" ఎంతో బాధ్యతతో భద్రంగా చూసుకొంటున్నట్లు అనుభూతి చెందుతున్నాను "

 

 

నేను సికింద్రాబాద్ అల్వాల్ నివాసిని. మా వారి పేరు శ్రీనివాస్. ఇద్దరు పిల్లలు. శ్రీదివ్య పాప, శ్రీ సాయితేజ బాబు. నేను షిర్డీ సాయిబాబా భక్తురాలిని.

18 సంవత్సరాలు ఎంతో అన్యోనంగా హాయిగా కాపురం చేస్తూ నలుగురిలో పార్వతీపరమేశ్వరుల జంట అని అన్పించుకుంటున్న రోజులలో హఠాత్తుగా హార్ట్ ఎటాక్‌తో నా భర్త చనిపోయారు. ఆ రోజు నుండి ఇరవై రోజుల క్రితంవరకు ఏడ్వనిరోజు లేదు. అనుక్షణం ఆయన అనురాగం గుర్తుకువచ్చి తల్లిడిల్లిపోయేదాన్ని.

నాకు ప్రపంచజ్ఞానం అంతగా లేదు. చదువు కూడా వానాకాలపు చదువే. ఆయన పోయే సమయానికి ఆర్థికపరిస్థితి అంతంమాత్రమే. అప్పటివరకూ ఎంతో ఆప్యాయతగా ఉండే బంధువులు, హఠాత్తుగా కన్పించటం మానివేశారు. ఎంతో డిప్రెషెన్ గురిఅయ్యాను. అమ్మా, నాన్నగార్లను చివరకు నా పిల్లల్ని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించక తప్పదా అన్పించే దుస్థితి.

సరిగ్గా ఆ స్థితిలోనే ఏ బంధుత్వం లేకపోయినా ‘మేమున్నాము’ అని వచ్చినవారు మా శ్రీవారి స్నేహితులు శ్రీమతి కస్తూరి (మార్గదర్శి), శ్రీ మధుసూధనరావు గారు (మెడిటేషన్ పరంగా) ఎంతగానో ఆదుకున్నారు. ముఖ్యంగా కస్తూరి గారు మెడిటేషన్ నాకు నేర్పించి నేను కొంతవరకూ కోలుకోవటానికి కారకులు. ఆ తర్వాత ఆమె ప్రోద్బలంతో R.P. Road లోని కేర్ సెంటర్‌కి వెళ్ళాను. ఇన్‌ఛార్జి రాజశేఖర్ సార్ నన్ను ఎంతో ఆదరించి ఆప్యాయంగా కన్నతల్లిని మరిపించే మమకారంగా మాట్లాడారు. నా భర్తను ఒక్కసారి కన్పించేలా, ఒక్కసారి మాట్లాడేలా ఏమైనా చేయమని కోరాను. ‘మన ప్రపంచాన్ని వదిలివేసిన వ్యక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నతి పొందుతారనీ- నా భర్త కూడా అలాగే పొందారనీ’ చెప్పారు. అలాగే ‘మీ భర్త గురించి మీరు ఏడిస్తే ఆయన ఉన్నతి ఆగిపోవడమే కాకుండా ఆయన ఇబ్బంది పడతారు’ అని కూడా చెప్పారు.

అయినా నేను ఒకసారి ఒక్కమారు అని పట్టుపట్టేసరికి రోజూ మూడుగంటలు ధ్యానం చేయండి అని చెప్పటం, నాలుగైదు రోజులలోనే నా భర్త మాట నాకు స్పష్టంగా విన్పించడం జరిగింది. నా ఆశ్చర్యానికి అంతులేదు. మెడిటేషన్‌లో ఏదయినా సాధ్యమే అని అక్కడక్కడ వింటూనే వున్నాను గాని సరాసరి నాకే అనుభవం కావటంతో అమితానందం కలిగింది.

డాక్టరు కనీసం 4 సంవత్సరాలు వాడాల్సిందే అని చెప్పిన మందులు తీసుకోవటం మానివేశాను. ఎక్కడ మేడిటేషన్ క్లాసున్నా అక్కడకు పరిగెత్తుకెడుతున్నాను. రోజుకు 5,6 గంటలు ధ్యానానికే కేటాయిస్తున్నాను. నా భర్త భౌతికంగా లేకపోయినా కూడా అనుక్షణం నన్ను వెన్నంటే ఉన్నట్లు ఎంతో బాధ్యతతో భద్రంగా చూసుకొంటున్నట్లు అనుభూతి చెందుతున్నాను. ఇంతటి మహోపకారం చేసిన పత్రీజీకి శతసహస్ర వందనములతో ముగిస్తున్నాను.

 

శ్రీలక్ష్మి
సికింద్రాబాద్

Go to top