, నాన్న అప్పటికే 75 సంవత్సరాల వయస్సువాళ్ళు. మా వయస్సులోని పిల్లలు బయట తిరగకుండా, సమయమంతా సంగీత సాధనలో గడపడం వాళ్ళకు చాలా ఆనందం కలిగించేది. మాకు వద్దన్నా కూడా విసనకర్రతో విసిరేవాళ్ళు. నీళ్ళు ,కాఫీలు అందించేవాళ్ళు. ఆ ఎదురింట్లోనే IAS కి ప్రిపేరవుతున్న నరసింహరావుగారు... పత్రి గారి సహాధ్యాయి ... ఇంటికి నేను, పత్రీజీ తరుచుగా వెళ్ళేవాళ్ళం.

మారం శివప్రసాద్ : మీరిద్దరూ కలిసి ఏవైనా కచేరీలు కానీ, ప్రోగ్రాములు కానీ చేశారా"

శేషయ్యశాస్త్రి : నల్లకుంటలో శృంగేరి శంకరమఠంలో శ్రీ విద్యాసేవాసమితి వుండేది. ప్రాగా టూల్స్ లో మేనేజర్‌గా పనిచేసే ప్రసాదరావు గారు శ్రీ విద్యాసేవాసమితికి అధ్యక్షుడిగా వుండేవారు. ఆయన నాకు బాగా తెలుసు. వారు ప్రతి సంవత్సరం శ్రీ లలితారాజరాజేశ్వరీ అమ్మవారి ఉత్సవాలు జరిపించేవారు. ఆ సంవత్సరం 1975 అనుకుంటాను... ఉత్సవాలు నిర్వహించినప్పుడు మాటల్లో నేను ప్రసాదరావు గారితో పత్రీజీ వేణుగానం గురించి చెప్పి "అపూర్వంగా వాయిస్తాడు వేణువుని; మా మిత్రుడు" అని చెప్పాను. వారు వెంటనే స్పందించి "Ag.M.Sc. చదువుకున్నవాడు అంత శ్రద్ధగా ఫ్లూట్ వాయిస్తాడు అంటే మనం తప్పకుండా 'కచేరీ' ఏర్పాటు చేయవలసిందే. ఈ ఉత్సవాల సందర్భంలోనే అతని 'వేణుగాన కచేరి' ఏర్పాటుచేద్దాం" అన్నారు. నేను పత్రిగారితో చెప్పాను ఈ విషయం. "నాకేమీ రాదు; నేనంత గొప్పవాడిని కాను; ఏదో నాలో నేను పాడుకుంటున్నాను" అన్నారు. నేను పట్టు విడువక ఒప్పించి వారి కచేరీ ఏర్పాటు చేయించాను... లలితామాత ఉత్సవాలలో. ప్రోగ్రామ్ ఏర్పాటయింది. చాలా అద్భుతంగా వేణుగానం చేశారు పత్రీజీ.

మారం శివప్రసాద్ : ఎవరైనా గొప్పవారు హాజరయ్యరా ఈ ప్రోగ్రామ్‌కి? పత్రీజీ కుటుంబసభ్యులు వచ్చారా?

శేషయ్య శాస్త్రి : పత్రి గారి అమ్మా, నాన్న వచ్చినట్లు గుర్తు. ఆ ప్రోగ్రామ్‌కి హాజరైన వారిలో ఒక V.V.I.P. వున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో తెలుగు విభాగం హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ అయిన మహామహనీయుడు, విశ్వనాధ సత్యనారాయణ గారి శిష్యుడు "దివాకర్ల వెంకటావధాని" గారు వచ్చారు ఆరోజు. వారు పూర్తిగా విన్నారు పత్రీజీ వేణునాదాన్ని. పులకించిపోయారు. ప్రోగ్రామ్ అయిన తరువాత ఆయన లేచి "ఇంత మృదుమధురమైన వేణుగానాన్ని ఇంత యుక్తవయస్సులోనే ఆలపించిన ఈ చిరంజీవి ఎంతైనా అభినందనీయుడు" అని వేనేళ్ళ వారు పత్రీజీని అభినందించి "వంశీగాన విశారద" బిరుదునిచ్చారు. బహూశా మొదటి కచేరీలోనే అంత గొప్పవారైనా 'దివాకర్ల వెంటవధాని' గారితో బిరుదును తీసుకున్న మహనీయుడు మన పత్రీజీ అనుకుంటాను. ఆ సందర్భంలోనే మా ఇతర సంగీత మిత్రులైన మద్రాస్ చంద్రశేఖరన్ గారి శిష్యుడు చంద్రశేఖర్ వయోలిన్ వాయించారు. ఇంకొక మిత్రుడు ఆంజనేయశర్మ మృదంగం సహకారం అందించారు.

మారం శివప్రసాద్ : మరి మీరిరువురూ కలిసి ఏవైనా కచేరీలు చేశారా?

శేషయ్య శాస్త్రి : మేమిద్దరం కలిసి చాలా కచేరీలు చేశాం. పత్రీజీ ఒక గంట ఫ్లూట్ వాయిస్తే, నేనొక గంట పాటలు పాడేవాడిని. ఒకసారి నల్గొండజిల్లా పాలెం వెంకటేశ్వరస్వామి ఆలయంలో M.S.రామారావు గారి సుందరకాండ పారాయణం సందర్భంగా అక్కడ నేను, పత్రి గారు నేను గాత్రం పాడితే ఆయన వేణుగానం చేశారు. అదేరోజు మళ్ళీ ట్రైన్‌లో బయలుదేరి నిజామాబాద్ వెళ్ళి మరుసటిరోజు పాలిటెక్నిక్ కాలేజీలో సరస్వతీ సంగీత సభ సందర్భంగా కచేరీ చేశాం.

మారం శివప్రసాద్ : మరి ఇంకా ఏ ప్రముఖ సభల్లో చేశారు మీ ఇరువురూ కలిసి?

శేషయ్య శాస్త్రి : ఒకసారి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ విద్యా సేవాసమితి వారు ఏర్పాటు చేసిన బస్సులో శ్రీశైలం వెళ్ళాం. "భ్రమరాంబికా మల్లికార్జునస్వామి" వారి ఆలయంలో పత్రి గారు ఫ్లూట్ వాయించారు ఆ సందర్భంగా.

