" స్పిరిచ్యువాలిటీ వల్ల మైండ్ స్ట్రాంగ్‌గా అవ్వడమే కాకుండా బుద్ధి వికసిస్తుంది, విచక్షణా జ్ఞానం పెరుగుతుంది "

" పత్రీజీ సోదరి మేడమ్ సుధాకోడూరి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ "

 

శ్రీమతి సుధా కోడూరి మేడమ్‌తో ఇంటర్వ్యూ మూడుసార్లు వాయిదాపడి చివరకు 25-01-07 న హిమాయత్‌నగర్ లోని నూతన ధ్యానంధ్రప్రదేశ్ ఆఫీస్ లో బ్రహ్మర్షి పత్రీజీ ఆఫీస్‌లో వున్నప్పుడు సాధ్యమయింది. బహుశా మాతృశ్రీ సావిత్రీదేవి గారి గురించిన కొన్ని మధురస్మృతులు వారి జీవనయాత్ర ముగిసిన తరువాత గుర్తుచేసుకోవలసిన సందర్భం వుందేమో.

పత్రీజీ ద్వారా ధ్యాన పరిచయం ... పిరమిద్ స్పిరిచ్యువల్ సొసైటీతో సుధా మేడమ్ అనుబంధం... డాక్టర్ మరి సైకియాట్రిస్ట్‌గా వుంటూ ధ్యానం గురించి క్లయింట్స్‌కి సజెస్ట్ చేసి అద్భుత ఫలితాలు సాధించడం.. వారి తల్లి గారు బాడీ వెకేట్ చేయడం, తల్లిదండ్రులతో, సోదరులతో అనుబంధం... ఇంకా ఎన్నో విషయాలకు వారు ఎంతో ఓపికగా, చక్కగా జ్ఞాపకం చేసుకుని సమాధానాలు ఇచ్చారు. మేడమ్ గారికి కృతజ్ఞలతో...

మారం శివప్రసాద్


మారం : పత్రీజీలో మీరు అబ్జర్వ్ చేసిన ప్రత్యేకతలేంటి?

సుధామేడమ్ : చిన్నప్పటి నుంచీ ఆయన జేబులో ఎప్పుడూ స్వామి వివేకానంద ఫోటో వుండేది. 1965 లో అనుకుంటాను... నా 19 వ పుట్టినరోజు నాడు... మా అమ్మ నన్ను కొత్తచీర కట్టుకుని సెలబ్రేట్ చేసుకోమంది. అప్పుడు 'సుభాష్' అంటే మన బ్రహ్మర్షి పత్రీజీ ప్రక్కనే వున్నారు. అమ్మ ఎదురుగా ఏమీ మాట్లాడకుండా ఆమె ప్రక్కకు వెళ్ళిన తరువాత నన్ను పట్టుకుని "నీకేమైన పిచ్చా? బర్త్ డే అంటే 'మనం ఎందుకు పుట్టాం? మన గతం ఏంటి? మనం ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాం' అని ఆలోచించాలే గానీ 'చీర కొనుక్కోవాలా? సెలబ్రేట్ ఎక్కడ చేసుకోవలి?' అని కాదు" అన్నాడు. ఇలాంటి గాఢమైన ఆధ్యాత్మిక భావాలు ఆయనకు చిన్నవయస్సు నుంచే వుండేవి. ఈ విషయం నాకు నేను ధ్యానం మొదలుపెట్టిన తరువాతనే అర్థమయ్యింది.

మారం శివప్రసాద్ : ఇంత పెద్ద ఆర్గనైజేషన్‌ను పత్రీజీ ఒంటిచేత్తో ఎంతో సమర్ధవంతంగా నిర్వహించడం వెనుక బాల్యంలో ఏమైనా ప్రత్యేక విశేషాలున్నాయా?

సుధా మేడమ్ : మేము బోధన్ దగ్గర షక్కర్‌నగర్‌లో వుండేవాళ్ళం. మా చిన్నప్పుడు మా తండ్రిగారి ఉద్యోగరీత్యా. అక్కడ మాకు కమ్యూనిటీ లివింగ్ అలవాటయ్యింది. సుభాష్ నాకంటే కేవలం రెండేళ్ళు చిన్నవాడు. నేను, సుభాష్ మరణించిన మా చిన్నతమ్ముడు 'అరవింద్' ముగ్గురం బాగా ఆడుకునేవాళ్ళం. షక్కర్‌నగర్ లోని రెసిడెన్షియల్ క్వార్టర్స్‌లో మేం ఆఫీసర్స్ క్వార్టర్స్‌లో వుండేవాళ్ళం. అక్కడ హిందువులతోపాటు క్రిస్టియన్లు, ముస్లిమ్‌లు... అన్ని మతాలవాళ్ళు వుండేవాళ్ళు. పండగలొస్తే అన్ని మతాల పండగలకు మా పెద్దవాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేం, మా ఫ్రెండ్స్ అయితేనేం ఒకరినొకరు కలుసుకునేవాళ్ళం. అలా మాకు జన్మతః "కమ్యూనిటీ లివింగ్" అన్నది నరనరాల్లో ఇంకిపోయింది. అలా అన్ని మతాలవాళ్ళతో కలిసివుండడం వల్ల, ఫంక్షన్‌లు పండుగలు కలిసి చేసుకోవడం వల్ల ఈ బాల్యం లోని అమరికలు లేని క్లోజ్‌‍నెస్ పత్రిగారికి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ఆర్గనైజేషన్‌లో ఎంతో ఉపకరించి వుంటుందని నేను భావిస్తున్నాను.

మారం శివప్రసాద్ : "మీ కుటుంబం గురించి చెప్పండి?"

సుధా మేడమ్ : మా కుటుంబం అంటే నాన్న P.V.రమణారావు గారు, మా అమ్మ సావిత్రమ్మ, మా అన్నయ్య వేణువినోద్, మా అక్క ఉష, నేను, సుభాష్, మా చిన్నతమ్ముడు అరవింద్. అరవింద్ లుకేమియా వల్ల తన 15 వ ఏట బాడీ వెకేట్ చేశాడు. మా అన్న వేణువినోద్ గారి పట్ల మేమంతా భయభక్తులతో వుండేవాళ్ళం. అమ్మానాన్నల పట్ల ఎంతో ఇష్టంగా వుండేవాళ్ళం. అక్కకు చిన్నప్పుడే పెళ్ళై వెళ్ళిపోవడం వల్ల అన్న అంటే భయభక్తులుండడం వల్ల నేను, పత్రీజీ, అరవింద్ ఎంతో క్లోజుగా వుండేవాళ్ళం.

మారం శివప్రసాద్ : పత్రిసార్‌తో మీ అనుబంధం?"

సుధా మేడమ్ : 1960 లో నేను, తమ్ముళ్ళిద్దరం పై చదువుల కోసం సికింద్రాబాద్‌కు వచ్చాం. అన్నయ్య అప్పటికి మూడు నాలుగు సంవత్సరాల ముందే సికింద్రాబాద్ వచ్చాడు. అందరం కలిసి వంట చేసుకుని తినేవాళ్ళం. నాన్నగారి ఉద్యోగరీత్యా షక్కర్‌నగర్ లోనే వుండేవాళ్ళు అమ్మా నాన్న. 1964 లో అరవింద్ బాడీ వేకేట్ చేశాడు. అది 'డెత్' తో నా మొదటి అనుభవం. బయట అందరికీ చెప్పకపోయినా అది నన్ను చాలా బాధపెట్టింది. జీవితంలో ఒక 'వెలితి'ని ఫీలయ్యాను. " 'డెత్' అంటే ఏమిటి?" అన్న ప్రశ్న నాలో మొదలయింది. చిన్నప్పటి నుంచి స్వతహాగా ఎక్కువ మౌనంగా వుండే సుభాష్ తమ్ముడు అరవింద్ మరణం తర్వాత మరింత మౌనంగా వుండడం మొదలుపెట్టాడు. అప్పట్లో భయపడ్డాం ఈయన ఏమౌతాడో ఏమో అని.

షక్కర్‌నగర్‌లో మా నాన్నగారి ఆప్తమిత్రులు కోడూరి హనుమంతరావు గారు. వారి శ్రీమతి శ్యామల గారు. ఆ కుటుంబం, మాకుటుంబం ఎంతో క్లోజ్‌గా వుండేవి. మా నాన్న గారికి తీవ్ర అనారోగ్యం కలిగినప్పుడు... వారు రిటైర్ అయ్యేవరకు కూడా ... నాన్న గారి జాబ్ పోకుండా సర్వీస్‌లో కంటిన్యూ కావడానికి శ్రీహనుమంతరావు గారి సహకారం అంతా ఇంతా కాదు. మా రెండు కుటుంబాల అన్యోన్యత క్రమంగా 'బంధుత్వం' గా మారి వారు నా 'అత్తమామలు' అయ్యారు. మా వారు శ్రీరామక్రిష్ణగారు శ్రీ హనుమంతరావు, శ్రీమతి శ్యామలల కుమారులే. మా అత్తా మామగార్లకు మా కుటుంబం... మా నాన్నగారి ఫ్యామిలో ... ఎంతో ఋణపడి వుంది.

మారం శివప్రసాద్ : "మీ జీవితంలో మీరు మరచిపోని మధురస్మృతులు, చేదు అనుభవాలు?

సుధా మేడమ్ : 'చేదు అనుభవాలు'... చిన్నవయస్సులో అరవింద్ బాడీ వెకేట్ చెయ్యడం. మధురస్మృతుల విషయానికి వస్తే నేను M.Sc. లో ఆర్గానికి కెమిస్ట్రీ చేశాను. అదే ఆర్గానిక్ కెమిస్ట్రిలో Ph.D. కూడా మొదలుపెట్టాను. నాకు 23 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాతనే పెళ్ళి అయ్యింది. నా పెళ్ళి గురించిన ఆలోచనల్లో నన్ను విద్యానగర్‌లో వుండే ఒక ఇంజనీర్ మరి జ్యోతిష్కుడు కూడా అయిన శ్రీ గౌరీశంకర్ గారి వద్దకు తీసుకెళ్ళారు. ఆయన నన్ను స్టడీ చేసిన తర్వాత " ఈ సంవత్సరం(1968) ఆగస్ట్ తర్వాత పెళ్ళి అవుతుంది. ఈమె విదేశాలకు వెళ్తుంది. ఇప్పుడు ఈమె చదువుతున్న చదువు Ph.D. ఆగిపోతుంది. విదేశానికి, ఇండియాకు చాలాసార్లు తిరుగుతుంది. చివర్లో మెడిసిన్ చేస్తుంది" అని చెప్పారు. నాకు చాలా కోపం వచ్చింది. ఆయన జ్యోతిష్యాన్ని తేలికగా కొట్టిపారేశాను. ఎందుకంటే Ph.D. చేయడాన్ని నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని. అది మానేస్తాను అని వారు చెప్పడం నాకు అస్సలు రుచించలేదు. "Ph.D. నేను ఎందుకు మానేస్తాను? ఏం జ్యోతిష్యం లే అనుకున్నాను.

అయితే నా పెళ్ళైన 12 ఏళ్ళ తరువాత నేను మెడిసిన్‌లో చేరాను బెంగుళూర్‌లో. రామక్రిష్ణ గారితో 1968 అక్టోబర్‌లో పెళ్ళై, Ph.D. మానేసి నాలుగునెలల పాపతో 1970 లో అమెరికా వెళ్ళిపోవలసి వచ్చింది. మెడిసిన్‌లో 1980 లో చెరినప్పుడు "వారి జ్యోతిష్యం పూర్తిగా కరెక్ట్" అని నాకు అర్థమయ్యింది. ఇది నేను నా జీవితంలో మరచిపోలేని సంఘటన.

