" ధ్యానం వల్ల ఎన్నో సమస్యలు మాయం "

నా పేరు పద్మ. మాది పాతపల్లె గ్రామం, తాడిపత్రి తాలుకా, అనంతపురం జిల్లా.

మేము 1996లో హైదరాబాద్‌కి వచ్చి ఒక కిరాణషాపు నడుపుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నాము. మా బాబు, పాప ఏడవ తరగతి వరకు " వికాస భారతి స్కూల్ " లో చదువుకున్నారు. అక్కడ ప్రతిరోజు మెడిటేషన్ చేయించేవారట. కానీ నాకు మెడిటేషన్ అంటే ఏమిటో అప్పుడు అస్సలు తెలియదు. అక్కడి టీచర్లందరూ పిల్లలందరితో ధ్యానం చేయించేవారు .. మరి దాంతో పిల్లలు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా రిలాక్స్‌డ్‌గా చదువుకునేవారు.

అయితే వేరే స్కూళ్ళల్లో ఉ|| 7 గం|| నుంచి రాత్రి 7 గం|| వరకు బాగా రుద్ది రుద్ది చదువులు చెపుతున్నారు కాబట్టి మనం కూడా స్కూలు మార్చేద్దామని మేము మా పిల్లలను " భాష్యం స్కూలు " లో వేసి .. ఎంతోమంది మూర్ఖపు తల్లిదండ్రుల్లాగె " పిల్లల పట్ల అది మా ప్రేమ, మరి బాధ్యత " అనుకున్నాము. ప్రతిరోజూ ధ్యానం చేస్తూ కార్పొరేట్ హింసలకు దూరంగా హాయిగా సహజస్థితిలో పెరుగుతున్న మా బాబుని ఇలా స్కూల్ మార్చడంతో ఇక మొదలైంది సమస్య. వాడు తన తెలివినంతా అల్లరిగా మార్చుకుని .. నేనేదైనా " ఇది చేయి " అంటే మాత్రం అది చేయకుండా తయారయ్యాడు. ప్రతిక్షణం నాకు వాడి గురించి బెంగతో మరి " భవిష్యత్తులో వాడేమైపోతాడో " అన్న చింతతో ఆలోచించీ, ఆలోచించి .. తలనొప్పి, స్పాండిలైటిస్, వెన్నునొప్పి మరి లో బి.పి వచ్చాయి.

మా కాలనీలో ఉన్న " ధ్యానాంధ్రప్రదేశ్ " ఎడిటర్ వాణి మేడమ్ వాళ్ళింటికి వెళ్ళి " మా బాబు చెప్పిన మాట వినడం లేదు .. ఏం చేస్తే మా బాబు మారుతాడు ? " అని అడిగాను. అప్పుడు మేడమ్ " మీకు ఏం తెలుసని మీ బాబుకు చెప్తారు? ముందు మీరు ధ్యానం చేసి పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసుకోండి. మంచి పుస్తకాలు చదువుతూ, ధ్యానం చేస్తూ 40 రోజులపాటు ఏమీ ఆలోచించకండి ; అన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. " అన్నారు.

ధ్యానంలోకి వచ్చిన పదిరోజులలోనే పత్రీజీని కలిసి " షేక్ హ్యాండ్ " తీసుకుందామని ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసుకి వెళ్ళి మా బాబు గురించి బాధలను సార్ దగ్గర ప్రస్తావించాను. అప్పుడు సార్ " నువ్వు అమాయకపు జీవులైన కోళ్ళనూ, మేకలను చంపి కూర వండుకుని తినేటప్పుడు నీకు బాధ అనిపించలేదా ? నీ దాకా వస్తేనే గుర్తుకు వచ్చిందా ? " అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. " సార్ ఇంతకు ముందు ఎప్పుడూ నన్ను చూడలేదు అయినా నేను మాంసాహారిని అని ఎలా గుర్తుపట్టారో " అనుకున్నా.

" ఇప్పుడు మేము అందరం మాంసం తినడం మానేశాం కానీ .. ఇతరులకు ధ్యానం గురించి చెప్పి ‘ మాంసం మానండి ’ అని చెబితే రుచిగా వండుకు తినేవాళ్ళు వింటారా సార్ ? " అన్నాను. అప్పుడు సార్ " నువ్వు చెప్పు, వాళ్ళు వినకపోతే నోరు మూసుకుని ఉండు ; సమాజం గురించి బాధ నీకెందుకు ? " అన్నారు.

అంతే .. సార్ కోపంగా అన్నమాటల గురించి ఆలోచించాను. " నేనెందుకు నోరు మూసుకుని వుండాలి ? నేను చేయాల్సింది మాంసాహారం పైన యుద్ధం కనుక నోరు మూసుకోవడం వల్ల లాభం లేదు " అని నిశ్చయించుకుని .. కనిపించినవాళ్ళ కల్లా మాంసాహారం ఎంత పాపాహారమో చెప్పడం మొదలుపెట్టాను. నిష్ఠగా పూజలు చేసే వీరభక్తులు కూడా అజ్ఞానం వల్ల ఈ పాపాహారం తింటూ ఎన్ని కర్మలు కూడగట్టుకుంటున్నారో వివరిస్తూంటే .. విన్న ప్రతివాళ్ళు కూడా " మాకు ఇన్నాళ్ళుగా ఈ విషయాలు తెలియదు " అంటూ శాకాహారుల్లా మారుతూండటం చూసి సత్యానికి వున్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను.

