" కొన్ని లక్షలమందికి ధ్యానం నేర్పించి వుంటాను "

 

వైజాగ్ పిరమిడ్ మాస్టర్ " శ్రీమతి తాడి వీరజగదీశ్వరి " గారు పూర్తి సమయం ధ్యానప్రచారం చెసే మహిళా మాస్టర్లలో ప్రప్రథమస్థానంలో వుంటారు! తన 47వ ఏట ధ్యానంలోకి వచ్చిన శ్రీమతి వీరజగదీశ్వరి .. " నా దుఃఖానికి కారణమై, ఆ తరువాత ధ్యానయోగిగా మారిన నా భర్త వెంకటరెడ్డి గారే నా గురువు " అంటూ తన దుఃఖాన్ని ధ్యానం ద్వారా పూర్తిగా తొలగించుకుని జీవన్ముక్తి మార్గంలో పయనిస్తున్నారు. అడిగిన వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చిన వీరికి నా కృతజ్ఞతలు.

మారం శివప్రసాద్


మారం : వీరజగదీశ్వరి గారూ ! ఆత్మప్రణామాలు! మీ గురించి వివరించండి!

వీరజగదీశ్వరి : మా స్వగ్రామం .. మరి మావారు తాడి వెంకటరెడ్డిగారిది కూడా .. " గొల్లలమామిడాడ (తూ.గో) ". ఇద్దరు కుమారులు రామ్‌కుమార్‌రెడ్డి, విజయకుమార్‌రెడ్డి. కోడళ్ళు శ్రీదేవి, కళ్యాణి. ఇద్దరు మనుమరాళ్ళు స్నిగ్ధ, జ్ఞానద. ఇదీ నా కుటుంబం.

ఆరవతరగతి చదువుకుంటూండగానే .. నాకు 9 సం|| వయస్సు ఉన్నప్పుడే .. పెళ్ళి చేసారు. చదువు ఆగిపోయింది. 1975 లో మా కుటుంబం విశాఖపట్నంలోని " గాజువాక " కు వచ్చేశాం. జమీందారీ కుటుంబం మావారిది. మా అత్తగారు సీతాయమ్మ మా వారి చిన్నవయస్సులోనే మరణించారు. మా మామగారు తాడి రామారెడ్డి గారు మావారిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలవాట్లు కూడా అలాగే బాగా అబ్బాయి!

నేను ధ్యానంలోకి రావడానికి కారణం అంతులేని దుఃఖం; అందుకే నా దుఃఖమే నా మొదటి గురువు! నా ధ్యాన వైభవానికి కారణం దుఃఖం. ధ్యానసాధన ద్వారా " నా దుఃఖానికి కారణం నా అజ్ఞానం " అని తెలుసుకున్నాను.

కావడానికి జమీందారీ కుటుంబం. డబ్బుకు లోటు లేదు. కానీ ఏ మాత్రం జీవితంలో ఆనందం లేదు. నాకు 47 సం|| వయస్సు వచ్చేవరకు ఏడవని రోజేలేదు. నా భర్త వెంకటరెడ్డి గారు స్వతహాగ మంచివారు. నన్ను ఏరికోరి ఇష్టపడి పెళ్ళిచేసుకున్నారు. నా దుఃఖానికి కారణం వారి ద్వారా తెలుసుకుంటేనే బావుంటుంది. మావారు తన అనుభవాన్ని అందరికీ తెలియజేస్తూ వుంటారు. చాలా ‘ ఓపెన్ ’ గా వుంటారు. ఏమీ దాచుకోరు !

మారం : వెంకటరెడ్డి గారూ ! మీరు చెప్పండి మరి మీ శ్రీమతి వీరజగదీశ్వరి గారి అంతులేని దుఃఖానికి కారణం ఏమిటి ? ఆ దుఃఖం నుంచి ఆమె ఎలా బయటపడింది?

