" నా గురువు ఆశయసాధనలో భాగస్తుడిని అవుతాను "

 

నా పేరు చంద్రశేఖర్. నేను 1995 నుంచి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నా విధులను నిర్వర్తిస్తూ.. "శారీరక పరంగా ఫిట్‍నెస్‌తో వుంటే చాలు" అనుకునే వాడిని.

2007 లో గ్రౌండ్ ఇన్‌స్పెక్టర్ గా పోలీస్ శాఖలో క్రొత్తగా భర్తీ అయిన వారికి శిక్షణ ఇస్తూవున్నప్పుడు నాకు ‘గ్యాస్ట్రిక్ ట్రబుల్’ వచ్చి విపరీతమైన నొప్పితో విలవిలలడాను. అపోలో హాస్పిటల్‌లో డాక్టర్ గారు "మసాలాలు, మాంసం తినడం మానకపోతే ‘ప్రేగు ఆపరేషన్’ చేయాల్సివుంటుంది" అన్నారు. మొదటిసారిగా నాకు "చచ్చిపోతానేమో" అని భయం వేసింది!

అంతకముందు 2000 సంవత్సరంలో మా హెడ్ కానిస్టేబుల్ రంగస్వామి గారు ‘ధ్యానం’ గురించి నాకు తెలియజేసారు. కానీ నేను ఎగతాళిగా "పోవయ్యా.. భలే చెప్పావు! నాకు మూడు పూటలా మాంసం లేనిదే ముద్ద దిగదు. నువ్వు చెప్పినట్లు చేసేవాడు ఏ హిమాలయాల్లోనో వుండాలి; నా వల్ల కాదు నన్ను వదిలివేయి" అన్నాను.

అలాంటిది ఇప్పుడు నాకు ఆయన గుర్తుకు వచ్చారు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి "సార్ మీరు ఇంతకు ముందు చెప్పిన ధ్యానం నేను చేస్తాను చెప్పండి" అన్నాను.

ఆయన.. "తడిసావా! సరే ఇప్పుడు గుడిసెనే కప్పుకోవడానికి వచ్చావన్న మాట" అన్నారు. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టి.. "ఈ రోజు నుంచి మాంసం తినడం మానివేద్దాం" అని నా భార్యతో చెప్పి ఇంట్లో వున్న వండిన మాంసం కూరను పాత్రతో సహా పారేసాను.

ఈ క్రమంలో ఒకరోజు కడుపునొప్పితో బాధపడుతూ కూర్చున్న నాకు ధ్యానంలో ఒక మగగొంతు వినపడి "ఎందుకు ఏడుస్తున్నావు?" అన్నారు. నేను "స్వామీ! కడుపులో ఎడమ వైపు విపరీతమైన నొప్పి వుంది" అన్నాను. "దానికి ఏడవాలా?! ఏదీ? "అంటూ నా కడుపులోకి చెయ్యిపెట్టి త్రిప్పుతూ "కదలవద్దు; కళ్ళు తెరవవద్దు" అన్నారు.

"ఇప్పుడు ఎలా వుంది? ఇది తాత్కాలికమే ఇక నుంచి నిన్ను నువ్వే బాగుచేసుకోవాలి; ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలి" అన్నారు.

ప్రొద్దున్నే వెళ్ళి.. రాత్రి ధ్యానంలో జరిగిన విషయాలను మా హెడ్ కానిస్టేబుల్ గారికి చెప్పాను. ఆయన ఇంట్లోకి వెళ్ళి ‘ధ్యానాంధ్రప్రదేశ్’ పుస్తకం తెచ్చి "నీకు ధ్యానంలో కనపడింది ఈయనేనా?" అన్నారు.

ఆ పుద్తకం మీద నేను రాత్రి ధ్యానంలో చూసిన గురువు ఏ డ్రస్సులో ఏ విధంగా తలకి పట్టీకట్టి ఆకుపచ్చ లాల్చీ వేసుకుని వున్నారో సరిగ్గా.. అదే ఫోటో చూశాను. వారు నా ప్రాణప్రదాత విశ్వగురువు బ్రహ్మర్షి పత్రీజీ. నాకు నోటమాట రాలేదు! "ఈ రోజుల్లో అసలు ఇలాంటి అద్భుతం సాధ్యమా" అని ఆశ్చర్యపోయాను!

