" పత్రీజీ యొక్క సర్వవ్యాపకత్వాన్ని దర్శించగలిగాము "

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో " స్వాధ్యాయం " కోసం కృషి అద్భుతంగా చేసినవారు హైదరాబాద్ సీనియర్ మాస్టర్లు శ్రీ పాపారావు, శ్రీమతి ఆదిత్యకుమారి దంపతులు, అందమైన " 23 బ్రోచర్ల " సంకలనంతో వెలువడిన " ఆత్మజ్యోతి " ఫోల్డర్ ఎంతోమంది ధ్యానయోగులకూ, పిరమిడ్ మాస్టర్లకూ మరి క్రొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి ఎంతగానో మార్గదర్శకమైంది ! ఎంతోమంది ఈ బ్రోచర్స్‌ను బ్రహ్మర్షి పత్రీజీ యొక్క ఆధ్యాత్మిక ప్రిస్క్రిప్షన్‌గా స్వీకరించారు. " శ్రీ కృష్ణామృతం- ఉత్తరగీతాజ్ఞానసారం " పుస్తకం ఈ దంపతుల అమోఘ కృషికి నిదర్శనం. " నా చిరకాలవాంఛను నువ్వు తీర్చావయ్యా పాపారావ్ " అనే పత్రీజీ అభినందన వీరి కర్మలను దగ్ధం చేసింది " జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం " అనే శ్రీకృష్ణ సందేశం వీరి జీవితాల్లో స్పష్టంగా సాక్షాత్కారమైంది. ఈ పిరమిడ్ ఆదర్శ దంపతుల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం !

మారం శివప్రసాద్


మారం : " శ్రీకృష్ణామృతం - ఉత్తరగీత జ్ఞానసారం " పుస్తకం పట్ల పాఠకుల స్పందన ఏమిటి?

ఆదిత్యకుమారి : ఎక్కడెక్కడి నుంచి ఎన్నో ఫోన్లు. " ‘ ఒక ముహూర్తకాలం మనస్సును శూన్యం చేసి ధ్యానం చేస్తే చాలు, ఆత్మదర్శనం, ఆత్మానందం కలుగుతాయి, మనిషి దేవుడు కాగలదు ’ వంటి అద్భుత వాక్యాలు చదివి ధ్యానంలో సత్ఫలితాలు సాధించగలుగుతున్నాము " అని ఫోన్ చేసి చెప్పారు కొందరు. " గురుచరిత్ర పారాయణ చేసినట్లు క్రమం తప్పకుండా చేస్తున్నాను " అని మరొకరు చెప్పినప్పుడు నేను ఆనందాశ్చర్యాలలో మునిగిపోయాను.

విశ్వంలోంచి ఉత్తరగీతకు సంబంధించిన ప్రేరణలు అద్భుతంగా రావడం, మరి ఇందుకు నేనొక పరికరం అవడం నా అదృష్టం .. అంతే! ఈ శ్లోకాలనూ, వ్యాఖ్యానాన్నీ ఒక మాస్టర్ రికార్డ్ చేశారట ! పాడుతూ .. దాన్ని ఫోన్లో వినిపించారు నాకు ఇంతకంటే ఇంకేం కావాలి ? మా జన్మలు ధన్యమయ్యాయి.

పాపారావు : మేం చేసిన పనిలో ‘ ఉత్తరగీత ’ ఒక మాస్టర్ - పీస్. ఇంతవరకు పత్రీజీ చెప్పిన ఏ బ్రోచర్ అయినా .. మనస్సును ఆత్మలో లీనం చేసి మరీ చేయటం జరిగింది. పుస్తకం కూర్పులో మా మేడమ్ శ్రద్ధ తీసుకుంటే, ఆ పుస్తకం ప్రచురణ .. డిజైన్ పని నేను ఎక్కువగా చూస్తాను. " ఎలాంటి ఫోటోలు .. వేయాలి, ఎలాంటి పేపరు వాడాలి? ఎలాంటి కలర్ కంపోజ్ చేయాలి? " అనే పని ముఖ్యంగా నాది. ఆర్ట్ పేపర్‌తో పుస్తకం చూసి బ్రహ్మర్షి పత్రీజీ మహదానందపడ్డారు.

మారం : " శ్రీకృష్ణామృతం - శ్రీ మద్భగవద్గీతా విజ్ఞానసారం " అనే రాబోయే గ్రంథం గురించి వివరించండి !

