" ఆత్మ దర్శనం జరిగితే ఇక యమదర్శనం జరుగదు "

 

నా పేరు సోమేశ్వరమ్మ. నేను 1975 సంవత్సరంలో క్షయవ్యాధి సోకడం వలన తీవ్ర అనారోగ్యానికి గురుయ్యాను. నా పాలు త్రాగిన చిన్న బాబుకు దగ్గు, ఆయాసం వచ్చి ఒకటిన్నరేళ్ళ వయస్సులోనే చనిపోయాడు.

నా అనారోగ్యం తీవ్రమవ్వడం వలన 1976లో మా నాన్నగారు నన్ను వికారాబాద్‌కు తీసుకువెళ్తానని అన్నారు కానీ నేను ఇష్టపడలేదు. నా ఆరోగ్యం బాగుచెయ్యడం ఇష్టం లేకపోతే నన్ను చంపెయ్యమని దేవుడిని కోరుకునేదాన్ని. నా జబ్బు వలన ఎవ్వరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, నన్ను విడిగా వేరే గదిలో ఉంచేవాళ్ళు. మా నాన్నగారు నా బాధ్యత తీసుకుని ఎంత ఖర్చుయినా సరే.. పిల్లల కోసం బ్రతకాలని అన్నారు.

క్షయ వ్యాధి చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ T.B. ఆసుపత్రిలో ఆరు నెలలు ఉన్నాను. ఆసుపత్రిలో కూడా ఏమీ తగ్గలేదు. ఆపరేషన్ చేస్తామని చెయ్యలేదు. మళ్ళీ 1977లో మా ఊరికే వచ్చేశాం. ఇక అప్పటి నుంచి నేను తిరుగని డాక్టర్ లేడు, వాడని మందు లేదు. ఏ క్షణంలో చనిపోతానో తెలియని విధంగా దగ్గు ఆయాసంతో కాలం గడుపుతూ చావుకోసం ఎదురుచూస్తూ జీవచ్ఛవంలా పడి ఉండేదాన్ని!

హైదరాబాద్ వనస్థలిపురం, విజయపురి కాలనీలో 2004 సంవత్సరంలో M. వెంకటరెడ్డి గారి ఇంట్లోని పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 40రోజుల ధ్యాన శిక్షణా కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి రోజూ ఆనాపానసతి ధ్యానం చేస్తూన్నాను. ఆ ధ్యాన కేంద్రంలో శ్రీ P.V.S. విజయకుమార్ గారు వారానికి రెండుసార్లు వచ్చి ఎన్నెన్నో గొప్ప విషయాలు చెప్పేవారు. ధ్యానం మొదలుపెట్టిన 11 నెలలకే.. నేను ఎవరనేది తెలుసుకున్నాను. ప్రతిరోజు ఉదయం ఒకగంట, సాయంత్రం ఒక గంట ధ్యానం చేసేదాన్ని. అప్పటి నుంచి ఆర్థికంగా బాగుంది. ఆరోగ్యమే పెద్దగా బాగుపడలేదు. ఊపిరితిత్తుల్లో ఒక ప్రక్క నొప్పి వుండేది, ఆయాసం తగ్గలేదు.

"ఒక యోగి ఆత్మకథ" అనే పుస్తకంలో "ఆత్మదర్శనం జరిగితే ఇక యమదర్శనం జరుగదు" అని వ్రాసి ఉన్నది చదివాక నాకు చావు అంటే భయం పోయింది కానీ శారీరకంగా మాత్రం బాగా బాధగానే ఉండేది.

శ్రీశైలంలో 2009 లో జరిగిన తాండవ శివ మహాయజ్ఞంలో అయిదవ రోజున పత్రీజీ "అందరూ మీ జీవితాలను గురించి పుస్తకం వ్రాయండి."అని చెప్పారు. ఆరవరోజున నాకు ధ్యానంలో విశ్వామిత్ర మహర్షి దర్శనం ఇచ్చి.. "నీ జీవిత కథను విశ్వానికి అందజెయ్యి" అని చెప్పారు.