ఇక "వారిని ప్రత్యక్షంగా కలుద్దాం" అనుకుని అప్పట్లో హిమాయత్‌నగర్ లో వున్న "ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీస్" లో పుస్తకం కరెక్షన్స్ చేసుకుంటోన్న పత్రీజీ దగ్గరికి వెళ్ళి.. "నమస్కారం సార్" అన్నాను.

ఆయన తలపైకి ఎత్తి చూసి .. మళ్ళీ పుస్తకం కరెక్షన్‌లో ఉండిపోయారు. ఏమి మాట్లాడలేదు .. అంతా నిశబ్దం .. నాకేం అర్థంకాలేదు. నాకు బాధకలిగి "సార్! ‘ మీతో కలిసి మాట్లాడాలి’ అని వస్తే మీరు నాతో ఏమీ మాట్లాడడం లేదు " అన్నాను. అప్పుడు ఆయన " ఏం మాట్లాడాలి? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే వున్నావా. నీలాంటి వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరా? నీకు మొన్న కడుపులో నొప్పి తగ్గించాను .. ఇంకేం కావాలి? ధ్యానం చెస్తే చెయ్యి లేకపోతే చచ్చిపో " అన్నారు.

ధ్యానంలో నాకు జరిగిన స్వస్థతా చికిత్సా తరువాత కూడా "ఇది సాధ్యమా?" అని ఒకింత అనుమానంగా ఉన్న నాకు సర్వజ్ఞులైన వారి మాటలు విన్న తరువాత నోట మాట రాలేదు. ఆ తరువాత కొన్నాళ్ళకు నేను దేశరాజధాని న్యూ ఢిల్లీ లోని "A.P. భవన్" లో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తూండగా విపరీతమైన జ్వరం వచ్చి మూసినకన్ను తెరవకుండా పడిపోయాను. వెంటనే నన్ను హైదరాబాద్‌కు త్రిప్పిపంపి అపోలో హాస్పిటల్‌లో చేర్చి వందల సంఖ్యలో సెలైన్ బాటిల్స్ ఎక్కించారు.

మెల్లిమెల్లిగా నా శరీరం స్వస్థత పొందిన తరువాత ఒకరోజు నేను ఎనిమిది గంటలు ఏకధాటిగా ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో ఒక మహాపురుషుడు కొప్పు చుట్టూ రుద్రాక్ష మాలలతో, చేతిలో కమండలం పుచ్చుకుని.. తలచుట్టూ సూర్యుడిలాంటీ వెలుగుతో దర్శనం ఇచ్చారు. "మాంసాహారంతో కలుషితమైపోయిన నీ భౌతిక శరీరం జ్వరంతో కరిగించబడి.. సెలైన్ బాటిల్స్‌తో కడిగివేయబడింది. ఇకనుంచి చక్కటి శాకాహారంతో నీ శరీరాన్ని పోషించుకో. నువ్వు 135 సంవత్సరాలు బ్రతుకుతావు.. నీ గురువు ఆశయసాధనలో భాగస్థుడివి అవుతావు" అంటూ మాయం అయ్యాడు.

అప్పటినుంచి నేను హైదరాబాద్.. యూసుఫ్‌గూడ పోలీస్ స్టేషన్ లో ఇన్‌స్పెక్టర్‌గా నా విధులను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూనే డిపార్ట్‌మెంట్‌లోని నా సహోద్యోగులకు ధ్యానం గురించీ, శాకాహార ప్రాముఖ్యత గురించీ ప్రచారం చేస్తున్నాను. వృత్తిరీత్యా పోలీస్‌నైనా నా ప్రవృత్తిని దివ్యత్వంతో నింపుకుంటూ నన్ను నేను ఆనందంగా, సంతోషంగా వుంచుకుంటూ నా చుట్టూ వున్న అందరిని కూడా సంతోషంగా వుంచుతున్నాను.

జై ధ్యానం! జై జై ధ్యాన ప్రచారం! జై ధ్యాన జగత్!

 

M.చంద్రశేఖర్
హైదరాబాద్
సెల్ : +91 98851 37952

Go to top