" ఒక రాజహంసలా ఏది కావాలో అదే తీసుకుంటారు "

 

" పత్రీజీ " .. ఈ పేరులోనే ఏదో సొంపు వుంది .. మరి ఎన్నెన్నో జన్మలు ప్రయాణం చేసి అలసినవారిని సేదతీర్చే దివ్యామృతం వుంది. పత్రీజీ గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా ఎంతైనా తెలుసుకోవచ్చు కానీ .. పత్రీజీని అర్థం చేసుకోవాలంటే మాత్రం ఆ స్థాయిలో ఉన్నవారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. మిగతావారికి పత్రీజీ ఒక అర్థం కాని ‘ మిరాకిల్ ’

" BHEL "

2006 సంవత్సరంలో ఒకసారి హైదరాబాద్‌లో బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో BHEL లో ఒక పెద్ద ధ్యానశిక్షణా తరగతి జరిగింది. ఆ రోజు " ‘BHEL’ అంటే .. ‘ BE HAPPY AND ENJOY LIFE ’ " అని సర్ క్రొత్త అర్థం చెప్పారు. కానీ మధ్యలో రెండుసార్లు కరెంట్ పోవడం, మైకు సరిగా పనిచేయకపోవడం వంటి కొన్ని అవాంతరాలతో క్లాసు ముగిసింది. సాధారణంగా పత్రీజీ స్టేజీ దిగగానే అందరినీ పరామర్శిస్తూ " ఎలా వుంది, చెప్పండి " అంటూ పదేపదే అడుగుతూంటారు. ఎందుకంటే తాము విన్న జ్ఞానాన్నీ, పొందిన అనుభవాన్నీ వాళ్ళు మరిచిపోకుండా ఉండేందుకు మరి వారిలో వున్న అనేక రకాలైన భయాలను తొలిగించేందుకే ఆయన అలా చేస్తూంటారు.

ఇంతలో ఒక మేడమ్‌ను " ఎలా వుంది క్లాస్ ? " అని ప్రశ్నించారు. " ఈ రోజు క్లాసు ఏం బాగోలేదు సార్ .. మైకు సరిగ్గా వినిపించలేదు " అంటూ ఆమె పళ్ళు ఇకిలించింది. అంతే! పత్రిసార్ .. లాగి ఆమె చెంపమీద ఒకటి ఇచ్చారు! " ఫో! ఇక్కడి నుంచి నీ మొహం చూపించకు! " అంటూ తరిమేసారు.

తరువాత ఆయన దృష్టి నా మీద పడింది. " ఏమయ్యా వంశీ .. క్లాసు ఎలా వుంది?! " అంటూ ప్రశ్నించారు. " సార్! ఈ రోజు చాలా అద్భుతంగా వుంది; ‘ BHEL అంటే అర్థం ఇదే ’ .. అన్న విషయం ఈ రోజే తెలుసుకున్నాం ; జీవితాన్ని మధురంగా భోగించాలని అర్థం చేసుకున్నాం; సత్యాన్ని సరళంగా చెప్పడంలో మీకు మీరే సాటి " అంటూ మనస్సులోని మాట చెప్పాను.

ఆయన ఎంతో సంతోషపడిపోయి నా భూజాన్ని తట్టి నన్ను హత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ గుంపులో నుంచి ఒకామె నా చేయి పట్టుకుని వెనక్కి లాగింది. " ఎవరా ? " అని చూద్దును కదా .. ఇందాక సార్‍తో చెంపదెబ్బ తిన్న ఆమె. ఆమె నన్ను " నిజం చెప్పండి వంశీగారూ! ఈ రోజు క్లాసు సరిగ్గా జరగలేదు. ఎన్నో అవాంతరాలు వచ్చాయి కదా .. మరి ఆ విషయం నేను చెప్తే నన్ను కొట్టారు. మీరేమో ‘ ఆహా ’ .. ‘ ఓహో ’ అంటూ చెపితే సార్ ఆనందపడిపోయారు. ఎందుకిలా జరిగింది ? " అంటూ నన్ను నిలదీసింది!

