" జ్ఞానంతో కర్మలు దగ్ధం చేసుకున్నాము "

 

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో " స్వాధ్యాయం " కోసం కృషి అద్భుతంగా చేసినవారు సీనియర్ మాస్టర్లు శ్రీ పాపారావు, శ్రీమతి ఆదిత్యకుమారి దంపతులు. అందమైన " 23 బ్రోచర్ల " సంకలనంతొ వెలువడిన " ఆత్మజ్యోతి " ఫోల్డర్ ఎంతోమంది ధ్యానయోగులకూ, పిరమిడ్ మాస్టర్లకూ మరి క్రొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారికి ఎంతగానో ఉపకరించింది, మరి మార్గదర్శకమైంది. ఎంతోమంది ఈ బ్రోచర్స్‌ను బ్రహ్మర్షి పత్రీజీ యొక్క ఆధ్యాత్మిక ప్రిస్క్రిప్షన్‌గా స్వీకరించారు. " శ్రీకృష్ణామృతం - ఉత్తరగీతాజ్ఞానసారం " పుస్తకం ఈ దంపతుల అమోఘ కృషికి నిదర్శనం. " నా చిరకాలవాంఛను నువ్వు తీర్చావయ్యా పాపారావ్ " అనే పత్రీజీ అభినందన వీరి కర్మలను దగ్ధం చేసింది. " జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం " అనే శ్రీకృష్ణ సందేశం వీరి జీవితాల్లో స్పష్టంగా సాక్షాత్కారమైంది. ఈ పిరమిడ్ ఆదర్శ దంపతుల గురించి తెలుసుకుందామా ..

మారం : ధ్యాన దంపతులకు ఆత్మప్రణామాలు. మీరు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి ఎప్పుడు ప్రవేశించారు? ఆ సందర్భం ఏమిటి ?

ఆదిత్యకుమారి : 2003 నవంబర్ 3 వతేదీన సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ నరేంద్ర, ప్రేమా మేడమ్ గార్ల ధ్యాన ప్రవచనం ఇందిరాపార్క్‌లో విన్నాను. అయితే ధ్యానంలోకి రావడానికి ముందు 20 సంవత్సరాలు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలో తర్ఫీదు తీసుకోవడం జరిగింది.

పూజలు, స్తోత్రాలు : మహిషాసురమర్దిని స్తోత్రాలు, లలితా సహస్రనామాలు, సౌందర్యలహరి మొదలైనవాటిని మానసికంగా పఠిస్తూ ఉండేదాన్ని. వాటిలో మానవ శరీరంలోని షట్చక్ర వ్యవస్థ యొక్క ప్రస్థావనను చూసి, వాటి విశ్లేషణలను చదివి ‘ శక్తిరూపం’ గా మనం బాహ్యంగా పుజిస్తున్నది మానవశరీరంలోనే నిక్షిప్తమై వుంది, అదే కుండలినీ శక్తి, అదే షట్చక్ర వ్యవస్థ అన్న అవగాహనను పొందాను.

మంత్రజప సాధన : సూఫీ గురువు గారి నుంచి మంత్రోపదేశం తీసుకుని చాలా సంవత్సరాలు సాధన చేసాము. పుజలు, స్తోత్రాలు చేసినప్పుడు, మంత్రోపాసన చేసినప్పుడు కూడా ఎన్నో ప్రత్యక్ష, పరోక్ష అనుభవాలను పొందాము. మంత్ర సాధనలో సూక్ష్మశరీరయాన అనుభవాలు కూడా పొందగలిగాము.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారి ఆనాపానసతి ధ్యాన పద్ధతి కంటే ముందు 25 సంవత్సరాలు సమకాలీనంగా వున్న అన్ని ప్రక్రియలలో ప్రవేశించి సాధన చేసినా సంతృప్తికరమైన అనుభూతి రాలేదు. " ఇంకా ఏదో వుంది ; ఇంకా ఏదో తెలుసుకోవాలి " అనిపించేది.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి వచ్చిన తర్వాత ఇందులోనే స్థిరపడడం జరిగింది. " పూజకోటి సమం స్తోత్రం .. ధ్యానకోటి సమో లయః " అంటూ ఉత్తరగీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అన్ని పద్ధతులనూ అధ్యయనం చేసి పిరమిడ్ సొసైటీ .. ఆనాపానసతి ధ్యానంలో స్థితమయ్యాను. ఎంతో సులభమైన ఈ పద్ధతిలో నాకు ఎంతో సౌలభ్యం అనిపించింది. అంతకుముందు " క్రియాయోగం " చేసేదాన్ని ; అందులోని అలసట ఇందులో కనిపించలేదు.