మారం శివప్రసాద్ : పత్రీజీ మీ పట్ల ఇన్‌స్పైర్ అయ్యారా లేక మీరు వారి వల్ల ఇన్‌స్పైర్ అయ్యారా?

శేషయ్యశాస్త్రి : పత్రీజీతో సహవాసం నాకు ఎంతో చక్కటి తర్ఫీదునిచ్చింది. మాకు పరిచయమైన తొలి సంవత్సరాలలో.. ఆయనలో 'స్పిరిచ్యువల్ టచ్' లేదు. అయినా ఆయన ఎంతో బ్యాలెన్స్‌డ్‌గా ఉండేవారు. ముఖ్యంగా "గొడవల్లో తలదూర్చకపోవడం ఆయనలోని సుగుణం". " తన తప్పులేకపోయినా, తప్పుఎదుటివారిదైనా కూడా రెచ్చిపోకుండా వుండడం, శాంతంగా వుండడం" ఆయనలో నాకెంతో నచ్చిన గుణం. గొడవ ఏదైనా జరిగితే ఆ సమావేశానికి దూరంగా వుండడం ఆ సందర్భాలను బహిష్కరించడం చేసేవారు. ముఖ్యంగా ఆయనలో నాకు నచ్చింది "ఎవరినీ కామెంట్ చేయకపోవడం, మూడవ వ్యక్తిని గురించి విమర్శించకపోవడం, ఎవ్వరి గురించీ మాట్లాడకపోవడం" ఎంతో సౌజన్యంగా ఉండేవారు. "ఇది ఎలా సాధ్యం?" అని నేను అనుకునేవాడిని. క్రమంగా పత్రీజీని చుసి నేనూ అలాగే ప్రవర్తించడం ప్రారంభించాను. నా ఈ ప్రవర్తన నా జీవితంలో నాకు ఎనలేని పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెట్టింది. అందరినీ కలుపుకునిపోవడం, ఒకరి గురించి మరొకరివద్ద విమర్శించక పోవడం, లెక్చరర్ల దగ్గరి నుంచి అటెండర్ల వరకు అందరితో స్నేహంగా వుండడం వల్ల "శేషయ్య శాస్త్రి అమిత స్నేహపాత్రుడు, గొప్ప అడ్మినిస్ట్రేటర్" అనే పేరు నాకు తెచ్చిపెట్టింది. పత్రీజీ స్నేహ భాగ్యమే ఇది. స్టేట్ లెవల్లో మ్యూజిక్ కాలేజీ సర్కిల్స్‌లో ఎక్కడ ఏ గొడవలున్నా "శేషయ్యశాస్త్రి అయితే ఈ ప్రాబ్లమ్‌ని చక్కగా హ్యాండిల్ చేసి సరిదిద్దుతాడు" అని నన్ను అక్కడికి పంపేవారు... నా పై అధికారులు. ఆయా సమస్యలు చక్కగా పరిష్కరింపబడేవి కూడా. నేను చేసే కచేరిల్లో ప్రోగ్రాముల్లో కూడా ఈ క్వాలిటీ నాకెంతో పేరు తెచ్చిపెట్టింది.

మారం శివప్రసాద్ : పత్రీజీతో మీరు చూసిన మరికొన్ని సుగుణాల గురించి చెప్పండి?

శేషయ్య శాస్త్రి : అప్పట్లో అంటే 74,75 ప్రాంతాల్లోనే ఆయన ఒక "ఋషితుల్యుడు" గా కనిపించేవారు. బయటకు ఆధునికమైనా భావాలున్న వ్యక్తిగా అందరూ అనుకేవారు. కానీ అంతరంలో ఆయన ఒక ముని, ఒక ఋషి అని నేను గమనించాను. ఏ విషయాన్నైనా చాలా కూల్‌గా, డిగ్నిఫైడ్‌గా తీసుకునేవారు. ఒకసారి మేమిద్దరం సిటీ బస్ ఎక్కాం. సీట్ దొరకక నిలబడ్డాం. నేను ఎక్కడ సీట్ ఖాళీ అవుతుందో అని ఆతృతగా గమనిస్తున్నాను. సీట్ దొరక్కపోతే ఎలా అని కాదు. అదొక యాంగ్జైటీ అంతే.

పత్రీజీ మాత్రం పైన రాడ్‌ను పట్టుకుని స్థిమితంగా నిల్చుని వున్నారు. నన్ను, నా ఆతృతను చూసి ... "ఎందుకంత ఆదుర్దా? కాస్సేపు నిలబడితే ఏమైంది" అని అడిగారు నన్ను. ఇద్దరం మాట్లాడుకుంటూ ప్రయాణం చేశాం. ఇంక సీట్ గురించి ఆలోచించలేదు. కాసేపట్లో మేం దిగాల్సిన స్టేజీ వచ్చేసింది. ఈ సంఘటన తర్వాత తర్వాత ఎంతో మార్పుని తెచ్చింది నాలో. ఎంతో స్థిమితంగా వుండడం నేర్చుకున్నాను నేను ఏ విషయంలోనైనా. ఒక్కొక్క సంఘటన జీవితాన్నే మార్చేస్తుంది.

మారం శివప్రసాద్ : మరి మీ ఇద్దరి ఉద్యోగాలు? అప్పట్లోనే మీరు ఉద్యోగం చేసేవారా?

శేషయ్య శాస్త్రి : నేను సంగీతంలో డిప్లొమా పొందినా... నా మొదటి ఉద్యోగం ఖాదీ గ్రామోద్యోగ కమీషన్‌లో. ఆ తరువాత నేను సికింద్రాబాద్ సంగీత కళాశాలలో లెక్చరర్‌గా చేరాను. మరి పత్రిగారేమో కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగంలో చేరి ఆ తరువాత కర్నూలుకు ట్రాన్సఫర్ అయి వెళ్ళిపోయారు. ఆయన కర్నూలు వెళ్ళిన తర్వాత ఒకసారి నేను సంపత్ అనే ఇంకొక మిత్రుడు కలిసి కర్నూలు వెళ్ళి పత్రీజీ వెంటే క్యాంప్స్‌కి కూడా వెళ్ళాం. బాగా ఎంజాయ్ చేసాం కూడా.

మారం శివప్రసాద్ : మీరు ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం లోనే కొనసాగారా? కచేరీలు చేసేవారా?