" మేడమ్! పత్రిసార్ చేసిన పని వందకు ‘ 99% ’ ఫెయిల్ అయిందనుకోండి .. కానీ ‘ 1% ’ విజయవంతం అయిందిగా. నేను ఆ 1% విజయాన్నే సార్‌కి చూపించాను. మీరేమో 99% ఫెయిల్యూర్ నెగెటివ్‌ని చూపించారు. సార్ .. మన వద్దనున్న నెగెటివ్ విషయాలు తీసుకుంటే .. తన సంతోషాన్నీ, తన సంకల్పాన్నీ మరి తన శక్తినీ కూడా కోల్పోవలసి వుంటుంది. అప్పుడు ఆయన ఏ పనీ చేయలేరు. అందుకే నెగెటివ్‌గా మాట్లాడేవారిని సార్ దూరంగా ఉంచుతారు. నేను చెప్పిన పాజిటివ్ విషయాలు ‘ ఒక్క శాతమే ’ కావచ్చు కానీ .. అదే ఆయనకు ఎంతో సంతోషాన్నీ ఆయన సంకల్పానికి మరి బలాన్నీ అందిస్తుంది. తాను చేసిన ప్రయత్నం ద్వారా ఇంతమంది ఆనందంగా ఉన్నారన్న బ్రహ్మానందాన్ని ఆయన పొందుతారు. తద్వారా మరొక ధ్యానప్రచార సభకు కావలసిన శక్తినీ మరి ప్రేరణనూ పొందుతారు. పత్రీజీ .. ఒక ‘ రాజహంస ’ లా ఏది కావాలో అదే తీసుకుంటారు. పాలనూ .. నీళ్ళనూ వేరుచేసినట్లు అక్కరలేనిదానిని వదిలేస్తారు మరి మనకు కూడా తిట్టో, కొట్టో అదే నేర్పిస్తారు. దటీజ్ పత్రీజీ !!

" నో హితూరీలు "

పత్రీజీ దగ్గర వున్న మరొక శాసనం " నో హితూరీలు ". ఎవరైనా వెళ్ళి సార్‌కి ప్రక్కవాళ్ళ మీద కంప్లయింట్స్ ఇస్తే ఇక వారు పత్రీజీ ఉగ్రరూపాన్ని చూడాల్సిందే! ఎందుకు ఇతరులపై చాడీలు చెప్పడాన్ని పత్రీజీ సహించరు ? ?" ఎందుకు? " అంటే వారిలోని ఈర్ష్యా స్వభావం ఆయన మనోనేత్రానికి స్పష్టంగా గోచరిస్తుంది కాబట్టి ! నిజానికి ప్రతి వ్యక్తికి కూడా అంతర్లీనంగా ఏదో ఒక కోరిక వుంటుంది. వారు దాన్ని వాంఛిస్తూ తీరని కోరికగా మిగుల్చుకుంటారు. ఎప్పుడైతే ఇతరులు దానిని అనుభవిస్తూ వుంటారో .. అది చూసి వారిలో అంతర్గతంగా ఒక చిన్న అసహనం ప్రారంభమవుతుంది. అది కాస్త అసూయగా మారి తరువాత ద్వేషంగా రూపాంతరం చెందుతుంది.

ఇలా ఇతరులకు వున్నది తమకు లేనిది చూసి బాధపడటం అలవాటు చేసుకుని .. జీవితమంతా ఈర్షాద్వేషాలలో గడుపుతూ " ఇతరులలో ఎలాగైనా లోపాల్ని వెతికి బయటపెట్టాలి " .. అని మనం తహతహలాడతాము. ధనవంతుల జీవితాలలో కూడా బాధలు ఉన్నాయని బీదవాళ్ళు వెతుకుతూంటారు. ఆశ్రమాల్లో నీచకార్యాలు జరుగుతున్నాయనీ తెలుసుకోవటానికి ప్రజలు పాట్లు పడుతూంటారు. అలాగే జీవితాలనే పణంగా పెట్టి ఎంతో ధ్యానప్రచారం చేస్తున్న మాస్టర్‌ని ప్రోత్సహించకపోగా ఒక్కోసారి వాళ్ళ వ్యక్తిగత విషయాలను విమర్శించడం వంటి పనులు కొందరు చెస్తూంటారు. మరి వాటన్నింటికీ ఈర్ష్యే కారణం. సోక్రటీస్, జీసస్ కాలాల నాటి ఛాందసాలు ఇంకా మనలో వున్నాయంటే ఎంత ఆశ్చర్యం !