పత్రీజీతో ‘ షేక్‌హ్యాండ్ ’ తీసుకోవడం కంటే కూడా " పత్రీజీ ఆశయాలను నెరవేరుస్తూ సార్ దారిలో నడవడం ఇప్పుడు చాలా చాలా అవసరం " అని నాకు తెలిసింది. సత్యం కోసం, ధర్మం కోసం అహర్నిషలూ కృషి చేస్తూన్న ఆ మహానుభావుని అడుగుజాడల్లో నడవడమే ఇక ముందు నా కర్తవ్యం.

" ఒక గంటసేపు ధ్యానం చేయడం .. ఆరు గంటలు నిద్రపోతే వచ్చే శక్తికి సమానం " అని తెలుసుకున్న తరువాత " ఎంత ఎక్కువ నిద్రపోతే అంత ఆరోగ్యం " అనే అపోహ నాలో నుంచి మాయమైంది. ధ్యానం మొదలుపెట్టిన రోజు నుంచి నాలో అంతకు ముందులేని సహనం, ఓపిక నాకే తెలుస్తున్నాయి. నాలో ఉన్న చైతన్యాన్నీ, శక్తినీ, నిస్వార్థప్రేమనూ తట్టిలేపి .. మరి నాలో ఉన్న కోపాన్నీ, రాక్షసత్వాన్నీ తరిమికొట్టాను. మన జీవితానికి డబ్బు అవసరం. కానీ డబ్బే ప్రధానం కాదనీ, మరి పిల్లలు తప్పుచేస్తే వారికి సర్దిచెప్పాలనీ తెలుసుకున్నాను. ఇతర ప్రాణులను హింసించడం వల్ల మనపిల్లలే మనల్ని హింసిస్తారని అందరికీ చెపుతున్నాను. మా ఇంట్లో 4'X4' పిరమిడ్ పెట్టుకుని ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అందరితో ధ్యానం చేయిస్తున్నాను.

ఇంతకూ .. నేను ధ్యానంలోకి రావడానికి కారణమైన మా బాబు సంగతి చెప్పనేలేదు కదా .. ఎప్పుడైతే నేను వాడిని సతాయించడం మాని ధ్యానం చేస్తూ ఇంట్లో అందరితో ధ్యానం చేయిస్తూ వున్నానో .. ఇక సమస్యలన్నీ వాటంతట అవే సర్దుకోవడం మొదలైంది " అసలు ఇన్నాళూ నేనే వాడిని సరిగ్గా అర్థం చేసుకోలేదు " అన్న అవగాహనతో " పిల్లల పట్ల ఒక తల్లిగా వారికి సంపూర్ణమైన ప్రేమను అందివ్వటమే నా ధర్మం " అని తెలుసుకుని దానిని అమలులో పెట్టాను. దీంతో మా అబ్బాయి కూడా వాడి చదువు వాడే ఎంతో బాధ్యతగా చదువుకోవడం మరి ఖాళీ సమయాల్లో ఇదివరకు రోడ్డుపట్టుకుని తిరిగేవాడు ఇప్పుడు షాపులో వాళ్ళ నాన్నకి సహాయం చేస్తూ వున్నాడు .. వాడి కాలేజిలో కూడా లెక్చరర్లు వాడి ప్రవర్తనలో వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతున్నారు.

అంతకు ముందు నెలకోసారి నన్నూ మావారినీ కాలేజీకి పిలిపించి .. మా అబాయి గురించి ఫిర్యాదులు చేసి T.C ఇచ్చేస్తామన్న ప్రిన్సిపాల్ .. ధ్యానమహిమను తెలుసుకుని ఇప్పుడు నన్నే .. వాళ్ళ కాలేజీలో పిల్లలకు కూడా ధ్యానం నేర్పించమని అడగడం నిజంగా ఒక మహా అద్భుతం.

ఇంతకు ముందు ఒక మామూలు గృహిణిగా కాలేజీకి వెళ్ళి .. " ఏం వినాల్సివస్తుందో " అని లెక్చరర్లతో మాట్లాడటానికి కూడా భయపడే నేను .. ఈ రోజు వాళ్ళకే సలహాలు ఇచ్చేస్థాయికి ఎదిగానంటే ఇది అంతా ధ్యానం ద్వారా నాలో వచ్చిన అద్భుతమైన మార్పు మాత్రమే ఇలా తల్లిదండ్రుల అంతా కూడా ధ్యానం చేస్తే .. పిల్లలను చక్కగా అర్థం చేసుకుని ఒక సుహృద్భావ వాతావరణంలో వాళ్ళను పెంచి .. భవిష్యత్తులో ఒక మంచి సమాజాన్ని తప్పక నిర్మించగలుగుతాం.

 

- పద్మజా రెడ్డి,
హైదరాబాద్

సెల్ : +91 99891 14638

Go to top