వెంకటరెడ్డి : నేను, మా చిన్నమేనమామ సమవయస్కులం కావడం వల్ల ఆయన సాన్నిహిత్యంతో నాకు అన్ని దురలవాట్లూ అబ్బాయి! " సరికాదు " అని తెలిసినా .. చిన్నప్పటి అలవాట్లను నేను మానుకోలేక పోయాను. నా భార్యను చాలా బాధపెట్టాను. ఆమె ఎంతో ఓర్పుతో సహించేది. ఒకసారి నా భార్య విపరీతంగా ఏడ్చింది సహించలేక, " నేను ఇంకొక పెళ్ళి చేసుకుంటాను నువ్వుండలేకపోతే; ఉంటే వుండు లేకపోతే పో " అన్నాను ; తట్టుకోలేక " మరిణించాలి " అనుకుంది.

అయితే ధ్యానం ఆమె జీవితాన్ని మేలు మలుపుతిప్పింది! 2005 నుంచి .. నేను నా భార్య ద్వారా తెలుసుకున్న ధ్యానం వల్ల నా పద్ధతులన్నీ మార్చుకున్నాను! నా భార్యను ధ్యాన ప్రచారానికి ఎక్కడికైనా పంపుతున్నాను. ఆమెకు ప్రత్యేకంగా ఒక కారు కొనిచ్చాను. ఆమె చాలా పుస్తకాలు వ్రాసింది. అవన్నీ ప్రచురింపజేసి ఉచితంగా లక్షలపుస్తకాలు అందజేశాం ధ్యాన ప్రపంచానికి " ధ్యానతరంగం " పుస్తకాలు దాదాపు నాలుగున్నరలక్షల పుస్తకాలు పంచాం!

మారం : మేడమ్! మీరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కి రాకముందు దుఃఖం పోగొట్టుకోవడం కోసం ఏమేం చేశారు? ఎక్కడైనా ఓదార్పు, శాంతి లభించిందా ?

వీరజగదీశ్వరి : చిన్నప్పటి నుంచి మా అమ్మ వల్ల గొప్పభక్తి కలిగింది నాకు. ఎన్ని పూజలు! ఎన్నెన్ని స్తోత్రాలు! ఎన్నెన్ని జపాలు! 108 పూలతో రోజూ పూజలు, 1000 పూలతో పూజలు, 1000 నామాలతో కుంకుమార్చనలు, ప్రతి పౌర్ణమికీ రుద్రాభిషేకాలు! ఏ కష్టం కలిగినా పురోహితులవారికి చెప్పుకోవడం, వేలకు వేలు ఖర్చు పెట్టి గృహశాంతులు, జపాలు, దానాలు చేయించడం. " ఎన్ని చేసినా అశాంతి తొలిగేది కాదు ; కష్టాలు అలాగే వున్నాయి ; ఏమిటి పరిష్కారం ?? " అని మా పురోహితులువారిని అడిగితే " ఎలా జరగాలో అలాగే జరుగుతూ వుంటుంది " అన్నారు. " మరెందుకు ఈ జపాలు ? మరెందుకు శాంతులు, పూజలు, అర్చనలు, దానాలు ? " అని అడిగితే .. " ఇది ఉపశమనం, ఉపశాంతి " అన్నారు.

వేదవ్యాస విరచిత భాగవతం చదవడం వల్ల నాకు తృప్తి కలిగింది. మరణం అనే ఆలోచన నుంచి దూరమయ్యాను. 1990 నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ప్రారంభించాను. శ్రీ వేదవ్యాస, IAS, వారు వ్రాసిన పుస్తకాలు ఒకటొకటి చదవడం మొదలుపెట్టాను. 1996 నుంచి పుస్తకసేకరణ, మరి పిరమిడ్ ధ్యానంలోకి రాకముందే కొన్ని పుస్తకాలు వ్రాసి ప్రచురించి పంచడం జరిగింది. ఒక్కొక్కటి వేయి ప్రింటింగ్ చేయించి పంచడం మొదలైంది. ఆ తర్వాత ‘ SSY ’, ‘ AMC ’, ‘ ప్రాణిక్‌హీలింగ్ ’, ‘ MMY ’, ‘ క్రియాయోగం ’, ‘ విపస్సన ’ .. ఈ విధంగా ఎన్నెన్నో చేసి 12-2-2000 న మా వదిన చంద్రావతి గారి ద్వారా బుద్ధప్రబోధిత ఆనాపానసతి ధ్యానంలోకి రావడం జరిగింది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి వచ్చిన తర్వాతనే నాకు అంతులేని ప్రశాంతత, ఆనందం .. కలిగాయి.

