" ధ్యానంతో నా కర్మ కాలిపోయింది "

 

నా పేరు నరసింహరాజు. మా స్వగ్రామం ప||గో||జిల్లా. " వీరవాసరం". నేను వృత్తిరీత్యా శ్రీశైలం దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేసి 2008 వ సంవత్సరం జనవరి 31 వ తేదీన పదవీ విరమణ చేసాను. అప్పట్నుంచి భిమవరంలో నివాసం వుంటున్నాను.

2009 సం|| జూలై నెలలో హైదరాబాద్ కూకట్‌పల్లిలో వుంటున్న నా మేనకోడలు " దుర్గావాణి " ఇంటిలో 11 రోజుల ధ్యాన యజ్ఞంలో ఆనాపానసతి ధ్యాన అనుభవాలకు ఆకర్షితుడనై .. నిత్యం ధ్యానం చేస్తున్నాను. భీమవరంలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి దుర్గావాణి చేపట్టిన " 41 ఇళ్ళలో ధ్యానం " తరువాత " 41 గ్రామాలలో ధ్యానం " మరి ప్రస్తుతం " 7 రోజుల సప్తాహ ధ్యానం " కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం, అదృష్టం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా వుంది!

2010 వ సంవత్సరం ఆగస్టు నెల 25 వ తేదీన భీమవరంలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ తటవర్తి వీరరాఘువరావు గారి ఇంటిలో బ్రహ్మర్షిపత్రీజీ గారిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఆ సందర్భంలో పత్రీజీ తన జీవితం గురించి చెపుతూ .. చేతి ఐదు వేళ్ళు చూపించి .. " చిటికెన వ్రేలు 1970 -80 సం||వరకు ఆధ్యాత్మిక పరిశోధనా పర్వం గానూ, ఉంగరం వ్రేలు 1980-90 ఆధ్యాత్మిక పరిసాధనా పర్వం గానూ, మధ్యవేలు 1990-2000 సం||వరకు ఆధ్యాత్మిక పరివిప్లవ పర్వం గానూ .. అంటే పూజలు వద్దనటం, మాంసాహారం వద్దనటం, కట్టుబాట్లు, ఆచారాలకు దూరం కావాలని చెపుతూ " ఎందరివో జంధ్యాలు ‘ కట్ ’ చేసేసాను ; కొందరు అది చూసి పరిగెత్తుకుంటూ పారిపోయేవారు " అని చెపుతున్నారు.

అది వింటూన్న నేను " నాకు జంధ్యం వున్న విషయం ఆయనకు చెప్పాలా ? వద్దా ? " అనే సంశయంలో వుండగానే పత్రీజీ వెనక్కివాలి .. అక్కడ కూర్చున్న నా వైపుకు వంగి.. నేను వేసుకున్న టీ షర్టు గుండీ తీసి దానిలోంచి లోపల వున్న బనియన్‌లో చెయ్యి దూర్చి మరీ బనియన్ లోపల ఏ మాత్రం బయటకు కనపడే అవకాశం లేని నా జంధ్యాన్ని బయటకు లాగి " కత్తెర పట్టుకురండయ్యా " అంటూ అందరూ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపు దాన్ని " కట్ " చేసి బయటకు తీసి నా చేతిలోపెట్టి " దాన్ని ఎక్కడ పారేయవద్దు భద్రంగా జాగ్రత్త చేసుకో! ఇవ్వాళ నీ ఖర్మ కాలి నా ముందు కూర్చున్నావయ్యా అన్నారు!!

వాస్తవానికి మనలోని కర్మలు మనం తీసుకోలేకపోతే అవి కూడా ఆయన ప్రత్యక్షంగా ఇలా దగ్ధం చేసి మరీ మన పురోగమనానికి తోడ్పడుతున్నారనే ఈ అపూర్వమైన సంఘటన .. నా ఈ జన్మలో ఎప్పటికి మరువలేని ఒక ముఖ్య అనుభవంగా నా హృదయంలో ముద్ర వేసింది!!

భీమవరం చుట్టుప్రక్కల గ్రామాలలో .. ధ్యాన ప్రచారం కోసం నేను ఒక మారుతి వాన్‌ని సమకూర్చుకున్నాను. " బ్రహ్మర్షి పత్రీజీ ఒక్కసారైనా మా వాహనంలో ప్రయాణిస్తే బాగుండు " అని నేను అనుకుంటూండగానే సార్ " మీ వాహనంలో వస్తాను " అని చెప్పటం మరి ఆ వాహనంలో కూర్చుని ప్రయాణం చేస్తూ " నీ డ్రైవర్ కమ్ క్లీనర్ ఉద్యోగం బాగుందయ్యా! ఇవ్వాళ నీ ఖర్మ కాలి నా దగ్గర కూర్చున్నావు " అని మళ్ళీ అనటం నా జీవితంలో మరపురాని ముఖ్య సంఘటనలలో ఒకటి!! ఈ సంఘటనలు చూసాక.. " నా మనస్సులోని విషయాలు కూడా గ్రహించిగలిగిన పత్రీజీ నిజంగా గ్రేట్ " అని అర్థమైంది.

 

దండు నరసింహరాజు
వీరవాసరం
పశ్చిమ గోదావరి జిల్లా

Go to top