" సరికొత్త ధ్యాన ప్రచార సాధన .. ‘ స్కైప్ ధ్యానం "

 

నా పేరు N.S.రావు. నేను పదేళ్ళ నుంచి ధ్యానం చేస్తూ రామకృష్ణాపురం. సికింద్రాబాద్‌లోని " కృష్ణా పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్, ధ్యాన కేంద్రం " ద్వారా ధ్యానప్రచారం చేస్తున్నాను. ప్రస్తుతం నేను అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర రాజధాని.. " ఆస్టిన్ " లో మా చిన్నబ్బాయి దగ్గర వున్నాను ; అమెరికా రావటం ఇది నాకు రెండవసారి.

మొదటిసారి 1999లో అమెరికా వచ్చినప్పుడు.. ఇక్కడి విద్యావిధానం గురించి అధ్యయనం చేశాను. కొన్ని పాఠశాలలకు కూడా వెళ్ళి అక్కడ గురించి అధ్యయనం చేశాను. కొన్ని పాఠశాలలకు కూడా వెళ్ళి అక్కడ నాకందిన సమాచారాన్ని బట్టి చూస్తే.. పరిస్థితి చాలా బాధాకరం అనిపించింది. ఇక్కడ సౌకర్యాలూ, వసతులూ, యంత్రాలూ పనిముట్లూ .. అన్నీ పుష్కలంగా వున్నాయి కానీ .. ఆధ్యాత్మిక చింతనగానీ, బోధన కానీ .. అసలు లేవు. ఈ సమయం లోనే కొలరాడోలో " క్రిమ్‌సన్ సర్కిల్ " ప్రారంభించబడింది. గొప్ప గొప్ప మాస్టర్స్‌తో " టోబయాస్ " సందేశాలు వినిపించటం ఆ సంస్థ ధ్యేయం. నేను వారి నుంచి " ఆత్మలో ఆధ్యాత్మిక చైతన్యం వస్తున్నది తీలుసుకోండి ; మీకు సాయపడేందుకు మేమున్నాము ; మీరు ఎప్పటికీ ఏకాకి కారు, ఈ నవశక్తిని పొందండి " అన్న సందేశం అందుకుని .. ఎంతో ఆశ్చర్యపోయాను.

ఇండియా రాగానే .. అక్కడ " క్రిమ్‌సన్ సర్కిల్ " సంస్థలో నేను తెలుసుకున్న విషయాలనే ఇంకా విపులంగా, ఆచరణాత్మకంగా చెబుతోన్న పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో .. జూన్ 2002లో చేరాను. ఇక అప్పటి నుంచి నిరంతర ధ్యానసాధన మరి ధ్యానపచారంతో మునిగితేలుతూన్న నేను రెండవసారి.. ఇప్పుడు అమెరికాకి వచ్చి.. పత్రీజీ ప్రోత్సాహం మరి ఆశీస్సులతో ఇక్కడ ధ్యానప్రచారం మొదలుపెట్టాను. నేనిక్కడ వుండే కొద్ది సమయంలో వీలైనంత ఎక్కువ మందికి ధ్యానం నేర్పాలనే తపన మొదలైంది ; రాత్రింబవళ్ళు ఇదే ఆలోచన మరి ఇదే పని.

వచ్చిన మరుసటిరోజే ఇంట్లో అందరం పిరమిడ్ టోపీలు పెట్టుకుని ధ్యానం చేశాం. రెండున్నర సంవత్సరాలున్న మా బుల్లి మనుమరాలు .. " ప్రియ " కూడా ఒకరోజు నా గదిలో " యూట్యూబ్ ఛానెల్‌లో పత్రీజీ పాడిన త్యాగరాజకీర్తన నేను వింటూంటే వచ్చి .. పాటంతా విని చప్పట్లు కొట్టి " తాతా, ఆ పాట మళ్ళీ పెట్టవా ? " అని అడిగి మరీ పెట్టించుకుని పూర్తిగా మరి కదలకుండా కూర్చుని విని మరీ మళ్ళీ చప్పట్లు కొట్టింది. " నర్సరీ రైమ్స్ " తప్ప మరేమీ తెలియని చిన్నపిల్ల ఆ విధంగా ఆనందించటం నాకెంతో ఆశ్చర్యం అనిపించింది.

జూన్ 19 వ తేదీన " వెంకట్ ఇంద్రకంటి " గారి ఆహ్వానంతో ఆస్టిన్ హిందూ దేవాలయంకు వెళ్ళి అక్కడ చిన్న పిల్లలకు ఒక మంచి ధ్యానం కథ చెప్పి, దాని నీతి చెప్పి ధ్యానం చేయించి వచ్చాను. " ఆస్టిన్ " లో ఒక ధ్యాన కేంద్రం ప్రారంభిస్తే బాగుంటుందనిపించి.. " స్పిరిచ్యువల్ అమెరికా టీమ్ " సభ్యులు.. " ధ్యానయుక్త ", " ప్రబోధ్ " మరి " దివ్య " లను సంప్రదించాను.