మరి నా జీవితంలో నేను మరచిపోలేని మధురస్మృతి ఏంటంటే ఒకసారి కలలో నేను శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయస్వాములను చూడటం. 1982 లో గాధనిద్రలో కల వచ్చింది. బెంగుళూరులో మెడిసిన్ చేస్తున్నాను. ఆ రోజు ఇంటినిండా బంధువులు వున్నారు. వున్నవి రెండు రూమ్‌లు. కలలో ఎవరో తలుపు తట్టారు. తలుపు తీసి చూస్తే బయట సీతారామలక్ష్మణులు. "మేం ఈ దారిని వెళుతూ అలసిపోయి మీ ఇంటికి వచ్చాం, విశ్రాంతి తీసుకునేందుకు" అన్నారు. "మరి మా ఇంటి నిండా జనం వున్నారు. మీరు ఎక్కడ పడుకుంటారు? స్థలం లేదు కదా?" అన్నాను. వారు విగ్రహాలకు మనం చేసే అలంకారాల వంటి అలంకారాలతోనే వున్నారు. "మేం ఇప్పుడు మళ్ళీ వేరొక ఇంటికి వెళ్ళలేం. బాగా అలసిపోయివున్నాం, సర్ధుకుని పడుకుంటాం" అని లోపలికి వచ్చి మా మధ్యనే సర్ధుకుని పడుకున్నారు. ఉదయం లేచి అది కల కాదు, వాస్తవమే అనుకుని వారికై వెతికాను. అప్పుడు నాకు అర్థం అయింది "ఆ రోజు నా హృదయద్వారాలు ఓపెన్ అయ్యాయి" అని.

ఇక మా ఆత్మీయ స్నేహ కుటుంబంలోని వ్యక్తి అయిన శ్రీరామక్రిష్ణ గారిని పెళ్ళి చేసుకోవడం, 35 సంవత్సరాల వయస్సులో అమెరికా నుంచి ఇండియా వచ్చి M.B.B.S. చేయడం, మళ్ళీ అమెరికాలో మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం, ఆ పైన ధ్యానం గురించిన తెలిసిన తరువాత చాలా ఇష్టపడి 'సైకియాట్రీ' కోర్స్ అమెరికాలోనే చేయడం, నా జీవితంలోని ఇతర మధురస్మృతులు. ముఖ్యంగా నాకు U.S.A. లో సైకియాట్రీ కోర్సులో సీట్ రావడం.

మారం శివప్రసాద్ : "మీకెందుకు చదువుపై ఇంత మోజు"

సుధా మేడమ్ : అది నా ఒక్కదాని మోజే కాదు. మా కుటుంబమంతా ఉన్నతవిద్యావంతులే. మా అమ్మ, మా నాన్నగార్లకు "చదువే జీవితధ్యేయం" అనే అభిప్రాయం వుండేది. మా అక్క ఉష B.A. చేసింది. ఇక మా అన్నయ్యా? చదువే ఆయన. ఆయనే చదువు. అంత మమత చదువులంటే. మీకు తెలుసు కదా పత్రీజీ కూడా మొదట B.Sc. చేసి, I.A.S. కు రెండుసార్లు అప్పియర్ అయి, ఆ తరువాత B.Sc. Agriculture, M.Sc. Agriculture చేశారని. మా అన్నయ్య, మా వారు రామక్రిష్ణ ఇద్దరూ కూడా IIT లో M.Tech చేశారు. తరువాత మా అన్నయ్య మాంచెస్టర్‌లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో Ph.D. చేశారు. మా వారు అమెరికాలో M.S.(Environmental Engineering) చేశారు.

డిగ్రీలు అనేవి ప్రాపంచిక జీవితానికి అంటే ముఖ్యంగా భుక్తికి పనికివస్తాయి. ఆత్మజ్ఞానానికి డిగ్రీలు అవసరం లేదు. ఆత్మజ్ఞానం ముక్తికి దారితీస్తుంది. ధ్యానం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. ఈ ధ్యానాన్ని ప్రపంచానికి పుష్కలంగా అందచేస్తున్న మహనీయుడు పత్రీజీ. మనందరికీ భుక్తితో పాటు ముక్తి కూడా కావాలి.

మారం శివప్రసాద్ : మీ ఆధ్యాత్మికత గురించి చెపుతారా. పత్రీజీ ధ్యాన పరిచయానికి ముందు మీకు మెడిటేషన్ పట్ల అవగాహన వుండేదా?

సుధామేడమ్ : నాకు ఎనిమిది సంవత్సరాల వయస్సు వున్నప్పుడు ఒక కాంపిటేషన్‌లో అవార్డు గెలుచుకున్నప్పుడు నాకు "రామక్రిష్ణ పరమహంస" వారిని గురించిన పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అందులో ధ్యానం గురించి, వెన్నెముక చక్కగా వుంచుకోవాలనీ ఇంకా చాలా చాలా విషయాలు వున్నాయి. వయస్సు పెరుగుతున్నా ఆ పుస్తకాన్ని నేను ఎన్నోసార్లు చదువుతూండేదాన్ని. ఆ తరువాత మా పెద్దనాన్న డాక్టర్ నరసింహబిందు గారు హైదరాబాద్ నల్లకుంటలో వుండేవారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. చదువుకుంటున్నప్పుడు వీకెండ్స్‌లో నేను పెదనాన్న గారింటికి వెళ్తూండేదాన్ని. వారింట్లో ఆదివారాల్లో ఆధ్యాత్మిక సత్సంగం చేసేవారు. వారి రూమ్‌లో సత్సంగం చేసేటప్పుడు డోర్ వేసేవారు. ఆ రూమ్ ముందు నేను కూర్చునేదాన్ని. ఆయన మాటలు నాకు వినపడేవి. ఆత్మ గురించిన ప్రసక్తి వారి ప్రసంగాల్లో చాలాసార్లు వచ్చేది. మిగతావి నాకు అర్థం కాకున్నా, 'ఆత్మ', 'ఆత్మ', 'ఆత్మ' అని ఆయన ఆత్మ గురించి ఎన్నోసార్లు చెప్పేటప్పుడు నాలో 'ఆత్మ' అనే పదం రికార్డ్ అయిపోయింది.

రామక్రిష్ణ పరమహంస పుస్తకం చదివినప్పుడు, పెదనాన్న గారి సత్సంగాల్లో ఆత్మ గురించి విన్నప్పుడు, నా పెళ్ళి సందర్భంగా శ్రీ గౌరీశంకర్ గారు జ్యోతిష్యం చెప్పినప్పుడు, అవి నిజమైనప్పుడు "మనకు తెలియని ఎన్నో విషయాలు ఈ సృష్టిలో వున్నాయి" అనేటటువంటి ఆలోచనలు చెలరేగేవి. 1983 లో పుట్టపర్తి వెళ్ళాను. శ్రీ సత్యసాయిబాబా నా కళ్ళలోకి చూశారు. నాకెంతో ఆనందం కలిగింది. 1985 లో మా మామగారు బాడీ వెకేట్ చేసారు. అది 'డెత్' తో నా రెండవ అనుభవం. 'డెత్' గురించి తెలుసుకోవాలనే తీవ్ర ఆకాంక్ష మరోసారి నాలో మొదలయింది.

మారం శివప్రసాద్ : మరి పత్రీజీ ద్వారా ధ్యాన పరిచయం ఎప్పుడు కలిగింది?"

సుధా మేడమ్ : 1985 లో మా అమ్మ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు నా M.B.B.S. ఇంకా పూర్తికాలేదు. కాలేజీకి పదిహేనురోజులు సెలవుపెట్టి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు సుభాష్ పత్రి గారు అమ్మ వద్దే వున్నారు. అంతకుముందు 1980 నుంచే నాకు ఎన్నో పుస్తకాలు ఇచ్చేవాడు. నేను ఇండియాకు వచ్చినప్పుడు, బెంగుళూరులో చదువుతున్నప్పుడు కూడా. జబ్బు పడినప్పుడు సుభాష్ గురించి చాలా బాధపడింది. "వీడు రాష్‌గా డ్రైవ్ చేస్తాడు. ఎక్కువ మౌనంగా వుంటాడు. ఎప్పుడూ పుస్తకాలు చదువుతాడు. ఏమిటో వాడి పరిస్థితి." అని. నాకు ఇచ్చినట్లే అందరికీ పుస్తకాలు ఇచ్చేవాడు. అమ్మ జబ్బు పడినప్పుడు ఆ పదిహేనురోజుల్లో మా ఇద్దరి మధ్య ఆధ్యాత్మికత గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి. ఈ పదిహేనురోజులలో డిస్కషన్స్‌లో 'కర్మసిద్ధాంతం' గురించి చాలా వివరంగా చెప్పాడు.

మారం శివప్రసాద్ : వారు మీకు అప్పుడు కర్మసిద్ధాంతం గురించి చెప్పినదాన్ని, మీకు గుర్తున్నంతవరకు వివరిస్తారా?

సుధా మేడమ్ : దీనికంటే ముందు కొంచెం నా గతం గురించి వివరించాలి. చిన్నప్పటినుంచి స్వతహాగా నేను చాలా బిడియస్తురాలిని. ఎవరినీ ఎదిరించి మాట్లాడేదాన్ని కాదు. సహజ మృదుస్వభావం. అయితే ఎవరైనా చిన్నమాట అన్నా చాలా బాధకలిగేది. ఆ బాధ నా ముఖంలో చాలా స్పష్టంగా కనిపించేది. బిడియం, ఆందోళన, ఆతృత నా ప్రవర్తనలో ఎప్పుడూ వుండేవి. మా వాళ్ళంతా నా ఫీలింగ్స్‌కి నన్ను ఎగతాళి చేసేవారు. అయితే ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకునేదాన్ని.

బెంగుళూర్‌లో M.B.B.S.లో నాకు అమెరికా లోని నా ఫ్రెండ్ అరుణా మిట్టపల్లి క్లాస్‌మేట్, ఆమె సీనియర్ పిరమిడ్ మాస్టర్ M.నిర్మలాదేవి మేడమ్‌కు ఆడపడుచు అవుతుంది. బెంగుళూరులో కొండపైన ఆంజనేయస్వామి గుడి వుండేది. నాకు మూడ్ బాగా లేనప్పుడంతా అరుణను పిలుచుకుని కొండపైకి గుడికి వెళ్ళేదాన్ని. నాకున్న యాంగ్జైటీ, టెన్షన్ తగ్గడానికి బాగా 'హనుమాన్ చాలీసా' చదివేదాన్ని. అందరినీ సంతోషపరచాలని నా ధ్యేయంగా భావించేదాన్ని. అయితే నేను "అందరినీ సంతోషపెట్టడానికి ఎంత ప్రయత్నించినా ఎవరికీ నా పట్ల సాటిస్‌ఫ్యాక్షన్ లేదు" అనిపించేది. అమెరికాలో మా వారు వుంటే నేను మెడిసిన్ చేయడం కోసం మా వారికి దూరంగా ఉండవలసి వచ్చింది. అది నాకు ఎంతో భారంగా అనిపించింది. నేను చదువుకోసం మళ్ళీ ఇండియా వచ్చినందుకు, "మా వారికి దూరంగా వున్నందకు నేను సాటిస్‌ఫ్యాక్షన్‌ను కోల్పోతున్నానా" అనిపించేది.

కర్మసిద్ధాంతం గురించి పత్రీజీ అప్పుడు నాకు చెప్పినప్పుడు ఆ పదిహేనురోజుల్లో నాకు చాలా క్లారిటీ వచ్చింది. వేరేవాళ్ళు నాపట్ల సంతృప్తిగా ఫీల్ కావడంలేదు అని నేను ఫీల్ కావడానికి కానీ, ఇతరులకు నా పట్ల నిజంగా అసంతృప్తి వున్నా కానీ దానికి నా గతజన్మలే కారణమని సుభాష్ చాలా చక్కగా వివరించాడు. కర్మసిద్ధాంతం పట్ల నాకు చక్కని అవగాహన కలిగించాడు. "ఎవరు ఎలా ప్రవర్తించినా, అసంతృప్తిపడినా నేను పట్టించుకోవలసిన అవసరం లేదు" అని చెప్పాడు. అలాగే ధ్యానం చేయడం, జ్ఞానం పొందడం వల్ల నా గతజన్మలోని, ఈ జన్మలోని కర్మలను నేను తొలగించుకోవచ్చునని అర్థమయ్యింది. అయితే ప్రాక్టీస్ చేయడానికి ప్రాక్టికల్‌గా నాకు చాలాకాలం పట్టింది. ఆ సమయం అంటే 1985 లో "నా నిజమైన స్పిరిచ్యువల్ జర్నీ" మొదలయింది.