ఆదిత్యకుమారి : ఉత్తరగీత పూర్తయిన తర్వాత ‘ వశిష్ఠామృతం ’ చేయాలని పత్రీజీ అన్నారు. నేను ఆ పనిలో పడ్డాను. అయితే ఈ సంవత్సరారంభంలో భగవద్గీతలో మన ధ్యాన జ్ఞాన యోగాలకు సంబంధించిన విశేషాంశాలను పత్రీజీ ఎన్నో సార్లు ప్రవచించారు. వాటినన్నిటినీ సంకలనంచేసి ఒక పుస్తకరూపంగా తీసుకురావాలని పత్రీజీ ఆకాంక్షించారు. మే 1 తేదీ నుంచి ఈ పనిలో వున్నాం. పత్రీజీ బోధించినవీ, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో భాగంగా ఉన్నవీ ఒక వంద శ్లోకాలు ఇందులో పొందుపరచడం జరిగింది.

పాపారావు : భౌతిక జీవితంలో మరి ఆధ్యాత్మిక జీవితంలో వచ్చే ఏ సందేహానికైనా ఈ " శ్రీ కృష్ణామృతం - భగవద్గీతా విజ్ఞానసారం " లో సమాధానం దొరుకుతుంది. " నిత్య జీవితంలో భగవద్గీతా విజ్ఞానసారం " లో సమాధానం దొరుకుతుంది. " నిత్య జీవితంలో భగవద్గీతను ఏ రకంగా ఆచరించవచ్చు " అనే దాన్ని పత్రీజీ ఎన్నోసార్లు తమ ప్రవచనాల్లో మనకు అందించారు.

మారం : " ధ్యానమాతృత్వం " బ్రోచర్ ఎలా తయారు చేసారు ?

ఆదిత్యకుమారి : " ధ్యానమాతృత్వం " బ్రోచర్ తయారు చేయమని పత్రీజీ చెప్పినప్పుడు మా కుటుంబ సమస్య నాకు బాగా గుర్తుకు వచ్చేది. అవగాహనా రాహిత్యల వల్ల కుటుంబాలకు .. కుటుంబాలే నాశనం అవుతున్నాయి. వాటికి మూలకారణం వెతుకుతూ వెనక్కి వెళితే అంతా తిరిగి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ మూల సిద్ధాంతానికే వస్తుంది. సరియైన పెంపకం తెలియని ఒక స్త్రీ ధ్యానం చేస్తూ, గర్భవతి అయిన తరువాత క్రమంతప్పక ధ్యానం చేస్తూ వుంటే, ఎదిగిన వ్యక్తిత్వం ఉన్న పిల్లలు పుడతారు. ఎంతో గొప్ప గుణాలు కలిగి ఉంటారు .. ఒక వ్యక్తి ఎంత గొప్ప జీవితాన్ని మలుచుకుంటాడు అనే మూలం తల్లి లోంచే వస్తుంది.

పుట్టే పిల్లలు చక్కటి సక్రమమైన దారిలో ఉంటే సమాజంలో ఇప్పుడు జరిగే మోసాలూ, ఘోరాలూ, అకృత్యాలూ ఏవీ ఉండవు కదా " అంటూ " ధ్యానమాతృత్వం " బ్రోచర్ వ్రాస్తున్నప్పుడు నాలోని ఆరు సంవత్సరాల వేదన అంతా బయటికి వచ్చింది. " నేను పడిన వేదన ఇతరులు పడవలసిన అవసరంలేని తరాలు .. గర్భవతులైన తల్లులందరూ ధ్యానం చెస్తే వస్తాయి " అని వాటిని తయారుచేసాము. " అజ్ఞానంతో అల్లకల్లోలమయ్యే కుటుంబాలూ, మరి వేదనలుపడే కుటుంబాలూ అందరూ .. ధ్యానయోగులుగా ఎప్పుడు మారుతారు ? " అనే ఉద్వేగం నాలో చోటు చేసుకుంది వ్రాస్తున్నప్పుడు.

మారం : పత్రీజీ అందించిన ఈ మార్గంలో ఇప్పుడు మీరు మీ స్వస్థితికి చేరుకున్నట్లు భావిస్తున్నారా ?