మారం : మీ కుటుంబంలో కలిగిన " పెనుతుఫాను " అనే ఒక ముప్పును ధ్యానశక్తి ద్వారా మీ దంపతులు ఎలా ఎదుర్కొన్నారు ?

ఆదిత్యకుమారి : మా కోసం సమయాన్ని వెచ్చించి నేను, నా భర్త పాపారావు గారు స్వీయ ఆత్మపరిశీలన పొందాలని మా ఉద్యోగాల నుంచి స్వచ్ఛంద విరమణ తీసుకున్నాం .. 2005 లో. అప్పటికి నాకు ఇంకా పది సంవత్సరాల సర్వీస్ మిగిలివుంది. నాకు 50 సంవత్సరాల వయస్సు అప్పుడు. ఆ వెనువెంటనే ఒక కుటుంబపరమైన పెనుతుఫానులో చిక్కుకున్నాం. అసలు నేను, మావారు, మా చిన్నబాబు ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి అప్పుడు తలెత్తింది. అయితే నా అంతరాంతరాలలోని సందేశం వల్ల, ధ్యానాంధ్రప్రదేశ్ ఆఫీసుకు వెళ్ళి ధ్యానం పుస్తకాలు, పాత ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకాలు అన్నీ కూడా తెచ్చుకుని చదివాను. రావుల అంజయ్య. మెగా మురళి గార్లు " మహాబోధి ఫంక్షన్ " హాల్లో ఏర్పాటు చేసిన 40 రోజుల ధ్యానశిక్షణా కార్యక్రమంలో పాల్గొనడం మొదలుపెట్టాను.

పాపారావు : ఆనాపానసతి 40 రోజుల కార్యక్రమం మహాబోధిలో 6 వతేదీ నవంబర్ 2005 న మొదలైంది. అంతకుముందు రోజు A.S రావ్ నగర్‌లో జరిగిన ఒకానొక ధ్యానశిక్షణా కార్యక్రమానికి పత్రీజీ వచ్చి " మీరందరూ అమ్మలక్కల కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నారు " అని తిట్టడం జరిగింది. నేనూ హాజరయ్యాను ఆ ప్రోగ్రామ్‌కి. కానీ నాకు పత్రీజీ యొక్క ‘తిట్టడం’ నచ్చలేదు. అందుకే ముందు మహాబోధికి వెళ్ళలేదు. అంతలోనే మా ఆవిడను అసంతృప్తి పరచడం ఎందుకని ఒక వారం తరువాత వెళ్ళాను. మా ఆవిడ తీసుకువచ్చిన " స్పిరిచ్యువల్ రియాలిటీ CD " చూడడం మరి మాస్టర్స్ ప్రవచనాలు విన్నాం. ఒక వారం రోజులు మిస్ చేసుకున్నందుకు నాకు ఎంతో బాధ కలిగింది. " ఏదో ఊహించుకుని అనవసరంగా తప్పు చేశాం " అనిపించింది. అప్పటికే మేం పీకలదాకా సమస్యల్లో ఇరుక్కున్నాం. ఆ సందర్భంగా ఆ 40 రోజుల మండల ధ్యాన కార్యక్రమంలో " కర్మల ప్రక్షాళన ఎలా జరుగుతుంది ? " అనే విషయం గురించి మీరు ఇచ్చిన వివరణ నాకు చాలా నచ్చింది. ఒక రోజు చేయని నేరానికి తనపై నింద వేసుకుని కర్మలు తొలగించుకున్న ఆ ఉదాహరణ కథ రూపంలో మీరు చెప్పడం విని ఆలోచనలో పడ్డాను.