అంతకుముందుకూ, అప్పటికీ పత్రీజీలో నాకు ఎంతో మార్పు కనిపించింది. బహూశా నేను ఆలస్యంగా గమనించానేమో. నాకు ఆయనలో 'ఒక మహానుభావుడు' కనిపించాడు. "ఇంత గొప్ప బంగారానికి నేను ఎలా సోదరిని కాగలిగాను?" ... అని నా భాగ్యానికి నేనే మురిసిపోయాను. ఆశ్చర్యపోయాను కూడా. అప్పటికే ఎంతోకాలంగానే "ఆయన బంగారు గని" అని నాకు చాలా ఆలస్యంగా అర్థమయిందని తెలిసింది. అప్పుడే నాకు తప్పక సైకియాట్రిస్ట్‌ని కావాలనే కాంక్ష మొదలయింది. మానసిక వ్యాధిగ్రస్థులకు ధ్యానం ద్వారా ట్రీట్‌మెంట్ ఇవ్వడం వల్ల వారి సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయనీ, అందుకోసం సైక్రియాట్రీ తప్పకచేయాలనీ నిర్ధారణ చేసుకున్నాను.

మారం శివప్రసాద్ : U.S.A. లో సైకియాట్రీ కోర్స్ అంటే చాలా డిమాండ్ కదా... మరి అప్పట్లోనే మీకు అది ఎలా సాధ్యమయింది?

సుధా మేడమ్ : M.B.B.S. 1986 పూర్తిచేసి నేను మళ్ళీ అమెరికా వెళ్ళాను. ఈ లోపు పత్రీజీ ఇచ్చిన, సజెస్ట్ చేసిన ఎన్నో బుక్స్ చదివాను. ముఖ్యంగా చికాగో లోని ప్రపంచ విఖ్యాత డాక్టర్ ఎలిజబెత్ కూబ్లర్ రాస్ వ్రాసిన పుస్తకాలు చదివి చాలా ఇంప్రెస్ అయ్యాను. సైకియాట్రీ కోర్స్ చదవాలనే కోరిక మరింత పెరిగింది. ఎడ్గెర్ కేసీ వ్రాసిన కర్మసిద్ధాంతానికీ, రీ ఇన్‌కార్నేషన్‌కూ సంబంధించిన పుస్తకాలు చదివినప్పుడు అవి నన్ను ఎంతో ఆలోచింపజేశాయి. ఇండియాలో బేసిక్ డిగ్రీ M.B.B.S. ని అమెరికాలో 'M.D.' అంటారు. ఇండియాలో Post Graduation in medical fieldని అమెరికాలో 'రెసిడెన్సీ ప్రోగ్రామ్' అంటారు.

1987 లో ఒకరోజు బ్రహ్మముహూర్తంలో నాకు ఒక వాయిస్ వినిపించింది. "you will be a psychiastrist" అని. ఆ సందేశం వల్ల నేను తప్పక సైకియాట్రిస్ట్ అవుతాను అనిపించింది. మీరు చెప్పినట్లు U.S.A.లో సైకియాట్రీ లో సీటు విదేశీయులకు దొరకడం చాలా కష్టం. అమెరికన్ల అభిప్రాయం ఏమిటంటే "సైకియాట్రీ లో అమెరికన్స్‌కి అమెరికన్స్ మాత్రమే చక్కగా ట్రీట్ చేయగలరు" అని. అయితే నేను అప్లై చేసినప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసిన ముగ్గురు మహనీయులైన మేధావులకు నా బయోడేటా ఎంతో డిఫరెంట్‌గా అనిపించింది. నా జీవితం, అప్పటి నా వయస్సు, అమెరికాలో పిల్లలను పెంచుతూ, మళ్ళీ ఇండియాకు 35 సంవత్సరాల వయస్సులో పిల్లలను తీసుకునివెళ్ళి వాళ్ళను పెంచుతూ మెడిసిన్ చేయడం, మళ్ళీ అమెరికా వచ్చి మెడిసిన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఆ తరువాత సైకియాట్రీ కోర్స్‌కు అప్లై చేయడం వారిని ఎంతో ఆశ్చర్యపరిచింది, ఆలోచింపజేసింది. మామూలుగా సీట్ ఇస్తే కూడా తరువాత తెలుపుతారు అలాంటిది వాళ్ళు నాకు వెంటనే సైకియాట్రీ కోర్స్‌లో సీట్ ఇచ్చేశారు. వెంటనే జాయిన్ అయ్యాను, సైకియాట్రిస్ట్ అయ్యాను.

మారం శివప్రసాద్ : మరి మళ్ళీ సైకియాట్రీ కోర్స్ చేసినప్పుడు కూడా స్పిరిచ్యువాలిటీకి సంబంధించిన పుస్తకాలు చదువుతూ వుండేవారా? పత్రీజీతో ఫోన్‌లో మాట్లాడుతూండేవారా? మీ కోర్స్‌కి పుస్తకాలు సహకరించేవా? ట్రీట్‌మెంట్‌లో ధ్యానాన్ని జోడించేవారా?

సుధా మేడమ్ : స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గురించి అమెరికాలో డాక్టర్ దీపక్ చోప్రా ఇచ్చే ఉపన్యాసాలు, వ్రాసే ఆర్టికల్స్, పుస్తకాలు నన్నెంతో ప్రభావితం చేశాయి. "ఏజ్‌లెస్ బాడీ - టైమ్‌లెస్ మైండ్" అనే పుస్తకం నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇతర ఆధ్యాత్మిక రచయితల పుస్తకాలు కూడా చాలా చదివాను. ఎప్పటికప్పుడు ఫోన్‌లో సుభాష్‌తో మాట్లాడుతూ, చర్చిస్తూ నా సందేహాలు తీర్చుకునేదాన్ని. మెడిటేషన్ ద్వారా స్ట్రెస్ బ్రేక్ చేయవచ్చని తెలిసింది. "Any life condition can cause stress. అయితే ఇందుకు ధ్యానం మాత్రమే విరుగుడు" అని అర్థమయ్యింది.

"ఏజ్‌లెస్ బాడీ - టైమ్‌లెస్ మైండ్" అనే పుస్తకంలో దీపక్ చోప్రా స్ట్రెస్ గురించి ఈ విధంగా చెప్పారు. స్ట్రెస్ వల్ల cortisol అనేది పెరుగుతుంది. ఇది శరీరంలోని ఆర్గాన్స్ లోని సెల్స్‌ని తినేయటం మొదలుపెడుతుంది. దీనివల్ల అల్సర్స్, (స్ట్రెస్ ఇంకా ఎక్కువైపోతే) క్యాన్సర్ కూడా రావచ్చు. స్ట్రెస్ వల్ల శరీరంలో adreneline కూడా పెరుగుతుంది. దీనివల్ల fight or flight response వుంటుంది. అంటే మనిషికి పరిస్థితుల ప్రభావం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోయి కోపతాపాలు కలిగి పోట్లాటకు దారితీయవచ్చు లేదా భయపడి పారిపోవచ్చు. రెండూ కూడా సరిఅయినవి కావు. ఇంకొకటి స్ట్రెస్ వల్ల DHEA (dehydroepiandraosterone) అనేది తగ్గుతుంది. దీనివల్ల ఇమ్యూనిటీ అంటే రోగనిరోధకశక్తి తగ్గుతుంది. దీనివల్ల మానసిక, శారీరక రోగాలు వస్తాయి.

స్ట్రెస్ ద్వారా యాంగ్జైటి, డిప్రెషన్స్, మూడ్ స్వింగ్స్ (డిఫరెంట్ మూడ్స్), ఏకాగ్రత తగ్గటం, మెమొరీ పవర్ తగ్గటం, అబ్‌సెషన్స్(ఒకే విషయం గురించి టూమచ్‌గా ఆలోచించడం) ఎక్కువ అవుతాయి. ఇవేకాకుండా డిప్రెషన్ చాలా ఎక్కువైపోతే అది ఆత్మహత్యలకు లేదా హత్యలకు కూడా దారితీయవచ్చు. డిప్రెషన్స్ వల్ల అనవసరంగా పనులు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు సిగరెట్స్ ఎక్కువుగా త్రాగడం, ఆల్కహాల్ ఎక్కువుగా త్రాగడం, డ్రగ్ అడిక్ట్ కావడం జరుగుతుంది. స్ట్రెస్ వల్ల ఫిజికల్ డిజార్డర్స్ రావడం, క్రానిక్ డిసీజెస్ రావడం జరుగుతుంది. ఓల్డ్ ఏజ్‌లో ఈ ప్రోబ్లమ్స్ ఇంకా ఎక్కువుగా వుంటాయి. మరింత తొందరగా వృద్ధి అవుతాయి. నేను నా రెండు సంవత్సరాల ఇంటర్నల్ మెడిసిన్ (P.G.) లో ఒక సంవత్సరం ఓల్డ్ ఏజ్ డిసీజెస్ గురించి స్పెషలైజేషన్ చెయ్యడం వలన, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ గురించి ఇంకా బాగా అర్థమయ్యింది. ఓల్డ్ ఏజ్ డిసీజెస్ ఉదాహరణకు హైపర్‌టెన్షన్, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్ ఇవన్నీ కూడా స్ట్రెస్‌కు సంబంధించినవే. వీటన్నింటినీ కూడా ధ్యానంతో తగ్గించుకోవచ్చు.నేను సైకియాట్రీ కోర్స్ చేయాలనుకున్న కారణం, నేను సైకియాట్రిస్ట్‌ని అవుతాను అని నాకు అంతరిక్ష సందేశం అందడం, సైకియాట్రిస్ట్‌గా వుంటూ ధ్యానాన్ని జోడించి నేను ట్రీట్ చేయడం ఇవన్నీ కాస్మిక్ ప్లాన్‌లో భాగం అని కూడా నాకు తరువాత తరువాత బాగా అర్థమయ్యింది.

మారం శివప్రసాద్ : మరి నాన్‌వెజిటేరియన్ ఫుడ్ వల్ల మనిషి శరీరంలో వచ్చే జబ్బులు, మార్పుల గురించి ఒక సీనియర్ డాక్టర్‌గా వివరించండి

సుధామేడమ్ : మానవశరీరం మీద మాంసాహారం మరింత ఎక్కువ స్ట్రెయిన్ కలిగిస్తుంది. అంతేకాదు మైండ్‌ని ఇర్రిటేట్ చేస్తుంది. తామస, రాజస, సాత్విక గుణాలకు, మనం తీసుకునే ఆహారానికి చాలా సంబంధం వుంది. మానవ శరీరం మాంసాహారం జీర్ణం అయ్యేటట్లుగా డిజైన్ చేయబడలేదు. మాంసాహారం తినే జంతువులకి 'టీత్' ... అంటే పళ్ళు చాలా కన్వీనియంట్‌గా వుంటాయి. అదే మనిషులకి మాంసాహారం తినడానికి కన్వీనియంట్ టీత్ లేవు. అలాగే యానిమల్స్‌కి ప్రేవులు చాలా చిన్నవిగా వుంటాయి. అదే మనుషుల్లో ప్రేవులు చాలా పెద్దవిగానూ, పొడవుగానూ వుంటాయి. మాంసాహారంలో టాక్సిన్స్ చాలా ఎక్కువుగా వుంటాయి. జంతువులను ఆహారం కోసం చంపినప్పుడు, అవి మరణించేముందు పొందే భయం వల్ల టాక్సిన్స్.. విషపదర్థాలు.. కలుగుతాయి, వృద్ధిపొందుతాయి. ఆ మాంసాహారం తిన్నప్పుడు ఆ టాక్సిన్స్ వాళ్ళ బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ జంతువుల భయం, ఉద్వేగం మనుషుల శరీరాల్లో ప్రవేశించి, మైండ్ పైన ప్రభావం చూపిస్తాయి. ఇందాక చెప్పినట్లు జంతువులకి ప్రేవులు చిన్నవిగా వుండడం వల్ల టాక్సిన్స్ ఎఫెక్ట్స్ తక్కువుగా వుండి, త్వరగా బయటకు వెళ్ళిపోతాయి. అవే ప్రేవులు మనుషుల శరీరాల్లో చాలా పెద్దవిగా వుండడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్ళకుండా శరీరంలో మళ్ళీ re-absorb అయి ఇంకా ఇంకా మానవ మస్తిష్కాలను ఇరిటేట్ చేస్తాయి. టెన్షన్‌కి, స్ట్రెస్‌కి గురిచేస్తాయి.

మారం శివప్రసాద్ : మరి ఇతర ఇంటర్నల్ ఆర్గాన్స్‌ని అంటే మన శరీరం లోపల వుండే మూత్రపిండాలు, పాంక్రియాస్, ఊపిరితిత్తులు, గుండె వీటి మీద మాంసాహారం ప్రభావం వుంటుందా?