శేషయ్య శాస్త్రి : అవును. నేను గవర్నమెంట్ అంతా సంగీత కళాశాలల్లో లెక్చరర్‌గా, ఆ తర్వాత సంగీత కళాశాలల ప్రిన్సిపాల్‌గా పనిచేశాను. చేస్తున్నాను. కచేరీలు ఎన్నో చేశాను. చేస్తున్నాను కూడా.

మారం శివప్రసాద్ : మీ ఉద్యోగంలో మీ అనుభవాలు కొన్నింటిని వివరిస్తారా?

శేషయ్య శాస్త్రి : ఉద్యోగరీత్యా నేను పట్టణాలు, నగరాలు తిరిగాను. ఎంతోమంది సంగీత విద్వాంసులను తయారుచేసాను. నా వృత్తి నాకెంతో తృప్తినిచ్చింది. సంగీతమంటే నాకు ప్రాణం. నేను సహజంగా ఎంతో కోపస్థుడిగా, ఆవేశపరుడిగా వుండేవాడిని. పత్రీజీ సాంగత్యం వల్ల నేను చాలా శాంతం, సౌఖ్యం పొందాను. నాకు కోపం, ఆవేశం వచ్చినప్పుడల్లా పత్రీజీ, త్యాగరాజస్వామి గుర్తుకువచ్చేవారు. "శాంతము లేక సౌఖ్యము లేదు" అనే త్యాగరాయకీర్తన గుర్తొచ్చి కోపం, ఆవేశం తగ్గిపోయేవి. అవసరమైనప్పుడు నేను నా స్టాఫ్‌ని కేకలు వేసినా, తిట్టినా కూడా నా స్టాఫ్ నన్ను యాక్సెప్ట్ చేసేవారు. "ఆయన కరెక్టుగా మాట్లాడతారు... మనమే తప్పుచేసి వుంటాం" అనుకుంటారు. నా స్టాఫ్. "మన బిహేవియర్ సరిగ్గా వుంటే, మనపట్ల అందరూ అలాగే వుంటారు" అని అనుకుంటాను నేను.

మారం శివప్రసాద్ : మీలోని స్నేహతత్వం... వ్యవహారశైలి...?

శేషయ్య శాస్త్రి : దాదాపు పది సంవత్సరాల క్రితం విజయనగరంలో ఒక ప్రముఖ హరిదాసు నా ప్రోగ్రామ్‌ని బాగా స్టడీ చేశాడు. నన్ను ప్రశంసిస్తూ "స్వామీ, మీ స్నేహగుణం, మీ అడ్మినిస్ట్రేషన్ చూస్తే నాకు ధర్మరాజు మరి దుర్యోధనుల కథ గుర్తుకువస్తోంది. ధర్మరాజుకు అందరూ గొప్పవాళ్ళుగా కనిపిస్తే దుర్యోధనుడికి ఎవ్వరూ గొప్పవాళ్ళుగా అనిపించలేదు. ఆ ధర్మరాజులా ప్రతి ఒక్కరినీ మీరు కలుపుకునిపోతూ వున్నారు. అందరినీ గౌరవిస్తున్నారు. నాకు మిమ్మల్ని చూసి చాలా సంతోషంగా వుంది" అన్నాడు. ఇదంతా ఒకప్పటి పత్రిగారి సాంగత్య భాగ్యమే.

మారం శివప్రసాద్ : ఉద్యోగరీత్యా మీరు దూరప్రాంతాలకు వెళ్ళిన తర్వాత మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చినట్లుంది ..

శేషయ్య శాస్త్రి : అవును. 1976 తరువాత మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మాత్రమే మేమిద్దరం కలుసుకున్నాం. 1986 లో అనుకుంటాను ... అప్పుడు నేను విజయనగరం సంగీత కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. పత్రీజీ తన ఆఫీసర్స్ గ్రూప్‌తో కలిసి విశాఖపట్టణం సన్&శాండ్ హోటల్లోబస చేసి, నాకు ఫోన్ చేసి అక్కడికి వచ్చి కలుసుకోమన్నారు. వెళ్ళి హోటల్లో కలిసాను. పదేళ్ళక్రితం సుభాష్ పత్రికి, ఈ సుభాష్ పత్రికి అసలు సంబంధమే లేదు. 1975 లో ఆయన"సంగీత పత్రి" ఇప్పుడు అంటే 1986 లో ఆయన "ఆధ్యాత్మిక పత్రి"... మాటల్లో, హావభావాల్లో చేతల్లో ధ్యానం.. ధ్యానం.. ధ్యానం. అది తప్ప వేరేమాట వినిపించడం లేదు... ఆయన సంభాషణల్లో. ఆ హోటల్లో వున్న స్టాఫ్‌ని, బట్లర్లని, సప్లయర్స్‌ని, అటెండర్స్‌ని అందరినీ ఒక రూమ్‌లో కూర్చోబెట్టి వారితో ధ్యానం చేయించారు. దేవుడి ఫోటోలని చూసి, "అవెందుకు? వాటిల్లో ఏమీ లేదు తీసివేయండి" అన్నారు.

మారం శివప్రసాద్ : మరి మీరు పత్రీజీని విజయనగరం తీసుకెళ్ళారా.

శేషయ్య శాస్త్రి : తీసుకెళ్ళాను. నేను పనిచేసే సంగీత కళాశాలకు కూడా తీసుకెళ్ళి అప్పటి మా ప్రిన్సిపాల్ గారికి పరిచయం చేసాను. "వీరు సుభాష్ పత్రి గారు నా స్నేహితులు. చాలా గొప్పగా వేణుగానం చేస్తారు" అని చెప్పాను. వెంటనే పత్రీజీ అందుకుని "నేనొక బ్రహ్మజ్ఞానిని" అన్నారు. ఆ మాటలు విని నిశ్చేష్టులయ్యి మా ప్రిన్సిపాల్... కాస్సేపటికి తేరుకున్నారు. వారితో ఇంకా పత్రీజీ "నేను దేనికి లొంగను. దేనికీ తొణకను. బెణకను. నేను కర్మ సన్యాసిని. నేను దేనికీ చెందను. ఏదీ నాకు చెందదు. మీరు నా చెయ్యి నరికినా కూడా మీ పట్ల నాలో ఏ మార్పు వుండదు" అన్నారు. ఆ తర్వాత మా కాలేజీలో వారి ప్రోగ్రామ్ ఏర్పాటుచేశాం. ఫ్లూట్ వాయిస్తూ అందరితో ధ్యానం చేయించారు. మనస్సును శూన్యం చేయమని ఆయన అప్పుడు చెప్పింది నాకిప్పిటికీ గుర్తుంది.

