" డాక్టర్‌గా నా ధ్యాన ప్రచారం "

 

 

నా పేరు గోపీనాథ్. నేను నెల్లూరు జిల్లాలోని గూడూరులో డాక్టరుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ధ్యానంతో పాటూ నేను స్వాధ్యాయం బాగా చేసేవాడిని కానీ ధ్యానంలోకి వచ్చిన నేను " అహం " వల్ల సజ్జన సాంగత్యం మాత్రం ఉండేది కాదు. అందువల్ల నా ఆధ్యాత్మిక జీవితం యొక్క అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే వుండేది. నాయుడుపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ రాఘవేంద్రరావు గారి పరిచయం తర్వాత ఆయన ప్రోత్సాహంతో గూడూరులో ధ్యానం గురించి క్లాసులు పెట్టడం జరిగింది.

ఆ తరువాత కొద్దిరోజులకే గూడూరులో రేవతీ మేడమ్ గారిని కలవమని మెస్సేజ్ రావడం మరి మిత్రుడు పిరమిడ్ మాస్టర్ రాజ్‌సుమన్ సహకారంతో గూడూరులోని సబ్‌జైలులో మరి ఇతర ప్రదేశాలలో మేడమ్ గారి క్లాసులు పెట్టించడం జరిగింది.

నా చిన్న చిన్న ఆనారోగ్య సమస్యలు ధ్యానం చేసిన వెంటనే పోగొట్టుకోగలగడంతో పాటు మా అమ్మ గారికి ఎన్ని సంవత్సరాలు వైద్యం చేసినా నయంగాని ఆనారోగ్య సమస్యలు కూడా ఆమె ధ్యానంతో శాశ్వతంగా నివారించుకో గలిగింది.

ఇంతవరకు నేను కొన్నివేలమందికి అల్లోపతి వైద్యం చేశాను. అయితే ఈ అల్లోపతి వైద్య వృత్తిలో పేషంట్లకు శారీరక లక్షణాలకు మాత్రమే మందులు ఇవ్వడం వల్ల .. " వాళ్ళు తమ ఆత్మశక్తిని గురించి తెలుసుకోనీకుండా నేను అడ్డుపడుతున్నాను " అని అర్థం అయ్యింది. అలాంటి సమయంలో మనస్తాపానికి గురై ఈ వృత్తిని వదిలివేయాలని నేను, నా భార్య డాక్టర్ " స్పందన " అనుకున్నాం. కొద్దిరోజులకే గవర్నమెంట్ నుంచి " ఫిజికల్లీ డిసేబుల్డ్ సర్టిఫికేట్స్ " ఇష్యూ చేసే ప్రాజెక్టుకి మేము ఇద్దరం సెలెక్ట్ అయ్యి మందుల గోల లేకుండా కేవలం వికలాంగులకు నిర్ధారణ పరీక్షలు చేసే విధంగా మేము నియమించబడ్డాం. ఆ విధంగా " ధ్యానం వల్ల ఏదైనా సాధించవచ్చు " అని తెలిసింది.

ఇప్పుడు నేను నా దగ్గరికొచ్చే మామూలు పేషెంట్లకు మాంసాహారం ఎలా చెడు చేస్తుందో తెలియజేస్తూ అనారోగ్యంలో నుండి బయట పడాలంటే ధ్యానం ఎలా సహకరిస్తుందో వివరిస్తూ ధ్యానం చేయించి పంపుతున్నాను. పాజిటివ్ ఆలోచనా విధానం, మన జీవితాన్ని ఎలా మలుస్తుందో చెప్తూంటాను. నా స్టాఫ్‌కి నేర్పించి పేషంట్లకు ధ్యానం నేర్పడం కోసం వాళ్ళను అందుబాటులో వుంచడం జరుగుతోంది.

చివరగా ఒక ధ్యానానుభవం : 7.9.2010 వ తేదీన గూడూరులో పత్రీజీ మీటింగ్‌లో జరిగింది. అందరం ఆ ఏర్పాట్లు హడావిడిలో ఉన్నాము. ఆ మీటీంగ్‌కు సరిగ్గా రెండు రోజులు ముందు నాకు " కండ్లకలక " వచ్చింది. దాంతో నేను ఆందోళన చెంది " ఇలా జరిగితే నేను మీటింగ్ పనుల్లో పాల్గొనలేను ; పత్రి సార్‌ని కలవలేను " అని బాధపడి సంకల్పం పెట్టుకుని పడుకోబోయే ముందు ధ్యానం చేసి పడుకున్నాను.

ఉదయం నిద్రలేచి చూసే సరికి ఎర్రగా, నీళ్ళు కారుతూ వుండవలసిన నా కళ్ళు తెల్లగా, ఇరిటేషన్ అంతా తగ్గిపోయి స్వచ్ఛంగా మారిపోయి వున్నాయి. దాంతో వెంటనే ధ్యానం చేస్తే ధ్యానంలో ఒక మహానుభావుడు నల్ల కళ్ళజోడుతో కన్పించాడు.

నేను వెంటనే " మీకు ఆ స్థాయిలో, అక్కడ కూడా, కళ్ళజోడు అవసరమా ? ? " అని అడిగాను.

వెంటనే ఆయన " ఒరే, ఇది నీదిరా. నువ్వక్కడ పనులు చేస్తావని నీది నేను తీసుకున్నాను " అన్నాడు. వారికి ఆ ధన్యవాదాలు తెలియజేసాను.

 

డా|| గోపీనాథ్
గూడూరు

Go to top