" సదా ఆత్మస్థితిలో ఉండే మహాయోగి..పత్రీజీ"

సాహిత్య శిరోమణి డా|| సముద్రాల లక్ష్మణయ్య- తిరుపతి

1994 నుంచీ బ్రహ్మర్షి పత్రీజీతో ఆధ్యాత్మిక సాంగత్యం కలిగిన సాహిత్య శిరోమణి డా|| సముద్రాల లక్ష్మణయ్య‌గారు వేదవేదాంగాల్లో మహాపండితులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిష్ఠాత్మకమైన ధర్మప్రచార పరిషత్ కార్యదర్శిగా పదవిని నిర్వహించిన డా|| సముద్రాల గారు 2002 నుండి తిరుమల తిరుపతి దేవస్థానంలో భారతీయ పురాణ, ఇతిహాస ప్రాజెక్టుకు స్పెషల్ ఆఫీసర్‌గా ఉంటూ సాహిత్యరంగంలో తమ అనన్యమైన సేవలను అందిస్తూన్నారు. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌కు చిరపరిచితులైన సాహిత్య శిరోమణి బ్రహ్మశ్రీ డా|| సముద్రాల లక్ష్మణయ్యగారు ఇన్నర్ వ్యూ ద్వారా తమ భావాలను మనతో పంచుకోవడం మన అదృష్టం! వారికి ధ్యానాంధ్రప్రదేశ్ బహుధా కృతజ్ఞతలు తెలియజేస్తోంది.

మారం శివప్రసాద్


మారం : "శిరిడీ సాయి దత్తాత్రేయుడు వంటి మహానీయులు కూడా మాంసాహారాన్ని వండి వడ్డించారు.. మీరు శాకాహారం అంటారు" అని కొన్ని వర్గాలవారు ఎందుకు పరిహసిస్తున్నారు?

డా|| సముద్రాల : శిరిడీ సాయిబాబా గురించీ, శ్రీ రామకృష్ణ పరమహంస గురించీ మాట్లాడేవారు.. వారు వివరించిన సందర్భాలను పూర్తిగా అధ్యయనం చేసి వారు అన్న మాటల్ని గుర్తుచేసుకోవాలి!

"అది అగ్నిరా! ఏమి వేసినా కాలిపోతుంది!" అని ఋషులను గురించి రామకృష్ణుల వారు మాట్లాడేవారు. వీరబ్రహ్మేంద్రస్వామి, ఆదిశంకరులు సలసలా కాగుతూన్న సీసాన్ని త్రాగేవారు. వీరబ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్యకూడా సీసం త్రాగాడు. ఒక ఋషి ఐరన్ త్రాగాడు, ఒక ఋషి మద్యం త్రాగాడు, ఒక ఋషి ఇంకేదో త్రాగాడు .. అంటూ మహనీయుల యొక్క జీవనశైలిగురించి తెలియకుండా మాట్లాడడం మూర్ఖత్వం!

సంఘసంస్కర్తల్లో అగ్రగణ్యులైన శ్రీ వీరబ్రహ్మంగారు, శ్రీ యోగివేమన వంటి మహితాత్ములు మానవాళికి సరియైన ఆహారంగా శాకాహారాన్నే ప్రతిపాదించారు..ప్రచారం చేశారు.

ఇటీవలి కాలంలో శ్రీ నారాయణ గురువు, శ్రీ దయానంద సరస్వతి, శ్రీ మలయాళ స్వామి వంటి మహనీయులు సాత్విక ఆహారాన్నే బహుళ ప్రచారం చేసారు. భగవద్గీత కూడా సాత్విక ఆహారాన్నే సరియైన ఆహారంగా నిర్దేశించింది. కడప జిల్లాలో జన్మించిన యోగి వేమన.. తన పద్యాల రూపంలో..

"జీవి జీవిని జంపి జీవికి వేయగా.." అంటూ పద్య సందేశం ద్వారా, "ఇతర జీవులను హింసించి, చంపి తినేవారికి మోక్షం లభించదు" అన్నారు! "క్రూరమైన జంతువులాగా మానవుడు ఇతర ప్రాణులను చంపి తినడం అతి క్రూరత్వం" అని వేమనవారి సందేశం!

అంతే కాకుండా యజ్ఞ యాగాలలో బలులను ప్రోత్సహించేవారిని ఉద్దేశించి.. "పేరు సోమయాజి పెనుసింహబలుడయా! మేక పోతు బట్టి మెడలు విరుచు" అని కూడా అన్నారు!

