" ధ్యానం నేర్సుడు నా అదృష్టం "

 

నా పేరు సత్తయ్య. నాకు 75 యేండ్లు! నేను నాలుగేండ్ల సంది కడ్తాల్ .. మహా పిరమిడ్ తాన .. నైట్ వాచ్‌మెన్ లెక్క కొల్వు జేస్తున్న.

దినాం తెల్లారి డ్యూటి అయిపోతానే అయిదు కి.మీ. నడిచి మా కడ్తాల్ ఊర్ల ఉన్న ఇంటికి చేర్కున్నంక .. జెరసేపు ఆ పనీ ఈ పనీ జేస్కునేటోన్ని. అటెన్క నాకు ఇంట్ల ఏం సుదరాయించక పోవుడుతోటి మల్ల అయిదు కిలో మీటర్లు నడిచి పిరమిడ్‌తానికే బోయి .. పగలు పిరమిడ్ చూడనీకి ఒచ్చిపోయెటోల్లకు ధ్యానం గురించి చెప్త వుంట.

ధ్యానం చెయ్యక ముందు నేను దినాం మాంసం దినుకుంట, మందు బీడీలు, సుట్టలు తాగుకుంట బతికెటోణ్ణి. పెయ్యంత రోగాలతోని నిండుడుతోటి..డాక్టర్ల సుట్టు తిరుక్కుంట మస్తు పైసలు మందులకు బోసిన. రెక్కాడితెగాని డొక్కాడని మా తాన డాక్టర్లకు ఇయ్యనీకి ఇగ లచ్చలకు లచ్చలు యాడికెల్లి ఒస్తయ్ సారూ!?

గీ రోగాలు నా సావుకొచ్చినయ్" అని నేను బాధపడ్తుంటె జూసి మా ఊర్ల "రాజిరెడ్డి" అనే ధ్యానంసారు నాకు ధ్యానం నేర్పించిండు. మాంసం దినుడు, బీడీలు, మందు తాగుడు బంద్ బెట్టి పొలం పన్లు జేసుకుంటనే.. మాపటేల ఇంటికి ఒచ్చినంక ధ్యానం జేస్కుంటుంటే .. దగ్గు, దమ్ము, కాళ్ళనొప్పులు, కడ్పులనొప్పి మెల్లిమెల్లిగ గవే తక్కువయినయ్!

ఇంతకు మున్పు జెర ఫుర్సత్ దొర్కంగనె మందుదాగి పండెటోణ్ణి! ఇగ ధ్యానం నేర్పిన సంది రాజిరెడ్డి సార్‌తోని గూడి మా కడ్తాల్ ఊర్ల, సుట్టుపక్కల పల్లెల్ల ధ్యానప్రచారం జేసుడు బెట్టిన. మా ఊరికి దగ్గర పిరమిడ్ గడ్తున్నరని ఇని ఊరోళ్ళందరం మస్తు ఖుష్ అయినం. నేను ధ్యానం గురించి అందరికి జెప్పుడు జూసి .. పిరమిడ్ సార్లు నాకు "మహా పిరమిడ్" కాడ "వాచ్‌మెన్ కొల్వు" ఇచ్చిన్రు.

పిరమిడ్ కట్టినన్ని రోజులు నేను మా ఊరి జనాలను ఆడికి తోల్కుచ్చి ధ్యానం జెప్పిచ్చెటోణ్ణి. గిప్పుడు మా ఇంట్లనే కాదు మా సుట్టాలల్ల చాన మంది ధ్యానం జేస్తున్నరు. మాంసం తినుడు, మందు తాగుడు బంద్ బెట్టి గ పైసల్తోని ముద్దుగ పిల్లల్ని మంచి సదువులు సదివించుకుంటున్నరు.

గీ నడ్మ టీవిలల్ల, పేపర్లర్ల జూసి .. కొత్తకొత్తోళ్ళు కార్లేస్కొని శనాదివారాలల్ల పిరమిడ్ జూడనీకి మస్తుగ ఒస్తున్రు. వాళ్ళందర్కి పగటి పూట.. అక్కడ ఉన్న పిరమిడ్ సార్లతో పాటు నేను బీ ధ్యానం నేర్పుతున్న. గంత పెద్ద పిరమిడ్‌ను జూసి వాళ్ళు మస్తు పరేషాన్ అవుతున్రు!!

గిసొంటి గొప్ప పిరమిడ్ కాడ నాలుగేండ్ల సంది వాచ్‌మెన్‌గ కొల్వొజేసె మౌక నాకు ఒచ్చుడు నా అదృష్టం! మా అసొంటి పల్లెటూరి రైతులకు ధ్యానం నేర్పి, మంచేందో.. చెడేందో ఎర్కజేసి మా బతుకులను ఉద్ధరిస్తున్న "పెద్దసారు" కు దండాలు బెడ్తున్న!!

 

మీ సత్తయ్య
మహాపిరమిడ్.. నైట్ వాచ్‌మెన్
కైలాసపురి, కడ్తాల్

Go to top