నిజంగా " ప్రక్కవాడు చెడిపోతున్నాడు " అని నమ్మితే మనం విచారపడాలి. నెమ్మదిగా వారికి చెప్పి చూడాలి; వినకపోతే " అది వారి అనుభవంకోసం వారు అలా ప్రవర్తిస్తున్నారు " అని తెలుసుకుని వారిని వదిలివేయాలి. ఇలాకాకుండా " అంతా పాడవుతోంది ; నాశనం అవుతోంది " అని దొంగ అదుర్దాలు పడతాము మరి దొంగ ఆటలు ఆడుతాము.

కానీ పత్రీజీ దగ్గర ఇలాంటి ఆటలు సాగవు ! ఆయన మనోనేత్రానికి స్పష్టంగా, చక్కగా ఈ " దొంగ " దొరుకుతాడు .. మరి అప్పుడు వెంటనే ఆయన తమ విశ్వరూపాన్ని చూపించి వాళ్ళ చెంపలు వాయగొడతారు. ఇదంతా మనలోని ఆ " దొంగ " ను పారద్రోలడానికే సుమా ! కనుక డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త .. పత్రీజీ దగ్గర నో కంప్లయింట్స్! ఎవరి సమస్యను వారే స్వంతంగా, పర్సనల్‌గా పరిష్కరించుకోవాలి. అంత కఠినంగా వుంటుంది పత్రీజీ శిక్షణ ! దటీజ్ పత్రీజీ !!

" నిరంతర ప్రోత్సాహం "

పత్రీజీ దగ్గర వున్న మరొక దివ్యమైన గొప్ప కస్తూరి .. ‘ ప్రోత్సాహం ’. ఎవ్వరినైనా సరే మెచ్చుకోవడానికి సిద్ధంగా వుంటారు పత్రీజీ! ఎవరు ఎంత చిన్న మంచిపని చేసినా దాన్ని ఎంతో ప్రోత్సహిస్తారు ! శిష్యుణ్ణి తమ ప్రక్కనే కూర్చోపెట్టుకుని తమ స్థాయికి తీసుకునివచ్చే గొప్ప జగద్గురువులు చాలా తక్కువమంది. వారిలో పత్రీజీ మొట్టమొదటి శ్రేణివారు! ఈ రోజు ఇంతమంది పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉన్నతంగా ఎదిగారు అంటే .. దానికి పత్రీజీ నిరంతర ప్రోత్సాహమే కారణం!

ఒకసారి నేను .. నా మిత్రుడు .. వెలగపూడి లక్ష్మణరావు గారి కుమారుడి పెళ్ళిలో అన్నమయ్య పాటలకు వెంకటేశ్వరుని వేషధారణతో కళాకారులతో కలిసి నృత్యరూపకం నిర్వహిస్తూ మధ్య మధ్య సరదాగా ధ్యానం గురించిన విషయాలు చెపుతూ ఒక కార్యక్రమం నిర్వహించాము. పత్రీజీ దానిని రెండుగంటలపాటు వీక్షించారు.