మారం శివప్రసాద్ : మీ ప్రిన్సిపాల్‌తో ఇంకా ఏం చెప్పారాయన?

శేషయ్య శాస్త్రి : "సంగీతం చాలా గొప్పదనుకున్నాను. నేను చాలా సంవత్సరాలపాటు. దానికంటే గొప్ప విషయం దొరికింది నాకు. అదే ఆధ్యాత్మికత. ధ్యానం. సంగీతం కూడా మరింత రాణిస్తుంది ధ్యానంతో" అన్నారు పత్రీజీ.

మారం శివప్రసాద్ : పత్రీజీ తరుచూ చెప్పే సంగీత గురువు శ్రీపాద పినాకపాణిగారి గురించి?

శేషయ్య శాస్త్రి : పత్రి గారు ఉద్యోగరీత్యా కర్నూలు బదిలీ అయిన తర్వాత ప్రఖ్యాత సంగీత విద్వాంసులు, సంగీత కళానిధి పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారిని కలుసుకునే అవకాశం లభించింది. పినాకపాణి గారు ఆంధ్ర రాష్ట్రం లోని సకల సంగీత గురువులకే గురువులు. అలాంటి పినాకపాణి గారు పత్రి గారిని ఆదరించి వారి దగ్గరున్న సంగీత జ్ఞానాన్ని గురించి ప్రత్యేకంగా ప్రశంసించి వారికి అనేక కీర్తనలు నేర్పారు. పినాకపాణిగారి దగ్గర సంగీతం నేర్చుకోవడం పూర్వజన్మ సుకృతం వుంటే గాని లభ్యం కాదు. పత్రి గారు తాము పినాకపాణి గారి దగ్గర నేర్చుకున్న కీర్తనలను చక్కగా నొటేషన్ వ్రాసి నాకు పంపుతూ వుండేవారు. ఆ విధంగా పినాకపాణి గారి సంగీతాన్ని పరోక్షంగా నేను కూడా నేర్చుకునే అవకాశం లభించింది. పినాకపాణి గారి దగ్గర చాలా కీర్తనలు సాధన చేసి గొప్ప సంగీత జ్ఞానాన్ని పొందారు పత్రిగారు.

మారం శివప్రసాద్ : ధ్యానం - సంగీతం ... మీ నిర్వచనం?

శేషయ్య శాస్త్రి : శృతిని, తాళాన్ని శ్రద్ధగా మేళవించుకుని పోవడమే ధ్యానం అనుకుంటాను నేను. సంగీతానికి సృష్టిలో చాలా ప్రాధాన్యత వుంది. అనాది నుంచి ఎందరో మహానుభావులు ఎన్నో కృతులు చెప్పారు. అన్నమయ్య అంటాడు ఇలా... "జగమంతా నాదమయం. విష్ణువు ఒక్కడే విశ్వాంతరాత్ముడు" అని.

"నాహం వసామి వైకుంఠే న యోగి హృదయోరవౌ,
మద్భక్తాః యత్ర గాయన్తి తత్ర తిష్ఠామి నారద"

అంటారు శ్రీమహావిష్ణువు. అంటే, గానానికి అంత ప్రాముఖ్యత సృష్టిలో. "నా భక్తులు ఎవరు పాడుతూ వుంటే వారి హృదయాల్లో నేనుంటాను" అని.

అలాగే త్యాగరాజస్వామి ఇలా చెప్తారు :

"మనస్సు నిలుప శక్తి లేక మధురకంఠ విరుల పూజ ఏమి సేయును" అని. సంగీతం ఎంత గొప్పదైనా మనస్సు నిలిపితేనే అందులో తాదాత్మ్యత లభిస్తుంది. సంగీతం వింటూ ధ్యానం చేస్తే మనస్సు చక్కగా నిలుస్తుంది.

మారం శివప్రసాద్ : మిమ్మల్ని మీరు మరచిపోయి పాడిన క్షణాలు?

శేషయ్య శాస్త్రి : 2006 సంవత్సరం గురుపౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్ జయలక్ష్మి గార్డెన్స్‌‍లో జరిగిన ప్రోగ్రామ్‌లో ఆ రాత్రి నేను పాడుతూండగా పత్రీజీ ధ్యానం చేయించారు. అప్పుడు ... ఆ గురుపౌర్ణమి సందర్భం... ఆ చల్లటి వాతావరణం... ఆ గార్డెన్స్ ప్రెమిసెస్ ... ఆ రాత్రి రెండువేలమంది ధ్యానుల సన్నిధి... పత్రీజీ సాన్నిహిత్యం... ఆ సందర్భంగా నేను చేసిన కచేరీ ... ఆలపించిన గానం... ఆ తాదాత్మ్యత ఇన్ని సంవత్సరాల నా సంగీత సాధన ప్రోగ్రామ్‌లలో ఈ ప్రోగ్రామ్ హైలైట్. ఎన్ని లక్షలిచ్చి ఏ కచేరీకి నన్ను పిలిపించినా కూడా నేను పొందని, పొందలేని ఆనందాన్ని ఆ రోజు రాత్రి నేను పొందాను. నా జీవితంలోనే మరపురాని మధురానుభూతి అది. మాటల్లో వర్ణించలేనిది. నా సంగీత గానాన్ని అత్యంత ఇష్టంగా, మరచిపోలేని సువర్ణాక్షర ప్రాముఖ్యతతో నేను ఎంజాయ్ చేసిన రోజది. నన్ను నేను అభినందించుకున్న స్థితి అది. దీనికంతటికీ కారణం ఆ మెడిటేషన్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి, ప్రక్కనుంచి నన్ను ఉత్తేజపరచిన పత్రీజీ ప్రెజెన్స్.