మారం : పత్రీజీని మొదటిసారి ఎప్పుడు ఎక్కడ కలిశారు ?

వీరజగదీశ్వరి : 2000 సం||లోనే బ్రహ్మర్షి పత్రీజీ పరిచయం కలిగింది. 24-8-2000 లో గాజువాకలో మా ఇంటిపైన 9'X9' సైజు రూఫ్‌టాప్ పిరమిడ్‌ని వారు ప్రారంభిస్తూ " లక్షలమంది ఇక్కడ కలుస్తారు, ధ్యానం చేస్తారు ; ధ్యానప్రచారం చేసి ముక్తిమార్గంలో ప్రయాణిస్తారు, తరిస్తారు " అని చెప్పారు. అంతకుముందు మా కుటుంబస్నేహితులు మురళి గారి ద్వారా బ్రహ్మర్షి పత్రీజీ గురించి, పిరమిడ్స్ గురించి విన్నాను. శ్రీ P.V. రెడ్డినాయుడు గారి ఇంటికి వెళ్ళడం, వారి ఇంటిపైన పిరమిడ్ చూడడం, పులకరించడం జరిగింది. ఎందుకంటే అంతకుముందే, ఆ పిరమిడ్ చూడకమునుపే, ధ్యానంలో ఇదే ధ్యానమందిరాన్ని బంగారు రంగులో నేను దర్శించాను!

ధ్యానం ద్వారా నేను జీవించే కళను తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న సత్యాన్ని, తద్వారా నేను పొందిన ఆత్మానందాన్ని అందరికీ తెలియజేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. మేడపైన నిర్మించిన ఈ చిన్న పిరమిడ్, వచ్చినవారికి స్థలం సరిపోవడంలేదని మా మేడ క్రింద రెండు అంతస్థులను " పిరమిడ్ కేర్ సెంటర్ " గా మార్చి ఉపయోగిస్తున్నాం. ఒక రూమ్ లైబ్రెరీగా, మరి రోజూ ధ్యానం క్లాసులు, సీనియర్ మస్టర్స్‌తో వారం వారం ధ్యానం క్లాసులు, ప్రతి నెల 6,7,8 తేదీలలో " మూడురోజుల ధ్యానశిబిరాలు " నిర్వహిస్తున్నాం ! మరి " ఇదీ సరిపోవడంలేదు " అని ఒక మెగా పిరమిడ్ గాజువాకలో కానీ, విశాఖలో మరెక్కడైనా కానీ నిర్మించాలని మావారు పూర్తి ఇష్టంతో పట్టుదలతో ప్రయత్నిస్తున్నారు. మరి రెడ్డినాయుడు గారి యొక్క ఇతర పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకార సంకల్పాలతో ఇది కూడా త్వరలో నెరవేరబోతోంది!

" శ్వాస మీద ధ్యాస " ద్వారా రోజురోజుకూ నా మీద నాకు గమనిక పెరిగింది. ధ్యానం నుంచి లేచేసరికి మనస్సు ప్రశాంతంగా వుండేది. ఆ ప్రశాంత స్థితి నుంచి నాలో ఎన్నో మార్పులు మొదలయ్యాయి .. నా ఆలోచనలో, మాటలలో, చేతలలో ! సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో తెలిసింది. నాలో ఓర్పు, సహనం వల్ల నా చుట్టూ ఉండేవారినీ, పరిస్థితులనూ సమగ్రంగా అర్థం చేసుకోవడం ప్రారంభమైంది. ధ్యానసాధన వల్ల పొందిన జ్ఞానం ద్వారా ప్రతిక్షణం నాకెదురైన ప్రతిఒక్కరి నుంచి, ప్రతి సంఘటన నుంచి, కష్టసుఖాల నుంచి నేను మరింత జ్ఞానాన్ని పొందుతున్నాను.