సుధా మేడమ్ : పది ప్లేట్ల శాకాహారం డైజెస్ట్ కావడానికి మూత్రపిండాలకు కలిగే పని ఒక ప్లేట్ మాంసాహారానికి కలుగుతుంది. మాంసాహారం వల్ల మనిషి ఆయుర్ధాయం తగ్గుతుంది అని ఖచ్చితంగ చెప్పవచ్చు. మన చర్మం క్రింద, ducts లోనూ, రక్తనాళాల లోనూ కూడా టాక్సిన్స్ చేరుకుని బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. శరీరం, మస్తిష్కం స్ట్రెయిన్ అవుతాయి.

మారం శివప్రసాద్ : మీరు U.S.A. లో మీ క్లయింట్స్‌ని ఎలా ట్రీట్ చేసేవారు?

సుధా మేడమ్ : స్ట్రెస్ మానేజ్‌మెంట్ చేసేదాన్ని. లాసెస్ (losses) మీద గ్రూప్స్ చేసేదాన్ని. ఏ బాధాకరమైన పరిస్థితి అయినా ఏదో ఒక లాస్‌కు సంబంధించినదే. ఎలాంటి లాస్ అయినా తట్టుకోవటానికి స్పిరిచ్యువల్ థెరఫీ చాలా పనికివస్తుంది. స్పిరిచ్యువల్ థెరపీతో పాటు మెడిటేషన్ చేయించేదాన్ని. శ్రద్ధగా వినేవాళ్ళకు బాగా చెప్పేదాన్ని ఎంతో మంది సంతోషించేవారు. నేను పనిచేసే హాస్పిటల్ డైరెక్టర్‌కి, నాకు కూడా నన్ను అప్రీషియేట్ చేస్తూ ఉత్తరాలు వ్రాసేవారు, ఫోన్లు కూడా చేసేవారు.

మారం శివప్రసాద్ : మీరు ఇతర ధ్యాన పద్ధతులు ఏవైనా స్టడీ చేశారా?

సుధా మేడమ్ : ఆనాపానసతి అనే ఈ మెథడ్ ... "ఇంత సింపుల్ సిస్టమ్... ఇన్ని రకాలుగా మనుష్యులసమస్యలు సాల్వ్ చేస్తుందా?" అని నేను అబ్బురపడేదాన్ని. ఎంతోమంది "మీ తమ్ముడు ఆ మార్గంలో గురువు కనుక నువ్వు ఆనాపానసతి చెప్తున్నావు" అనేవారు బంధుమిత్రులు కూడా. నేను రెండు, మూడు ఇతర మార్గాలు కూడా ప్రయత్నించాను. అమెరికాలో 'క్రియాయోగం' లో ఇనీషియేషన్ తీసుకున్నాను. క్రియాయోగం చాలా గొప్పదే. అందులో కూడా ఆనాపానసతి సూక్ష్మంగా ఇమిడి వుంది. అయితే క్రియాయోగంలో ఇనీషియేషన్ తీసుకున్నా కూడా ఎక్కువుగా నేను ఆనాపానసతి ధ్యానం చేశాను.

మారం శివప్రసాద్ : ధ్యానంలో మీ అనుభవాలు?

సుధా మేడమ్ : నాకు స్పిరిచ్యువల ఎక్స్‌పీరియన్సెస్ ధ్యానంలో కన్నా కలలో ఎక్కువుగా వస్తాయి. ఒకరోజు కలలో నేను సత్యసాయిబాబా చేతి మీద నిద్రపోతున్నాను. 1995 లో నేను క్రియాయోగం క్లాసెస్‌కి వెళ్తున్నప్పుడు... 'ఇనీషియల్ క్లాస్' చేస్తున్నప్పుడు అనుకుంటాను... ఫస్ట్ టైమ్ 'ఔట్ ఆఫ్ బాడీ' ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నా సూక్ష్మశరీరంతో స్పేస్‌లో వుండి నేను క్రిందకు చూస్తున్నాను. నా క్రింద, పైభాగంలో మాత్రం పుర్రె లేకుండా వున్న ఒక బ్రెయిన్‌ని చూస్తున్నాను. ఆ బ్రెయిన్ యొక్క సహస్రారంలోంచి ఒక వెలుగువచ్చి ఒక చక్రం లాగా పైన తిరుగుతోంది. అది యూనివర్సల్ బ్రెయిన్ లాగా అనిపించింది. చాలా సంతోషం వేసింది.

ఎన్నోరోజులు అదే దృశ్యం పదేపదే నాకు కనిపించడంతో "నేను తెలుసుకోవలసింది ఎంతో ఎంతో వుంది" అని అర్థమైంది. యూనివర్సల్ బ్రెయిన్ మీద అసలు veins లేవు. చెడు రక్తం లేదు. "చెడు రక్తం లేదు కనుకనే veins లేవు" అని అర్థమైంది. "ఎవరు రెగ్యులర్‌గా మెడిటేషన్ చేస్తారో వారికి చెడు రక్తం అసలువుండదు, మంచి రక్తం మాత్రమే వుంటుంది. ఫుల్లీ ఆక్సిజనైజ్‌డ్ బ్లడ్ గా మారుతుంది" అని అర్థమైంది. "మెడిటేషన్ డీప్‌గా వెళ్ళడం అనే ప్రాసెస్ ద్వారా హ్యూమన్ బాడీలో ఆక్సిజన్ ఎక్కువై కార్బన్‌డైఆక్సైడ్ తక్కువుగా అవుతుంది" అని నాకు తట్టింది. ప్రతి విషయం లోనూ సైంటిఫిక్‌గా, స్పిరిచ్యువల్‌గా, మెడికోగా అన్నీ కలిసి ఆలోచించి చక్కటి అవగాహన పొందడం అనే వ్యవస్థ నాలో నాకు ధ్యానం ద్వారా సంక్రమించింది.

మారం శివప్రసాద్ : పత్రిగారు జాబ్‌కి రిజైన్ చేసినప్పుడు మీ కుటుంబంలో ఎటువంటి కలకలం కలిగింది? అప్పుడు అమ్మ గారి మనఃస్థితి ఏంటి?

సుధా మేడమ్ : 1991 లో నేను, అమ్మా, నాన్న కర్నూలు వెళ్ళాం. పిరమిడ్ చూశాం. అప్పుడే మావాడు రిటైర్ అయ్యాడు అని తెలిసింది. ఈ విషయం మా నాన్న గారికి ఎవ్వరం కూడా తెలియనివ్వలేదు. అమ్మ చాలా చాలా అప్‌సెట్ అయ్యింది. పిరమిడ్‌లో ధ్యానానికి కూర్చుంది ఈ విషయం తెలిసిన తర్వాత. ఆ ధ్యానంలో అమ్మకి బాడీ వెకేట్ చేసిన మా తమ్ముడు 'అరవింద్' ధ్యాన భంగిమలో కనిపించి "అన్న గురించి నువ్వేమీ చింతించొద్దు. అంతా బాగుంటుంది" అని చెప్పాడట. అరవింద్ గురువు గారి కన్నా రెండేళ్ళు చిన్న... తన పదిహేనవ ఏట 1964 లో బ్లడ్ క్యాన్సర్‌తో శరీరాన్ని వదిలిపెట్టేసాడు.. పత్రి గారిని 'అన్న' అని అనేవాడు. ధ్యానంలో ఆ మెస్సేజ్ విన్న తరువాత అమ్మ శాంతమయిందట. ధ్యానం చేసి వచ్చి ఈ మెస్సేజ్ గురించి అమ్మ నాకు చెప్పింది.

మారం శివప్రసాద్ : పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో మీ పార్టిసిపేషన్ గురించి చెప్పండి. ఎప్పటినుంచి మన ప్రోగ్రామ్స్‌కి మీరు అటెండ్ అవ్వడం ప్రారంభించారు? ఎన్ని పిరమిడ్స్ చూశారు? ఎన్ని మహా ధ్యానయజ్ఞాల్లో పాల్గొన్నారు?

సుధా మేడమ్ : నేను చాలాసార్లు అమెరికా నుంచి ఇండియా వచ్చాను. చాలా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీల మేజర్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నాను. 1999 లో కర్నూల్లో జరిగిన మొదటి ధ్యాన మహాయజ్ఞం చూశాను. 2004 లో సికింద్రాబాద్ ధ్యాన యజ్ఞంలో పాల్గొన్నాను. అనంతపూర్, ఉరవకొండ పిరమిడ్లు చూశాను. నవంబర్ 2006 లో పత్రీజీ బర్త్‌డే సెలెబ్రేషన్స్ జరిగిన సందర్భంగా విజయవాడకి వెళ్ళాను. అప్పుడు గుంటూరులో లక్ష్మణరావు గారి ఇంటిపైన గల రూఫ్‌టాప్ పిరమిడ్, నెక్కల్లులో వెంకటేశ్వరరావు గారు కట్టించిన పిరమిడ్‌ను సందర్శించాను. ఫిబ్రవరి 2007 లో బెంగుళూరు లోని మైత్రేయ బుద్ధా విశ్వ విద్యాలయాన్ని సందర్శించాను. పిరమిడ్ వ్యాలీ ప్రకృతి ఒడిలో అత్యద్భుతంగా వుంది. అది చూసి పరవశించిపోయాను. పిరమిడ్‌లో మెడిటేషన్ చేసినప్పుడు విపరీతంగా పాజిటివ్‌ వైబ్రేషన్స్ ఫీలయ్యాను. నేను పాల్గొన్న ప్రతి ప్రోగ్రామ్‌లో కూడా నా స్పీచ్ ఇప్పించేవారు పత్రీజీ. నాకు చిన్నప్పటి నుంచి పబ్లిక్‌లో మాట్లాడే అలవాటు లేదు. పిరమిడ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొని స్పీచ్ ఇవ్వడం వల్ల పబ్లిక్ స్పీకింగ్ బాగానే వచ్చింది.

మారం శివప్రసాద్ : ధ్యానం వల్ల లాభాలేంటి? సైంటిఫిక్‌గా వివరిస్తారా?

సుధా మేడమ్ : నాకు తరుచుగా ... నా క్లయింట్స్‌ని కౌన్సిలింగ్ చేసేటప్పుడు... వారు చెప్పే వారి సమస్యలు విన్నప్పుడు... "ఒక మనిషి ఇంకొక మనిషి ని ఎందుకు కంట్రోల్ చేయాలని చూస్తాడు? ఎందుకు కంట్రోల్ చేస్తారు మనుష్యులు ఇతరులను?" అని చాలా కోపం వచ్చేది. 1992-93 ముందు జేమ్స్ రెడ్‌ఫీల్డ్ వ్రాసిన "సెలెస్టైన్ ప్రోఫెసి" పుస్తకం చదివాను. ఈ పుస్తకం చదివిన తరువాత స్పిరిచ్యువల్ పర్సన్స్ ఎవ్వరూ ఎవరినీ కంట్రోల్ చేయాలని అనుకోరు, కంట్రోల్ చేయరు. "నాన్ స్పిరిచ్యువల్ పీపుల్... అదే ఆధ్యాత్మికత లేనివాళ్ళు.. మాత్రమే ఎదుటివారిని కంట్రోల్ చేసి వారి ఎనర్జీని లాక్కుంటారు" అని అర్థమైంది.

ధ్యానం చేయడం వల్ల, ధ్యానం యొక్క గొప్పతనం అర్థమవడం వల్ల, గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. ప్రతి పిరమిడ్ మాస్టర్ అనుభవం ఇదే. మెంటల్లీ స్ట్రాంగ్‌గా వున్నవారి నుంచి ఎవ్వరూ ఎనర్జీ లాక్కోలేరు. మైండ్ స్ట్రాంగ్‌గా అవ్వాలంటే ప్రతిఒక్కరూ మెడిటేషన్ చెయ్యాలి. స్పిరిచ్యువాలిటీ వల్ల మైండ్ స్ట్రాంగ్‌గా అవ్వడమే కాకుండా బుద్ధి వికసిస్తుంది, విచక్షణా జ్ఞానం పెరుగుతుంది, మనం చేసే పనులన్నీ ఎంతో ఆలోచించి చేస్తాం.

మారం శివప్రసాద్ : మీ ధ్యాన అనుభవాలు, ఒక సైంటిస్ట్‌గా, ఒక సైకియాట్రిస్ట్‌గా మీ అవగాహానలు చాలా బాగున్నాయి. ప్రతీదీ మీరు కో రిలేషన్ చేసుకోవడం ఇంప్రెసివ్‌గా వుంది. మరిన్ని మీకు గుర్తున్న గొప్ప అనుభూతులను వివరించడి?