ఆదిత్యకుమారి : నేను పూజలు చేసీ, మంత్ర దీక్షలు చేసీ పొందిన ఎన్నో మంచి ఫలితాలు అనేక సంస్థల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి కారణభూతమయ్యాయి. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మూవ్‌మెంట్‌కు వచ్చి బ్రహ్మర్షి పత్రీజీని కలిసిన తర్వాత ఇక నా వెతుకులాట ఒక కొలిక్కి వచ్చింది. " ఇంత సుళువైన పద్ధతి, ఇంత పెద్ద కాన్సెప్ట్ ఇంక ఎక్కడా లేదు " అని బోధపడింది .. అర్థమైన తర్వాత " పూర్తిగా విలువలేని నన్ను .. నేనే ఉద్ధరించుకోగలను " అని ఎక్కడాలేని ధైర్యం నాకు వచ్చేసింది. " లక్ష పేజీలు అక్కర్లేదు .. ఒక్క ‘ ధ్యానాంద్రప్రదేశ్ ’ పుస్తకం ప్రతి నెలా చదివితే చాలు " అని నాకర్థమయింది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు నేను సర్వం ఋణపడి వున్నాను! నా స్వస్థితిని నేను ఇక్కడ పొందగలిగాను అని గర్వంగా చెప్పుకుంటూ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ యొక్క ఋణాన్ని ఈ బ్రోచర్ ద్వారా పుస్తకాల ద్వారా తీర్చుకునే అవకాశం ఇచ్చారు పత్రీజీ.

పాపారావు : మా మేడమ్, నేను, మా చిన్నబ్బాయి గత ఆరేళ్ళుగా ఎంతో ఒత్తిడికి గురి అయి " మా జీవితాలను కోల్పోతామా ? " అనే స్థితిలో మమ్మల్ని ఆదుకున్నదీ, ఆదరించిందీ మరి అక్కున చేర్చుకున్నదీ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ మరి బ్రహ్మర్షి పత్రీజీ! మరి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు మమ్మల్ని చక్కగా గైడ్ చేయడంతో ఎప్పుడూ వర్తమానంలో జీవించడం మాకు అలవాటైంది.

మా ముగ్గురిపై ఉన్న అన్ని కేసులు ఎత్తివేసినప్పుడు, మా కర్మలు దగ్ధమయ్యాయని పత్రీజీ వ్యాఖ్యానించినప్పుడు, నన్ను పాపారావు కాదు " పుణ్యారావు " అని పత్రీజీ అన్నప్పుడు కలిగిన అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను !

ఆదిత్యకుమారి : బ్రహ్మర్షి పత్రీజీలో నేను " సర్వవ్యాపకత్వాన్ని " చవి చూశాను.. మరి దర్శించాను. నేను సాంప్రదాయకమైన గురువునూ, దైవాన్నీ నమ్ముతూ వచ్చినదాన్ని. నా చిన్నతనం నుంచి నేను దేనినైతే నమ్మానో ఆ గురువూ, దైవమూ " బ్రహ్మర్షి పత్రీజీ " లో నేను సంపూర్ణంగా చూశాను. నేను " గురుచరిత్ర " చదివేటప్పుడు ఒకసారి పత్రిసార్ మా ఇంటికి వచ్చి " మేడమ్! ఎందుకు నన్ను పిలిచారు ? " అని అడిగారు. " మిమ్మల్ని పిలిచేటంత స్థాయి నాకెక్కడిది సార్! మీరు వస్తే ఆనందం " అన్నాను.

గురుచరిత్ర చదివి దత్తాత్రేయుల వారికి నన్ను నేను నివేదించుకున్నప్పుడు " నీ గురువు పత్రీజీ " అని దత్తాత్రేయులవారు నాకు తెలియజేయడమే పత్రీజీ మా ఇంటికి రావడం మరి " నన్నెందుకు పిలిచారు మేడమ్ ? " అని అడగడం .. బ్రహ్మర్షి పత్రీజీ సర్వవ్యాపకత్వానికి నిదర్శనం !

పుణ్యారావు : " ఉత్తరగీత " పుస్తకం సంకలనం సమయంలో కూడా ఇలా ఎన్నోసార్లు నాలో నేను అనుకుంటున్నది పత్రీజీ నోట్లోంచి రావడం జరిగేది. పత్రీజీ లాంటి గురువు సమీప సాంగత్యం మనకు లభించడం మన అదృష్టం! పత్రీజీని కలిసిన ప్రతిసారీ .. ఏదో ఒక జ్ఞాన పెన్నిధి లభిస్తుంది. ఆ మధ్య నేను నా స్వవిషయాల మీద పడి ఒక మూడు నాలుగు నెలలు వారి దగ్గరకు వెళ్ళకపోతే, పత్రీజీ స్వయంగా ఫోన్ చేసి " ఏమయ్యా పుణ్యారావు! కనపడడం లేదు .. ఒకసారి వచ్చి వెళ్ళు " అన్నారు. మరి గురువు గారి తలపుల్లో మేం వుండడం ఎంతటి భాగ్యం !