" నాకు దుఃఖాన్ని కలిగించిన నా భర్తా, నా సమస్యలూ, జరిగిన సంఘటనలూ .. అన్నీ, అందరూ కూడానూ నాకు గురువులే " అని తెలుసుకున్నాను. అంతఃశోధన వల్ల .. " నేను తెలుసుకున్న జ్ఞానం అణువంత .. మరి తెలిసింది సముద్రమంత " అని అర్థమైంది. దుఃఖం నుంచి ధ్యానంలోకి వచ్చి .. ఆత్మానందం అనే బహుమతిని అందుకోవడం వల్ల నా జీవితగమనమే పరిమారిపోయింది.

ధ్యానసాధన వల్ల నాలో సహనం, భరించే శక్తి, అవగాహనా శక్తి పెరిగింది. ప్రతి సమస్యకూ అంతకుముందు విపరీతంగా కృంగిపోయేదాన్ని. ఇప్పుడు ఆ సమస్యలే నన్ను చూసి భయపడుతున్నాయి ! అలాగే నాలోని కళలు మేల్కొన్నాయి. అమ్మా నాన్న ఎంత బలవంతం చేసినా సంగీతం నేర్చుకుని నేను ఇప్పుడు పాటలు కూడా పాడుతున్నాను!

నలుగురిలో మాట్లాడడమంటే మొహమాటపడేదాన్ని నేను. ధ్యానసాధన మొదలుపెట్టిన తర్వాత, పత్రీజీ నన్ను స్టేజీ మీదకు పిలిచి నా అనుభవం చెప్పమన్నారు. తెలిసింది చెప్పాను. ఆ తర్వాత పత్రీజీతో " సార్ నన్ను స్టేజీ మీదకు పిలవకండి .. నాకు మాట్లాడడం రాదు .. నేను అస్సలు చదువుకోలేదు " అన్నాను. అప్పుడు బ్రహ్మర్షి పత్రీజీ " నీ గురించి నీకు తెలియదు ! నాకు తెలుసు ! నువ్వు ఇండియాలోనే కాకుండా, ప్రపంచదేశాలలో కూడా ధ్యానం చెబుతావు " అన్నారు. అక్షరాలా అలాగే నా జీవితంలో జరిగింది.

అన్నవరం ధ్యానయజ్ఞంలో " వీరజగదీశ్వరి మేడమ్ ! మీరు విదేశాలకు వెళ్ళి ధ్యానం చెప్పవలసిన సమయం ఆసన్నమైంది ; మీరు మలేషియా, సింగపూర్ వెళ్ళి ధ్యానం చెప్పండి " అన్నారు నాతో " నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు సార్ " అన్నప్పుడు " తెలుగులోనే మీరు అక్కడి తెలుగువారికి చెప్పండి ; వారు ఇతరులకు చెపుతారు. మీ ద్వారా మరి మీ ద్వారా విన్నవారి ద్వారా ప్రపంచ భాషలన్నిటిలో ధ్యాన వైభవం అందుతుంది " అన్నారు పత్రీజీ. వారు చెప్పిన తర్వాత 2007 లో మలేషియాలో 16 క్లాసులు, సింగపూర్‌లో 9 క్లాసులు నేను ఇతర మాస్టర్లతో కలిసి నిర్వహించాము!

