" బ్రహ్మర్షి పత్రీజీకి జై "

 

నా పేరు గంగాలక్ష్మి. భర్త పేరు సుబ్రహ్మణ్యం. పిల్లలు ఈశ్వర్, సురేష్, స్వాతి. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా లోని ముమ్మిడివరం దగ్గర ‘పల్లంకుర్రు’ అనే గ్రామం. భర్తకి పుట్టుకతోనే మాటలేదు. వినిపించదు. పదవ తరగతి వరకు వాళ్ళ
భాషలోనే చదివారు.

నాకు కూడా కూడబల్కుని కొంచెం చదవడం వరకే వచ్చు. పల్లెటూరి అమాయకత్వంతో భర్తలోని లోపాలు పట్టించుకునేదాన్ని కాదు. మూగ భాషతో, సైగలతో జీవితం గడుస్తూండేది. అలాంటప్పుడు 1987 లో ఆయనకు పక్షవాతం వచ్చింది.

ఓ సామాన్య స్త్రీ అనుభవించే బాధతో డాక్టర్ల చుట్టూ తిరగడం, మ్రొక్కితే దేవుడు కరుణిస్తాడని మ్రొక్కడం జరిగేది. తగ్గినట్టే తగ్గి మళ్ళీ వచ్చింది. అప్పటినుంచి దీర్ఘకాల రోగంగా ఉండిపోయింది. అన్నిరకాల డాక్టర్లు, మందులు.. ఇంగ్లీషు, హోమియోపతి, నాటు మందులు వాడినా తగ్గలేదు. "ఆపరేషన్ చేయకపోతే ఇక మంచం మీదే ఉండాలి" అని డాక్టర్లు చెప్పారు. 1999 లో వెన్నుపూసకి ఆపరేషన్ చేసారు. ఫలించలేదు. రెండు చేతులూ పనిచేయడం లేదు. నడక తూలుతూ పడిపోతారేమో అన్నట్టు వుంటారు.

పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు -అవి కాపాడతాయనే పిచ్చి నమ్మకంతో చేసేదాన్ని. కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాం. జీవితం మీద విరక్తి కలిగింది. చచ్చిపోవాలనంత బాధ. "అయ్యో! నేను పోతే ఆయన్ని, పిల్లల్ని ఎవరు చూస్తారు?" అన్న తలంపుతో ఉండేదాన్ని.

ఇటువంటి స్థితిలో ఒక యోగా సంస్థ పదిరోజుల కోర్సు చేయడం జరిగింది. అది సరిగ్గా అవగాహన కాలేదు. కానీ ఏదో కొంత ఊరట. జీవితంలో అసలైన మలుపు పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సరళ గారి ద్వారా పరిచయమైన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ "శ్వాస మీద ధ్యాస" ధ్యానంతో మొదలైంది.

క్రొత్తల్లో మాస్టర్లు చెప్పే అనుభవాలతో ఒక మాయా లోకంలో ఉన్నట్లు అనిపించేది. రాను రాను అవగాహన అవుతూ వచ్చింది. శ్వాస మీద ధ్యాసతో జీవితం దిశే మారినట్టు అనిపించింది. మా వారికి కూడా అర్థమైంది. రోజూ ధ్యానంలో కూర్చుంటారు చాలాసేపు.

ఈ ధ్యాన సాధనతో నాలో వుండే అధిక నిద్ర, నడుమునొప్పి, వెన్నుపూస నొప్పి, కడుపులో సమస్య అన్నీ తగ్గిపోయాయి.. మందులు వాడకుండానే. మా వారు కూడా ధైర్యంతో, మనోనిబ్బరంగా వున్నారు. ఊరట కలిగిన మనస్సుకి నేర్చుకున్నది నలుగురికీ చెప్పాలన్న తాపత్రయం మొదలైంది. మా ఇంట్లోనే ధ్యానం చెప్పడం మొదలైంది. న్యూ గాంధీనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి రూములో ధ్యానకేంద్రం పెట్టాం.

"శ్వాస మీద ధ్యాస" తో పూజలు, వ్రతాలు ఎలా మర్చిపోయానో నాకే తెలియదు. తీర్థయాత్రల బదులు "ధ్యాన యాత్రలు" మొదలయ్యాయి! ఎక్కడ ధ్యాన శిక్షణా కార్యక్రమం జరిగినా వెళ్ళడమే! ధ్యాన యజ్ఞాలు, ట్రెక్కింగ్‌లకు కూడా మా వారు, నేను కలిసి వెళ్తాం! చెప్పుకోతగ్గది గండికోట ట్రెక్కింగ్. అక్కడే మొదటిసారిగా పత్రీజీ మా వారిని చూడడం, పలుకరించడం జరిగింది!

ధ్యాన సాధన, ధ్యానం చెప్పడం, ధ్యాన ప్రచారం చేయడమే మా పని. ఇంటింటా తిరిగి కరపత్రాలు పంచడం, స్కూళ్ళల్లో, గుళ్ళల్లో ధ్యానం చెప్పడం, అనువైనచోట వారం, తొమ్మిది, 40 రోజులు క్లాసులు నడపడం జరుగుతోంది.

ఒకప్పుడు అక్షరాలు కూడబలుక్కుని చదివే నేను ఈనాడు వేమన, వీరబ్రహ్మేంద్రస్వామి పద్యాలు, పాటలు నలుగురిలో పాడగలుగుతున్నాను. ఇంకా ఎదగాలి... ఇంకా ఎదగాలి.. ఎంతో వుంది మరి!

"నమస్తే టీచర్","నమస్తే మేడమ్" అని స్కూలు పిల్లలు దారిలో కనపడినప్పుడల్లా పలుకరిస్తూంటారు. "ధ్యానం చేస్తున్నారా?" అంటే "చేస్తున్నాం టీచర్" అని అంటూంటే ఎంతో ఆనందం కలుగుతుంది! స్కూళ్ళల్లో ధ్యానం చెప్పడం మన విధి. "శ్వాస మీద ధ్యాస" అనే బ్రహ్మస్రాన్ని అందించిన పరమగురువు బ్రహ్మర్షి పత్రీజీకి జై.

 

V. గంగాలక్ష్మి
ఆత్మగంగా పిరమిడ్ ధ్యానకేంద్రం
1-201, న్యూ గాంధీనగర్, కాప్రా, హైదరాబాద్ - 500062
పోన్ : +91 99663 62691, +91 080 27141061

Go to top