" శాపాలు- వరాలు! "

 

11-11-07 తెల్లవారుజామున 5.30 గంటలకు చల్లటి గాలులు శరీరాన్ని తాకుతూండగా, సూర్యోదయపు ఛాయలు మనస్సును ఆహ్లాదపరుస్తూండగా బ్రహ్మర్షి పత్రీజీతో ‘మైత్రేయ బుద్ధా స్కార్పియో’ లో మేమందరం అంటే.. నేను, మేడమ్ స్వర్ణమాలా పత్రి గారు, పత్రీజీ అక్కగారు డాక్టర్ సుధా కోడూరి గారు, వారి బావగారు కోడూరి రామకృష్ణ గారు, మాస్టర్ శీను గారు మరి మాస్టర్ దామోదర్ గారు తిరుపతి నుంచి తిరుమలకు బయలుదేరాం. వేరొక కారులో మాస్టర్ గుణాకర్ గారు, మాస్టర్ శివప్రసాద్ గారు పత్రీజీ పెద్దమ్మాయి ‘మున్నీ’ బయలుదేరారు. ప్రకృతిని తిలకిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని ఆస్వాదిస్తూండగా, పత్రీజీ నోటి నుంచి నా వైపుకు ఒక ప్రశ్న సంధింపబడింది..a

పత్రీజీ : "మురళీ! వేంకటేశ్వర స్వామిని ఏం కావాలని కోరుకుంటావ్?

మురళీధర్ : "సార్! 2006 లో షిరిడీ సాయిని చూపించారు. అక్టోబర్ 2007 లో సత్యసాయిని చూపించారు. ఇప్పుడు వేంకటేశ్వర స్వామిని చూపించబోతున్నారు. ప్రస్తుతానికి ఇంతే!"

పత్రీజీ : "వేంకటేశ్వరస్వామిని చూపించను. కానీ కొండలు, కోనలు చూపిస్తాను!"

మురళీధర్ : "మీరు ఏది చూపిస్తానంటే దాన్నే చూస్తాను."

పత్రీజీ : "నువ్వు ఏం కోరుకుంటావ్ ‘శీను’ వేంకటేశ్వర స్వామిని?"

శీను : "2020 లో జరిగే ప్రపంచ క్రికిట్ మ్యాచ్ మీతో కలిసి చూడాలని కోరుకుంటాను!"

పత్రీజీ : "నువ్వు ఏం కోరుకుంటావ్?" (అని మేడమ్ స్వర్ణమాల గారిని అడిగారు)

మేడమ్ : "అందరూ సుఖ-శాంతులతో వుండాలని కోరుకుంటాను."

పత్రీజీ : "నువ్వు ఏం కోరుకుంటావ్?" (అని మేడమ్ సుధా గారిని అడిగారు)

డా|| సుధ : "నీతో మేం ఈ విధంగా ప్రయాణం చేయాలని కోరుకున్నాం! అది నెరవేరింది. నాకు ఇంక ఏ కోరికా లేదు."

పత్రీజీ : "నువ్వు చెప్పవయ్యా ‘దామోదర్’, ఏం కోరుకుంటావ్ స్వామిని?"

దామోదర్ : "మీ కోరికే నా కోరిక సార్!"

"మీరు ఏం కోరుకుంటారు?"

" మేమంతా కలిసి పత్రి గారిని "మీరు ఏం కోరుకుంటారు?" అని అడిగాం.

పత్రీజీ : "జీవులను చంపి రాక్షసంగా వాటిని తినే వారందరినీ చంపేయమనీ, నరకబడుతూంటే అనుభవించే ఆ నరక అనుభవాన్ని వాళ్ళకూ రుచి చూపించమనీ కోరుకుంటాను!"

(కొంత విరామం తర్వాత, నేను పత్రీజీ ఎదుట ఒక సందేహాన్ని వ్యక్తపరిచాను)

మురళి : "సార్! కోరికలలో ‘బెస్ట్ కోరిక’ ఏది? దయచేసి చెప్పండి."

పత్రీజీ : "మురళీ! కోరికల్లో ‘బెస్ట్’, ‘వరస్ట్’ అంటూ లేవు. అసలు ఏ కోరికా వుండకూడదు!"