ఒకానొక కాలంలో నరబలి ఇచ్చినవారు, గోవులను బలి ఇచ్చినవారు ఆ చంపబడిన జంతువులను యజ్ఞఫలం అని స్వీకరించేవారు. వారందరినీ అత్యంత దుష్కృత్యాలని వేమన తెగనాడాడు. అందువల్లనే వేమన సంఘ సంస్కర్తగా, మహా తత్వవేత్తగా కీర్తించబడ్డాడు. అలాంటి మహనీయుల బోధనలనే ఈనాడు పత్రీజీ సరళమైన రీతిలో వివరణలు ఇస్తూ విశ్వవ్యాప్తం చేస్తున్నారు.

మారం : పత్రీజీ చేస్తున్న పిరమిడ్ ధ్యాన ఉద్యమం గురించి"

డా||సముద్రాల : ఏదైనా ఓ ఉద్యమం ఫలవంతం కావాలి అంటే అది నాలుగు దిక్కులా పరిప్రచారం కావాలి! అందుకు కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు పట్టిన ఉదంతాలు చరిత్రలో అనేకం. అయితే .. పత్రీజీ చేపట్టిన పిరమిడ్ ధ్యానప్రచారం ఆ ఖ్యాతిని అతి తక్కువ కాలంలోనే సాధించింది!

1994లో పత్రీజీ తిరుపతికి వచ్చినప్పుడు వారు చేసిన ధ్యానప్రచార కార్యక్రమంలో హాజరయిన శ్రోతలలో నేనూ ఒకడిని. కొండంత ఆత్మవిశ్వాసంతో ఆనాడు వారు మాట్లాడిన మాటలను నేను కూడా అతిశయోక్తులుగానే భావించాను. కానీ ఆ తరువాత పత్రిగారి ధ్యాన, శాకాహార - పిరమిడ్ నిర్మాణప్రచారాన్ని నేను అంచెలంచెలుగా గమనిస్తూ వచ్చాను.

మొన్నటికి మొన్న "కడ్తాల్" లో జరిగిన ప్రపంచ ధ్యాన మహాసభలు ఆసాంతం పరిశీలించి ఆవేదికపై ప్రవచించే అవకాశం నాకు వచ్చినప్పుడు అక్కడ హాజరయిన లక్షలమందిని చూసి నేను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాను! వారి సంకల్పం, కృషి వల్ల కర్నూలు నుంచి కడ్తాల్ వరకు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు .. జరిగిన ధ్యానమహాప్రచారం ఇతరులవల్ల సాధ్యమయ్యేదికాదు. వారి మాటల్లో గాంభీర్యత, ఆత్మ విశ్వాసం ఆనాటికీ, ఈ నాటికీ ఒక్కటే!

ఇంత ఉవ్వెత్తున ధ్యానప్రచారం జరగడం .. జిల్లాల నుంచి మారుమూల గ్రామాల వరకూ, అరణ్యాలకూ, ఆశ్రమాలకూ వ్యాపించడం, అనేక ధ్యానకేంద్రాలు ఆవిర్భావం, అనేక పిరమిడ్ ధ్యానమందిరాలు నిర్మాణం చేయడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు.

గతంలో ఇలాంటివే ఎన్నో ఉద్యమాలు మొదలయ్యాయి కానీ .. పిరమిడ్ ఉద్యమంలో జనబాహళ్యంలోకి ఇంతగా చొచ్చుకునిపోయి విజయవంతం అయినవి వ్రేళ్ళమీద లెక్కించవచ్చు. ఈ లోకాన్ని ఉత్తమ మార్గంలోకి మళ్ళించడానికి ఏ ఏ మహనీయులు కృషిచేసారో వారి వారి ప్రబోధాలు, ప్రవచనాల ద్వారా మనల్ని మనం సంస్కరించుకోవడం ముఖ్యం!

సమాజాన్ని సంస్కరించడానికి కావలసిన సమున్నత ఆశయాలను పత్రీజీ తమ గ్రంథాల ద్వారా, ఆడియో- వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. తమ అఖండ ఆత్మజ్ఞాన భాండాగారాన్ని వారు భావితరాలవారికి అందిస్తున్నారు. కేవలం రెండు దశాబ్దాలకాలంలోనే ఇంత ప్రచారం ఎలా జరిగింది అని అందరూ ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు. ఇదంతా బ్రహ్మర్షి పత్రీజీ తపోబలం మాత్రమే ..

ఇవి అన్నీ ఎక్కడో మారుమూఅ ప్రదేశాల్లో జరిగిన వాటి గురించి చెప్పేమాటలు కావు! ఇవి సాక్షాత్తు నేను స్వయంగా పిరమిడ్ సొసైటీవారి అనేక కార్యక్రమాలలో పాల్గొని గ్రహించి విశ్లేషించి చెప్తున్న అక్షరసత్యాలు. అనల్పమైన ప్రచారం అల్పకాలంలో జరిగింది. ఇది పత్రీజీ విజయం!

Go to top