" ధన సంపదన కన్నా .. ధ్యాన సంపద ఎంతో గొప్పది "

 

నా పేరు దివాన్‌జీ. నేను ధ్యానంలోకి 2008 అక్టోబర్ నెలలో రావడం మరి అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ జ్ఞాన సంపదను సంపాదిస్తూనే వున్నాను.

" సంపద " అని ఎందుకు అన్నాను అంటే .. నేను గత 15 సంవత్సరాలుగా " వ్యాపారం చేస్తూ సంపాదించిన సంపద " కంటే ఈ రెండు సంవత్సరాల నుంచి సంపాదించిన " జ్ఞానసంపద " నాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది! నేను ఈ ధ్యానంలోకి రావడానికి ముఖ్యకారణం నా భార్య శ్రీమతి శైలజ.

గత జూలై నెలలో రాజమండ్రి మూర్తి గారి పిరమిడ్‌లో " శ్రీ చక్రా " మెడిటేషన్ క్లాసులు ఎనిమిది రోజులపాటు జరిగాయి. ప్రతిరోజూ ఈ క్లాసులకి నేను నా భార్య పిల్లలతో కలిసి వెళ్ళడం జరిగింది. ధ్యానంలో కూర్చున్న కొద్దిసేపటికి నేను ముందుకి తూలి పడిపోయినట్లు అనిపించింది. " అరె నేను పడిపోయానే ? " అని లేచి చూస్తే ధ్యానంలో వున్న నా శరీరం కనిపించింది. వెంటనే నాకు సూక్ష్మశరీరంయానం గురించి జ్ఞప్తికి వచ్చింది. అంటే " నా భౌతిక శరీరం నుంచి సూక్ష్మశరీరం వేరు అయింది అన్నమాట ! " అనుకున్న వెంటనే దూదిపింజలా తేలుతూ మాటలతో వర్ణించలేని చెప్పలేనంత ఆనందాన్ని అనుభవించాను!

కానీ " నేను నిజంగా ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నానా ! " అని నన్ను నేను ‘ చెక్ ’ చేసుకోవాలనిపించింది వెంటనే .. అలా అలా గాలిలో తేలుతూ పిరమిడ్ లోపలకి వెళ్ళాను .. ఏమైనా గుర్తులు పెట్టుకుందామని ! పిరమిడ్ లోపల ఒక కూర్చీలో కూల్‌డ్రింక్ బాటిల్ పెట్టి వుంది. అలాగే క్రిందకు వచ్చి చుస్తే అక్కడ ఒక టేబుల్ మీద పారాచూట్ కొబ్బరినూనె బాటిల్ వుంది.

" ఓకే " .. చెక్ చేసుకోవడం అయిపోయింది. మరుక్షణం నేను ఈ ప్రకృతిలో వున్న కొండలు, కోనలు, వాగులు, సెలయేరులు ఇలా నేను మనస్సులో అనుకున్న ప్రకృతిలోని అందాలన్నీ చూడగలిగాను. ఇలా 45 నిమిషాల పాటు ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని పొంది .. " పిరమిడ్‌కు వెళ్ళాలి " అనుకుని గాలిలో తేలుకుంటూ పిరమిడ్ దగ్గరకు వచ్చాను. అక్కడ నా శరీరం ధ్యానం చేస్తూ కనబడింది. నేను వెంటనే నా శరీరంలోకి మెల్లగా ప్రవేశించాను. అప్పుడు నాకు " ఓకే " అంటూ కల్పనామూర్తిగారి స్వరం వినిపించి మెల్లిగా కళ్ళుతెరిచాను.

నా మనస్సు, నా శరీరం ఒక ఉత్తేజకరమైన ఆనందాన్ని పొందుతున్నాయి. నేను వెంటనే పిరమిడ్ లోపలికి వెళ్ళి చుసాను. ఆ చైర్‌లో కూల్‌డ్రింక్ బాటిల్ వుంది ! అలాగే క్రిందకు దిగి చూస్తే టేబుల్ మిద ఆయిల్ బాటిల్ కూడా వుంది ! ఈ ఆనందాన్ని చవి చుసాక సృష్టిలో ప్రతి ఒక్కటీ నాకు ఆనందంగా కనిపిస్తుంది.

కాబట్టి ఫ్రెండ్స్ ! డబ్బులూ, ఆస్థిపాస్థులూ విపరీతంగా సంపాదిస్తూ మిమ్మల్ని మీరు మరచిపోకుండా .. ఇలా ధ్యానం చేసి ఇటువంటి ఆనందలోకాల్లో కాస్సేపు కూడా విహరించాలని కోరుకుంటున్నాను. ఇంతటి ఆనందం మనకు ధ్యానంలో తప్ప బయట ఎన్నికోట్లు ఖర్చుపెట్టినా దొరకదు గాక దొరకదు. ఈ ఆనందమయమైన జీవితాన్ని ప్రసాదించునటువంటి పరమ గురువు పూజ్యశ్రీ పత్రీజీ గారికి నా ధ్యానాభివందనాలు.

 

దివాన్‌జీ
రాజమండ్రి
సెల్ : +91 92466 58858

Go to top