" నా కంటే నా కర్తవ్యమే గొప్పది "

 

నా పేరు లక్ష్మీరాణి. నేను గత కొన్ని సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలో నాకు కొన్ని అద్భుత సందేశాలు రావడం మరి వాటిని నేను మీ అందరితో పంచుకోవడం నా అదృష్టం! ఈ ‘ నేను ’ ని తెలుసుకున్న నేను నిర్వహించే కర్తవ్యమే " స్వధర్మ నిర్వహణ ". స్వధర్మ నిర్వహణలో ఉన్నవారంతా ఆనందాల హరివిల్లులో విహరిస్తున్న వాళ్ళే. తాత్కాలిక ఒడిదుడుకులు వారిని కదిలించ లేవు. పైపైన అలజడి వున్నా లోపల పరమ శాంతంలో ఉంటారు.

ఎవరైతే ‘ స్వధర్మ ’ నిర్వహణలో ఉన్నారో, వారే వేరొకరికి నిత్య సత్యాన్ని సుస్పష్టం చేయగలరు. అంతర్ముఖం అయిన ఆత్మ మాత్రమే తన స్వంత ధర్మాన్ని తెలుసుకోగలదు మరి ఆత్మ యొక్క అనుభవాన్ని రుచి చూడగలదు; తన కర్తవ్యాన్ని ప్రేమించగలదు; మరి " నా కంటే నా కర్తవ్యమే గొప్పది " అని తెలుసుకోగలదు. పొరుగు వారికి సత్యం తెలియజేయడం కన్నా ఆ ఆత్మకు వేరే ఇతర పని రుచించదు. ఆ ఆనందంలోనే తృప్తి చెంది " లోకాన్ని ఉద్దరించాలి " అన్న సత్ సంకల్పంతో, తన శ్రేయస్సునీ, ప్రేయస్సునూ నిలుపుకుంటూ ముందుకు సాగుతుంది .. మరి ఇలాంటి వారి సాంగత్యంలోనే అది నివాసం కోరుకుంటుంది.

ఆత్మ తన అనుభవ జ్ఞానాన్ని నిత్యం పొందుతూ, పరమ పురుషార్థాన్ని తెలుసుకుంటూ, అనునిత్య జ్ఞానార్జనలో సంయమనం చెందుతుంది. మన కర్తవ్యమే మనలను నడిపిస్తుంది. శరీరానికీ, మనస్సుకూ అక్కడ తావు లేదు. జ్ఞాన సముపార్జనతో అది ముందుకు సదా వెళ్తూనే వుంటుంది. ప్రాణాన్ని సైతం పణంగా పెట్టగల ధైర్యం స్వధర్మ నిర్వహణలో వుంటుంది; మరి ధైర్యం, పట్టుదల, మనోనిశ్చలత, నైపుణ్యం, ప్రేమ, సమత్వం ప్రస్ఫుటంగా మనలో గోచరిస్తూ వుంటాయి.

లోకోపకారమే పరమ ధర్మంగా మనం వేసే ప్రతి అడుగుకూడా ఆనందాయకమే! ఆ ఆనందామృతంలో సాధన - బోధన, ఆట-పాట, పొగడ్త-అవమానం, సమానత్వం-ఏకత్వం, యోగం-వియోగం అంతా అభివృద్ధి పథమే.

 

J. లక్ష్మీరాణి
రాజమండ్రి

Go to top