సుధా మేడమ్ : 1993 లో నా ఆఫీస్‌లో కూర్చుని మెడిటేషన్ చేస్తూ వుంటే భూమి నుంచి ఆకాశానికి బ్లూ సెర్చ్ లైట్స్ వెళ్తున్నట్లు కనిపించింది. "నేను ఆకాశంలో స్పిరిచ్యువల్ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" అని నాకు అర్థమైంది. నాకు కలలోనే చక్కటి ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది అని చెప్పాను కదా. 1994 లో ఒక సూపర్ కాన్షియస్ డ్రీమ్‌లో ఒక దృశ్యం నన్ను అబ్బురపరిచింది. "ఒక జారుడుబండ మీద నేను క్రింద నుంచి పైకి వెళ్తున్నాను". మామూలుగా మనం పై నుంచి క్రిందికి వెళ్తాం కదా. క్రింద నుంచి పైకి వెళ్ళడం అసాధ్యం కదా. ఆ సందర్భంగా నాకు అర్థమయింది ఏమిటంటే నా పాస్ట్‌లో నన్ను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వాటర్ లాగా నన్ను నేను శుద్ధి చేసుకుంటూ, నేను మరింత మరింత స్పిరిచ్యువల్ హైట్స్‌కి వెళ్తున్నాను.

ఆరునెలల తరువాత మరొక అనుభవం. భూమికీ ఆకాశానికీ మధ్యస్థంగా నేనొక ఫ్లయింగ్ సాసర్‌లో కూర్చుని వున్నాను. నేను క్రిందికి చూసి క్రిందికి దిగుదామని ట్రై చేసినా కూడా దిగలేకుండా వున్నాను. "నేను ఆల్‌రెడీ ఒక స్పిరిచ్యువల్ స్టేటస్‌కి చేరాను కనుక ఇక దిగే ప్రశ్న లేదు" అని అర్థమైంది. ఇతర ధ్యాన మార్గాలు స్టడీ చేసినా దేంట్లోనూ నేను ఇమడలేకపోయాను. ఎందుకంటే ఆనాపానసతి చేసి పొందిన అనుభవం పత్రి గారు చెప్పే జ్ఞాన విస్తృతి వీటిలోని అవగాహన, అనుభూతి మరి ఎందులోనూ దొరకలేదు. "ఇది ఎక్స్‌ట్రీమ్" అని అర్థమైంది.

మారం శివప్రసాద్ : మిమ్మల్ని ప్రభావితం చేసిన ఇంకొన్ని సంఘటనల గురించి చెప్తారా?

సుధా మేడమ్ : పరమహంస యోగానంద పరంపరలోనీ పరమహంస స్వామి హరిహరానంద, స్వామి ప్రజ్ఞానానంద గార్లు వ్రాసిన క్రియాయోగ పుస్తకాలు కూడా నన్ను ఎంతో ప్రభావితం చేసాయి. వాటిలోని సింబాలిక్ మీనింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ బాగా అర్థమయ్యాయి. వాటి హిడెన్ మీనింగ్స్ ప్రతిఒక్కటి కూడా మానవప్రవృత్తులలో ఉన్న వైవిధ్యాలను, సంబంధాలను తెలియజేస్తాయి. ఆనాపానసతి నా పేషంట్స్‌కి బోధించడానికి చాలా అనువుగా వుండేది. ఒక పేషంట్‌కు ధ్యానంలో శిలువ మీద జీసస్ కనబడడంతో ఆవిడ ఎంతో సంతోషించింది. ఇంకా కొంతమంది కూడా తమ అనుభవాలు చెప్పేవారు. వారు తమ అనుభవాలు చెప్పడం నాకూ సంతోషం కలిగించేది. 1996 లో నాకు కలలో... ఒక అరటిచెట్టు బోదెను నేను సగానికి నరికాను. అందులో ఒక కొబ్బరికాయ కనిపించింది. కొబ్బరికాయ పైన కూడా తెలుపు కనిపించింది. అరటిపండు డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. అరటిచెట్టును నేను సగం నరికాను అంటే "నేను చింతలు అప్పటికే సగానికి పైగా నరికి నా జ్ఞానం క్రమంగా పెంచుకుంటున్నాను" అని నాకు అర్థమైంది. కొబ్బరికాయ అనేది జ్ఞానానికి నిదర్శనం.

1996 లో నాకు కలిగిన ఒక ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్. అదేమిటంటే ఒకసారి నాలో నాకు ఒక తెర తొలగిపోయి ఆకాశం కనిపించింది. అప్పటినుంచి నాకు కళ్ళుమూసుకున్నా తెరచుకున్నా ఆకాశమే కనిపిస్తుంది. అంటే అనంతత్వం కనిపిస్తోంది. 1996, 1998 సంవత్సరాల్లో నేను అమృతానందమయి మాతాజీ దర్శనం చేసుకున్నాను. మొదటిసారి వారిని కలిసినప్పుడు నాకు సహస్రారం వద్ద పెద్ద బ్యాటరీ పెట్టినట్లుగా చాలా ఎనర్జిటిక్‌గా ఫీల్ అయ్యాను. మరొకసారి ఆమెలో దేవీభావం చూసినప్పుడు ఆ దర్శనం నాకు ఎంతో ధైర్యాన్ని పెంచినట్లు అనిపించింది. పత్రిగారి సాంగత్యంతో వారి సలహా, సహకారాలతో చక్కగా ధ్యానం చేసేదాన్ని. ఎన్నో దివ్యదర్శనాలు, అనుభూతులు పొందాను.

1999 ధ్యాన యజ్ఞానికి వచ్చేముందు కలలో జరిగిన ఆస్ట్రల్ ట్రావెల్. నేను, మా అత్తగారు ట్రాన్స్‌పరెంట్‌గా వుండే ఒక ప్లెయిన్‌లో వస్తున్నాం. ఆకాశానికి, సముద్రాని మధ్య అది ప్రయాణిస్తూ వుంటే అది నలిగిపోయినట్లు అనిపించినా ఏమీ కాలేదు. ప్రయాణం మధ్యలో మేమొక దీవిలో దిగాం. అక్కడ వారందరూ గోల్డ్ సిల్వర్ బట్టలు వేసుకున్నారు. మేమూ అలాంటి డ్రెస్ వేసుకుని వారితో కలిసిపోయాం. 1999 లో ధ్యానయజ్ఞానికి కర్నూలు వచ్చినప్పుడు నేను, మా అత్తగారు కర్నూలు పిరమిడ్‌లో కూర్చుని ధ్యానం చేశాం. అప్పుడు నాకు పై విజన్ గురించి అర్థమయింది ఏమిటంటే ట్రాన్స్‌పరెంట్ ప్లేన్ అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ నా థర్డ్ ఐ యాక్టివేట్ అయినందువల్ల కనిపిస్తోందనీ, నాకు కనిపించిన ఆ ద్వీపం ధ్యానయజ్ఞవేదిక అనీ, సిల్వర్ ఆర్నమెంట్స్ సిక్స్త్ సెంటర్ అంటే ఆజ్ఞాచక్రానికి సంబంధించినవనీ, గోల్డ్ ఆర్టికల్స్ సెవెన్త్ సెంటర్‌కు సంబంధించినవనీ, అక్కడ వున్న వాళ్ళంతా పిరమిడ్ మాస్టర్లనీ, ఆజ్ఞాచక్రానికీ, సహస్రారానికీ చెందినవాళ్ళనీ అవగాహన అయ్యింది. ఆ ద్వీపంలో వున్నవాళ్ళు సెపరేట్‌గా వుండడం వల్ల పిరమిడ్ మాస్టర్ల స్థాయి, వారి ప్రపంచం వేరే అని తెలిసింది. "తక్కిన ప్రపంచానికి డిఫరెంట్‌గా వుంటారు పిరమిడ్ మాస్టర్స్ ... అందరికీ అర్థం కారు" అని పత్రీజీ చెప్తూంటారు కదా తరుచుగా ... దాని అర్థం ఇది అని నేను తెలుసుకున్నాను.

కొన్ని సంవత్సరాలు నేను పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో పత్రీజీ వెంట తిరగడం వల్ల, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ల సాంగత్యం వల్ల, ఎన్నో క్లాసులు చెప్పడం వల్ల, నేను తెలుసుకున్నది ఏమిటంటే "పత్రీజీ నా సోదరుడు అవ్వడం నేను చేసుకున్న మహద్భాగ్యం" అని. పత్రి గారి ద్వారా ఆధ్యాత్మిక నౌకలో ప్రయాణించడం మొదలుపెట్టిన నాటినుంచి క్రమక్రమంగా నాలో చిన్నప్పటి నుంచి వున్న నాకు నాలో నచ్చని గుణాలన్నీ ఒకటొకటిగా తొలగిపోవడం మొదలుపెట్టాయి. పత్రీజీ 24 క్యారెట్ల మేలిమి బంగారం. బంగారు గని. బంగారు కొండ. ఆ బంగారు గనిలోంచి, బంగారు కొండలో నుంచి ఎంత పంచిపెట్టినా తరగని విజ్ఞాన ఖని అది. పత్రీజీ గొప్ప సూపర్ స్టార్. ఆధ్యాత్మిక పూర్ణ యోగి అని, ఆనాపానసతి అంతటి సింప్లెస్ట్ మెథడ్ ఇంక వేరేదీ లేదు అని నేను తెలుసుకున్న అనుభవజ్ఞానం.

మారం శివప్రసాద్ : పత్రీజీ వివాహం నాటి పరిస్థితుల గురించి వివరించండి

సుధా మేడమ్ : 1974 లో నేను అమెరికా నుంచి ఇండియా వచ్చాను. పత్రీజీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అప్పటికే స్వర్ణమాల సుభాష్ ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. నేను ఇండియా లోనే వున్నప్పుడు వారి పెళ్ళి కావాలని అమ్మ అభిలాష. ఉద్యోగం లేకున్నా నా కోసం, అమ్మ తృప్తి కోసం నేను ఇండియాలోనే వున్నప్పుడు పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత రెండేళ్ళ లోపు కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగం వచ్చిందని ఉత్తరం వ్రాశాడు. నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

మారం శివప్రసాద్ : మీ నాన్నగారి మరణం ఎప్పుడు సంభవించింది? అప్పుడాయన వద్ద ఎవరెవరు వున్నారు? సార్ కర్నూల్‌లో ఉద్యోగం చేసేవారు కదా

సుధా మేడమ్ : 1993 లో నేను అమెరికాలో వుండగా బోస్టన్‌లో ఒక సైకియాట్రిక్ కాన్ఫరెన్స్‌కి వెళ్ళాను. కాన్ఫరెన్స్‌లో వుండగా ఐ ఫెల్ట్ దట్ "సమ్‌థింగ్ వెంట్ రాంగ్" అని. "ఏదో జరిగింది" అనిపించింది. ఇంటికి ఫోన్ చేస్తే మా వారు లిఫ్ట్‌ చేసి "నేను నీ కోసం ఫోన్ ట్రై చేద్దామని అనుకుంటూ వుంటే సడెన్‌గా నీ ఫోన్ వచ్చింది" అన్నారు. "హైదరాబాద్‌లో ఇంట్లోనే మీ నాన్నగారు బాడీ వెకేట్ చేశారు" అని మావారు చెప్పారు. ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాతా నాకు వచ్చిన గొప్ప థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ ఇది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యుల లోని మూడవ మరణం అది. మొదట అరవింద్, తరువాత మా మామగారు, ఇప్పుడు మా నాన్నగారు. ఆ మధ్యలో నేను 'మరణం' గురించి బాగా స్టడీ చేయడం వల్ల నేనేమీ బాధపడలేదు. క్యాజువల్‌గా తీసుకున్నాను. నేను మా నాన్నగారు బాడీ వెకేట్ చేసిన 10 వరోజు లోపు వచ్చాను.