మేం చేయని నేరాలు, మోపబడిన నిందలు మాపై అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్లో, పేపర్స్లో ఒక వారంరోజులపాటు అదేపనిగా ప్రసారమయ్యాయి. ఏ పత్రిక చూసినా, ఏ ఛానెల్ చూసినా ఆ వారామంతా ప్రసారమైన ఆ న్యూస్ చూసి .. జీవితం అంటేనే జుగుప్స కలిగింది. ధ్యానంలోకి రాకపోయి ఉండినట్లయితే నేను, నా శ్రీమతి, మరి మా చిన్నబ్బాయి " శశి " .. అందరి ఆత్మహత్యలు జరిగి వుండేవి. అదే సందర్భంలో " మహాబోధి " లో మీరు చెప్పిన కథ విని ఆత్మపరిశీలన చేసుకుని మరింత ధైర్యంతో ఆ సమస్యను ఎదుర్కోవాలనిపించి ఎదుర్కొన్నాం. అప్పటికే నేను పది సంవత్సరాల నుంచి High B.P. పేషెంట్‌గా వుండి మందులు వాడేవాడిని. ధ్యానంలోకి వచ్చిన 20 రోజులకే నేను టాబ్లెట్స్ మానేశాను. ఇప్పటిదాకా అదే కంటిన్యూ అవుతోంది.

మేము ఆ కేసు నుంచి బయటపడడానికి ధ్యానం మరి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అయిన మీరు, రాజశేఖర్ మరి ముఖ్యంగా మెగా మురళి గారు కారకులు.

మన కర్మలు పదిమందితో పంచుకోవడం వల్ల కర్మలు త్వరగా ప్రక్షాళన అవుతాయని మీరు చెప్పింది మాకు కొండంత బలాన్నిచ్చింది. " మీరు సరియైన మార్గంలో వున్నారు ; ఇందులో కంటిన్యూ అవ్వండి " అని రాజశేఖర్ గారు చెప్పారు. ఆ ధైర్యంతో మేము పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో ముందడగు వేశాం. ఇక మెగా మురళి గారు మాకిచ్చిన ధైర్యం, స్థైర్యం మాటల్లో వర్ణించలేనివి. అంతా ఇంతా కాదు. " మీరు ధ్యానం అనే బుల్లెట్ ప్రూఫ్ కవచం వేసుకున్నారు ; మీకు ఏ దెబ్బలూ తగలవు ; ఈ సవాలు నుంచి మీరు బయటపడతారు " అనే నైతికపరమైన ధైర్యాన్ని ఆయన ఇచ్చారు. బంధువులంతా కూడా మాకు జరిగినదానికి మమ్మల్ని దోషుల్లా చూస్తూ గుసగుసలాడుకుంటూంటే .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడా " మేము మా సమస్యనూ, అపనిందలనూ, కేసునీ, కర్మలనూ తొలగించుకునే మార్గం, అవకాశం మాకు వచ్చింది " అని చూశారు, మాకు ధైర్యం చెప్పారు. పిరమిడ్ మాస్టర్లు నిజంగా దేవతలు .. పత్రీజీ వెంట దివి నుంచి భువికి దిగివచ్చిన ఈ దేవతలే మమ్మల్ని తమ ప్రబోధాలతో కాపాడారు .. " ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి " అని మేం నిర్ణయం తిసుకోవడానికి పిరమిడ్ మాస్టర్లు ఇచ్చిన నిరంతర ప్రోత్సాహం మాత్ర్రమే కారణం. వారిచ్చిన ధైర్యం, స్థైర్యం మాకు కొండంత అండ అయ్యి మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడింది. అలాగే సరళా మేడమ్ నాకెంతో స్ఫూర్తినిచ్చిన మరో పిరమిడ్ మాస్టర్.

మారం : బ్రహ్మర్షి పత్రీజీని మీరు మొట్టమొదట ఎప్పుడు కలిశారు ? ఎక్కడ ? వారిని చూసినప్పుడు మీలో కలిగిన మనోభావాలు ?