మురళీ : "కోరికే లేకపోతే మనిషిలో నిర్లిప్తత కలగదా? పురోగతి ఆగదా?’

పత్రీజీ : "ప్రతి కోరికా దుఃఖానికి దారితీస్తుంది. కోరికలలో జీవించేవాడు శాంతిని పొందలేడు. మనిషికి వుండవలసింది కోరిక కాదు. అసలు ఎవరినైనా, దేనినైనా కోరడమంటూ వుండకూడదు. ఎవ్వరి దగ్గర నుంచి అయినా ‘తెలుసుకోవడం’ మాత్రమే వుండాలి! ఎవరికి ఏం కావాలో, ఆ యా వాటిల్లో ప్రావీణ్యం సంపాదించిన వాళ్ళ నుంచి టెక్నాలజీని తెలుసుకుని ప్రయత్నించి వాటిని సిద్ధింపచేసుకోవాలి. అంతేకానీ కోరికలు తీర్చమని ఎవ్వరినీ ప్రాధేయపడరాదు! ఒకవేళ అలా కోరిన ‘వరాలు’ ఇవ్వబడినా అవి శాపాలే కానీ వరాలు కావని మాత్రం గుర్తుంచుకోవాలి!

"కోరితే ఇవ్వబడేవి శాపాలు -

కోరకుండా ఇవ్వబడేవి వరాలు!"

మురళీ : "సార్! ఇంకొంచెం వివరంగా చెప్పండీ!"

పత్రీజీ : "కఠోర తపస్సు చేసి శివుని ద్వారా కోరుకున్న వరం పొందిన భస్మాసురుడికి తను కోరుకున్న వరమే శాపంగా మారింది. తన నాశనానికి దారితీసింది. కనుక కోరుకుంటే వచ్చేవి వరాలు కాదు-శాపాలు!

"నచికేతుడు, యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి ‘మరణం తర్వాత జీవితం’ గురించి ప్రశ్నించాడు. నచికేతుని సహనశీలతకూ, వినయసంపదకూ అబ్బురపడి, ఆ ప్రశ్నకు ముచ్చటపడి, యమధర్మరాజే స్వయంగా నచికేతుడిని మూడు వరాలు కోరుకోమన్నాడు! అప్పుడు నచికేతుడు ‘నాకు వరాలు వద్దు, నేను అడిగిన వాటికి సమాధానాలు కావాలి’ అన్నాడు. యమధర్మరాజు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం, ఆ తర్వాత నచికేతుడు అడగకనే వరాలు ఇవ్వడం కూడా జరిగింది!

"కనుక, మన ప్రయత్నానికి కావలసిన టెక్నాలజీని తెలుసుకుని ఆ పనిని సిద్ధించుకోవడమే వరాలు పొందడం వంటిది! ఇటువంటి వరాలు ఎప్పుడూ శాంతినీ, జ్ఞానాన్నీ కలిగిస్తాయి!

"పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడూ కూడా ‘కోరిక తీర్చండీ’ అంటూ మరొకరిపై ఆధారపడరు! శాపాల బారిన పడరు! వారు కారణ కార్య సంబంధ శాస్త్రాన్ని గురించి మాత్రమే ఆరా తీస్తుంటారు! అంటే నేర్చుకోవడం కోసం ప్రశ్నలు సంధిస్తూ వుంటారు! అంతేతప్ప ప్రాపంచిక, ఆధ్యాత్మిక కోరికలు కోరరు! ఉదాహరణకు ‘నాకు క్యాన్సర్ బాగు చెయ్యండి’ అని కోరుకోరు.. ‘నాకు క్యాన్సర్ ఎందుకు వచ్చింది? చెప్పండి’ అని ప్రశ్న అడుగుతారు! అప్పుడు అది చెప్పబడుతుంది! అప్పుడు కారణం అవగాహనకు వచ్చి సమస్య తీరడం ప్రారంభం అవుతుంది. ప్రశ్న వేయడం అన్నది కోరిక కోరడం కాదు!

 

T. మురళీధర్
గుంతకల్లు

Go to top