రెండవరోజు ప్రొద్దునే సార్ నన్ను పిలిచి " ఎంతో అద్భుతంగా వుంది నీ ప్రోగ్రామ్. సామాన్యులందరికీ కూడా అర్థమయ్యేలా వుంది నీ ప్రసంగం. నేను చాలా ఎంజాయ్ చేసాను ; నాకు ఎంతో నచ్చింది. ఇది అన్నిచోట్లకూ విస్తరింపచేయి ! " అంటూ ఎంతో మెచ్చుకున్నారు. నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఇంత గొప్ప గురువు ఒక చిన్న కార్యక్రమాన్ని ఇంతగా గుర్తించారు అంటే " నాలో ఏదో శక్తి వుంది " అని నాపై నాకే అపారమైన నమ్మకం కలిగింది ! అప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్నో చోట్ల అన్నమయ్య సంగీత ధ్యానయజ్ఞాలు నిర్వహించాము .. మరి వేలాది ప్రజలకు దాని నుంచి ఎంతో ఆత్మవిజ్ఞానాన్ని అందించగలుగుతున్నాం! భక్తిమార్గంలో వున్న ఎంతోమందిని సంగీత ధ్యానయజ్ఞాల ద్వారా పిరమిడ్ ప్రపంచానికి తీసుకురాగలిగాం ! దీన్ని మరింత ప్రోత్సహిస్తూ పత్రీజీ దానికి " ధ్యాన అన్నమయ్య ప్రాజెక్టు " అని నామకరణం చేసి ప్రపంచవ్యాప్తంగా విస్తారం చేయమని సూచన కూడా ఇచ్చారు. పత్రీజీ ప్రోత్సాహంతో 2009 డిసెంబర్ శ్రీశైలం ధ్యానమహాయజ్ఞంలో 200 మంది కళాకారులతో వారంరోజులపాటు ప్రతిరోజూ మా ప్రదర్శనలు సాగాయి! వీటన్నిటి కారణం పత్రీజీ ఇచ్చిన ప్రోత్సాహమే! దటీజ్ పత్రీజీ !!

" నో జడ్జిమెంట్ "

పత్రీజీ దగ్గర మనం నేర్చుకోవల్సిన మరొక దివ్యజ్ఞానం " నో జడ్జిమెంట్ ". సరికాని స్థితిలో వున్నవారిని వారు హెచ్చరిస్తారే కానీ ‘ తీర్పు ’ చేయరు. సంపూర్ణ ఆత్మస్థితిలో సదా జీవించే అద్భుతమైన గురువు పత్రీజీ. " ప్రతి ఒక్కరూ కూడా వారివారి ఆత్మస్థితి ప్రకారం ప్రవర్తిస్తూ వుంటారు. వారికి మనం జ్ఞానం కలుగచేయాలే కానీ వారిని జడ్జ్ చేయకూడదు. వారి స్థితిలో వారు కరెక్టే. ఒక ‘ శైశవఆత్మ ’ శైశవంలా ప్రవర్తిస్తుందే తప్ప ‘ యవ్వనాత్మ ’ లా ప్రవర్తిస్తుందా ? ఒక యవ్వనాత్మ యవ్వనస్థితిలో వుంటుందే తప్ప ‘ వృద్ధాత్మ ’ లా వుంటుందా ? కనుక ఎవరి ఆత్మస్థితిలో వారు సహజంగా వుంటారు. నువ్వు ఎందుకు అందరూ మనం చెప్పినట్లు వినాలనుకుంటావు? ఎవరి సహజస్థితి వారికి వుంటుంది కదా! కనుక ఎవ్వరినీ జడ్జ్ చెయ్యవద్దు. అందరికీ ధ్యానం నేర్పించు. గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారినట్లు వారివారి స్థితి ప్రకారం వారే నెమ్మదిగా ఎదుగుతారు. కనుక నో జడ్జ్‌మెంట్! " అంటారు. దటీజ్ పత్రీజీ !!

"సరండర్"

" సరండర్ " : " ఓడిపోయి గెలుపు " అన్న సూత్రాన్ని పత్రీజీ దగ్గరే నేర్చుకోవాలి! ఒకసారి .. ఒకాయన పత్రీజీపై పగ పెంచుకున్నారు. ఎందుకంటే .. సంపాదించే స్థితిలో వున్న తన కొడుకు వాటిని కొంచెం ప్రక్కన పెట్టి ధ్యానప్రచారం చేస్తూ పెద్ద పిరమిడ్ కట్టించాడు .. మరి దాని ప్రారంభోత్సవానికి పత్రీజీని ఆహ్వానించాడు. " డబ్బు సంపాదించుకునే యువకులను ఇలా ధ్యానప్రచారంతో మీ గురువు పాడుచేస్తున్నాడు! ఆయన సంగతి చూస్తాను .. రానీ, అంతు తేలుస్తాను " అంటూ చిందులుత్రొక్కుతూ రంకెలు వేయడం మొదలుపెట్టాడు. పత్రీజీ రావడం కోసం ముందు వెళ్ళి ఏర్పాట్లు చేసే మమ్మల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా రాత్రంతా తిడుతూనే వున్నాడు.