ఆదిత్యకుమారి : నిందపడి మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు నేను పత్రీజీని చూసాను, మల్కాజ్‌గిరిలో. క్లాస్ అయిపోయి ఇక ఆయన వెళ్ళిపోతారనగా సరళా మేడమ్ " ఆదిత్యకుమారి గారూ, పత్రీజీ ఇక వెళ్ళిపోతారు .. రండి, వారిని కలుద్దురు గాని " అన్నారు. ఎంతో బలహీనస్థితిలో వున్న నేను పత్రీజీ దగ్గరకు తెల్లమొహం వేసుకుని వెళ్ళాను. ఆయన నన్ను చూసిన చూపు " వచ్చావా " అని నేను తెలిసినట్లున్న ఆ ఫీలింగ్ .. "ఊ" అన్నారు పత్రీజీ. నేను షేక్‌హ్యాండ్ తీసుకున్నప్పుడు " చేరవలసిన చోటుకు నేను చేరిన ఆ ఫీల్ " వారి చూపులో నాకు కనిపించింది. క్రమంగా మా వారు కూడా పత్రీజీకి అత్యంత చేరువయ్యారు. పత్రీజీ మావారి భుజం మిద చేయివేసి స్నేహితుడిగా స్వికరించేంతగా ..

పాపారావు : పత్రీజీ మహాబోధికి వచ్చినప్పుడు వారు నా భుజం మీద చేయివేసి దగ్గరికి తీసుకున్నారు. మనం వెంపర్లాడనవసరం లేకుండా వుంటే ఆయనకే తలంపు కలిగి మన దగ్గరకు వస్తారని నాకు అర్థమైంది. మహాబోధిలో 40 రోజుల ధ్యానశిక్షణా కార్యక్రమంలో మేము ఆనాపానసతిలో పూర్తిగా లగ్నం అయ్యాము. అంతకుముందు ఆదిత్యకుమారి M.A. ఆస్ట్రాలజీ చేసారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సులు చేసారు. ఆధ్యాత్మిక అంటే ఎంతో ఇష్టం వున్న తనకు నెయ్యి వచ్చి రొట్టె మీద పడినట్లయింది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో.

మారం : ధ్యానప్రచారం చెయ్యాలనే సంకల్పం మీకు ఎలా కలిగింది ?

పాపారావు : 2004 లో మేము పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో ప్రవేశించిన తర్వాత పిరమిడ్స్తో నిండిన కేర్ సెంటర్ R.P.రోడ్‌లో మాత్రమే వుండేది. మా ప్రాంతంలో ఎక్కడా కేర్ సెంటర్ లేదు. అప్పుడు " 2004 ధ్యానాంధ్రప్రదేశ్ " ఉత్సవాలు అయిన వెంటనే మెగా మురళి, సరళా మేడమ్ గార్ల ప్రోత్సాహంతో జనవరి 3 వ తేదీ 2005 బ్రహ్మర్షి పత్రీజీ తమ దివ్యహస్తాలతో మా ఇంటిపైన " గౌతమబుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం " మరి లైబ్రెరీని ప్రారంభించారు.

మారం : ఇంకా చెప్పండి ..

ఆదిత్యకుమార్ : దాదాపు సంఘంలో వెలివేయబడినంతటి నిందతో పదిమందిలో తిరగలేక జివచ్ఛవాల్లాగా బ్రతుకును ఈడ్చవలసిన స్థితిలో వున్న మేము మా కేర్ సెంటర్లో ధ్యానప్రచారం చేయడం జరిగింది. నేను చేయగలగిన ధ్యాన సేవ వల్ల నా దగ్గరికే ఎంతోమంది వచ్చి ధ్యానం నేర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించారు పత్రీజీ. ఇక రెండవ అవకాశం కూడా మళ్ళీ నేనెక్కడికీ వెళ్ళకుండా నా దగ్గరికే ఎంతోమంది వచ్చి ధ్యానం నేర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించారు పత్రీజీ. ఇక రెండవ అవకాశం కూడా మళ్ళీ నేనెక్కడికీ వెళ్ళకుండా నా దగ్గరకే వచ్చింది. నేను బాగా మానసికంగా, శారీరకంగా కృంగిపోయి ఎక్కడికీ వెళ్ళలేని స్థితిలో వుంటే నేనున్నచోటే నేను ఎంతో గొప్ప ధ్యానసేవ చేసే అవకాశం నాకు పత్రీజీ కల్పించడం ఎంత భాగ్యమో మరెంత సౌఖ్యమో. ఆ భాగ్యం మాకు " బ్రోచర్స్ " తయారుచేయడం ద్వారా వచ్చింది.