మారం శివప్రసాద్ : ఆ రోజు మీరు ఎంతో ఇన్‌స్పైర్ అయినట్లు మీ కళ్ళు చెప్తున్నాయి. మీ మాటల్లోని లోతు దాన్ని కన్‌ఫర్మ్ చేస్తోంది. మీ వైబ్రేషన్ దాన్ని సత్యం అని ఋజువు చేస్తోంది. మీ ఎనర్జీ నా బుగ్గలలో వెచ్చటి ఆవిరిని సృష్టిస్తోంది, పత్రీజీని గురించి మీరు మాట్లాడుతూంటే మీకు తెలిసిన పత్రీజీ గురించి ఇంకా వినాలని వుంది.

శేషయ్య శాస్త్రి :నేను ఎందరో స్వామీజీలను చూశాను. మరెన్నో సంస్థలను చూశాను. ఒక షిరిడీ బాబా లాగా, ఏమాత్రం స్వార్ధం లేకుండా డబ్బు మీద అస్సలు వ్యామోహం లేకుండా ప్రజానీకమంతా ధ్యానం చెయ్యాలనే కాన్సెప్ట్‌తో జగత్తంతా ధ్యాన ప్రచారమే తన జీవిత పరమావధిగా భావించిన నిస్వార్ధ సేవాపరుడాయన. డబ్బుని, వ్యామోహాన్ని జయించడం చాలా కష్టమైన విషయం. నేను మెల్లమెల్లగా వీటన్నింటి నుంచి బయటపడాలని ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాను. మరి నా సహాధ్యాయే కదా పత్రీజీ? ఆయన ఎప్పుడో 30 సంవత్సరాల క్రిందే వీటన్నింటికీ అతీతుడయ్యాడు. ప్రస్తుతం నిజమైన ఆధ్యాత్మిక గురువుగా మూర్తీభవించారు. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సమస్త ప్రపంచం ప్రజలను సన్మార్గంలో నడిపించాలని వచ్చిన నిస్వార్ధ ఆధ్యాత్మిక గురువు ఆయన. సత్యమైన గురువు. తాను పొందిన, తాను సాధించిన విజ్ఞానాన్నంతా ధ్యానులను ఎన్‌లైటెన్‌ చేయడానికే ఉపయోగించారాయన. ఇలాంటి మహనీయులంతా కారణజన్ములు. అలౌకిక స్థాయి వారిది.

మారం శివప్రసాద్ : 1975 సంవత్సరానికీ 2005 సంవత్సరానికీ మధ్యలో వారిలో మీరు గమనించిన తేడా?

శేషయ్య శాస్త్రి : ఆయన చిన్నవయస్సు నుంచి కూడా ప్రాపంచికంలో కనిపించని ఋషి. ఇప్పు డు అందరికీ కనిపిస్తున్న ఋషి. అదే అప్పటికీ, ఇప్పటికీ తేడా. అంతరంలో అప్పుడూ, ఇప్పుడు ఒకటిగానే అనిపిస్తారు నాకు.

మారం శివప్రసాద్ : వారిలో మీకు నచ్చిన మరోగుణం?

శేషయ్య శాస్త్రి :ఆయన్ను చూస్తే నాకు ఇంత గొప్ప ఆధ్యాత్మిక గురువుకు నేను స్నేహితుడిని, సంగీత సహాధ్యాయిని అని గుర్తుచేసుకుంటే నాకెంతో గర్వంగా వుంటుంది. ఆయనను నేను చాలా స్నేహితుడిగా భావించడం గొప్పకాదు. నన్ను ఆయన గతకాలంలో స్నేహితుడిగా గుర్తుంచుకుని అంతకంటే గొప్పగా ఇప్పటికీ సమాదరించడం ఆ ఫ్రెండ్‌షిప్‌ని మరింత ఔన్నత్యంతో మెయిన్‌టెయిన్ చెయ్యడం గొప్ప.

మారం శివప్రసాద్ : 1992 లో పత్రీజీ ఉద్యోగ విరమణపై మీ అభిప్రాయం?

శేషయ్య శాస్త్రి : అంత పెద్ద ఉద్యోగాన్ని ఆయన వదులుకున్నారు. ఇప్పుడు అయితే కోరమాండల్ వైస్ ప్రెసిడెంట్ స్థాయిలో రిటైర్ అవుతూ ఉండేవారేమో. అలా భౌతికమైన పదవులను, ఉన్నతోద్యాగాలను వదులుకోవడం, త్యజించడం అనేది విపరీతమైన సాహసం. భార్య బిడ్డలను, కుటుంబాన్ని, తల్లిదండ్రులను కాకుండా కేవలం స్పిరిచ్యువాలిటీనే ఆయన సంపూర్ణ జీవన మార్గంగా ఎంచుకుని అంకితం చెయ్యడం. ఒక గౌతమబుద్ధుడి స్థాయి అది. పత్రీజీకే చెల్లింది.

మారం శివప్రసాద్ : వారి కుటుంబంతో మీకున్న పరిచయం?

శేషయ్య శాస్త్రి : శ్రీమతి స్వర్ణమాలా తండ్రిగారు కూడా ఉన్నతాభ్యాసం ఉన్నతోద్యోగం చేసినవారే. వారి తండ్రి గారు ప్రొఫెసర్. అలాంటి ఉన్నత కుటుంబంలోంచి వచ్చిన స్వర్ణమాల గారు చిన్నప్పటి నుంచి క్లాస్‌గా ఉన్నవారు. మరి అంత గొప్ప కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ, ఈయన సడెన్‌గా ఉద్యోగవిరమణ చేస్తే ఎలా తట్టుకున్నారో. ఇద్దరు ఆడపిల్లలుండి కుటుంబాన్ని ఎలా లాక్కువచ్చారో? ఆ మహా ఇల్లాలు ఎంత ఓర్చుకుందో? ఎన్ని ఇబ్బందులు పడిందో? నాకు ఆశ్చర్యం వేస్తూ వుంటుంది. చెప్పడం చాలా సులభం. ఆచరణ చాలా కష్టం. దాన్ని సాధించింది ఆవిడ. అధిగమించింది అనవచ్చు. పత్రీజీ దృక్పధాన్ని యాక్సెప్ట్ చేసి, జీవితం గడుపుతున్నారావిడ. వారికి నా ధన్యవాదాలు.

మారం శివప్రసాద్ : పత్రీజీ తల్లిదండ్రుల గురించి?

