" పత్రీజీ మాకు ప్రాణప్రదాత "

 

నా పేరు రాఘవమ్మ. మా కుటుంబమంతా 2007 నుంచి ధ్యానం చేస్తున్నాము. ధ్యానంలోకి రాకముందు నాకు విపరీతమైన తలనొప్పి వుండేది. ఏదో ఒక క్షణాన నా తల నాలుగు ముక్కలుగా పగిలి పోతుందనిపించేది. ధ్యానంలో మాస్టర్స్ కనబడి నా తలలో " ఆస్ట్రల్ సర్జరీ " చేసారు! మరి అప్పటి నుంచి నా తలనొప్పి మటుమాయమయ్యింది ! ఒకసారి అతితీవ్రమైన జ్వరంతో పాటు విపరీతమైన వణుకు వచ్చి శవ స్థితిలో పడి వున్న నేను .. మా ఇంట్లో వున్న 4'X4' పిరమిడ్ క్రింద ధ్యానంలో కూర్చున్న కాస్సేపటికే ఎంతో స్వస్థత పొందాను.

ఇంకొకసారి తెలంగాణ, ఆంధ్ర సమస్య మొదలైన రోజులలో విజయవాడ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాం. మధ్యలో దాదాపు వంద మంది కర్రలు పట్టుకువచ్చి కొందరు" కొట్టండి, చంపండి " అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ మా కారుని ఆపివేసారు. అంత భయాందోళన సందర్భంలో కూడా మా అమ్మాయి ధ్యానంలో కూర్చుంటే పత్రీ సార్ కనబడి " ఏం కాదు .. కారు స్టార్ట్ చేసి నెమ్మదిగా పోనిమ్మను; నేను చూసుకుంటాలే " అన్నారట! ఆమె ఈ మాట చెప్పగానే మేము కారు కదిలించాము. అప్పటి వరకు అరిచిన వారందరూ నిశ్శబ్దంగా ప్రక్కకు తొలగి మాకు దారి ఇచ్చారు!!

హైదరాబాద్ వచ్చే లోపు దారి పొడుగునా ఆందోళనకారులు ఎన్నో కార్లు ఆపారు కానీ .. మా కారు మాత్రం ఎవ్వరూ ఆపలేదు. ఇక మేం ఏ ఇబ్బంది లేకుండా హైదరాబాద్ మీదుగా శ్రీశైలం ధ్యానయజ్ఞానికి వెళ్ళాము. ఇలా పత్రీజీ మనల్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంటారని అర్థమయ్యింది.

మా ఇంటి పైన 10'X10' రూఫ్ టాప్ పిరమిడ్ కట్టగా సార్ 17.9.2010న దయతో వచ్చి దానిని ప్రారంభం చేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా దాదాపు మూడు గంటలు మా ఇంట్లోనే ఎంతో సరదాగా గడిపారు!

ఇంకోసారి మా కుటుంబం, ఓల్డ్ బోయిన్‌పల్లిలోని నాగభూషణం గారు అనిత కుటుంబంతో కలిసి పిల్లాజెల్లాలతో నాగార్జున సాగర్ బయలుదేరాం. బయలుదేరిన కాస్సేపటికే హఠాత్తుగా వెలుగోడు దగ్గర మా కారుకి పెద్ద ఆక్సిడెంట్ అయ్యింది. ఆ శబ్దానికి మేమందరం కళ్ళు తెరచి చూస్తూండగానే .. మా సఫారీ కారు ఎగిరి మూడు పల్టీలు కొట్టింది. అయితే నాలో ఏ విధమైన భావవేశాలు లేవు. భయం గానీ, ఖంగారు గానీ లేకుండా .. నిశ్శబ్దంగా ఉండిపోయాను. " చనిపోతే చనిపోతాం, పత్రీజీ వున్నారు " అనుకుని " పత్రీజీ " అని మాత్రం అన్నాను. అదే టైంలో పిల్లలతో సహా మా ఎనిమిది మంది నోటివెంట " పత్రీజీ ఉన్నారు " అనే మాట మళ్ళీ మళ్ళీ రావటం జరుగుతూనే ఉంది. పిల్లలు కూడా అరవటం కానీ, ఏడవటం కానీ లేదు.

ఇంతలోనే మా కారు గాలిలో ఎగిరి .. ప్రక్కనే ఉన్న లోతు అయిన గొయ్యిలో పడిపోయింది .. మరి మా కారు డోర్లు ఊడిపోయి మేమంతా అక్కడక్కడ పడిపోయాం. మేం పడిన చోట ఎన్నో పదునైన మేకులు, గాజు పెంకులు, పెద్ద పెద్ద తేళ్ళు ఉన్నాయి. అయినా ఎవ్వరికీ చిన్నపాటి గాయం కూడా కాలేదు! కనీసం ఒక్కరికి అయినా ఒక్కచోట కూడా గీరుకోకుండా మమ్మల్ని మృత్యువు నుంచి తప్పించిన పత్రీజీ మాకు ప్రాణప్రదాత .. మరి మాకు పునర్జన్మను ప్రసాదించిన పుణ్యమూర్తి!

" జనన మరణ దుఃఖ సాగరమున నుంచి పరమపదం చేర్చు గురువరుండు నిత్య సత్యంబైన ప్రత్యక్ష దైవంబు " అన్న బ్రహ్మం గారి వాక్కులకు నిజమైన నిర్వచనం పత్రీజీ !

ఇటువంటి ఉత్తమోత్తమైన సద్గురువు సమక్షంలో .. వారికి సమకాలికులుగా ఉండటం మనందరి మహాద్భాగ్యం. ఆయనతో కలిసి ధ్యాన ప్రచారం చేసుకుంటూ మన జీవితాలను ధన్యం చేసుకుందాం

 

రాఘవమ్మ
సికింద్రాబాద్
ఫోన్ : +91 98480 49554

Go to top