పుస్తకాలలో వున్న సారాంశాన్నంతా బ్రోచర్స్ రూపంలో తీసుకురావడం. అందరూ పుస్తకాలు చదవడం లేదు. అలాంటివారు ఆయా పుస్తకాలలోని సారాంశాన్ని ఏర్చికూర్చబడిన విధంగా ‘బ్రొచర్స్’ తయారుచేసే అవకాశాన్ని పత్రీజీ మాకు కల్పించడం మా దంపతుల భాగ్యం. ఇందులో మేము పూర్తిగా మునిగిపోయి అత్యంత సంతృప్తికరంగా జీవితం గడుపుతున్నాం. ఇక మూడవ భాగ్యం పత్రీజీ చెప్పినవి పుస్తకరూపంలో తిసుకోవడం.

మారం : పాపారావు గారూ, మరి బ్రోచర్స్ ఇంత అద్భుతంగా తీసుకురావడం వెనుక నేపథ్యం చెప్పండి ?

పాపారావు : 2005 జూన్లో మానససరోవరం యాత్రకు వెళ్ళాం మేము. 2004 జూలై 12 వ తేదీన కేదార్‌నాథ్ - బదరీనాథ్ యాత్రకు మేము వెళ్ళవలసి వుండింది. అయితే అక్కడ కొండచరియలు విరిగిపడడం వల్ల మా యాత్ర రద్దు అయింది. ఆ తరువాత జూలై 14 వ తేదీనే మా కుటుంబం పెనుతుఫానులో చిక్కుకోవడం, ఆ తర్వాత మేము పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలోకి రావడం, 40 రోజుల మండల ధ్యాన కార్యక్రమం, 2004 డిసెంబర్ జింఖానా గ్రౌండ్స్‌లో ఏడురోజుల ధ్యానమహాయజ్ఞం, జనవరి 3, 2005 న మా ఇంటిపైన గౌతమబుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం, ఆ తరువాత మేగా మురళి గారి ప్రోద్బలంతో 2005 జూన్లో మానససరోవర యాత్రకు వెళ్ళడం, అక్కడి నుంచి వస్తూనే బ్రహ్మర్షి పత్రీజీ " తెలుగులో గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల సందేశాలను మనం బ్రోచర్స్‌ని తిసుకురావాలి " అని చెప్పడం, వెంటవెంటనే మా మొట్టమొదటి బ్రోచర్స్ " వేమనవాణి ", " గురువాణి " పేర్లతో వేమన గారి యొక్క , వీరబ్రహ్మేంద్రస్వామి వారి యొక్క పద్యాలు మల్టీకలర్‌లో సరిక్రొత్త గెటప్‌లో తీసుకురావడం జరిగింది. క్రమంగా " ఇంతింతై వటుడింతై " అన్నట్లుగా ఇప్పటికి మొత్తంగా 23 బ్రోచర్స్ తీసుకువచ్చాం.

మారం : మానససరోవరం గురించి మాట్లాడినప్పుడల్లా మీ కళ్ళలో ఎంతో మెరుపు. మరి ఇప్పుడు కూడా. అదేంటో వివరించండి మేడమ్.