మా నాన్నగారు ప్రతిరోజూ వాకింగ్‌కి వెళ్ళేవారు. వారు బాడీ వెకేట్ చేసే ముందు రెండుమూడు రోజులు వాకింగ్‌కి వెళ్ళలేదట. మా ఆడపడుచు డాక్టర్ జానకి. ఆవిడ ఆ రోజు మా ఇంటికి వచ్చారట. డల్‌గా వున్న మా నాన్నగారిని చూసి "ఆఖరు రోజులు" అని చెప్పారట. ఆ విషయం సుభాష్‌కి ఇన్‌ఫామ్ చేశారట. వెంటనే సుభాష్ పత్రి హైదరాబాద్ వచ్చారట. నాన్నగారి ముందు కూర్చుని ఫ్లూట్ వాయిస్తే బాగా రిలాక్స్ అయ్యారట. ఆ తరువాత పత్రీజీ లేచి ప్రక్క గదిలోకి వెళ్తూ వుంటే అస్సలు లేవలేని మా నాన్నగారు లేచి ఆయన వెనుక మెల్లగా నడిచారట. వెంటనే సుభాష్ వెనుతిరిగి చూసి నాన్నగారిని తన చేతులలోకి తీసుకున్నారట. అంతే ... తమ్ముడి చేతిలో వాలిన మా నాన్నగారు తత్‌క్షణం లోనే బాడీ వెకేట్ చేశారట. "ఈ సోల్ వెళ్ళిపోయింది" అని పత్రీజీ అమ్మతో చెప్పారట.

మారం శివప్రసాద్ : మీ తల్లి గారు ధ్యానంలో పొందిన వివిధ అనుభవాలు, అనుభూతులు మరి మీ తల్లి గారితో మీరు ధ్యానంలోకి వచ్చిన తరువాత గడిపిన వివిధ సందర్భాలు, అనుభూతులు పాఠకులకు తెలియజేయాలని వుంది.

సుధా మేడమ్ : 1996 లో అమ్మ మా అమ్మాయి పెళ్ళి సందర్భంగా అమెరికా వచ్చింది. అమ్మకు నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు నేను ఇండియా వచ్చినప్పటి కంటే అమ్మ అమెరికా వచ్చినప్పుడు పత్రీజీ గురించి మరింత మరింతగా ముచ్చటించుకున్నాం. 2001 లో అమ్మా, నేను శివరాత్రికి అనంతపూర్ వెళ్ళాం. అక్కడ చాలా పెద్ద ధ్యానయజ్ఞం జరిగింది. ఆ శివరాత్రి రోజు ధ్యానంలో అమ్మ చాలా ప్రోగ్రెస్ అయ్యింది. పత్రీజీ చాలా ఆనందించారు. 1998 లో అమ్మ హాంకాంగ్ వెళ్ళారు అన్నయ్య దగ్గరికి. 1999 లో పత్రీజీ కూడా హాంకాంగ్ వెళ్ళారు. 1998 లో హాంకాంగ్ లో క్రిస్‌మస్ సందర్భంగా అమ్మ అక్కడ క్రిస్‌మస్ ట్రీ వద్ద ధ్యానంలో కూర్చుంది. ఆ ధ్యానంలో అమ్మ ఆస్ట్రల్ ట్రావెల్‌లో జెరూసలేమ్ లో వున్న అనుభూతి పొందింది. జెరూసలేమ్ అంటే క్రీస్తు పుట్టిన ఊరు తెలుసు కదా. ఆ ఊర్లో చిన్న చిన్న సందులలో వెళ్తూ వుంటే ఆమెకు తాను ఆస్ట్రల్ ట్రావెల్‍లో జెరూసలేమ్ లో వున్న సంగతి అర్థమైంది. "మరి జీసస్ ఏరి?" అనుకునేలోపే ఆమెకు జీసస్ కనిపించారు. "మరి వంటి మీద రక్తం లేదే?" అనుకుందట. వెంటనే జీసస్ చెయ్యి తెరచి చూపించారట. ఆ చేతిలో సిలువ చిహ్నాలు, రక్తం చూసింది అమ్మ. ఆమె ధ్యానంలో చేసిన గొప్ప ఆస్ట్రల్ ట్రావెల్ ఇది. ఒకసారి ఇంట్లో అమ్మ పడుకుని వున్నప్పుడు పత్రీజీ బయటనుంచి వచ్చి తట్టి లేపారట. గాఢనిద్రలో వున్న అమ్మ సడెన్‌గా లేచి చూస్తే పత్రీజీలో అనంత విశ్వరూపం కనిపించిందట. అమ్మ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు తాను పడుకుని వున్నప్పుడు తనలో మూడు శరీరాలు చూసుకుంది. ఒకటి పడుకుని వున్నది, ఒకటి ధ్యానం చేస్తున్న శరీరం, మూడవది ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్న స్థితి.

మారం శివప్రసాద్ : అమ్మగారు బాడీవెకేట్ చేసిన సందర్భం గురించి?

సుధామేడమ్ : అమ్మ అనారోగ్యంగా వున్నారని తెలిసి నేను, అన్నయ్య, వదిన ఇండియా వచ్చాం కదా. ఆమె శరీర పరిస్థితి క్షీణిస్తుండడం వల్ల, నేను ఆమె బాడీ వెకేషన్ గురించి మెంటల్‌గా ప్రిపేర్ అయ్యే వున్నాను. అమ్మ కూడా తాను బాడీ వెకేట్ చేయబోతున్నాను అని ప్రిపేర్ అయ్యే వుంది. అమ్మ బాడీ వెకేట్ చేసినప్పుడు నేను అక్కడ లేను. నేను ఇంటికి వచ్చేసరికి మా బంధువర్గం, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు అంతా వచ్చి వున్నారు. ఆ రోజు మరుసటిరోజు కూడా మాస్టర్స్ అందరూ గ్రూప్ మెడిటేషన్ చేసారు. సాయంత్రం గారపాటి లలితా మేడమ్ వచ్చారు. లలిత గారు అమ్మ బాడీ ముందు కూర్చుని ధ్యానం చేసి ధ్యానంలో "అమ్మ ఆత్మ మహావతార్ బాబాజీలో కలిసిపోవటం చూసాను" అన్నారు ఆ విషయం విని " అది సత్యం. ఆమె వచ్చిన చోటుకే వెళ్ళిపోయింది" అని పత్రీజీ కన్‌ఫర్మ్ చేసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఆ ఆనందాన్ని నేను మాటలలో చెప్పలేను.

మారం శివప్రసాద్ : మరి అమ్మగారు వెళ్ళిపోయేముందు సంవత్సరాల్లో అంటే 2003 నుంచి ఆమె ఎలా ఫీలయ్యేవారు?

సుధా మేడమ్ : ఆమె లాస్ట్ ఇయర్స్ అంతా కూడా పత్రీజీ హైదరాబాద్ వచ్చారు, అంతే చాలు. వంట్లో ఓపికలేకపోయినా కూడా ఎంతో ఎనర్జిటిక్‌గా ఫీలయ్యి వంట చేసేది. ఆయన తినడం, అందరికీ పెట్టడం అమ్మకు చాలా చాలా ఇష్టమైన విషయం. అమ్మ చేతివంట అంటే సుభాష్‌కు కూడా అమితమైన ప్రీతి. వీలైనంతవరకు సిటీలో వుంటే భోజనానికి ఇంటికే వచ్చేవాడు. పత్రీజీ భోజనం చేసిన తర్వాత ఫ్లూట్ వాయిస్తూంటే విని అమ్మ చాలా రిలాక్స్ అయ్యేవారు. మా అన్నయ్య ఇండియా వచ్చినప్పుడు కూడా ఇద్దరూ కలిసి ఫ్లూట్ వాయిస్తూంటే ఆమె ఎక్కువుగా సంతోషించేవారు. ఎంజాయ్ చేసేవారు.

మారం శివప్రసాద్ : మరి స్వర్ణమాలాపత్రి గారితో మీ అనుబంధం

సుధా మేడమ్ : స్వర్ణ నేను చాలా క్లోజ్‌గా మూవ్ అవుతూ వుంటాం. మా మధ్య వయస్సు తేడా వున్నా అన్నయ్య స్వంత మరదలు కావడం వల్ల కొత్త వ్యక్తి కాకపోవడం కూడా ఇందుకు కారణం. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టిన తరువాత గంటల తరబడి స్పిరిచ్యువాలిటీ గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళం. మా ఇద్దరి యోగానుభవాలను, యోగానుభూతులను షేర్ చేసుకునేవాళ్ళం.

మారం శివప్రసాద్ : పత్రీజీ భార్యగా ఆమె ఎంతో ఘర్షణ, సంఘర్షణ, టెన్షన్, భయం, ఉద్వేగం అనుభవించారు అని అందరికీ తెలుసు. మీ యాంగిల్‌లో కాస్త వివరిస్తారా

సుధా మేడమ్ : ఆమెకు మెంటల్‌గా రిలాక్సేషన్ లేకపోయేది. సుభాష్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా వుండేవి. ఇద్దరు చిన్నపిల్లలు, అదీ ఆడపిల్లలు. పత్రీజీ కోసం వచ్చిపోయేవారు. ఆయన వెంట వుండి పిలుచుకుని వచ్చేవారు. వీరందరితో సతమతమయ్యేది. దీనికితోడు ఆరోగ్యం సరిగాలేని నాన్న. బాగ అలిసిపోయింది. యోగబలం వల్ల మాత్రమే నెగ్గుకు రాగలిగింది. సుభాష్‌కు చేదోడు వాదోడుగా వుండేది. పిల్లలను, అత్తగారిని, వచ్చిపోయేవారిని అందరినీ గమనించుకోవడం తనకు శక్తికి మించిన పనయ్యేది. ఎలా వేగిందో నిజంగా నాకు స్వర్ణను చూస్తే ఎంతో జాలి, బాధ కలిగేది. ఒకరకంగా చూస్తే ఈ మూడు నాలుగు సంవత్సరాల్లోనే స్వర్ణ ప్రశాంతంగా కనిపిస్తోంది.

మారం శివప్రసాద్ : మరి పత్రి మేడమ్ ఇటువంటి జీవితానికి బాధపడేవారా?

సుధా మేడమ్ : బాధ కలిగినప్పుడు తాత్కాలికంగా డిప్రెస్ అయినా ఒక గొప్ప యోగి భార్యగా తనను తాను అనుకున్నప్పుడు ఒక అత్యంత గొప్ప ఆధ్యాత్మిక గురువుగా పత్రీజీని చూస్తూ తన భర్త ఎంత గొప్పవాడో అని గర్వపడేది. "ఈ మేరునగధీరుడికి భార్యగా కావడం ముందు ఈ బాధలు ఎంతలే?" అని అన్నీ మరచిపోయేది. నిజంగా స్వర్ణది పసిపిల్లల మనస్తత్వం. ఎంత తొందరగా కోపంగా, బాధగా మాట్లాడేదో అంత తొందరగా మరచిపోయి మళ్ళీ ఎంతో క్లోజ్‌గా మూవ్ అయ్యేది. ఆయా పరిస్థితుల్లో చికాకుపడినా పత్రీజీ కోణంలోంచి ఆలోచించి సర్ధుకుని మెల్లగా స్థిమితపడేది. విశ్వశ్రేయస్సే ధ్యేయంగా జీవించే యోగి భార్యగా తనను తాను గుర్తుచేసుకుని సంభాళించుకుని ఈజీ అయిపోయేది. స్వర్ణ కూడా ఒక మహా యోగిని. ఆమెకు అనేకానేక ధ్యానానుభవాలు వున్నాయి. టోటల్‍గా స్వర్ణ నాకొక గుడ్ ఫ్రెండ్.

మారం శివప్రసాద్ : పత్రీజీని గురించి మీకు ఆయన సన్నిహితులు, ఫ్రెండ్స్ ఏం చెప్పేవారు?

సుధా మేడమ్ : కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌లోని పత్రిగారి బాస్‌ని మా అన్నయ్య కలిసినప్పుడు ఆయన ఇలా చెప్పారట. "మీ బ్రదర్ ఒక యోగి. సరే, అయితే ఆఫీస్‌లో ప్రతిఒక్కరినీ ధ్యానం చేయమని విసిగిస్తాడు. కస్టమర్స్‌కి కూడా అంతే. అందరికీ పుస్తకాలు ఇస్తాడు చదవమని. ఇలా అయితే ఎలా?" అని అడిగారట. స్నేహితులు, బంధువులు పరిచయస్థులు ... ఎవ్వరినీ వదిలిపెట్టేవాడు కాడు. వారు వెనుకవైపు "ఇదేం బాధరా బాబూ?" అనుకునేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడైతే అందరూ ఈయన షేక్‌హ్యండ్ తీసుకోవడమే మహద్భాగ్యంగా భావిస్తున్నారు కదా. ఇంతకుముందు మా ఫ్యామిలోలో సుభాష్ ధ్యాన మార్గం గురించి ఎవ్వరూ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయితే పత్రీజీకి ప్రతిష్ఠాత్మకమైన 'జమునాలాల్ బజాజ్ అవార్డ్' ఇచ్చిన తర్వాతా మా అన్నయ్య, వదిన, మావారు కూడా చాలా ఆనందపడ్డారు. వారందరూ ఆ అవార్డు ప్రెజెంటేషన్‌కి వార్ధాకి వచ్చారు కదా.

