" సంకల్పబలంతో .. ఛాంపియన్ అయ్యాను "

 

నా పేరు కుసుమ నేహ గాంధీ. నా వయస్సు 11 సంవత్సరాలు. మా ఊరు విశాఖపట్నం. నేను మా తండ్రిగారైన ‘మాధవ్’ ద్వారా మార్చి 2008 లో ఆనాపానసతి ధ్యానం నేర్చుకున్నాను. నేను శ్రీ ప్రకాష్ విద్యానికేతన్‌లో చదువుకుంటున్నాను. నేను మా స్కూలులో 135 మంది విద్యార్థులకు మా అమ్మ ఆధ్వర్యంలో ధ్యానం నేర్పించాను. ఎక్కువగా కోపగించుకునే మా తెలుగు టీచర్‌కి కూడా ధ్యానం నేర్పించడం వల్ల ఆవిడ కోపం తగ్గింది. దాంతో మా స్కూల్లో పిల్లలందరం ఆవిడతో ఎంతో స్నేహంగా వుంటున్నాము. నేను కూడా నా చిరాకు తగ్గించుకున్నాను. పెద్దవారు ఎప్పుడైనా కోపగించుకున్నా, " అది మన మంచికోసమే " అని అర్థమవ్వడం మొదలైంది.

నాకు ధ్యానం క్లాసులకు హాజరు అవడమన్నా, ధ్యానయజ్ఞాలలో పాల్గొనడమన్నా చాలా ఇష్టం. భీమవరంలో శ్రీ తటవర్తి వీరరాఘవరావు అంకుల్ ఆత్మజ్ఞాన శిక్షణా తరగతులకు హాజరు అయ్యాను. బెంగళూరు మెగా పిరమిడ్‌లో నాకు బుద్ధుడు, శ్రీ కృష్ణుడు, జీసస్ మొదలైన మాస్టర్స్ కనపడ్డారు మరి నా ఒంటిమీద వున్న చిన్నగాయాలకు హీలింగ్ చేసారు. వారి ఆశీర్వాదాలు కూడా అందుకున్నాను.

2009 జూలైలో వైజాగ్‌లో జరిగిన సంగీత ధ్యానయజ్ఞంలో పైమా వారి ఒకానొక నాటకంలో నేను హీరో యొక్క చిన్ననాటి పాత్రను పోషించాను. అప్పుడు పత్రీజీ మా మీద ప్రశంసలజల్లు కురిపించారు. ఆ సమయంలో సార్ ప్రక్కన నేను స్టేజిమీద చాలాసేపు వున్నాను. సార్ నాతో కరచాలనం చేసి, నన్ను హత్తుకుని "అదరగొట్టేశావ్" అన్నారు. ఆ సమయంలో నా శరీరంలోకి అత్యంత అద్భుతమైన శక్తిప్రవాహం జరిగింది. ఇదొక అద్భుతమైన అనుభవం.

ధ్యానంతో పాటే చదువు : మా అమ్మ పేరు ‘శ్రీలక్ష్మి’. ఆమె మా ఇంట్లో " శ్రీ కుసుమహర పిరమిడ్ ధ్యానశిక్షణ కేంద్రం " ను 2009 జూన్‌లో మొదలుపెట్టింది. ఇందువలన మా అమ్మ చాలా బిజీగా అయిపోయింది. నన్ను మా అమ్మ దగ్గరుండి చదివించడం కుదిరేది కాదు. కాబట్టి నా అంతట నేనే చదువుకోవడం మొదలుపెట్టాను. మరి నా తల్లిదండ్రుల పర్యవేక్షణలో మరింత చక్కగా ప్లాన్ చేసుకుని చదువుకుని మంచి మార్కులు తెచ్చుకోగలిగాను. నా వయస్సులో వున్న, మరి నాకన్నా ఎక్కువ వయస్సు ఉన్నవారు కూడా ట్యూషన్స్ మీద ఆధారపడుతున్నారు కానీ నేను బాగా చదువుకుంటున్నానంటే అది ధ్యానం వలనే కదా !

సంకల్పశక్తి - ఛాంపియన్ కప్ : నేను మా అమ్మ ద్వారా " సేత్‌విజ్ఞానం " గురించి కొంత తెలుసుకున్నాను. నేను సంకల్పశక్తిని ప్రాక్టికల్‌గా ఉపయోగించాలనుకున్నాను. నేను 2010 ఫిబ్రవరిలో Abacus లో National లెవల్‌ ‘ ఛాంపియన్ కప్’ కోసం చెన్నై వెళ్ళాను. ఈ పోటీలో మూడు నిమిషాలలో 75 లెక్కలు చెయ్యాలి. పోటీకి వెళ్ళేముందు ధ్యానంలో కూర్చుని నాకు ఛాంపియన్ కప్ వచ్చేసినట్టూ, నేను ఎంతో ఆనందిస్తున్నట్లూ, నన్ను అందరూ మెచ్చుకుంటున్నట్లూ ఎమోషనల్‌గా ఫీలవుతూ ఒక సంకల్పాన్ని విడుదల చేసాను. ఆ సంకల్పం భౌతిక ప్రపంచంలో ఫలించడానికి కావలసిన ధ్యానశక్తిని పంపించాను. అలాగే కాంపిటీషన్‌కి ప్రాక్టీస్ కూడా బాగా చేసాను.

అంతే! " ఓ ధ్యాని ఓ సంకల్పాన్ని విడుదల చేస్తే సాధించలేనిది ఏదీలేదు " అని నిరూపిస్తూ 500 మందిలో నాకు ‘ఛాంపియన్ కప్’ వచ్చింది. సేత్ మాస్టర్ చెప్పినట్టు సంకల్పబలాన్ని ఎంత అద్భుతంగా ఉపయోగించవచ్చో నా అనుభవం ద్వారా ఋజువైంది. అప్పటినుంచి నేను అందరికీ నా జీవితానుభవం గురించి చెపుతూ, సంకల్పశక్తి ప్రాముఖ్యత గురించి విశదీకరిస్తున్నాను.

చివరగా ఒక మాట. ధ్యానం చేసే తల్లిదండ్రుల పెంపకం ఎంత బాగుంటుందో చూస్తునారుగా. దీనినిబట్టి మీకేం అర్థమయ్యింది? ధ్యాన కుటుంబమే అదృష్టమైన కుటుంబమని కదా! ఇదే నేను అందరికీ చెప్పాలనుకున్నది కూడా. మీరు ధ్యానం చేయండి. అందరిచేతా చేయించండి. ఇంతగొప్ప జీవితాన్ని ప్రసాదించిన ధ్యానానికి మరి బ్రహ్మర్షి పత్రీజీకి వందనాలు.

 

కుసుమ నేహ గాంధీ
విశాఖపట్నం
సెల్ : +91 99494 62228

Go to top