ఆదిత్యకుమారి : మానససరోవరంలో యోగులు ప్రశాంతంగా ధ్యానం చేస్తూంటే వుండే అనంత ప్రశాంతతను నేను అక్కడ ఫీలయ్యాను. " అసలు అందులో .. ఆ మానససరోవర సరస్సులో అడుగుపెట్టే అర్హత నాకుందా ? " అనే భావనతో నేను అడుగుపెట్టాను " ఒక సరస్సులో కాదు, ఒక సముద్రంలో అడుగుపెట్టాను " అన్న అనుభూతి కలిగింది అడుగుపెడుతూనే. ఉవ్వెత్తున కనపడే కెరటాలేం లేవు కానీ చిన్న అలలు కూడా ఎంతో బలంగా తోశాయి నన్ను. నేను ముందునుంచే ఆస్తమా పేషెంటుని. క్రమం తప్పకుండా ఇన్‌హేలర్ వాడేదాన్ని. అయితే మానససరోవర యాత్ర మొదలుపెట్టి పూర్తయ్యేవరకు నేను ఒక్కసారి కూడా ఇన్‌హేలర్ వాడలేదు. ఇక మానససరోవర యాత్రకు వెళ్ళేటప్పుడు మాకు బెంగళూరు ఎయిర్‌పోర్టులో పత్రీజీ వీడ్కోలు ఇచ్చారు. తిరిగి వచ్చి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు మళ్ళీ పత్రీజీయే స్వాగతం చెప్పారు .. ఒక తండ్రి తన పిల్లలకు ఇచ్చిన ఆదరణ, మరి దానికంటే ఎక్కువ కరుణ ఆయన కళ్ళల్లో నాకు కనిపించింది .. పత్రీజీ ఒక్కొక్కరినీ పలకరించి షేక్‌హ్యాండ్ ఇచ్చి స్పర్శించినప్పుడు.

మారం : " గురువాణి ", " వేమనవాణి " తరువాత వచ్చిన బ్రోచర్స్ ఏవి ? మరి వీటిని మొత్తం ఒక ఫోల్డర్ లాగా తీసుకురావాలి అనేదానికి ప్రేరణ ?

పాపారావు : " బుద్ధవాణి ", " ఓషోవాణి ", " శ్వాసే గురువు ", " స్పిరిచ్యువల్ సైన్స్ ", " ఆనాపానసతి అభ్యాసం " మరి " ధ్యానవిద్య ", " ఆత్మవిద్య " .. ఇలా మొత్తం 23 బ్రోచర్స్‌లను ఇంతవరకు మల్టీకలర్‌లో, ఫోల్డింగ్‌లో ఒక సెట్‌గా " ఆత్మజ్యోతి " పేరు మీద విడుదల చేశాం. ధ్యానయజ్ఞాల్లోనూ ఆయా బ్రోచర్‌లు విడుదల చేస్తూ వస్తున్నాం.

2006 డిసెంబర్‌లో షిర్డీ ధ్యానమహాయజ్ఞంలో " సాయి అమృతవాణి ", " జీసస్‌క్రైస్ట్ " (క్రిస్ట్‌మస్ సందర్భంగా ) బ్రోచర్స్ విడుదల చేసినప్పుడు నన్ను " Man of the year 2006 " గా బ్రహ్మర్షి పత్రీజీ ప్రకటించారు ..

2007 లో ఏకతాధ్యానం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో మొదలుపెట్టినప్పుడు ఆ రోజు పత్రీజీ ఈ " ఆత్మజ్యోతి " ఫోల్డర్ విడుదల చేశారు 3000 సెట్లు. దీనికి స్పాన్సర్స్‌గా మన చెర్లపల్లి వెంకటరామిరెడ్డి గారు, మేగా మురళి గారు వ్యవహరించారు. ఈ బ్రోచర్లు దఫదఫాలుగా విడుదలైనప్పుడు ఎప్పటికప్పుడు నాకు దాతలు దొరికారు. దొరకనప్పుడు నేను వాటిని పుర్తిచేసాను.

మారం : ఈ బ్రోచర్స్ తయారు చేస్తున్నప్పుడు " ధ్యానగ్రామీణం " బ్రోచర్ మీకు ఎంతో ఆనందానిచ్చిందని మీరు చెప్పారు.