ఆస్ట్రేలియాలో కూడా ధ్యానప్రచారం చేశాను ! భాష రాకపోయిన ఇంగ్లీషు, హిందీ పుస్తకాలు, కరపత్రాలు పంచాను. తెలుగులో పంచిన పుస్తకాలు, పాంప్లెట్లు వేలు, లక్షలు. ఇతర భాషలవారికి పక్కనున్నవారితో క్లాసులు చెప్పించాను.

ఇంటి బాధ్యతలతోపాటు ధ్యానప్రచారం, కేర్ సెంటర్ బాధ్యతలు, " ధ్యానగ్రామీణం " బాధ్యతలు, " ధ్యానవిద్యార్థి " ప్రాజెక్టు, " ధ్యాన ఆరోగ్య " ప్రాజెక్టు .. ఇలా నా దినచర్య ఏ క్షణానికి ఆ క్షణం పూర్తిగా, సంపూర్ణంగా సత్యవినియోగమవుతోంది ! ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా ఎలా జీవించాలో .. ఆచరణాత్మకంగా చూపించి నేర్పిస్తూంటారు పత్రీజీ ! ఆయన మార్గమే నా మార్గం !!

మారం : మీరు అత్యంత ఆనందాన్ని పొందిన సందర్భం, మీరు చేయాలని అనుకున్న అత్యంత గొప్పపని .. ఈ రెండూ వివరించండి !

వీరజగదీశ్వరి : మా సెంటర్ " విశ్వవిజ్ఞాన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ " మరి " శ్రీకృష్ణా పిరమిడ్ ధ్యానకేంద్రం " అవతరించి తొమ్మిది సంవత్సరాలు అయిన సందర్భంలో " నవవసంతోత్సవం " 9-9-2009 న బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో జరిగి వేలాదిమంది హాజరయ్యారు ఈ ధ్యాన సభకు!

ఆధ్యాత్మిక, సేవా రాజకీయతత్పరుల తత్వసందేశాలతో, పైమా సంగీత నృత్య ఝురిలో హరిహరాదులు సైతం పరవశించే విధంగా జరిగిన పిరమిడ్ ధ్యాన నవవసంతోత్సవం .. నా జీవితంలో నాకు పరవశాన్ని, పరమానందాన్ని ఇచ్చిన దివ్యసందర్భం !

" విశాఖలో మెగా పిరమిడ్ నిర్మాణం చేయాలి ’ అనే సంకల్పం ఆచరణలో పెట్టడానికి ఇది సరియైన సమయం " అని మా దంపతులకు అర్థమైంది. మేము చేయాలని అనుకున్న అతిగొప్ప పని ఇది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇంకా పెద్ద మెగా పిరమిడ్ రావాలి.

పత్రీజీ మహాసంకల్పాలు " 2012 కంతా ధ్యానజగత్ ", 2016 కల్లా పిరమిడ్ జగత్ ", " 2020 కల్లా శాకాహార జగత్ " .. ఈ వైనంలో, ప్రపంచమంతా ఒక " ధ్యానమహావంశవృక్షం " గా మార్చారు బ్రహ్మర్షి పత్రీజీ. ఇందులో మనమంతా శాఖోపశాఖలం !

మారం : మరి మీ విస్తృత ధ్యానప్రచారంలో మీ రక్తబంధీకుల నుంచి, స్నేహితులు, బంధువుల నుంచి ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ? ఒక జమీందారీ కుటుంబ ఇల్లాలిగా మీకు చాలా ప్రతిబంధకాలే వచ్చి వుంటాయే !

వీరజగదీశ్వరి : అవును! చాలా చాలా ఇబ్బందులే ఎదురయ్యాయి మా బంధుమిత్రుల నుంచి! ఎంతోమంది మా వారికీ, మా అబ్బాయిలకీ ఫోన్ చేసి " మన పరువు, మర్యాద ఏమైపోతుంది ? మన పెద్ద కుటుంబాల్లో ఆడవాళ్ళు ఇంట్లో వుండి కుటుంబాన్ని గమనించుకోవాలి; బయటకు వెళ్ళకూడదు " అంటూ వాపోయారు.