శేషయ్య శాస్త్రి : వారి తల్లి సావిత్రీదేవి గారికి సంగీతం పట్ల చాలా మక్కువ. భజనలు అంటే ఆమె చెవి కోసుకునేది. పత్రీజీ చిన్నప్పటినుంచే సంగీతం నేర్చుకున్నారంటే దానికి కారణం ఆవిడే. ఆవిడ చాలా హుందాగా మాట్లాడతారనీ, డిగ్నిఫైడ్‌గా వుంటారనీ మా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అనుకునేవాళ్ళం. మరి ఆమె స్వభావమే ఈయనకు వచ్చిందేమో? వారి తండ్రిగారితో నాకు పెద్ద పరిచయం లేదు. కానీ, వారి ఆరోగ్యం సరిగ్గా వుండేది కాదు. ఆయన మితభాషిగా అనిపించేవారు. వారు చాలాకాలం క్రితమే వెళ్ళిపోయారు. సావిత్రమ్మగారు ఈ మధ్యనే వెళ్ళిపోయారు కదా. దొడ్డ ఇల్లాలు.

మారం శివప్రసాద్ : పత్రీజీ సోదరులు వేణువినోద్, సోదరి సుధ గార్ల గురించి

శేషయ్య శాస్త్రి : సుధ గారితో నాకంత పరిచయం లేదు. వారి బ్రదర్ వేణు గారు కూడా చక్కగా ఫ్లూట్ వాయించేవారు. సోదరలిద్దరూ ఫ్లూట్ వాయిస్తూంటే చూడముచ్చటగా వుండేది. ముఖ్యంగా సావిత్రిదేవి గారు చాలా బాగా ఎంజాయ్ చేసేవారు వారిద్దరూ కలిసి వేణుగానం చేస్తూంటే, వేణు గారి వేణుగాన ప్రియత్వమే పత్రీజీని కూడా వేణుగాన విద్వాంసుని చేసింది అని పత్రీజీయే చెప్తారు కదా.

మారం శివప్రసాద్ : వేదకాలంలో సంగీతం ప్రాముఖ్యత ఎలా వుండేది?

శేషయ్య శాస్త్రి : మనం నారదుడు, తుంబురుడు మతంగుడు, భృంగి, ఆంజనేయుడు... వీరి గురించి విన్నాం కదా. వీరంతా సంగీతంలో నిష్ణాతులే. సంగీతానికి మూలం సరస్వతి. శివుడు నటరాజు, నృత్యానికి అధిపతి. సంగీతం, నృత్యం వేదకాలంలో సత్యలోకంలో, వైకుంఠంలో, కైలాసంలో ఎంతో ప్రాముఖ్యత పొందాయని పురాణాలు చదివిన ప్రతివారికీ అర్థమవుతుంది. స్వరాలు సరస్వతీదేవి నుంచి, నృత్యం నటరాజు నుంచి వచ్చాయని ప్రతి సంగీత విద్వాంసుడికీ తెలుసు.

మారం శివప్రసాద్ : మరి సంగీతాన్ని చక్కగా నేర్చుకోవాలనుకునేవారికి మీ సలహా ఏమిటి?

శేషయ్య శాస్త్రి : సంగీతం 1. గాత్రం 2. వాయిద్యం... ఈ రెండూ చక్కగా ప్రాక్టీస్ చేసుకుని ఆలపిస్తే ఎంతో యుక్తంగా వుంటుంది. ఇప్పుడు ఎన్నో ఇన్‌స్ట్రుమెంట్స్ వచ్చాయి. ప్రక్క వాయిద్యాలు లేకుండానే కీబోర్డ్ సహాయంతో ఎంతో అద్భుతంగా ప్రోగ్రామ్స్ ఇవ్వవచ్చు. శ్రద్ధతో దేనినైనా పొందవచ్చు. ధ్యానం చేస్తూ సంగీత సాధన చేస్తే ఎంతో గొప్ప విద్వాంసులయ్యే అవకాశం వుంది.

మారం శివప్రసాద్ : సంగీత జ్ఞానం ప్రతిఒక్కరికీ అవసరమా? సంగీతం నేర్చుకోండి అంటూ వుంటారు పత్రిసార్ ఎప్పుడూ, మీరు కాస్త వివరిస్తారా?

శేషయ్య శాస్త్రి : "సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము కలదే మనసా." అంటారు త్యాగరాజస్వామి. భక్తి అంటే చేసే పని పట్ల అంకితభావం. జగమంతా సునాదమే. నాదమయమే. అందుకే పత్రీజీ సంగీతం నేర్చుకోమని చెప్తారు. శిశుర్వేత్తి, పశుర్వేత్తి వేత్తి గాన ఫణిం రసః.

మారం శివప్రసాద్ : సంగీతం ఎలా వుండాలి? మన సప్తస్వరాలతో కూడిన సంగీతానికీ, వెస్ట్రన్ మ్యూజిక్‌కూ తేడా ఏంటి?

శేషయ్య శాస్త్రి : శాస్త్రీయ సంగీతానికైనా, పాప్ మ్యూజిక్‌కైనా శ్రుతి, లయ వుండాల్సిందే. మన సప్తస్వరాలు సింపతిటిక్ వైబ్రేషన్స్. ఆహ్లాదకరమైన తరంగాలు. అలాగే పాశ్చాత్య సంగీతంలో కూడా తాదాత్మ్యత వుంది. చక్కటి శ్రుతి, లయ వుంది. సంగీతం ఋషిప్రోక్తం. ధ్యానంలోనే యోగులు గ్రహించారు ఈ సునాదాలని. ఓంకార శబ్దం అనాహతచక్ర ప్రోక్తం. ననాద ఢక్కాం నవపంచవారం. ఇందులో పద్నాలుగా సూత్రాలున్నాయి. ఈశ్వరుడు నాట్యం చేస్తున్నప్పుడు ఢమరుకాన్ని 14 సార్లు మ్రోగించాడట. అవే ఈ 14 సూత్రాలు. సామవేదం సంగీతం. అధిదేవత సరస్వతి. పాశ్చాత్య దేశాలలో వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తూ పాలు పితుకుతూ వుంటే అధికంగా పాలు వస్తున్నాయని తెలుసుకుని సంగీతాన్ని ఆవుల ఫామ్స్‌లో వినిపిస్తున్నారు అక్కడ.

