" ధ్యానం.. మహా ఆరోగ్య ప్రదాయిని "

 

నా పేరు నాగేశ్వరరావు. నా వయస్సు 65 సంవత్సరాలు. నేను IFFCO పనిచేసి 2008 సం|| లో రిటైరయి ప్రస్తుతం సామర్లకోటలో ఉంటున్నాను. 1994 సంవత్సరంలో IFFCO మేనిజిమెంటు ప్రతి ఒక్కరికీ బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా మౌంట్ అబు (రాజస్థాన్) అయిదు రోజుల పాటు రాజయోగ విధానం నేర్పించారు. అప్పటి నుంచి అడపా దడపా వీలున్నప్పుడు నేను ధ్యానం చేస్తూండేవాడ్ని.

IFFCO నుండి రిటైరై వచ్చిన తరువాత రెగ్యులర్‌గా ధ్యానం చేస్తున్నాను. 2009 సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రీజీ వారి "శ్వాస మీద ధ్యాస" గురించి నాకు మా ఇంటి ప్రక్కనే వున్న శ్రీ పువ్వుల ప్రసాద్ గారు వివరించారు. అప్పటి నుంచి క్రమం తప్పక ధ్యానం చేస్తున్నాను.

2013 జనవరిలో మా కుటుంబం సభ్యులందరం కలిసి కేరళ టూర్ ప్రోగ్రామ్ వేసుకొని చాలా ఆనందంగా తిరిగాము. కేరళలో "మున్నార్" అనే చాలా చల్లటి ప్రదేశాన్ని కూడా చూశాము.

కేరళ నుంచి రాగానే కొంచెం మా కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయ్యారు. వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి నాలుగైదు రోజుల్లో తేరుకొన్నారు. నాకు మాత్రం రెండు చెవులు మూతలుపడి పడిసం బాగా మెదడుకు పట్టి గూబ సలుపుతో ఎంతో బాదపడ్డాను. సామర్లకోటలో డాక్టర్ గారి దగ్గరికి వైద్య నిమిత్తం వెళ్ళగా ఏవో కొన్ని మందులు వ్రాసి ఇచ్చారు. అవి వాడినా ల్లాభం లేకపోగా తల చాలా భారం ఎక్కి ఎన్నో కిలోల బరువు పెట్టినట్టు ఉండి రాత్రుళ్ళు నిద్రలేకపోయేది.

విశాఖపట్నంలో E.N.T. వైద్యునికి చూపిస్తే నా రెండు చెవులు కడిగి మందులు వేసి "చెవిలో ఏ లొపం లేదు" అని చెప్పారు కానీ నా ఎదురుగా ఉన్న మనిషి మాట కొండలోయలలో మాట్లాడినట్టు నాకు వినపడేది. ఎంతో చికాకుగా ఉండి బి.పి.తో పాటు ఎసిడిటీ ఎక్కువై భోజనం చేయలేకపోయేవాడిని. వేరే డాక్టర్లకు చూపించినా "పెద్దవయస్సుకనుక ఏమీ చెయ్యలేము .. జీవితాంతం ఇలాగే ఉండాలి" అని చెప్పారు.

నేను ఉన్న పరిస్థితిని శ్రీ పువ్వుల ప్రసాద్ గారు పరిశీలించి నన్ను వారింటికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేసి రెండు రోజుల పాటు వారి పిరమిడ్‌లో ధ్యానం చేయించారు. తరువాత అల్యూమినియం పిరమిడ్‌ని తీసుకువచ్చి మా బె‍డ్‌రూమ్‌లో పెట్టి దాని క్రింద కూర్చుని రోజూ నన్ను ధ్యానం చేయమని చెప్పారు. రోజుకి మూడు గంటలు నుండి నాలుగు గంతలు వరకు క్రమం తప్పక ధ్యానం చేయగా .. ఎన్ని మందులు వాడినా తగ్గని ఈ మెదడులో భారం చెవులు సమంగా వినిపించకపోవటం, చెవులలో రీసౌండ్సు, చెవులలో బాధ, పోటు అన్నీ సర్దుకుని .. కేవలం పది రోజులలోనే నేను పూర్తి ఆరోగ్యవంతుడయ్యాను.

మందులు వాడనవసరం లేకుండానే ధ్యానం అనారోగ్యాన్ని ఎలా నయం చేస్తుందో అన్నదానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ!

"Follow me not, follow my words" అన్న పత్రీజీ మాట నేను ఎప్పుడూ మరువను! ఇప్పుడు నేను మా సామర్లకోటలో లయన్స్ క్లబ్ మెంబర్స్, పురప్రజల చేత లయన్స్క్లబ్ భవనంలో రోజుకు ఒక గంట చొప్పున "శ్వాస మీద ధ్యాస" కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేయిస్తున్నాను.

 

నాగేశ్వరరావు
తూర్పు గోదావరి జిల్లా
సెల్ : +91 94939 54732

Go to top