అయితే మా వారు అస్సలు పట్టించుకోలేదు; నాకు పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు. " ధ్యానం చేసి మేం ఎన్నో మంచి ఫలితాలను పొందాం; నేనెంతో మారాను, నా అలవాట్లు మానుకున్నాను, ధ్యానం చేయండి మీరు కూడా " అని మా వారు వాళ్ళకు చెప్పారు. ఇక మా అబ్బాయిలు " ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో మా అమ్మకు మేం చెప్పాలా? ఆమెకు అన్నీ తెలుసు ! అమ్మ అన్నీ పర్‌ఫెక్టుగా చేస్తుంది ! " అని నన్ను పూర్తిగా సమర్థించారు.

ధ్యానసాధన ద్వారా నా అంతఃసౌందర్యాన్నీ, ఆత్మయొక్క పరమశక్తినీ, సామర్థ్యాన్నీ, నాలోని విశిష్టతనూ గుర్తించి, తదనుగుణంగా నాలోని భావాలను అర్థం చేసుకుంటూ, నా అత్యున్నత జీవితలక్ష్యం పై మరింత దృష్టిని కేంద్రీకరించగలిగాను. నా హృదయం నుంచి ఉప్పొంగిన సంకల్పాలను స్వచ్ఛంగా, నిర్దిష్టంగా, సమర్థవంతంగా ఆచరించ గలుగుతున్నాను, అమలు చేయగలుగుతున్నాను. ఎన్ని కష్టనిష్టూరాలు ఎదురైనా, నా సంకల్పాలను ఆచరణలో పెడుతూన్నప్పుడు నా జీవితం ప్రేరణతో, ఉత్సాహంతో నిండిపోతోంది. బాహ్యంలో వున్నదానికంటే నాలో వున్న దివ్యచైతన్యం చాలా అద్భుతమైనదనీ, విలువైనదనీ తెలుసుకున్నాను. " ప్రతిఒక్కరిలో వున్న ఆ దివ్యచైతన్యాన్ని అందరూ గ్రహించాలి " అనే తపనతో ధ్యానప్రక్రియను అందరికీ పరిచయం చేస్తున్నాను.

నేను మౌనంలో ఉన్నప్పుడు నాలో కాంతి వ్యాపించడం, ఏదో స్ఫురిస్తూ వుండడం, మాటలలో వివరించలేని అనుభూతి పొందడం మరి నాకు కావలసిన సమాధానాలన్నీ నాలోనే వున్న పరమసత్యం నుంచే అందుతున్నాయనీ నాకు స్పష్టమైంది.

నేను ఒక అడుగు ముందుకువేస్తే, ఎన్నో అడుగులు నన్ను నడిపించే బ్రహ్మర్షి పత్రీజీ మరి ఎంతోమంది ఆస్ట్రల్ మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ తమ తమ సహాయసహకారాలను నాకు అందించడం అంతా చాలా అద్భుతంగా, ఆశ్చర్యంగా జరిగిపోతోంది !

ధ్యానసాధన, బోధన ద్వారా నేను మరొకరికంటే ఉన్నతస్థితికి ఎదగడంలో గొప్పతనం ఏమీలేదనీ, నాలోని ‘ ప్రాత నేను ’ కంటే, రోజురోజుకూ ఉన్నతంగా ఎదుగుతూన్న ‘ క్రొత్త నేను ’ చాలా గొప్ప " అని తెలుసుకున్నాను. మరి " ఈ జ్ఞానాన్ని ఎందరికో అందరికీ అందజేయడమే ఇంకా ఉన్నతజ్ఞానం పొందే మార్గం " అని తెలుసుకున్నాను.

మారం : మీరు గ్రామాల్లో చేసిన ధ్యానప్రచారం గురించి చెప్పండి !

