" డా|| వేటూరి గారితో ముఖాముఖి! "

 

వేనవేల పాటల పువ్వులతో, తెలుగు సినిమా తల్లిని అర్చించిన "పుంభావ సరస్వతి" డా|| వేటూరి సుందరరామమూర్తి గారి జీవితం తెరచిన పుస్తకం. ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ ఆయన అంతరంగంలోని ఆధ్యాత్మికతను ఆంధ్రప్రజానీకానికి ఆవిష్కరిస్తోంది.

B. నాగలక్ష్మి


"J.K. భారవి" : బ్రహ్మర్షి పత్రీజీ విస్తృత ధ్యాన ప్రచారంతో పాటు శాకాహారాన్ని కూడా ఒక ఉద్యమంగా చేపట్టారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ప్రతి ఏటా నిర్వహించే ధ్యాన మహాయజ్ఞాన్ని కూడా ఈ ఏడాది, డిసెంబర్ చివరి వారం తమిళనాడు రాష్ట్రంలో.. తిరువణ్ణామలై లో.. "అహింసా ధ్యానయజ్ఞం"గా నిర్వర్తిస్తున్నారు. అంతేకాక, ప్రతిరోజూ శాకాహార ర్యాలీలు కూడా జరుగుతాయి, అక్కడ! ఆ ధ్యానయజ్ఞానికి మీ సందేశం కావాలి!

"డా|| వేటూరి సుందరరామమూర్తి గారు" : చాలా బాగుంది! శాకాహార పాశస్తాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన మహానుభావుల్లో ప్రధముడు హిట్లర్! "Mein Kampf" అంటే "My struggle" అనే ఆయన ఆత్మకథలో స్పష్టంగా "‘ఆహారం అంటే శాకాహారం’ అని చాటే సందేశమే నా జీవితం" అన్నాడు.

రెండో వ్యక్తి జార్జి బెర్నాడ్‌షా.. ఆయన "My stomach is not burial ground for dead animals.. నా కడుపు చచ్చిన జంతువుల కళేబరాలకు స్మశానం కాదు" అన్నాడు. బెర్రాండ్ రస్సెల్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తన "New Hopes for the Changing World" పుస్తకంలో శాకాహారాన్ని గురించి విస్తారంగా వ్రాశారు.

అదేవిధంగా లియో టాల్‌స్టాయ్ కూడా! వీళ్ళందరూ స్వతహాగా మాంసాహారులు. తరతరాలుగా మాంసాహారం తీసుకునే కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు. కానీ, తర్వాత శాకాహారులైపోయి, ప్రపంచవ్యాప్త శాకాహార ఉద్యమానికి వాళ్ళే మూల పురుషులై పోయారు. ఎంతటి మహానుభావులో!

"J.K. భారవి" : "హిట్లర్, ‘నా జీవిత సందేశమే శాకాహారం’ అన్నాడు" అన్నారు కదా, మరింత వివరంగా చెప్తారా గురూజీ!

"డా|| వేటూరి సుందరరామమూర్తి గారు" : హిట్లర్ ప్రపంచ విజేత అయి, ఒక బ్రహ్మాండమైన విందు చేశాడు. ఆ విందులో అన్నీ ఆకుకూరలు, కాయగూరలు, ఉడకేసినవి అన్నీ పెట్టారు. అప్పుడు మిలిటరీ సోల్జర్స్, జనరల్స్ వాళ్ళంతా వచ్చేసి "ఏమిటిది? తినటానికి ముక్కేమి కనపడట్లేదు; ఇదేమిటి?"అని ఆశ్చర్యపోయారుట.

