" ‘నేను కూడా దైవమే’ అని తెలుసుకున్నాను "

 

నా పేరు ప్రసన్నలక్ష్మి. నేను 2008 జనవరి నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానంలోకి వచ్చిన నెలరోజులలోపు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి వున్న ఆస్త్మా, తలనొప్పి వంటి ఆరోగ్యసమస్యలు సంపూర్ణంగా తగ్గిపోయాయి. నా చిన్నతనం నుంచి నాలో ఎన్నో ప్రశ్నలు వుండేవి. వాటికి సమాధానాల కోసం వెతుకుతున్నాను. " మనం ఎక్కడి నుంచి వచ్చాము? భూమి మీద ఎందుకు పుట్టాము? దేవుడిని పూజించటం వల్ల ఏమీరాదు, ప్రకృతిలో ఏదో శక్తి వుంది " అనిపించేది. " భూమి మీద కొంతమంది ధనవంతులుగా, పేదవారిగా, నల్లగా, తెల్లగా, పొట్టిగా, పొడువుగా .. ఇలా ఎందుకు పుడుతున్నారు? " లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ధ్యానంలోకి వచ్చిన తరువాత తెలుసుకున్నాను. నేను 6 వతరగతి చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి కలలో .. నేను దేవతగా, మరి గర్భగుడిలో నా విగ్రహాని పెట్టి పూజిస్తున్నట్లుగా .. చూసుకున్నాను. ధ్యానంలోకి వచ్చిన తరువాత అసలు " నేను కూడా దైవమే " అని తెలుసుకున్నాను.

ధ్యానంలోకి రాకముందు నేను షిరిడి బాబాకి పూజలు చేస్తూండేదాన్ని. బాబా ఎప్పుడూ "నిరాకారంగా ధ్యానం చెయ్యి" అని చెప్పేవాడు. " ఇది ఎలా సాధ్యం? " అని ప్రశ్నించేదాన్ని. సమాధానం మన గురువు బ్రహ్మర్షి పత్రీజీ చెప్పిన "ఆనాపానసతి" అని మూడు సంవత్సరాల తరువాత తెలిసింది..నాకు ధ్యానం తెలిసిన రోజు నుంచి నా ఫ్రెండ్స్‌కీ, తెలిసినవారికీ, తెలియనివారికీ, అందరికీ చెప్తూండేదాన్ని. ధ్యానం చేసిన తరువాత నాకు నా జీవితం మీద చక్కటి అవగాహన పెరిగింది. అప్పటినుంచి నిజమైన ఆనందాన్ని అనుభవించాను. నా చుట్టూ ఉన్నవారి జీవితంలోని మార్పులను కూడా గమనిస్తూ అందరి నుంచీ అన్ని విషయాలు నేర్చుకున్నాను.

నా ధ్యానజీవితం హైదరాబాద్, వనస్థలిపురంలోని "108 పిరమిడ్ ధ్యానస్థలి" లో ప్రారంభమైంది. ప్రతిరోజూ అందులో ధ్యానం చేస్తే వుండే ఆ ఆనందం చెప్పలేనిది. 108 శ్రీనివాసరావు గారు, విజయశారద మేడమ్ గారు, వారి అమ్మాయి దేదీప్యలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు! వారి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆధ్యాత్మికంగా నేను ఎదగటానికి వారు చేసిన సహాయం మరువలేనిది!

నేను ధ్యానంలోకి వచ్చిన మూడు నెలలకు నా జీవిత భాగస్వామి ఎవరో ధ్యానంలో తెలుసుకున్నాను. ఆ తరువాత నా జీవితంలో ఎన్నో మార్పులు " నా జీవిత భాగస్వామి ఉస్మానియా యూనివర్సిటీలో Ph.D.చేస్తోన్న కిరణ్‌కుమార్" అని నాకు తెలిసిన కొద్దిరోజులకే కిరణ్‌కి కూడా ధ్యానంలో మాస్టర్స్ వచ్చి చెప్పటం మరి గతజన్మల్లో మేము split souls అనీ ఇద్దరం పిరమిడ్‌ల గురించి తెలుసుకుంటూ పిరమిడ్ శక్తిని ఎక్కువగా ఉపయోగించుకునేవాళ్ళం అనీ తెలిసింది. 2010, ఏప్రిల్ 7 వ తేదీన హైదరాబాద్ బిర్లా ప్లానెటోరియమ్‌లో సాక్షాత్తూ భగవంతులు బ్రహ్మర్షి పత్రీజీ చేతులమీదుగా మా వివాహం జరగడంతో మా ఇద్దరి జీవితాలు ధన్యమైపోయాయి.

నేను జిల్లా పరిషత్ హైస్కూల్ హయత్‌నగర్‌లో కంప్యూటర్ టీచర్‌ని. మా స్కూల్లో విద్యార్థులకి పిరమిడ్ తయారీ నేర్పించినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇంకా ఎక్కువగా విద్యార్థులకు, గృహిణులకు పిరమిడ్ శక్తి గురించి తెలియజెయ్యాలి .. మరి అందరూ పిరమిడ్ శక్తిని విరివిగా ఉపయోగించుకోవాలి.

మా స్కూల్లో ఒక విద్యార్థిని " టీచర్! నాకు కడుపులో నొప్పి వస్తుంది; డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ధ్యానం చేస్తే తగ్గిపోతుందా?" అని అడిగింది. నేను వెంటనే cap pyramid చేసి ఎలా ఉపయోగించుకోవాలో చెప్పి ఇచ్చాను. రెండురోజుల తరువాత క్లాస్‌రూమ్‌లో విద్యార్థులందరి ముందు " ధ్యానంచేసి కడుపునొప్పి తగ్గించుకున్నాను " అని చెప్పింది. అప్పటినుంచి విద్యార్థులందరూ ఖాళీసమయంలో ఎక్కువగా ధ్యానం చేస్తున్నారు. చదువులో కూడా వాళ్ళ చురుకుదనం పెరిగిందని మిగతా టీచర్లు అభిప్రాయంపడడం ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తోంది.

 

K. ప్రసన్నలక్ష్మి
హైదరాబాద్
సెల్ : +91 98482 57422

Go to top