" నా సమస్యే నాకు ధ్యాన బహుమతిని ఇచ్చింది "

 

నా పేరు ఆదినారాయణ. నేను 2008 ఏప్రిల్‌లో ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానంలోకి రాకముందు .. ఒక బ్యాంకు దివాళా తీయడం వల్ల నేను ఆర్థికంగా దెబ్బతిన్నాను. దాంతో నా జీవితంలో ఒక అయోమయ పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన ఆలోచనలతో .. తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైన తరుణంలో నా పాలిట కల్పవృక్షంలా నాకు ధ్యాన మార్గం దొరికింది. ఈ ధ్యానం నేను భీమవరంలో శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారి దగ్గర .. వారు చెప్పే మూడు రోజుల క్లాసులకు వెళ్ళి నేర్చుకున్నాను.

అప్పటికి నేను పక్కా మాంసాహారిని. ఎప్పుడైతే మూడు రోజులు క్లాసులకు వెళ్ళానో .. " నేను ఇకనుంచి మాంసాహారం తీసుకోను " అని ప్రమాణం చేసుకున్నాను. ఇక పూర్తిగా మాంసాహారం మానివేసి.. ప్రతిరోజూ రాఘవరావు గారు చెప్పినట్లు క్రమం తప్పకుండా పిరమిడ్‌లో ధ్యానం చేయడం మొదలుపెట్టాను. కొన్నాళ్ళకు నాలో వున్న ఒత్తిడి, భయం తగ్గిపోయి.. ముఖ్యంగా నన్ను నేను తెలుసుకున్నాను. " నేను దేహాన్ని కాదు.. ఆత్మను! ఈ భూమి మీద కనిపించేవన్నీ అశాశ్వతం. నా ఆత్మ ఒక్కటే శాశ్వతం " అని తెలుసుకున్నాను.

ఏది జరిగినా నా మంచికే అన్నట్లు .. నిజంగా ఆర్థిక సమస్య అన్నది రాకపోతే ఇంతటి ఆనందమయ ధ్యాన మార్గం నాకు దొరికేది కాదు కదా. " ఒక చెడు ఎప్పుడూ ఒక మంచికే " అని నా జీవితంలో తెలుసుకున్నాను.

అలాగే నెల నెలా వచ్చే మన " ధ్యానాంధ్రప్రదేశ్ " పత్రికను చదివి.. అందులోని అద్భుతమైన విషయాలను అవగాహన చేసుకునేవాడిని. ధ్యానాంధ్రప్రదేశ్‌లో వచ్చే ప్రతి విషయం అద్భుతం! నాలో వచ్చిన ఈ మార్పును చూసి నా భార్య గౌరి, నా పిల్లలు నవ్య. రామంజనేయులుతోపాటు మొత్తం మా కుటుంబం అంతా ధ్యానంలోకి వచ్చి.. పూర్తిగా శాకాహారులుగా మారి.. మాది ధ్యాన కుటుంబం అయింది.

అలాగే ఆగస్టు నెలలో కొవ్వాడ గ్రామంలో.. పిరమిడ్ జరిగిన " అఖండ ధ్యానం " లో 41రోజులు, 24 గం||లు మా కుటుంబం మొత్తం క్రమం తప్పకుండా పాల్గొని అద్భుతమైన ఆత్మానందాన్ని పొందాము.

మా ఊరిలో ధ్యాన ప్రచారం మొదలుపెట్టి ఎందరికో ధ్యానం గురించి చెప్తూ.. ధ్యానం క్లాసులకు తీసుకెళ్తున్నాను. ఈ దేహాన్ని నాకు తల్లిదండ్రులు ఇస్తే, ఈ దేహానికి ఆత్మజ్ఞాన తల్లిదండ్రులు శ్రీ తటవర్తి వీర రాఘవరావు గారు, శ్రీమతి రాజ్యలక్ష్మి గారికి మరి ఈ ప్రపంచాన్ని ధ్యానమయంగా చేయడానికి కంకణం కట్టుకున్న మన ప్రియతమ బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మ ప్రణామాలు.

 

ఆదినారాయణ
భీమవరం, ప.గో.జిల్లా
సెల్ : +91 99483 78733

Go to top