మారం శివప్రసాద్ : పత్రీజీ గురించి ఎంత విన్నా, ఆయన సంగతులు ఎన్నిసార్లు చెప్పించుకున్నా ఇంకా ఇంకా వినాలని వుంటుంది. మరిన్ని విషయాలు పత్రీజీ గురించి.

సుధా మేడమ్ : నేను ఇండియాకి వచ్చిన ప్రతిసారీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. కొత్తలో పత్రీజీ నన్ను డయాస్ ఎక్కించి " ఈమె అమెరికా నుంచి వచ్చిన మా సిస్టర్... తాను ఒక గొప్ప డాక్టర్ అని అనుకుంటోంది. అయితే ఈవిడకు ఏమీ తెలియదు" అని చెప్పేవారు. ఇలా చెప్పడం మొదట్లో నాకు ఇబ్బందిగా అనిపించేది. అయితే నా సాధన పెరిగేకొద్దీ నాలోని 'ఈగో' తగ్గిపోయి జ్ఞానం పెరగడం మొదలయ్యింది. నన్ను ఆధ్యాత్మిక పుస్తకాలు చదవమని పోరేవాడు. ఆయన సలహాకు అనుగుణంగానే సైమల్టేనియస్‌గా పుస్తకాలు చదివేదాన్ని. ఇండియన్ ఆథర్స్ కాకుండా అమెరికన్ ఆథర్స్ వ్రాసిన ఎన్నో ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు చదివాను.

మారం శివప్రసాద్ : 2004 లో పత్రీజీ అమెరికా వచ్చారు కదా. ఎక్కడెక్కడ తిరిగారు? ఆ విశేషాలేంటి?

సుధా మేడమ్ :పత్రీజి 2004 లో అమెరికా వచ్చినప్పుడు ATA అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వైవార్షక సమావేశాల్లో 'అమెరికా ఇండిపెండెన్స్‌ డే' రోజు ప్రసంగించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. "అమెరికాలో ముమ్మరంగా ధ్యానప్రచారం జరగడానికి ఇది శుభారంభం" అనిపించింది. అమెరికాలో ATA మరి TANA సమావేశాలు చాలా వైభవంగా జరుగుతాయి. "అమెరికాకి ఆ రోజు స్పిరిచ్యువల్ గా ప్రపంచంలో అగ్రగామిగా ఆవిర్భవించిన మహాభాగ్యమైన రోజు" అనిపించింది. పత్రీజీ నేను కలిసి చికాగోలోనూ, డెట్రాయిట్ లోనూ, అట్లాంటా లోనూ, అగస్టా లోనూ, ఇండియానాపోలిస్ లోనూ, లూయీ విల్, సెయింట్ లూయిస్, మాడిసన్, మిల్వాకి... మొదలైన వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఫ్యామిలీస్ లోనూ, ప్రైవేట్ ప్లేసెస్ లోనూ మీటింగుల్లోనూ ప్రవచనం ఇవ్వడం జరిగింది. మెడిటేషన్ క్లాసెస్ నిర్వహించాం. న్యూయార్క్, న్యూజెర్సీ లకు పత్రీజీ వెళ్ళారు. ఎంతోమంది ఇన్‌స్పైర్ అయ్యారు. నేను, పత్రీజీ ముంబయి నుంచి వచ్చిన షీలా మేడమ్ కలిసి చాలా చోట్లకు తిరిగాం. కొన్ని చోట్లకు పత్రీజీ రెండవ అమ్మాయి పరిమళ కూడా వచ్చింది.

పత్రీజీ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేయ్యాలో, ఎలా అరేంజ్ చెయ్యాలో అని నాకు చాలా డైలమా గానూ, టెన్షన్ గానూ వుండేది. అయితే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎవరో వుండి ముందే పక్కా ప్రణాళికతో చేసినట్లుగా అద్భుతంగా అమరి, జరిగిపోయేవి. దీంతో నాకు అర్థమయింది ఏమిటంటే "పత్రీజీ ప్రెజెన్స్ వున్నచోట అన్నీ ఆటోమాటిక్ గానూ, పెర్‌ఫెక్ట్ గానూ జరిగిపోతాయి" అని. సెయింట్ లూయీస్ స్టేట్‌లో మా ఫ్రెండ్స్ డాక్టర్ విజయ్‌కుమార్, వారి శ్రీమతి డాక్టర్ విజయలక్ష్మి వాళ్ళ ఇంట్లో క్లాస్ చేశాం. మరుసటిరోజు మధ్యాహ్నం Madison, Wisconsin అనే వేరే రాష్ట్రంలో క్లాస్. ఈ రెండు రాష్ట్రాల మధ్యలో మేముండే చికాగో వుంది. డాక్టర్ విజయకుమార్ వాళ్ళ వద్ద సెయింట్ లూయీస్‌లో క్లాస్ అయిన తర్వాత మరుసటిరోజు క్లాస్ కోసం బయలుదేరాలని నేను పత్రీజీని తొందరపెట్టడం జరిగింది. ఆయనకు కోపం వచ్చింది. "ఇక్కడ ఇంకా పని బ్యాలెన్స్ వుంది. క్వాంటిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్" అన్నారు. షెడ్యూల్ ప్రకారం త్వరగా బయలుదేరి Madison, Wisconsin వెళ్ళాం. అయితే కాకతాళీయంగా పత్రీజీ సంకల్పం వల్లో సెయింట్ లూయిస్‌లో డాక్టర్ విజయకుమార్ గారింటికి మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ విజయలక్ష్మి దంపతులకు ఎవరో ఒక గిఫ్ట్ తెచ్చి ఇచ్చారు. ధ్యాన ముద్రలో వున్న శివుడి కంచు విగ్రహం అది. ఈ ధ్యాన ముద్రలో వున్న శివుడి విగ్రహం ప్రెజెంట్ చేయబడడం అంటే ఆ రోజు "ధ్యాన అమెరికా స్థాపించబడడం జరిగింది" అన్నారు పత్రీజీ. ఈ విధంగా పత్రీజీ అమెరికా విజిట్ చాలా వైవిధ్యంగా, ఆహ్లాదంగా, చక్కగా, ఊహించనంత గొప్పగా జరిగింది. సహజంగానే నేచర్‌ని ప్రాణంగా ప్రేమించే పత్రీజీ అమెరికాలోని అన్‌పొల్యూటెడ్ అట్మాస్ఫియర్‌ని, వాటర్‌ని, చలిని, గ్రీనరీని, సువిశాలమైన ప్రైవేట్ ఎస్టేట్స్‌ని బాగా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా అమెరికన్స్ యొక్క ప్లీజింగ్ నేచర్‌ని ఆయన ఇష్టపడ్డారు. ప్రపంచమంతా కలిస్తే ఆ అన్నిదేశాల నాగరికతలనూ అమెరికాలో చూడావచ్చు. ఆ వైవిధ్యమైన కలయికలను ఆయన ఎంజాయ్ చేశారు. ప్రపంచమంతా ధ్యానమయం కావాలని వారి ఆకాంక్ష కదా. 'ధ్యాన అమెరికా' పూర్తయితే 'ధ్యాన జగత్' పూర్తవడం అత్యంత సులభం అన్నారు. నేను పత్రీజీని అమెరికాలో వున్నప్పుడు మరింత ఎక్కువుగా వారిని గమనించడం వల్ల ఎంతో నేర్చుకున్నాను. ఎంతో తెలుసుకున్నాను. ఎంతో సాధించుకున్నాను, ఎంతో ఎన్‌లైటెన్‌ అయ్యాను కూడా.

మారం శివప్రసాద్ : మీరు, పత్రీజీ ఈ ఇరువురు కలసినప్పుడు మీ అమ్మ గారి మనోభావాలు ఎలా వుండేవి?

సుధా మేడమ్ : నాకు, పత్రీజీకి చిన్నప్పటి నుంచి వున్న కామన్ అటాచ్‌మెంట్ అంట్ ఇంటరెస్ట్ స్పిరిచ్యువాలిటీ వల్ల నాలో డీప్ అటెన్షన్ అండ్ ఇంటలెక్చువల్‍గా మారడానికి దోహదం చేసింది. ఈ విషయం మా అమ్మను ఎంతో ఆనందింపజేసింది. మా ఇద్దరి మధ్య జరిగే సంభాషణలను ఆమె చక్కగా అర్థం చేసుకునేది. ఇంగ్లీష్‌లో జరిగే డిస్కషన్స్ కూడా ఆమె బాగా అర్థం చేసుకుని ఎంజాయ్ చేసేది. ప్రతి కుటుంబం లోని ప్రతి అన్నాచెల్లెలు లేదా అక్కా తమ్ముడు లేదా అన్నదమ్ములు అందరూ చక్కగా ధ్యానం చేసి నేను, సుభాష్‌లాగా ఏ అమరికలు లేకుండా ప్రతి పిరమిడ్ మాస్టర్ వారి కుటుంబాలతో ఇంత అన్యోన్యంగా జీవించాలని ఆమె అభిలషించేది. పత్రీజీ ద్వారా "ఏపని చేస్తూ వుంటే దానిమీద కాన్‌సన్‌ట్రేషన్ చేయడమే స్పిరిచ్యువాలిటీ" అని నేర్చుకున్నాను. ఆయనకు అర్థరాత్రి కానీ, అపరాత్రి కానీ ఎవరైనా వచ్చినా లేచి వచ్చి మాట్లాడతారు. కొత్తవారైతే ధ్యానం నేర్పుతారు. ధ్యానంలో కూర్చోబెడతారు. ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేస్తారు. వృధా అనేదే వుండదు వారి షెడ్యూల్‌లో. ఇంత సమయమైంది మరి నిద్రించాలే, విశ్రాంతి తీసుకోవాలే అనే కాలవ్యవధి పత్రీజీకి లేదు... గౌతమబుద్ధుడిలాగే.

మారం శివప్రసాద్ : ఆయన దేన్నీ గమనించనట్లు వున్నా అన్నీ గమనిస్తూంటారు. అలాగే దేనికీ తొణికినట్లు, ఇబ్బంది పడినట్లు కనిపించరు. ఏమిటి ఇందులో రహస్యం?

సుధా మేడమ్ : న చుట్టుప్రక్కల వున్నవారందరినీ ఆయన చూడనట్లే చూసేవారు. గమనించనట్లే గమనించేవారు. బహూశా ఆయన కళ్ళకు వెనుకవైపు నుంచి స్కల్‌ని దాటి చూసే శక్తి వుందేమో. ఏ చిన్న విషయమైనా, అతిచిన్న శబ్దమైనా ఆయన దృష్టిని, చెవిని దాటిపోయేవికావు. ఒకరితో మాట్లాడుతూనే మరొకరిని కరెక్ట్ చేసేవారు. ఎదుటివారి ఈగోని బ్రద్దలుకొట్టడం ఆయన స్పెషాలిటీ. అందులో ఆయనకి ఆయనే సాటి. ఎవ్వరి మీద ఆయన డిపెండ్ కారు. ఎవరికైనా ఏదైనా చెప్తే వారు చేస్తే సరి చేయకపోతే ఇంకెవరికైనా అప్పజెప్పేవారు ఆ పనిని. ఎవ్వరూ తనవెంట లేకున్నా కూడా ఆయన ఇదే స్థితిలో మరింత స్థిమితంగా జీవించగలరు.

మారం శివప్రసాద్ : ఆయన కోపం గురించి, బ్యాలెన్స్‌డ్‌గా వుండడం గురించి.

సుధా మేడమ్ : ఎలాంటి కండిషన్స్‌లో కూడా ఆయన బ్యాలెన్స్‌ని కోల్పోరు. చెక్కు చెదరదు. ఆయనకు కోపం తెప్పించడం తప్పు కానీ, ఆయన కోపం ఎదుటివారి భాగ్యం. ఇది నా అంచనా. మనం ఎదిగేదాకా ఆయన కోప్పడుతూనే వుంటారు, తిడుతూనే వుంటారు, కొడుతూనే వుంటారు. మనం చక్కగా ఎదుగాతున్నామని తెలిసినా, ఎదిగినా ఆయన ఎంతో ఫ్రెండ్లీగా వుంటారు. ఈ విషయం మీకు బాగా అవగతమైంది కదా. "ఆయన మనపట్ల ఎలా మూవ్ అవుతారు" అనేదాన్నిబట్టే మన ఎదుగుదలను మనం అంచనా వేసుకోవచ్చు. ఆయన ఒక అద్దం లాంటివారు. అందులో మనల్ని మనం చూసుకుని మనం ఏ లెవెల్‌కి వచ్చామో లేదా ఏ స్థితిలో వున్నామో మనమే అర్థం చేసుకోవచ్చు.