ఏడవ రోజున ధ్యానంలో "ఇక నీ కర్మలన్నీ ఆ హోమగుండంలో పడిపోయి దగ్ధమైపోయాయి; నీ కర్మంతా తెగిపోయింది" అని ఎవరో నా చెవిలో స్పష్టంగా చెప్పారు. అప్పటి నుంచి నాకు దగ్గు, దాంతోపాటు రక్తం పడడం కూడా మంత్రం వేసినట్లుగా ఆగిపోయింది. అంతకు ముందు పక్కింటి వాళ్ళకే భయం కలిగేంతగా దగ్గు వచ్చేది. "డాక్టరుకు చూపించండి" అని వాళ్ళు చెప్పేవాళ్ళు కానీ.. నేను భయపడలేదు. శ్వాస మీద ధ్యాసనే నమ్ముకున్నాను మరి పూర్తి స్వస్థతను పొందాను. ఈ శ్వాస విద్యను అమలులోకి తెచ్చిన మన పత్రీజీకి వేల వేల నమస్కారాలు ...

నా ఆరోగ్యంలో వచ్చిన విశేషమార్పు మా ఇంటిల్లి పాదినీ ఆనందపరచింది. "ఏ క్షణంలో చనిపోతానో" అనుకున్న నేను ఇప్పుడు B.N. రెడ్డి నగర్‌లో మా వారితో పాటు ధ్యానప్రచార కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. నా ఆరోగ్యం ఎంత మెరుగయ్యింది అంటే.. ఇప్పుడు నేను ఎంత ఎండలైనా, ఎక్కడికైనా ధ్యానప్రచారం కోసం వెళ్ళగలుగుతున్నాను. ఎంతో ఖర్చుపెట్టి, ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా ఎక్కడా నా అనారోగ్యం పూర్తిగా నయం కాలేదు కానీ బ్రహ్మర్షి పత్రీజీ ఒక్కపైసా ఖర్చు అనేదే లేకుండా నా ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టించి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు. ఆయన నిరంతరం "ఎవరిని వారే వుద్ధరించుకోవాలి, "నీ కోసమే నువ్వు బ్రతకాలి" అని చెబుతూంటారు. ఇది నా విషయంలో వందకు వందశాతం నిజమై .. నా ధ్యానం ద్వారా నా ఆరోగ్యాన్ని నేనే మెరుగుపరుచుకోగలిగాను.

నేను ధ్యానం చెయ్యక ముందు కళ్ళజోడు లేకుండా చదవడం, వ్రాయడం చెయ్యలేకపోయేదాన్ని. ధ్యానం చేసిన తరువాత కళ్ళజోడు లేకపోయినా చక్కగా చదవగలుగుతున్నాను. మనకు ఆత్మదర్శనం అయిన తర్వాతనే మన బాధలు తగ్గిపోతాయి.. మరి మనం ఆత్మపరంగా జీవించినప్పుడే మళ్ళీ ఆ బాధలు రాకుండా ఉంటాయి ..

ఒకసారి గురువుగారు ఒక క్లాసులో, "నువ్వు ఎవరివైపైనా వేలెత్తి చూపితే, పైకి వెళ్ళిన తరువాత నీ వేలు కొట్టేస్తారు" అనీ, అలాగే, "నీ శరీరం ధ్యానం ద్వారా ఉక్కుశరీరం లాగా అవుతుంది" అనీ చెప్పారు. ఆయన అందరికీ చెప్పినా.. అది నాకే చెప్పినట్లుగా అనిపించింది.

మేము ధ్యానం చెయ్యకముందు మా జీవనం చాలా ఇబ్బందిగా వుండేది. రావలసిన డబ్బులు సమయానికి రాక చాలా బాధలు పడవలసి వచ్చేది. ఇప్పుడు సమయానికి డబ్బులు అంది మా జీవనం కూడా సాఫీగా సాగుతోంది; "ఆరోగ్యమే మహాభాగ్యం" కదా!

ధ్యానం చెయ్యకముందు "బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం" అనుకున్నాను. కానీ ఇప్పుడు..

* బ్రహ్మజ్ఞానం తెలుసుకోవాలనే కోరిక లేకపోవడం బ్రహ్మ హత్య

* బ్రహ్మజ్ఞానం తెలుసుకుని కూడా ఎవ్వరికీ చెప్పకపోవడం బ్రహ్మహత్య

* "నేనే బ్రహ్మను" అని తెలుసుకోలేకపోవడం కూడా బ్రహ్మహత్య..అని తెలుసుకుని ధ్యానం, ధ్యానప్రచారం ద్వారా నన్ను నేను ఆ పాపం నుంచి రక్షించుకుంటున్నాను.

 

K. సోమేశ్వరమ్మ
హైదరాబాద్
ఫోన్ : +91 94406 03373

Go to top