" గుజరాత్‌లో ధ్యానప్రచారం "

 

నా పేరు కామాక్షి. నేను సికింద్రాబాద్ లోని ఓల్డ్ బోయిన్‌పల్లిలో వుంటాను. నాకు ఆగస్ట్ 2009 లో పిరమిడ్ మాస్టర్ కృష్ణ గారి కుటుంబం ద్వారా ధ్యాన పరిచయం జరిగింది. ఆ రోజు నుంచి రోజూ ధ్యానం చేసుకుంటూ క్లాసులకు హాజరవుతున్నాను. చిన్నతనం నుంచీ నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ పోతూ వుండేవి. " దీనికంతటికీ మూలమైన శక్తి ఏదో వుంది " అనిపించేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత " ఆ శక్తే విశ్వశక్తి " అని తెలిసింది.

ధ్యానం చేసిన తర్వాత జీవితం .. మనకు పునర్జన్మ లాంటిది. నేను మొదట పిరమిడ్ ఆదర్శసూత్రాలు 18 గురించి చదివి, అవగాహన చేసుకుని ఆచరించడం మొదలుపెట్టాను. ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత నా జీవితం చాలా అద్భుతంగా సాగుతోంది. మొదటి క్లాసులోనే నాకు బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. ఒకరోజు శ్రీ రాజసింహారెడ్డి గారు నిర్వహించే క్లాసుకి వెళ్ళినప్పుడు శ్రీ రావుల అంజయ్య గారు అమావాస్య, పౌర్ణమి రోజులలో ధ్యానం చేస్తే చాలా అద్భుతంగా వుంటుందని చెప్పారు. నేను వెంటనే అమలులో పెట్టాను. ధ్యానం చేసేకొద్దీ నాకు ముందుగా జరగబోయే విషయాలు తెలిసేవి.

మొదటిసారిగా బ్రహ్మర్షి పత్రీజీని 2009 ఆగస్ట్ 15 న కడ్తాల్‌లో చూసాను. ఆ సమయంలో గురువుగారు వర్షం కోసం సంకల్పం పెట్టించి ధ్యానం చేయించారు. ధ్యానం చేస్తూన్నప్పుడే వర్షం రావడం ప్రారంభమైంది. ఆ రోజు నేను పొందిన ఆనందం వర్ణనాతీతం.

" గురువు గారి చుట్టూ తిరిగితే ఏమీ రాదు; గురువు చెప్పింది చేయాలి, ఆచరించాలి " అని ఒక పిరమిడ్ మాస్టర్ చెప్పగా విని " ఏదైనా ఒకటి సాధించి, అప్పుడు మాత్రమే గురువు గారిని కలవాలి " అనిపించింది. ఒకసారి క్లాసుకి వెళ్ళినప్పుడు శ్రీమతి స్వర్ణమాల పత్రి మేడమ్ గుజరాత్‌లో ధ్యానప్రచారం గురించి చెప్పారు. " ఈ మాటలు నా కోసమే చెబుతున్నారు " అనిపించింది.

వెంటనే " గుజరాత్‌లో ధ్యానప్రచారానికి నేను వస్తాను " అని నా పేరు ఇచ్చాను. చెప్పిన పదిరోజుల లోపు గుజరాత్‌కి వెళ్ళాను. మొదటిసారిగా రీటా మేడమ్, కిషోర్ గార్లతో కలిసి మహాత్మాగాంధీ జన్మస్థలం అయిన పోర్‌బందర్ లో ధ్యానప్రచారం ప్రారంభించాను. మొదటిసారి మార్చి 16 న రీటా గారు పత్రిసార్‌తో నన్ను ఫోన్‌లో మాట్లాడించారు. నాకు చాలా ఆనందం వేసింది.