మారం శివప్రసాద్ : చాలా చాలా విషయాలు చెప్పారు మీరు పిరమిడ్ మాస్టర్లకు... మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో మీకు నచ్చిన అంశాలు

సుధా మేడమ్ :

* డబ్బు ప్రసక్తి లేకపోవడం. కార్యక్రమాలకు డబ్బు అవసరమైతే ఎప్పటికప్పుడు ఏ ప్రాంతం వారు అక్కడివారితో ధ్యానంలో చక్కటి ప్రొగ్రెస్ కలిగి, ధ్యానం వల్ల కలిగిన ప్రయోజనాల వల్ల విస్తృత లాభాల వల్ల, తాము ఇష్టంతో డొనేట్ చేసే డబ్బుని, ప్రోగ్రామ్స్ మరి ధ్యానప్రచారం కోసం వినియోగించడం.

* అత్యంత సులభమైన సాధనా మార్గం శ్వాస మీద ధ్యాస. అంతేకాకుండా ఏ నియమాలు లేని విధానం. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చని తెలుసుకోవడం. మన శ్వాసే మన గురువు అని చెప్పబడడం.

* ఏ ఇనీషియల్ కండిషన్స్ లేకపోవడం

* శాకాహారమే మానవ జీవన మార్గమని బల్లగుద్ది చెప్పడం. హింసా ఛోడో, హంసా పకడో అని ప్రచారం చేయడం.

* ఏ దేశంలో ఏ యోగికి సంబంధించినవైనా, ఏ ఆథర్‌వైనా సరే, సరియైన ఆత్మజ్ఞానం ఇస్తున్నవైతే ఆ పుస్తకాలను ఆయా ప్రాంతీయభాషలలో అనువదించి, ధ్యానులకు అందజేయడం. సరియైన జ్ఞానాన్ని ఇవ్వడానికి కానీ, పొందడానికి కానీ ఎవరైనా అర్హులే అని తెలియజేయడం.

ఇందుకే ఆనాపానసతిని ఇండియాలోనైనా, అమెరికాలోనైనా ఎవరికైనాసరే రికమెండ్ చేయడానికి నాకు ఎంతో ఇష్టం. ఇదొక్కటి చాలు ముక్తి పొందడానికి. ముక్కు వున్న ప్రతి మనిషీ ముక్తికి అర్హుడే అనే పత్రీజీ సూక్తి ప్రతి ఒక్కరికీ చేరాలి.

మారం శివప్రసాద్ : మరి మీరు చదివిన పుస్తకాల గురించి చెప్పారు. పాఠకులకు ఏ ఏ పుస్తకాలు ముఖ్యంగా చదవాలో సజెస్ట్ చేయండి. అసలు ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేయడంలో గల ప్రాముఖ్యతను వివరించమని మీకు నా మనవి.

సుధా మేడమ్ : స్వాధ్యాయం... అంటే పుస్తకాలు చదవడం... అనేది ధ్యానులకు చాలా చాలా అవసరం. నాకు కూడా చిన్నప్పటి నుంచి నుంచి పుస్తకాలు చదవడం ఎంతో ఇష్టమైన విషయం. ఇక పత్రిగారి గురించి మీకు తెలుసుకదా. వారు ఎన్ని వేల పుస్తకలు చదివారో ... వారు అనంతమైన జ్ఞాన భాండాగారం స్వయంగానే... మరి వారెందుకు ఎన్నో పుస్తకాలు చదివినట్లు, చదువుతున్నట్లు? ఎన్నోసార్లు వారు చెప్పారు, మొన్న దీపావళి సందర్భంగా కూడా "ఎప్పుడు ఎవరి నోట్లోంచి ఏ ముత్యాలు, రత్నాలు రాలి పడతాయో వాటిని ఏరుకుని, నేను స్వీకరించి అందరికీ పంచిపెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుంటాను" అని చెప్పారు. దీని అర్థం సత్యం... అనేది జ్ఞానం అనేది... ఏ ఒక్కరి సొత్తూ కాదు. ఒక్కొక్క జ్ఞాన వీచిక, ఒక్కొక్క సత్యప్రవచనం, ఒక్కొక్క నోటి నుంచి వస్తుందని, రావచ్చుననీ అది అందరికీ అందజేయబదాలని పత్రీజీ ఉద్దేశ్యం.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ద్వారా ప్రచురింపబడిన పిరమిడ్ బుక్‌స్టాల్స్‌లో లభిస్తున్న పుస్తకాలు చదవండి, సి.డి.లు, క్యాసెట్లు వినండి. చదువు తక్కువుగా వున్నవారికి, పుస్తకాలు చదివే అలవాటులేనివారికి సి.డి.లు, క్యాసెట్లు వరాలు. ఇంకొక సౌలభ్యం ఏమంటే క్యాసెట్లు, సి.డి.ల ద్వారా పత్రీజీ గొంతు వినవచ్చు. ఆ మాటల్లోని సత్యం, మధురిమ, వాక్‌శైలి, ఎనర్జీ, వింటునప్పుడు కలిగే వైబ్రేషన్ వెలకట్టలేనివి. సింబాలిజమ్ ఇన్ హిందూయిజమ్ మీద నేను చాలా పుస్తకాలు చదివాను. సింబాలిజమ్ ఇన్ ‌క్రిస్టియానిటీ మీద కూడా నేను చాలా పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలలో ఒక్కొక్క క్యారెక్టర్‌కి, ఒక్కొక్క సన్నివేశానికి, స్పిరిచ్యువాలిటీకి ఎంతో సంబంధం వుంటుంది. ఇవి చదివి చక్కగా అర్థం చేసుకోవాలి.

మారం శివప్రసాద్ : ఒక గొప్ప పుస్తకంలోని ఒక క్యారెక్టర్‌కి మరి ఒక సన్నివేశానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి.

సుధా మేడమ్ : రామాయణాన్ని తీసుకుందాం. సీతా మాత మహాపతివ్రత. అయితే కోరిక వస్తే ఎవరైనా మాయలో పడతారు అనే విషయం సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయే సన్నివేశంలో చక్కగా మనకు సీతాదేవి ద్వారా స్పష్టమవుతుంది. మాయలేడిని కోరి మాయలోపడడం వల్ల సీత తన పరమాత్ముడిని దూరం చేసుకుంటుంది. మరి మాయలేడి ఒక్క కోరిక వల్లనే కదా శ్రీరాముడికి సీత దూరమై అష్టకష్టాలు పడింది దుఃఖానికి మూలకారణం తృష్ణ అని గౌతమబుద్ధుడు చెప్పింది ఇదే కదా. మనలో ఎంత ఎక్కువ కోరిక కలిగితే అంత ఎక్కువ దుఃఖం అంటే మరింత మహామాయ వుంటుంది. ఇక్కడ సీత మనస్సుకి ప్రతీక అయింది. లక్ష్మణుడు ధర్మానికి ప్రతీక అయ్యాడు. లక్ష్మణగీత దాటడం వల్ల సీత స్వధర్మానికి అంటే రామలక్ష్మణులకు దూరం అయింది.

ఎంతవారైనా, ఎవరైనా సరే తెలిసి కానీ, తెలియక కానీ గీత దాటితే సమస్యలలో ఇరుక్కుంటాం. ధర్మాన్ని తప్పుతాం. భగవంతునితో స్నేహం ఇంకా దూరమవుతుంది. మనమే భగవంతులం అని తెలుసుకోవడం మరింత ఆలస్యమవుతుంది. మరెన్నో జన్మలు ఎత్తవలసి వుంటుంది. ఆంజనేయుడు శ్వాసకి ప్రతీక. కోరికల ద్వారా స్వధర్మానికి దూరమైన మనస్సు శ్వాస ద్వారా మళ్ళీ సత్యాన్ని తెలుసుకుని, స్వధర్మాన్ని ఆచరించి, తన పరమాత్మను తాను పొందుతుంది. ధర్మో రక్షతి రక్షితః. శ్వాస మీద ధ్యాస ద్వారా మనం పోగొట్టుకున్నవి మనం మళ్ళీ తెచ్చుకుంటాం.

మారం శివప్రసాద్ : మరి మీరు పిరమిడ్ మాస్టర్లకు, ధ్యానులకు సజెస్ట్ చేసే పుస్తకాలు వివరించండి.

సుధా మేడమ్ : చాలానే వున్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని వివరిస్తాను.

* తులసీదళం / బి ఎ మాస్టర్ ... బ్రహ్మర్షి పత్రీజీ

* ఒక యోగి ఆత్మకథ ... పరమహంస యోగానంద

* హిమాలయ యోగులు ... స్వామి రామా

* ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఓషో / ఇంకా ఎన్నో ఓషో పుస్తకాలు

* డెత్&డయింగ్ ... డాక్టర్ ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్

* వైబ్రేషనల్ మెడిసిన్ ... రిఛార్డ్ గెర్బర్

* మెనీ లైవ్స్ & మెనీ మాస్టర్స్ ... బ్రియాన్ వెయిన్స్

* కన్వర్జేషన్స్ విత్ గాడ్ ... నీల్ డొనాల్డ్ వాల్ష్

* సెలెస్టైన్ ప్రోఫెసి ... జేమ్స్ రెడ్‌ఫీల్డ్

మారం శివప్రసాద్ : పిరమిడ్ మాస్టర్లకు మీ సందేశం?

సుధా మేడమ్ : పత్రీజీ సాంగత్యంలో ధ్యానం చేసిన తర్వాత, సత్యం అవగతమైన తర్వాత అన్నీ గమనిస్తూ, అన్నీ అనుభవిస్తూ, అన్నీ అధిగమిస్తూ.. కర్మలన్నీ మెల్లమెల్లగా దగ్ధం చేసుకుంటూ... అనవసరమైన కొత్త కర్మలేవీ చేయకుండా జాగ్రత్తపడుతూ... నా మాటను మరింత జాగ్రత్తగా బుద్ధితో, వివేకంతో మాట్లాడుతూ ఇప్పుడు లైఫ్ ఈజ్ ఎ గేమ్ అనే స్థితికి వచ్చాను. నాకు ఏదీ ప్రోబ్లెమ్‌గా అనిపించడం లేదు, కనిపించడం లేదు. అలా ట్రైన్ అయ్యాను చక్కగా పత్రీజీ మార్గంలో. ఇలా ప్రతి ఒక్కరూ చక్కగా ధ్యానం చేసి తమ తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటూ 'ఉద్దరేదాత్మనాత్మానాం', 'అప్పో దీపో భవ' అని తెలుసుకుని, ఎంతో సంతోషంగా జీవిస్తూ, తెలుసుకుంటూ అందరికీ బోధిస్తూ అందరి సంతోషాలకూ కారణభూతులవుదురుగాక.

అందరూ ఒక గంట ధ్యానం చేసి, ఒక గంట స్వాధ్యాయం కానీ, సి.డి.లు, క్యాసెట్లు వినడం తప్పకుండా చేయండి. సజ్జన సాంగత్యం చేయండి. ధ్యానప్రచారం చేయండి. ఆచార్య సాంగత్యం అంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ప్రసంగాలు తరచూ వినండి. ముఖ్యంగా మీ ఊర్లో కానీ, మీ చుట్టుప్రక్కల ఎక్కడైనా పత్రీజీ ప్రోగ్రామ్ వుందంటే ఎటువంటి పరిస్థితులలో మిస్ కాకుండా అటెండ్ అవ్వండి. ఎవరైనా నిస్పృహలో వున్నవారిని, తీవ్ర అనారోగ్యం వున్నవారిని, ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్నవారిని ధ్యానం క్లాసులకు తీసుకువెళ్ళండి.

థ్యాంక్యూ మారం శివప్రసాద్ గారు. ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులందరికీ నా శుభాకాంక్షలు.

వైజ్ఞానికంగా, శాస్త్రపరంగా, అనుభవపరంగా, పత్రీజీ కుటుంబ సభ్యులుగా మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా చేసిన ధ్యాన సేవ అమోఘం. మీకు నా ఆత్మ ప్రమాణాలు. కృతజ్ఞుడిని.

 

మారం శివప్రసాద్

Go to top