సంగీతం - వుంటే - ఆరోగ్యం

సంగీతం - వుంటే - మనోల్లాసం

సంగీతం - వుంటే - మరింత ధ్యానం

సంగీతం - ఆబాలగోపాలానికీ - ఆనందం

మారం శివప్రసాద్ : మరి సంగీతం వల్ల జబ్బులు తగ్గుతాయా?

శేషయ్య శాస్త్రి : సంగీతం వల్ల జబ్బులు తగ్గించవచ్చు అని సైంటిస్టులు ఋజువు చేసారు. ప్రశాంత వాతావరణంలో వుంటూ, సంగీతం వింటూ ధ్యానం చేస్తే జబ్బులు మరింత త్వరగా తగ్గుతాయి. ఏరాగం పాడితే ఏ రకమైన జబ్బు తగ్గుతుంది అనే విషయం గురించి రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. మన మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఇందులో రీసెర్చ్ చేస్తున్నారు అని విన్నాను. దీపక రాగాన్ని పాడితే దీపాలు వెలుగుతాయి. తాన్‌సేన్ దీపిక రాగాన్ని పాడి దీపాలు వెలిగించాడు. ఏ రాగాన్నైనా చక్కగా అవగతం చేసుకుని చక్కగా పాడగలగాలి. చక్కగా శృతితో పాడితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పత్రీజీ దృష్టి అంతా ధ్యాన ప్రచారం మీద వుంది. వారే కనుక సంగీతమే ప్రధానం అనుకుని వుంటే సంగీతానికి ధ్యానాన్ని జోడిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించి నోబెల్ ప్రైజ్ అందుకునేవారు. రాగస్వరూపం తెలిసి దాన్ని అమలు చేస్తే ఆ రాగం ఫలితం అద్భుతంగా వుంటుంది.

మారం శివప్రసాద్ : మీరు ఎప్పుడు మొదలుపెట్టారు సంగీత సాధన? మీ తొలిగురువు?

శేషయ్య శాస్త్రి : 1965 నుంచి నేను సంగీత సాధన చేశాను. నా తొలి గురువు నా తండ్రే.. వారి పేరు పుచ్చా వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి. కీర్తిశేషులు. చాలా గొప్ప సంగీత విద్వాంసులు. ప్రభుత్వ సంగీత కళాశాలలకు విజిటింగ్ ప్రొఫెసర్&రీసెర్చ్ ఆఫీసర్. "సంగీత విద్యాసాగర", "సంగీత మార్తాండ" లాంటి ఎన్నో బిరుదులున్నవారు. వారి దగ్గర నేను మొట్టమొదట సంగీతం నేర్చుకున్నాను. మా తల్లి గారి పేరు సూర్యకాంతమ్మ గారు. గృహిణి. వారికి సంగీతం రాదు. నా శ్రీమతి పద్మ. హెడ్‌మినిస్ట్రెస్‌గా పనిచేసేది. వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకుంది. మాకు ఇద్దరమ్మాయిలు. సుష్మ, సుచిత్రలు. బాగా చదువుకున్నారు.

మారం శివప్రసాద్ :ఇంకా మీరు ఎవరెవరివద్ద సంగీత సాధన చేసారు?

శేషయ్య శాస్త్రి : 1967-70 సంవత్సరాలలో మొదట కులవర్తి రామదీక్షితులు గారి దగ్గర. 1970-74 సంవత్సరాలలో సుసర్ల శివరాం గారి దగ్గర. 1977 తరువాత సంగీత కళానిధి డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గారి దగ్గర నేను సంగీత సాధనలో మెరుగులు దిద్దుకున్నాను.

మారం శివప్రసాద్ : మరి మీరు ఎప్పటికప్పుడు సంగీత సాధన చేస్తూ వుంటారా?

శేషయ్య శాస్త్రి : ఎప్పుడూ సాధన చేస్తూ వుండాలి. బుక్స్ రిఫర్ చేస్తూనే వుండాలి. "సాధన సేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా అంటాడు" తుకారాం. "సాధనతో సమకూరు పనులు ధరణిలోన" ఒకసారి ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు గారు ఇలా అన్నారు: "ఒకరోజు సాధన చేయకపోతే నా లోటు నాకు తెలుస్తుంది. రెండవరోజు సాధన చేయకుండా వాయిస్తే ప్రజలకు తెలుస్తుంది. నిత్యసాధన అవసరం" నేనైతే మాత్రం ఎప్పటికప్పుడు సంగీత సాధన చేస్తాను. ధ్యానం చేస్తాను. ధ్యాన సాధన, సంగీత సాధన రెండూ నాకు రెండు కళ్ళు.

మారం శివప్రసాద్ : మీకు ఎలాంటి సంగీతమంటే ఇష్టం?

శేషయ్యశాస్త్రి : నాకు శాస్త్రీయ సంగీతమంటే ఇష్టం. పాప్ మ్యూజిక్ చెవికి ఆనందాన్నిస్తుంది. శాస్త్రీయ సంగీతం మానసిక ఆనందాన్నీ, శాశ్వత ఆనందాన్నీ ఇస్తుంది.

మారం శివప్రసాద్ :మీరు అనుభూతి పొందిన ఇతర కళాకారులు?

శేషయ్య శాస్త్రి : T.R.మహాలింగం గారి ఫ్లూట్. షెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గారి గాత్రం. చెంబై వైద్యనాధన్ గారి గాత్రం. M.S.సుబ్బలక్ష్మి గారి గాత్రం. బిస్మిల్లాఖాన్ షహనాయి. K.V.నారాయణస్వామి గారి గాత్రం. యల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగం. అన్నింటినీ మించి ధ్యానం చేయిస్తూ, పాటపడుతూ, ఫ్లూట్ వాయించే పత్రీజీ. వీరందరి సంగీతం వింటూ నేనెంతో మధురానుభూతులు పొందాను.

మారం శివప్రసాద్ :మీరు ఎంతమంది సంగీత కళాకారులను తయారుచేసారు?

