" నా అంతరంగంలోని బాధ తగ్గిపోయింది "

 

నా పేరు అగస్త్య రాజు. మా నాన్నగారు "రామలింగేశ్వర చౌదరి" గారు గత ఏడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ.. మా కుటుంబంలో అందరినీ ధ్యానం చెయ్యమని కోరుతూ.. శాకాహారుల్లా ఉండమని చెప్పేవారు. కానీ మేమంతా మూర్ఖత్వంతో వారు చెప్పిన మంచి మాటలను వినేవాళ్ళం కాదు. 2011.. డిసెంబర్‌లో "ధ్యానమహాచక్రం-2" కార్యక్రమానికి వెళ్దామని వారు మమ్మల్ని ఎన్నిసార్లు కోరినా మేము పెడచెవిని పెట్టాం. తీరిక లేదని చెప్పి తప్పించుకున్నాం. ఇక వారు ఒక్కరే విశాఖపట్టణం వెళ్ళిపోయారు.

అయితే.. అప్పటికి గత నెల రోజులుగా ఒళ్ళంతా నీరసంగా ఉంటూ నాకు సరిగ్గా నిద్రపట్టక.. ఏదో జబ్బు పడిన వాడిలాగా వున్న నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. రకరకాల పరీక్షలు చేసి డబ్బు వదిలించుకున్నా.. జబ్బు ఏమిటో అర్థం కాలేదు కానీ..రోజు రోజుకూ నీరసం ఎక్కువ అయిపోవడం జరిగింది. ఏం చేయాలో తోచక.. "నాన్న గారు చెప్పినట్లు ధ్యానం చేస్తే బాగుంటుందేమో" అన్న నా భార్య సలహాతో విశాఖపట్టణం బయలుదేరాను.

అప్పటికి అది "ధ్యానమహాచక్రం-2" లో నాలుగవ రోజు. అక్కడ ఉన్న ఆకాశం అంత పందిరినీ, వేల జనాలనూ చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను! అసలు "పత్రీజీ" ఎవరో కూడా అప్పటికి నాకు తెలియదు! మొట్టమొదటిసారిగా వారిని స్టేజి మీద చూసి.. తన్మయత్వం చెందాను. "నవ విధ ధర్మాలు"లోని మైత్రీతత్వం గురించీ, సూఫీతత్వం గురించీ ఆ రోజు వారు చెప్తూన్న మాటలను వింటూ అలా ఉండిపోయాను.

ఇరవై నాలుగు గంటలూ బిజీగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, ప్రాపంచిక వ్యవహారాలు చక్కబెడుతూండే నేను.. నా సెల్ అదే పనిగా మ్రోగుతూ ఉంటే.. దాని స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసాను. అంతగా ఆయన మాటల్లో నేను లీనమైపోయాను. కార్యక్రమం అయిపోయాక ఫోన్ ద్వారా మా కుటుంబ సభ్యులతో, మరి అక్కడే ఉన్న మా నాన్నగారితో నా ఆనందాన్ని పంచుకున్నాను.

"ఒక్కరోజు ఉండి వెళ్ళిపోదాం" అనుకున్న నేను .. ఇక కార్యక్రమం పూర్తయ్యేవరకు అక్కడే వుండిపోవాలని నిర్ణయించుకుని ..ప్రతిరోజూ ఉదయం మూడు గంటలకే నిద్రలేచి స్నానం చేసి.. నాలుగు గంటలు కల్లా ప్రాంగణానికి చేరుకుని.. ప్రాతఃకాల ధ్యానంలో మునిగిపోయి అనంతమైన ఆత్మానుభూతులను పొందేవాడిని.

"నవ విధ ధర్మాలు"గా వారు ఒక్కొక్క ధర్మాన్ని గురించి విపులంగా చెపుతూ ఉంటే.. నా మనస్సంతా ఎంతో బాధతో నిండిపోయేది. ఎందుకంటే గత కొన్ని యేళ్ళుగా నేను మధ్యం, మాంసాహారం, ధూమపానం మరి పేకాట వంటి చెడు లక్షణాలతో నా శరీరాన్నీ, జీవితాన్నీ కూడా ఎంతో పాడుచేసుకున్నాను. ఇక ఆ రోజు నుంచి "నేను బ్రతికి ఉన్నంత కాలం చెడు అలవాట్ల నుంచి దూరం కావాలి" అని నిర్ణయించుకున్నాను. అప్పుడు కానీ నా అంతరంగంలోని బాధ తగ్గలేదు. ఇక అప్పటి నుంచి నా ఆనందమే.. ఆనందం మాటలలో చెప్పలేని ఆత్మానందం!

విశాఖపట్టణం నుంచి తిరిగివస్తూనే.. మొట్టమొదట నేను తీసుకున్న అద్భుతమైన నిర్ణయం.. మా ఊరు "తాపేశ్వరం" లో పిరమిడ్ నిర్మించడం. వెంటనే నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టి.. నెల రోజుల్లో "అమ్మ పిరమిడ్ ధ్యాన మందిరం" 12'X12' సైజులో బ్రహ్మర్షి పత్రీజీ చేతుల మీదుగా 31 జనవరి 2012 రోజున ప్రారంభోత్సవం చేయించుకోవడం జరిగింది.

ఇప్పుడు నాతో పాటు మా కుటుంబం సభ్యులంతా కూడా ధ్యానం చేస్తూ, శాకాహారుల్లా మారిపోయి ఊళ్ళో వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తూ ధ్యానప్రచారం చేస్తున్నారు. ఇక చెడు అలవాట్ల నుంచి దూరం కావడంతో.. ఈ కొద్ది కాలపు ధ్యానశక్తితోనే నా శరీరంలో.. మరి నా ఆలోచనా విధానాలలో.. జరిగిన పెను మార్పులు వెలకట్టలేనివి.

అజ్ఞానంతో నా జన్మను వృధా చేసుకోబోతోన్న నన్ను ఈ ధ్యానప్రపంచంలోకి తెచ్చిన మా నాన్నగారికీ, మరి నన్ను జ్ఞాన మార్గంలో నడిపిస్తోన్న పత్రీ్జీకీ.. వేల వేల కృతజ్ఞతలు.

 

 

M. అగస్త్య రాజు
తాపేశ్వరం
ఫోన్ : +91 9441049998

Go to top