వీరజగదీశ్వరి : నేను వేలకొద్దీ గ్రామాల్లో ధ్యానప్రచారం చేశాను. ప్రతిరోజూ మూడు, నాలుగు గ్రామాలు తిరిగి ధ్యానప్రచారం చెస్తూ వుంటాను! తిరిగిన ప్రతి గ్రామంలోని, పట్టణంలోని ప్రతి ఇంట్లో, గుళ్ళళ్ళో, బళ్ళళ్ళో, రచ్చబండల వద్ద, పొలాలలో, ఆఫీసుల్లో, బస్సుల్లో, ట్రెయిన్‌ల్లో ధ్యానం చెప్పడం, చెప్పడం ! ఇంతే!

లక్షలమందికి ధ్యానం నేర్పించి వుంటాను. మేం ముద్రణ చేయించి పంచిన పుస్తకాలు చదివినవారు అందులో అడ్రస్ చూసి ఉత్తరాలు వ్రాస్తూ వుంటారు. ఆ ఉత్తరాలు చదువుతూ వుంటే ఎంత ఆనందమో ! ఎన్నో పిరమిడ్లు నిర్మింపబడ్డాయి, ఆయా ఊళ్ళల్లో చేసిన ధ్యానప్రచారం వల్ల. త్వరలో నేను ధ్యానప్రచారం చేసిన ఊళ్ళలో వివిధ మాస్టర్ల్ అనుభవాలు, పిరమిడ్ వివరాలను పుస్తకరూపంలో తీసుకురావాలను వుంది.

మారం : మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి?

వీరజగదీశ్వరి : మాంసాహారం విషాహారమనీ, శాకాహారమే అమృతాహారమనీ, వీలైనంత ఎక్కువమందికి తెలియజేస్తూ ప్రతి మనిషికీ " శారీరక ఆరోగ్యం, మానసికప్రశాంతత అన్నవి కేవలం ధ్యానం, అహింస ద్వారా మాత్రమే " అని ఈ ప్రపంచంలోని అందరికీ 2012 లోపు చాటాలని ఆకాంక్ష. మరిన్నీదేశాలకు త్వరలో వెళ్ళి ధ్యానప్రచారం చేయమని పత్రీజీ ఆదేశించారు. చేస్తాను!

ధ్యానసాధన వల్ల ఇంతవరకు తొమ్మిదిపుస్తకాలు సంకలనం చేయగలిగాను. చదివినవారు తమ ఆనందాన్ని తెలియజేస్తూంటే " ఇది అద్భుతమే " అనిపిస్తోంది.

భౌతికవిద్య అతితక్కువైన నేను " జ్ఞానదర్శిని ", " జ్ఞానలీలాదర్శిని ", " జ్ఞానతత్వదర్శిని ", " ఓంకారదర్శిని ", " భగవద్‌గురి ", " జ్ఞానకిరణాలు ", " ధ్యానతరంగం " అని పుస్తకాలు వ్రాయడం నిజంగా అద్భుతమే మరి. పరమగురువుల ప్రబోధం " ధ్యానవైభవం " .. అనే మాసపత్రికను ప్రతినెలా తీసుకొస్తున్నాం !

ఈ పుస్తకాలు చదివనవారు ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా తమ అభినందనలు తెలియజేస్తూ " మీరేం చదువుకున్నారు ? " అంటే " నేను 5వ తరగతి పూర్తిచేశాను " అన్న జవాబును ఎవ్వరూ నమ్మరు ! ఎంతో బాగా చదువుకున్నవారు కూడా ఈ పుస్తకాలు ఎంతో బావున్నాయనీ, సంవత్సరాల అనుభవజ్ఞానం ఇదనీ చెప్పినప్పుడు కలిగిన ఆత్మానందంతో జీవితం ధన్యం అయిందని పరవశించిపోతూంటాను.

" పరమగురువుల ప్రబోధం - ధ్యానతరంగం " అనే చిన్న పుస్తకాలు నాలుగు లక్షల కాపీలు ముద్రించబడి పంచబడ్డాయి. మిగిలిన పుస్తకాల్లో 156 పేజీల ధ్యానతరంగం 70 వేల కాపీలు ముద్రించబడి పంచబడ్డాయి.