"మీరందరూ ఆశ్చర్యపోతారని నాకు తెలుసు! అన్ని జంతువులలోనూ సృష్టిలో బలిష్టమైనది ఏది?" అని అడిగాడట, హిట్లర్. "ఏనుగు" అని చెప్పారుట. "ఏనుగు శాకాహార? మాంసాహార?" అని అడిగాడట. "శాకాహారి" అన్నారుట. "నేను అందుకే ఇలా పెట్టాను, మీరెప్పుడూ బలవంతులై వుండాలని! నేను ఇన్నాళ్ళూ తినేది అదే. అందుకే ప్రపంచాన్ని జయించాను" అన్నాడుట, హిట్లర్. ఇంకా "నేను ఆర్యుడను. ఆర్యుడంటే పరిపూర్ణ శాకాహారి అనే అర్థం" అని కూడా నొక్కి వక్కాణించాడుట!

"J.K. భారవి" : హిట్లర్ ద్వారా శాకాహార సందేశం చాలా బాగుంది!

డా|| వేటూరి సుందరరామమూర్తి గారు" : అసలు బౌద్ధమతం బలహీన పడటానికి కారణం కూడా అదే! "కడుపు నింపుకోవటానికి ఏ ఆహారమైనా ఒక్కటే" అని చెప్పే ‘హీనయానం’ లాంటీ వాటి సంకరం వల్లే అది జరిగింది. ఆ ఒక్క వీక్‌నెస్ వల్లే ఆదిశంకరుడు భౌద్ధమతాన్ని వ్యతిరేకించాడు కూడా!

"J.K. భారవి" : మీ దృష్టిలో ‘ధ్యానం’ అంటే ఏమిటి?

"డా|| వేటూరి సుందరరామమూర్తి గారు" : "ఉత్తమాః సహజావస్థ ద్వితీయా ధ్యాన ధారణ తృతీయా పత్రిమా పూజా హోమయాత్రా చతుర్ధికా"

..అని శాస్త్రం చెబుతోంది! అందులో " ఉత్తమా: సహజవస్థ" అంటే ధ్యానంలో నిన్ను తెలుసుకోవటంలో, నువ్వు సర్వ వ్యాపారాలూ నిలిపి, నిన్ను నువ్వు అంతర్ముఖుడవై చూసుకునేటప్పుడు, నీకు కలిగే అనుభూతికి దగ్గరకు వెళ్ళి సహజావస్థను పొందటం ‘ధ్యానం’" అని చెబుతోంది.

అంటే.. భగవంతుడిని గురించి మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి.. భగవత్ ధ్యానం ఏమిటంటే.. It's an encounter with god. భగవంతుడితో తలపడటం, ముఖాముఖి భగవంతుడితో సంభాషించగలగటం! అదీ, ‘ధ్యానం’ అంటే!

"J.K. భారవి" : మీరు ధ్యానం చేస్తారా?

"డా|| వేటూరి సుందరరామమూర్తి గారు" : నేనా? (నవ్వుతూ) ఈ మధ్య పరధ్యానం చాలా ఎక్కువై పోయింది!

"వేటూరి ప్రభాకరశాస్త్రి గారు".. మా పెదనాయన గారు.. C.V.V. రాజయోగం చాలా నిష్ఠగా చేస్తూండేవారు. వారితోపాటు నేను కూడా చిన్నప్పుడు ఆ ధ్యానాన్ని ప్రతిదినం చేస్తూండేవాడిని మొహం కడుక్కోవటం, స్నానం చేయటం, భోజనం చెయ్యటం ఎలాగో.. అలాగే ధ్యానం చెయ్యటం కూడా ఒక నిత్యకృత్యంగా జీవితంలో కలిసిపోయి వుండేది. అయితే క్రమేణ ఆ అలవాటు తగ్గుతూ వచ్చింది.

అయితే "ధ్యానం చేస్తారా?" అని మీరు అడిగారు ప్రతి వాళ్ళూ ధ్యానం చేసుకుంటూనే వుంటారు! వాళ్ళు మౌనంగా ఉన్నప్పుడల్లా జరిగేది ధ్యానమే అని నా విశ్వాసం!!

Go to top