" ఏదైనా ఎంత కష్టమైనా.. ఇష్టంగా చెయ్యడమే పత్రీజీ నియమావళిలో మొదటిది.. "

 

 

"దేవుడెవుడు?"

"దేవుడెక్కడ??"

అని దేవులాడుతూ, దేవులాడుతూ వూరు వాడా దారీ తెన్నూ తిరుగుతూన్న నాకు ఓ రోజు అంటే..1995 ఆగస్టు నాకు ఓ రోజు అంటే..1995 ఆగస్టు 18న ..సాయంత్రం 6గంటలకు..

"ధ్యానం చేస్తే మన ఇంటీకి ‘దేవుడు’ వస్తాడు.. చేసి చూడు" అని నా చెవిలో వూదాడు.. నా మిత్రుడు.. ఇంజనీరు అయిన ‘శాస్త్రి’.. అనంతపురంలో..

ధ్యానం గురించి ‘ఓనమాలు’ కూడా తెలీని నేను కళ్ళు మూసుకున్నాను..

అలా సుమారు 7 గంటలు ఏకధాటిగా అఖండ ధ్యానం.. అథవా ధ్యానప్రయత్నం!

ప్రతిక్షణం కళ్ళుమూసుకునే బిత్తరచూపులు.. ఏ మూల నుంచి దేవుడు వస్తాడో.. దేవుడు ఎలా వుంటాడో..

గంట గంటకూ మరింత ఆతృత..!

సరిగ్గా అర్థరాత్రి రెండున్నర ప్రాంతంలో చిమ్మచీకటిలో దూరంగా..ఓచిన్న స్ఫార్క్.. ఓ పెద్ద వెలుగు చుక్క...

చూడబోతే... వేగంగా వచ్చి సరాసరి.. నుదుటిమీద తాకడం.. అంతే.. అంతా వెలుగే! ఆ వెలుగులో ధ్వజస్తంభం, నంది, జలపాతాలు, మలయ మారుతాలు..! ‘శివలింగం’..!

ఓహో ఏమని వర్ణించాలి?

అంతలో ఎవరో వచ్చి నా శరీరాన్ని సృశించడం.. హఠాత్తుగా కళ్ళు తెరుచుకున్నాయి వాటంతట అవే. చుట్టూ చూశాను.. ఎవ్వరూ లేరు.. భయం.. నన్ను నేను సముదాయించు కోవడం...

ఇలా ఆ మొట్టమొదటి రాత్రి అంతా ఇంతే..!

మొత్తానికి ఎలాగోలా తెల్లారింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి శాస్త్రీతో జరిగినదంతా చెప్పాను. "నాకేం తెలియదు.. ‘సుభాష్ పత్రీజీ’ కర్నూలు నుంచి వస్తున్నారు. ఆయన్ను అడుగు" అన్నాడు వాడు.

అనంతపూర్ మాస్టర్ శ్రీ T. విజయకుమార్ గారి సాయంతో తొలిసారి సుభాష్ పత్రీ గారిని చూశాను.

నన్ను చూడగానే ఆయన చిటికె వేసి రమ్మని సైగ చేశారు.

ఆయన దగ్గరికి వెళుతూంటే ‘నా దగ్గరికే’ నేను వెళ్ళుతున్నట్లు వుంది! ప్రక్కన వున్న ఒకాయన్ని తోసి తన ప్రక్కనే నన్ను కూర్చోబెట్టుకుని నా భుజం పై చెయ్యి వేసారు పత్రీజీ!

భాషకి అందని భావం!

భావానికి అందని అనుభూతి! "దేవుడు ఎక్కడ? ఎక్కడ?’ అని దేవులాడేవాడే ‘దేవుడు’! అన్నారు ఆయన. నా అనుమానాలు.. భ్రమలు, భ్రాంతులు పటాపంచలు.

పరంపరగా అచిరకాలంలో ఉద్యోగానికి రాజీనామా..

"శ్రీ రాముని" వెనకాల "హనుమంతుని" లా పత్రీజీ వెంట నేను..

ఎన్నో గ్రామూలూ, ఎన్నెన్నో నగరాలూ, మరెన్నెన్నో మహానగరాలూ ఉత్తర భారతం..దక్షిణ భారతం.. విదేశ పర్యటనలు..!

ఎన్నో అనుభవాలు..

ఎన్నెన్నో విజ్ఞానాలు..

లక్షమంది పత్రీజీని ప్రత్యేకంగా కలుసుకుని వుంటారు. వారిలో ధనవంతులు, స్థితివంతులు, పదవిలో వున్నవారు, అధికారులు, అఫీసరులు ఒకరేమిటి? రకరకాలవారు! అందరినీ ప్రత్యేకంగా చూడడం, ప్రత్యేకంగా చూడకపోవడం అన్నది పత్రీజీ ‘స్టైల్’ కాదు.

వచ్చిన వారి హోదా కానీ, పరపతి కాని కించిత్ కూడా చూసేవారు కాదు. "అందరూ ఆత్మలే" అన్నదే వారిదృష్టి..!

31 డిసెంబర్, 1995.. పిరమిడ్ మాస్టర్లందరూ "కర్నూలు బుద్ధ పిరమిడ్" చేరుకున్నారు. ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు వరుసగా జరిగిపోతున్నాయి. నవ్వులు, సరదాలు బలే జాలీగా సాగిపోతోంది.

"ఈ కొత్త సంవత్సరానికి ఒక కొత్త నిర్ణయం.." అన్నారు పత్రీజీ.