మారం : దయచేసి ఒక ధ్యాన అనుభవం చెప్పండి!

వీరజగదీశ్వరి : ఒకసారి నేను మెట్లు దిగుతూ వుండి జారిపడితే " పాదం జాయింట్లో రెండుచోట్ల విరిగింది, ఆపరేషన్ చేయాలి " అని డాక్టర్లు చెప్పారు. నేను పిరమిడ్‌లో ధ్యానసాధన చేయడం ద్వారా ఆపరేషన్ లేకుండానే విరిగిన ఎముక అతుక్కుంది ! అది చూసి ఆశ్చర్యపోయారు ఆర్థోపిడీషియన్ డాక్టర్ కమలాకర్ గారు. ఆ విశ్రాంత సమయంలో " ధ్యానతరంగం " పుస్తకం పూర్తి చేయగలిగాను.

మారం : విశాఖ జిల్లాలో మీరు చేసిన ధ్యానప్రచారం గురించి చెప్పండి!

వీరజగదీశ్వరి : విశాఖ జిల్లా 43 మండలాల్లో ప్రతి మండలంలోని ప్రతి ఊళ్ళో ధ్యానప్రచారం చేశాం విశాఖ జిల్లాలో. ధ్యానగ్రామీణం వ్యానులో ఎన్ని ఊళ్ళు తిరిగామో ! ఏం చేయగలనో అదంతా చేశాను ఇంకా చేస్తాను ! ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఆ ప్రేరణతో ధ్యానప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా మా పుట్టిన జిల్లా. ఆ జిల్లాలో ఎంతో ప్రచారం చేశాను నేను ; మరిణించేవరకు ధ్యానప్రచారం చేస్తూనే వూంటాను.

శిలను శిల్పంగా మార్చిన పరమగురువు, మహనీయులు బ్రహ్మర్షి పత్రీజీ! రోజూ ఉదయం నుంచి రాత్రి వరకు మాంసాహారం తినే మా దంపతులం ఆరేడుగంటలు ధ్యానం చేసి దాన్ని మానివేయగలిగాం. మాంసం తినేవారికి నేనిదే చెపుతూంటాను " రోజుకు ఆరేడు గంటాలు ధ్యానం చేయండి ; మాంసం మీరే ఆటోమాటిక్‌గా మానేస్తారు నాలాగా " అని. తూర్పుగోదావరి జిల్లాలో ‘ పుతుకులూరు ’ అనే ఊళ్ళో నేను క్లాస్ చెప్పాను. ఎంతోమంది మాంసం మానేశారు. పిరమిడ్ గురించి విని ఆ ఊళ్ళో పదిహేను రోజుల్లో పిరమిడ్ కట్టేశారు. వెంటనే పత్రీజీ ప్రారంభోత్సవం చేశారు. ధ్యానప్రచారం అంత వేగంగా జరుగుతోంది !

మారం : ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ గురించి మీ అభిప్రాయం ? ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు మీ సందేశం ?

వీరజగదీశ్వరి : ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రతి తెలుగువారి ఇంట్లో వుండాలి. ఇందులో వచ్చే విషయాలు ప్రతి తెలుగువారికీ అందాలి. ఆత్మజ్ఞానాన్ని అరటిపండు వొలిచి నోట్లో పెట్టినంత సులభంగా వివరించే పత్రీజీ సందేశాలతో మరెన్నో శీర్షికలతో అలరారుతోన్న ఈ ఉన్నత ఆధ్యాత్మిక మాసపత్రిక తెలుగుభాష వచ్చిన ప్రతి మనిషీ చదవాలి. ధ్యానప్రచారంలో ఇది కూడా ఒక భాగంగా తలచి .. మనందరం ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అందరికీ చేరేలా కృషిచేయాలి!

 

T. వీరజగదీశ్వరి
వైజాగ్
సెల్ : +91 98663 31999

Go to top