" స్పిరిచ్యువల్ అమెరికా టీమ్ " జరుపుతున్న " శనివారం కాల్ క్లాసులో ఎసోసియేట్‌గా పాల్గొన్న డా|| సుధా కోడూరి గారు, రామకృష్ణ గారు మరి ఇతర సభ్యుల సంభాషణ వినటంవల్ల .. ఇక్కడి పరిస్థితులు మీద కొంత అవగాహన కలిగి బెల్జియం పిరమిడ్ మాస్టర్ " సంపత్ " సహాకారంతో " మెడిటేషన్ ఆన్ స్కైప్ " కార్యక్రమాన్ని మొదలుపెట్టాను.

మొదటి సెషన్ .. జూలై 25 వ తేదీ ( గురుపౌర్ణమి రోజు ) ఉదయం 10 గంటలకు ( GST.8.30 PM) ప్రారంభించాను. ఎనిమిది మంది పాల్గొన్నారు అందులో .. కానీ క్రమక్రమంగా ఈ సంఖ్య ఇప్పుడు 60కి పెరిగింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల ధ్యానులతో పాటు బెల్జియం, ఆస్ట్రియా, ఇండియా, శ్రీలంక, దుబాయి వాళ్ళు కూడా ఇందులో చేరారు ; సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ క్లాసులు నడుపుతున్నాము.

ఈ సెషన్స్‌లో మొదటి 15 నిమిషాలు ధ్యానం, తరువాత క్రొత్తగా చేరిన వాళ్ళ పరిచయం ఆపై క్రిందటి క్లాసులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోవటం వుంటుంది. తరువాత 30 నిమిషాలు " ఈ రోజు జ్ఞాన అంశం " గురించి మరి చివరి 10 నిమిషాల్లో ప్రశ్నలకు సమాధానాలు, అనుభవాలు పంచుకోవడం చేస్తాము. పుస్తక పరిచయం, స్వాధ్యాయం, మంచిమాట ( సూక్తులు ) వినిపించటంతో పాటు పత్రీజీ ధ్యాన కార్యక్రమాల గురించి చెప్తాము.

ఇందులో మా ముఖ్యధ్యేయం, ఈ సెషన్స్‌లో పాల్గొంటున్న వాళ్ళందరూ మంచి పిరమిడ్ మాస్టర్స్‌గా తయారై వాళ్ళవాళ్ళ రాష్ట్రాల్లోనూ, దేశాల్లోనూ వీలైనంత త్వరగా వీలైనంతా ఎక్కువగా ధ్యానప్రచారం చెయ్యటానికి అన్నివిధాలా సహాయపడటం, మరి వారికి ధ్యాన ప్రచారంలోని మెళకువలు తెలియజెయ్యటం.

" SKYPE " ద్వారానే కాకుండా, నేను " ఫేస్‌బుక్ " ద్వారా, " నమస్తే చికాగో రేడియో " ద్వారా, " ఇండియా అబ్రాడ్ " వీక్లీ ద్వారా, " ఇ. మెయిల్ " ద్వారా కూడా ధ్యాన ప్రచారం " చేస్తున్నాను. దీనికి ముఖ్యకారణం, నేనిక్కడికి వచ్చే ముందు బ్రహ్మర్షి పత్రీజీ నాకిచ్చిన ప్రోత్సాహం, ఆశీస్సులు మరి " తెలుగువారు ప్రపంచానికి వెలుగువారు " అని వారన్న మాటలు ...

" SKYPE "

అసలు " స్కైప్ కార్యక్రమం " ఎలా చేస్తారో తెలుసుకుందాం. అమెరికాలోని మా మోడరేటర్ " దివ్య .. " తెలిసిన ధ్యానులందరికీ ఇ మెయిల్ ద్వారా, ఫోన్ ద్వారా .. స్కైప్ కార్యక్రమం జరిగే తేదీ, సమయం మరి ఆరొజు అంశం .. తెలియజేస్తుంది. స్కైప్ గుర్తింపు కార్డు వున్న వాళ్ళు ఎవరైనా మా కామన్ స్కైప్ I.D : " Spiritual.america " కు క్లిక్ చేస్తే మేము వాళ్ళను కలపుతాము. అప్పుడు మీరు మాట్లేడేది మీకూ వినబడుతుంది, క్లాస్ మొదలయ్యే ముందు " మీరు మ్యూట్‌లో వెళ్ళండి " అని చెబుతుంది. మళ్ళీ మిమ్మల్ని పిలిచి మాట్లాడమంటే " ఆన్ మ్యూట్ " చేసుకుని చెప్పాలి. " మీ చుట్టూ అనవసరమైన ఇతర శబ్ధాలు లేకుండా చూసుకోండి " అని కూడా చెబుతుంది.

ఇది మన ధ్యాన ప్రచారంలో ఒక విప్లవాత్మకమైన మార్పుగా మేం భావిస్తున్నాం. దీని ద్వారా మనం వెళ్ళలేని దేశాలకు కూడా మన ధ్యాన సందేశం తక్షణం అందించవచ్చు. ఇలా మనం కాలాన్నీ, దూరాన్నీ జయిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల్ని కూడా అధిగమించగలుగుతాం ; మరి జగత్ కుటుంబాన్ని కలుపగలుగుతాం.

ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి ముఖ్యకారకులైన పత్రీజీకి ప్రణామాలు ; డా||సుధా కోడూరి రామకృష్ణ గారు, సంపత్, దివ్య, ప్రబోధ్ అచ్యుత్ మొదలైన వారందరికీ నా కృతజ్ఞతలు, జై ధ్యాన జగత్ ..

 

N.S.రావు
సికింద్రాబాద్

Go to top