మేము పోర్‌బందర్ నుంచి అహ్మదాబాద్‌కు వెళ్ళాలి. అనుకోకుండా కారు బుద్ధ కేవ్స్ వైపు వెళ్ళింది. ఒక అరగంట ధ్యానం చేసి బయలుదేరుదాం అన్నారు. కానీ రెండుగంటలసేపు ధ్యానం చేసాము. అక్కడ ఎంతో ఎనర్జీ వుంది. ఓషో, బుద్ధ మాస్టర్ కనిపించి విస్తృతంగా ధ్యానప్రచారం చేయమని చెప్పారు.

సతీష్, వెంకటస్వామి. నేను ముగ్గురం కలిసి సూరత్ లో ఒక కాలనీలో ప్రచారం చేస్తూన్నప్పుడు ఒక వ్యక్తికి ధ్యానం గురించిన కరపత్రం తీసుకోవడం ఇష్టంలేక మమ్మల్ని వెళ్ళిపొమ్మనాడు. మేము వెళ్ళకపోయేసరికి మూడు పెద్ద కుక్కలను మాపైకి వదిలివేసాడు. మేము ఎటూ కదలక కళ్ళు మూసుకుని అలాగే ధ్యానం చేయడం మొదలుపెట్టాము. అవి మా వైపు పరుగెత్తుతూ వచ్చి అరవకుండా కరవకుండా అలా కూర్చున్నాయి. అది చూసి వాటి యజమాని ఆశర్యపోయి మా దగ్గరకు వచ్చి " మీరు చెప్పేదాంట్లో ఎంతో గొప్పతనం వుంది " అని లోపలికి పిలిచి కూర్చోమని చెప్పారు. ధ్యానం గురించి తెలుసుకుని .. " మీ గురువు గారు ఎంతో గొప్పవారు " అన్నారు. ఇక ఆ రోజు నుంచి అతను కూడా ధ్యానం చేస్తూ చక్కగా ధ్యానప్రచారం చేస్తున్నాడు.

మరొకరోజు ధ్యానప్రచారంలో సూరత్‌లోని బెజాన్‌వాలా కాంప్లెక్స్ కి వెళ్ళాము. అందులో పదహారు బ్లాకులు మరి ఒక్కొక్క బ్లాక్‌కి ఏడు అంతస్థులు వుంటాయి. అక్కడకు వెళ్ళాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. పదహారుమంది వాచ్‌మెన్‌లు వుంటారు. కానీ మేము ఒక్కొక్క బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరూ లేకపోవడం మేము ఏడు అంతస్థులు ఎక్కి ఇంటి ఇంటికీ ధ్యానప్రచారం చేశాము. పదహారు బ్లాక్‌లు 1 గంట 40 నిమిషాలలో పూర్తిచేశాము. ఇదంతా కూడా ధ్యానం యొక్క మహిమ.

ఒకరోజు సూరత్‌లో డాబా పైన పడుకుని అలా ఆకాశం వైపు చూస్తూ వున్నాం. అప్పుడు తెల్లవారుజామున 3.00గం|| 40 ని||ల ప్రాంతంలో చాలా పెద్దవి తొమ్మిది తెల్లని పక్షులు కనిపించాయి.

రీటా మేడమ్ " నవసారి " అనే కేర్ సెంటర్ ప్రారంభం చేయమని చెప్పారు. సెంటర్ ప్రారంభం చేసి మరుసటి రోజు పౌర్ణమి ధ్యానం కూడా చెయించాము. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు వారందరూ ధ్యానప్రచారం చేస్తున్నారు.

గుజరాత్ ధ్యానప్రచారం నా జీవితంలో మధురాతి మధురమైన అనుభూతి. నా జీవితం ఈ ప్రచారం తర్వాత ఎంతో అద్భుతంగా వుంది. ఈ అవాకాశాన్ని ఇచ్చిన గురువు గారికి కృతజ్ఞతలు.

 

P.కామాక్షి
ఓల్డ్ బోయిన్‌పల్లి
సెల్ : +91 93940 44006

Go to top