ఇక ప్రొద్దునే పత్రీజీ వచ్చారు. అందరికీ కరచాలనం చేస్తూ వస్తున్నారు. " గురువు గారిని ఏమంటాడో " .. అని ఇతని ప్రక్కన వున్న మాకేమో ఆందోళన పెరిగిపోతుంది. ఇతనేమో " రానీ చెపుతాను మీ గురువుని " అంటూ పళ్ళు నూరుతున్నాడు. అంతలో సార్ అతనిని సమీపించి అతని కళ్ళలోకి సూటిగా చూసారు. అతని కళ్ళలో పత్రిసార్ పై ద్వేషం ప్రజ్వరిల్లుతోంది. అంతే .. పత్రిసార్ చటుక్కున వంగి అతని కాళ్ళను స్పృశించి నమస్కారం పెట్టారు. మేమందరం షాక్!

అతడు కూడా శిలలా వుండిపోయాడు : " పత్రీజీయే నా కాళ్ళకు దండం పెట్టారా ?! అంటూ .. సీన్ ‘ కట్ ’ చేస్తే .. ఇప్పుడు ఆయన తన కొడుకు కన్నా ఎక్కువ ధ్యానప్రచారం చేస్తున్నారు. గ్రామగ్రామాలు తిరిగి ధ్యానప్రచారం చేస్తున్నారు. మరెన్నో పిరమిడ్‌లు నిర్మించారు!

" ఎదుటి వ్యక్తిలోని అహంకారాన్ని .. ‘ ప్రేమ ’ అనే ఆయుధంతో తెగనరకాలి " అన్న సూత్రం తెలిసిన జగత్‌గురువు పత్రీజీ. తన గుండెల మీద తన్నిన భృగుమహర్షి కాలిని ప్రేమతో నొక్కి .. అతని అహాన్ని తీసివేసిన శ్రీమహావిష్ణువే మళ్ళీ మనకోసం దిగివచ్చి నరరూపంలో తిరుగుతోన్న మన గురువు. దటీజ్ పత్రీజీ !!

" సింప్లిసిటీ "

ఒక్కొక్కసారి పత్రీజీ " సింప్లిసిటీ " ని చూస్తూంటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది. పెద్ద పెద్ద ధ్యానయజ్ఞాలు చేస్తూ జగద్గురువుగా విలసిల్లుతూ .. ఎంతో ఎత్తులో వున్న ఆయన .. అదంతా మరిచిపోయి ఎంత సామాన్యంగా తన మాస్టర్స్‌తో మెలుగుతారో .. అది అందరికీ అనుభవమే. అందుకే పత్రీజీ అంటారు: " నేను ఎవ్వరికన్నా ఎక్కువ కాదు, నేను ఎవ్వరికన్నా తక్కువ కాదు ". దటీజ్ పత్రీజీ !!

ఇలా చెపుతూపోతే ఎన్నెన్నో ఆయన దివ్యత్వాలు. మనందరం అవన్నీ నేర్చుకోవాలి. ప్రతిక్షణం ఎరుకతో వుండాలి. అటువంటి జగత్‌గురువు, ఇటువంటి పిరమిడ్ మాస్టర్‌ల సాంగత్యం అనేక జన్మల ఎదురుచూపుల తరువాత మాత్రమే మనకు దొరికింది. ఇప్పుడు కూడా మనం ఎదగకపోతే ఇక ఎప్పటికీ ఎదగలేము. కనుక ధ్యానం చేద్దాం ; ధ్యానప్రచారం చేద్దాం ; దివ్యత్వంతో వికసిద్దాం.

దటీజ్ పత్రీజీ!! దిసీజ్ పిరమిడ్ మాస్టర్ !!!

 

భీమనేని వంశీకిరణ్
వైజాగ్
సెల్ : +91 92466 72172

Go to top