శేషయ్య శాస్త్రి : నేను ఎంతోమందికి సంగీతం చెప్పాను. చాలామందిని చక్కగా తయారు చేసాను. అయితే వారిలో బాగా పాడగలిగినవారు, నాకు తృప్తి కలిగించినవారు ఒక యాభైమంది వుంటారు. వారిలో ఒక 30 మంది లెక్చరర్స్‌గా వున్నారు. కొంతమంది పెర్‌ఫార్మింగ్ ఆర్టిస్టులుగా వున్నారు. D.వర్ధని, విజయనగరం... ఈవిడ భద్రాచలంలో ధ్యాన మహాయజ్ఞంలో పాడింది. మరి సరస్వతి, నాగలక్ష్మి సోదరీమణులు, ఇక వంశీకృష్ణ అనే ఆర్టిస్టు లండన్‌లో వున్నాడు. ఇంకా ఇలా ఎంతోమంది.

మారం శివప్రసాద్ :సంగీతం నేర్చుకున్నవాళ్ళు ధ్యానం మొదలుపెడితే మామూలు వారికంటే త్వరగా ధ్యానయోగులయ్యే అవకాశం వుందా?

శేషయ్య శాస్త్రి : సంగీతం ప్రవేశం వున్నవారు, కొంతైనా సంగీతంలో పాండిత్యం వున్నవారు ధ్యాన సాధన కూడా మొదలుపెడితే మంచి స్థితి త్వరగా పొందే అవకాశం వుంది.

మారం శివప్రసాద్ :ధ్యానం గురించి సంగీతంలో మహానుభావులైన త్యాగరాజస్వామి చెప్పిన ఒక కృతి చెప్పండి

శేషయ్య శాస్త్రి :

"మానస వనచరవర సంచారము నిలిపి 'మూర్తి'
బాగుగా పాడగనే వారెందరో మహానుభావులు.
పరమ భాగవత మౌని వరశశి విభాకర
సనకసనందన దిగేశ సురకింపురుష
కనక కశిపుసుత నారదతుంబురు
పవనసూను బాలచంద్రధర శుకసరోజ
భవ భూసురవరులు పరమపావనులు
ఘనులు శాశ్వతులు కమలభవసుఖము
సదానుభవులుగాక మానసవనచరవర
సంచారము నిలిపి 'మూర్తి' బాగుగా పాడగనే
వారెందరో మహానుభావులు.
అందరికీ వందనములు."

వీరంతా పరమాత్ముని తెలుసుకున్న మహానుభావులు. కోతి లాంటి మనస్సు యొక్క సంచారం నిలిపి దాన్ని ఆపి పరమాత్ముని తెలుసుకోవచ్చు. అదీ త్యాగరాజు జ్ఞాన వైభవం. నిజమైన ఆధ్యాత్మికతలో తాదాత్మ్యత పొందినవాడాయన అదే ధ్యానమంటే. ధ్యానం సంగీతం కంటే గొప్ప సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. సంగీతం వింటూ ధ్యానం చేయడం వల్ల... మన మనస్సుని సంగీతం పైనే కేంద్రీకరించడం వల్ల... మనస్సు నిలిపే శక్తి కలిగి ధ్యానం చక్కగా కుదురుతుంది. ఒకే విషయం పైన మనస్సును కేంద్రీకరించడమే ధ్యానం అంటే. కళ్ళు మూసుకుని ఏదైనా మీకు నచ్చిన నాదం వింటూ శ్వాస మీద ధ్యాస పెట్టండి. క్రమంగా మీరు ఆలోచనారహిత స్థితి లోకి వెళ్ళిపోతారు. నాదం పైన మనస్సును లగ్నం చేయడం వల్ల ధ్యానం బాగా జరుగుతుంది.

మారం శివప్రసాద్ :మరి పిరమిడ్ ధ్యానులందరికీ మీ సందేశం?

శేషయ్య శాస్త్రి : మనం దేవతలుగా కీర్తించే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, అయ్యప్ప, ఒక మహా మహనీయ నిరాడంబర యోగి, సద్గురువుగా భావించే షిరిడీ సాయిబాబా, అహింసా మార్గాన్ని చుపిన ధ్యాన ప్రదాత గౌతమబుద్ధుడు, కరుణామయుడు, శాంతిదూత జీసస్‌క్రైస్ట్, నిరాకార పరమాత్మతత్వాన్ని బోధించిన ప్రవక్త మహమ్మద్... వీరందరి విలువ, వీరున్నప్పుడు మనకంతగా తెలియలేదు. తర్వాత తర్వాత ఎన్నో తరాలుగా, తరతరాలుగా వీరి గురించి ప్రజలకు మరింత.. మరింత చక్కగా విశదమవుతూ వస్తున్నది. ఉదాహరణకు హరిశ్చంద్రుడిని తీసుకోండి సూర్యుడు, చంద్రుడు ఉన్నంతకాలం 'సత్య హరిశ్చంద్రుడు ' అని ఆయన కీర్తింపబడుతూనే వుంటాడు. మన బ్రహ్మర్షి పత్రీజీ అలాంటి ఒక ప్రవక్త. వారితో చిరకాల పరిచయం వున్న సంగీత సహాధ్యాయిని నేను. ఎంతోమందికంటే వారి గురించి చక్కగా తెలిసినవాణ్ణి నేను... అప్పుడూ ఇప్పుడూ కూడా. ఈ ఆధునిక ప్రవక్త పత్రీజీ కాలంలో మనం పుట్టడం, వారికి సన్నిహితంగా వుండి వారి వేణునాద ధ్యానంలో అభ్యాసం చేసే యోగం మనకు కలగడం జన్మజన్మల సంస్కార విశేషంగా నేను భావిస్తున్నాను. వారికి చిరకాల స్నేహితుడిగా వుండే అవకాశం నాకు కలగడం ఏనాటి నోము ఫలమో. 'ధ్యాన జగత్' వారి ధ్యేయం. వారిని అనుసరించి ధ్యానం చెయ్యండి. సంగీతం వింటూ ధ్యానం చెయ్యండి. ధ్యానం చెప్పండి. ముక్తిమార్గం ఇదే.

నాద - ధ్యానం.. ధ్యానం - సునాదం. జగమంతా నాదమయం - జగమంతా కావాలి ధ్యానమయం.

ధ్యానమిత్రులందరికీ, పిరమిడ్ మాస్టర్లందరికీ సర్వజిత్‌నామ సంవత్సరం యొక్క శ్రీరామనవమి యొక్క నాదపూర్వక శుభాకాంక్షలు.

Go to top