" నా జీవితం అందరికీ స్పూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను "

 

ఇ.సి.ఐ.ఎల్. లోని భవానీనగర్‌లో నివసిస్తున్నాను. 2007 సంవత్సరం డిసెంబర్ నెలలో నాకు చాలా అనారోగ్యం చేసి డాక్టర్స్‌తో పరీక్ష చేయించుకున్నాను. ‘రెండు కిడ్నీలు బాగా చెడిపోయినవనీ చాలా ప్రమాదస్థితి అనీ’ చెప్పి వారానికి రెండుసార్లు చొప్పున తప్పనిసరిగా డయాలసిస్ చేయించుకోవాలని చెప్పారు. ‘ఈ జబ్బు తగ్గేది కాదని బ్రతికినంత కాలమూ డయాలసిస్ తప్పదు’ అని మొహమాటం లేకుండా చెప్పేశారు.

వారు చెప్పినట్లుగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకొంటున్నా కూడా చెప్పలేనంత నిస్సత్తువ, నిరుత్సాహంతో చాలా బాధ పడేవాడిని. మంచినీరు కూడా రెండుగ్లాసులు మించి త్రాగితే సాయంత్రానికల్లా విపరీతమైన ఆయాసం వచ్చేది. మోకాలి నుండి పాదముల వరకు కాళ్ళు వాచిపోయేవి. చివరకు కీర-పుచ్చకాయల్లాంటివి తిన్నా కూడా చాలా అవస్థ పడిపోయేవాడిని. ఇంత బాధపడుతూ ‘ఎప్పుడు చావు వస్తుందా?’ అని ఎదురు చూసేవాడిని. శారీరకంగా ఆర్థకంగా కూడా పూర్తిగా క్రుంగిపోయిన రోజులవి.

హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ దామోదరరెడ్డి గారు ధ్యానం చేయమని సలహా చెప్పారు. సికింద్రాబాద్ ఆర్.పి.రోడ్డులోని కేర్ సెంటర్ ఇన్‍ఛార్జి రాజశేఖర్ సార్ మొదటి పరిచయంలోనే ఎంతో ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మాట్లాడారు. మెడిటేషన్ వలన తగ్గని జబ్బులు గాని, తీరని బాధలు గాని ఉండనే ఉండవు అని ఎంతో ధైర్యం చెప్పారు. ఆయన మాటలు నాకు ఎంతో ఆసక్తిగానూ, అమితానందం గానూ అన్పించాయి. కేర్ సెంటర్‍లో రోజు ఐదుగంటలు ఉండిపోండి. నాల్గుగంటలు మెడిటేషన్ చేయండి. మాంసం ఊసే ఎత్తవద్దు అని ఖరాఖండిగా చెప్పారు.

గత 15 రోజులుగా కేర్ సెంటర్‌కు విధిగా వెళ్ళి మెడిటేషన్ చేస్తున్నాను. బాగా చెప్పుకోతగ్గ మార్పులు కొన్ని వ్రాస్తున్నాను.

1. డయాలసిస్ వారానికి రెండుసార్లు జరుగుతాయి. అప్పుడు బరువు 5 కేజీల నుండి 6 కేజీల వరకూ పెరిగేవాడిని ఇప్పుడు 2.5 కేజీల నుండి 3 కేజీలు మాత్రమే పెరుగుతున్నాను. ఇది అతితొందరగా వచ్చిన అరుదైన మంచిమార్పు అని డాక్టర్లు అన్నారు.

2. కాళ్ళనొప్పులు-కాపులు -ఊపిరితిత్తులలోకి నీరు రావటం జరిగేది. ఇప్పుడు నొప్పులూ లేవు. వాపులూ లేవు. ఊపిరితిత్తులలోకి నీరు రావటం లేదు.

3. అతి కష్టం మీద శ్వాసపీల్చే నేను చాలా ఫ్రీగా పీల్చగల్గుతున్నాను.

4. విపరీతమైన మనస్తాపం వలన వాడిపోయి - ఏడుపొక్కటే తక్కువ అన్నట్లు వుండే నా ముఖం ఎంతో వికసించినట్లుగా అవటం... ఇది నేనేకాక -నా చుట్టుప్రక్కల వారంతా గుర్తించి ఆనందించటం జరుగుతోంది.

ఇంత తక్కువ సమయంలో నాకు గల్గిన ఈ అనుభూతికి చాలా సంతోషిస్తున్నాను. నా జీవితం అందరికీ స్పూర్తిదాయకం కావాలని కోరుకుంటున్నాను.

 

బి. అంజిరెడ్డి

Go to top