మా కేసు విషయంలో ఒక తప్పు సాక్ష్యం చెప్పిన ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు ఊళ్ళో లేడు అని నిరూపించలేక పోయినందువల్ల కోర్టులో మేం దోషులుగా ఆరోపింపబడ్డాం. అయితే కాకతాళీయంగా రైల్వేశాఖలోని ఒక వ్యక్తి మాకు తటస్థించడం, అతడికి మేం ధ్యానం చెప్పడం .. మరి అతడు ధ్యానంలో ఆనందం పొంది .. మాటల్లో మా కేసు గురించిన వివరాలు వినడం, " ముఖ్యసాక్ష్యం చెప్పిన వ్యక్తి ఆ రోజు ఊర్లో లేకపోయినా ఉన్నట్లు సాక్ష్యం చెప్పాడు " అని నేననడం జరిగింది.

" ఒక వేళ ఆ వ్యక్తి ట్రైయిన్‌లో ఎక్కడికైనా ప్రయాణం చేసాడేమో " అని ఆ రైల్వే ఉద్యోగి ఆ ఖచ్చితమైన దినంలో ట్రావెలింగ్ ఛార్ట్‌నూ, తన పలుకుబడినీ ఉపయోగించి ఆ వ్యక్తి పేరు సీట్ బోగీ నెంబర్ చూసి " ఆ ముఖ్యసాక్షి ఆ రోజు ఊళ్ళోనే లేడు " అని ఋజువు చేసాడు. " కేసు తప్పుదారిలో వుంది " అని క్రింది కోర్టు జడ్జి మమ్మల్ని విశ్వసించి కేసు కొట్టేయడం జరిగింది.

ఇదేదో " కథలో " జరిగినట్లున్నా .. ధ్యాన మహిమ వల్ల మా జీవితంలో జరిగిన సత్యం. ఇదంతా ధ్యాన ప్రచారమహిమే ! ఒక్కరికి ధ్యానం చెప్పడం వల్ల ఇంత మేలు జరిగి మా జీవితాలు ఉద్ధరింపబడ్డాయి. " ధ్యాన ప్రచారం వల్ల కర్మలు దగ్ధమవుతాయి " అన్న పత్రీజీ ప్రవచనం అర్థమైందా ?!

ఆదిత్యకుమారి : " భగవద్గీత " పూర్తయిన తర్వాత " వశిష్ఠగీత " ఆ తర్వాత " ఉపనిషత్‌సారం " చెయ్యమన్నారు పత్రీజీ. ఇక గారపాటి లలితా మేడమ్ " శ్రీకృష్ణామృతం -ఉత్తరగీతాజ్ఞానసారం " పుస్తకాలు 500 ప్రతులు అమెరికాలోని తెలుగు వారికి పంపారు.

మా పెద్దబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేసి ఈ పుస్తకాన్ని " నేను ఇంగ్లీషుల్లో స్వయంగా అనువాదం చేస్తాను " అన్నాడు. ఇంతకన్నా భాగ్యం ఏముంది!

మారం : ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సందేశం

ఆదిత్యకుమారి : ధ్యానమార్గంలో కోకొల్లలుగా ప్రయోజనాలు పొందుతూ ప్రయాణిస్తున్న మన ధ్యానులు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ గురించి అందరికీ తెలియజేయడానికి " ధ్యానాంధ్రప్రదేశ్ " మ్యాగజైన్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

పుణ్యారావు : పత్రీజీ " శ్రీ శైలం ధ్యానమహాయజ్ఞం " లో స్వాధ్యాయం యొక్క ప్రాధాన్యతను మరింత నొక్కి వక్కాణించడం జరిగింది. స్వాధ్యాయం కోసం మా దంపతులం చేసిన చేస్తున్న బ్రోచర్స్, బుక్స్ ధ్యాన ప్రచారం మహాయజ్ఞంలో వుపయోగపడుతుండడం మాకెంతో ఆనందం. ప్రతి ధ్యాని తన ధ్యాన ప్రచారంలో " స్వాధ్యాయం " యొక్క ఉపయోగాన్ని తెలియజేయాలి.

Go to top