ఏమిటబ్బా?" అని అందరం చెవులప్పగించి చూస్తున్నాము..

"సంవత్సరం అంతా మౌనంగా వుండాలనుకుంటున్నాను.."

హఠాత్తుగా ఆయన తీసుకున్న నిర్ణయానికి కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి.

మళ్ళీ జోకులు..

కొత్త కొత్త కాన్స్‌ప్టులు..

టైమే తెలియట్లేదు..

అంతవరకు గలగలా మాట్లాడుతున్న పత్రీజీ సడన్‌గా మాటలాపి వీపుమీద చెయ్యి వేసుకుని అలా వెళ్ళిపోతున్నారు. అందరం ఆశ్చర్యంగా చూస్తున్నాము... అప్పుడు టైం చూసుకున్నాం. సరిగా రాత్రి 12.00గం||లు..

పత్రీజీ చేతికి వాచీ కూడా లేదు. చెప్పిన టయానికి మౌనవ్రతం ప్రారంభించారు...అన్నది... అనుకున్నది... ఏదైనా ఎంత కష్టమైనా.. ఇష్టంగా చెయ్యడమే పత్రీజీ నియమావళిలో మొదటిది..

ఎంతోమంది ఎన్నో ఆలోచనలతో "ఆ పని చేస్తాను.. ఈ పని చేస్తాను... అలాఅనుకుంటున్నాను... ఇలా అనుకుంటున్నాను.." అంటూంటారు పత్రీజీతో..

"యస్... నువ్వు చేయాలి. డూ ఇట్.." అంటారు పత్రీజీ..అలా రెండవసారి మూడవసారి ఇలాగే చెప్పిచెప్పి ఒకరోజు ఎప్పుడో..

"అది నీపని కాదయ్యా మానెయ్" అని చెప్పడం కొన్ని వేలసార్లు గమనించాను! ఒకరోజు పత్రీజీని అడిగాను "సార్! మీ దగ్గరకు వచ్చిన మొదటిసారే ‘అది మీ పని కాదు’ అని చెప్తే, ఇన్నిరోజులు వాళ్ళకు ఆ యాతన వుండదు కదా?" అని...

పత్రీజీ అదోలా నవ్వి "అలా చెప్తే పరిశ్రమ చేయరు, అనుభవాలు కలగవు, రావు, వాళ్ళళ్ళో పనిచేయాలి అనే వుత్సాహం సన్నగిల్లి పోతుంది; అంచేత ముందు ప్రోత్సహించాలి. ఆ తరువాత ఆ వ్యక్తి వల్ల ఆ పని అవుతోందో కాదో చెప్పాలి. అదో సీక్రెట్‌లే...!

ఇలా అంటున్నప్పుడు ఆయన చూపు.. ఆయన నవ్వు అర్థం కావడానికి చాలా ఏళ్ళు పట్టింది నాకు..

"జీవితంలో ఎప్పుడూ ముందుకు అడుగువేయాలి, వెనుకకు కాదు" అనేది పత్రీజీలో నేను కనిపెట్టిన విలక్షణమైన క్వాలిటీ.

1999 లో కాకినాడ "రామకృష్ణ మందిరం" లో క్లాస్ ముగించుకుని విజయవాడ వెళ్ళాలి..

రాత్రి 9 గం||లకు కాకినాడ నుండి సామర్లకోటకు వచ్చాం. స్టేషన్‌లోకి వెళ్ళేసరికి "ట్రైన్ మూడు గం||లు ఆలస్యం" అని తెలిసింది..

"సర్! కారు ఇక్కడే వుంది వెనక్కి వెళ్ళి మళ్ళివద్దాం" అన్నాను. "నో..నో..నో..

నో.. బ్యాక్‌స్టప్.." అంటూ రైల్వే ఫ్లాంట్‌ఫాం పైన అర్థరాత్రి మూడు గంటలు వరకు అటు ఇటు పచార్లు కొడుతూనే వున్నారు.. ఒక గంట దాటిపోయింది...

"శివా! ఓప్లాష్..!" అన్నారు..

ఆయన వెంట నడిచి నడిచి పీకుతున్న నేను "ఇంకేం ఫిట్టింగ్ పెడతారో" అనుకుంటూ దిగులుగా చూశాను..

"‘తులసిదళం’ ఒక రీసర్చ్ గ్రంథం కదా. దాంట్లో మనం ఎన్నో కాన్సెప్ట్‌లు చెప్పుకున్నాం కదా! అవి మన సంచిక విజ్‌డమ్ కదా! నౌ ‘తులసీదళం-2 కి ప్లాన్ చేయాలి’ అనే థాట్ ఫ్లాష్ అయింది! ఎలా వుంది...??"

"అదిరింది.." అన్నాను.. "ఈ ఆలోచన రావడానికి టైమ్ కావాలి. అందుకే ట్రైన్ ఆలస్యం" అన్నారు. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకోవడం..

ఎంత నెగెటివ్‌లోంచి అయినా పనికొచ్చే పాయింట్‌ని లాగడం.. పత్రీజీకి వెన్నతో పెట్టిన విద్య..!

"దటీజ్ పత్రీజీ" శీర్షకలో.. ఎవరెవరికి పత్రీజీ ఎలా అర్థమవుతున్నారో చాలా గొప్పగా వివరిస్తున్నారు.. 14 ఏళ్ళ నుంచి పత్రీజీ నీడల్లే వుంటున్న నాకు మాత్రం ఆయన ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తూంటారు..

దటీజ్ పత్రీజీ..!

 

D. శివప్రసాద్

Go to top