ఆదిత్యకుమారి : ప్రత్యేకంగా కొన్ని బ్రోచర్స్ చేసినప్పుడు కలిగిన అనుభూతిని వివరిస్తాను. నేను అప్పటివరకు పత్రీజీ చెప్పినట్లు చేస్తూ వచ్చాను. " ధ్యానగ్రామీణం " వైజాగ్‌లో రిలీజ్ అయినా " దానిని మన డిజైన్ ప్రకారం తీసుకురావాలి ; ఒక ఫోల్డర్‌గా వుండాలి " అనుకుని " గ్రామీణ వాతావరణానికీ, గ్రామాల్లో సంక్రాంతి లాంటి పండగలకూ సంబంధించిన ఫోటోలు రావాలి " అనుకుని మళ్ళీ ప్లాన్ చేసాము. అయితే వైజాగ్‌లో చేసినదాన్ని నేను మళ్ళీ మన స్టైల్లో తీసుకురావాలి అంటే " చేసిన పనే మళ్ళీ చేయడం " అని నాకంతగా ఇంట్రస్ట్ అనిపించలేదు. ప్రాముఖ్యత ఏమీ ఇవ్వకుండా తాత్సారాం చేసాను.

అప్పటికే మా కేస్ కోర్టులో హియరింగ్ స్టేజ్‌లోకి వచ్చింది. అప్పుడు ఈ " ధ్యానగ్రామీణం " బ్రోచర్. ఒకవైపు మా సమస్య కోసం ఫైట్ చేస్తూ దానికి సంబంధించిన చట్టబద్ధమైన పనుల్లో కూరుకుపోయి మా రక్షణ కోసం చేయవలసిన బరువైన, భారమైన స్థితి. అలాంటి స్థితిలో ఈ " ధ్యానగ్రామీణం " బ్రోచర్‌ని పత్రీజీ అంచనాలకు తగినట్లుగా గ్రామ వాతావరణాన్ని ప్రస్ఫుటింప జేస్తూ, సంక్రాంతి గెటప్‌ని సబ్‌మిట్ చేస్తూ తీసుకువచ్చాం.

కోర్టులో మా కేసుకు హాజరు కోసం వెళ్ళిన ప్రతిసారీ పత్రీజీయో, మేగా మురళిగారో, అంజనా మేడమ్ .. ఇలా ఎవరో ఒకరు మా వెంట వుండి రాత్రంతా మా బాధ్యత ఆస్ట్రల్‌గా తీసుకున్న అనుభూతి నాకు కలిగేది. అది సత్యం కూడా .. అదే మా మానసిక స్థైర్యానికి కారణం. నా లోపల " మాకేం కాదు " అనే అనుభూతి, ధైర్యం కలిగేది. ఆ ధైర్యాన్ని లోపల పెట్టుకుని, నాలోని శక్తిని పరిపూర్ణంగా వినియోగిస్తూ బ్రోచర్స్ వర్క్ చేసేదాన్ని.

సిస్టమ్ మీద కూర్చుని ఫోటోలు download చేసుకుని, ఎన్నో ఫోటోలు ఒక క్రమంలో సరిచేసుకుంటూ ఎంతో గొప్ప సంకలనంతో మూడు రాత్రులు కూర్చుని ఈ " ధ్యానగ్రామీణం " బ్రోచర్‌ని తీసుకొచ్చాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా " ధ్యానగ్రామీణం " బ్రోచర్ పూర్తయింది .. మరి మాకు విశేషంగా పత్రీజీ అభినందన దొరికింది.

పాపారావు :మా కేసు కోర్టులో ఉన్నప్పుడు " ఉత్తరగీత " బ్రోచర్ రిలీజ్ అయింది. అప్పుడు పత్రీజీ వైజాగ్ నుంచి ఫోన్ చేసి " శ్రీకృష్ణామృతం ఉత్తరగీతాజ్ఞానసారం " పుస్తకం వ్రాయమని చెప్పారు. మా మేడమ్‌ను ఈ పుస్తకం వ్రాయమని మరి దానిని శరత్‍చంద్ర పాడతారని అన్నారు. అలాగే ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాం. అంతకుముందు " గీతా సందేశం " పాంఫ్లెట్ చేసినప్పుడు " మా పైన వున్న కోర్టు కేసు కొట్టివేయడం జరుగుతుంది " అనుకున్నాం. అదేవిధంగా మేమిద్దరం నిర్దోషులుగా బయటపడటం జరిగింది. అలా 2007 డిసెంబర్‌లో, 2008 ఆగస్ట్ కృష్ణాష్టమి రోజు " శ్రీకృష్ణామృతం ఉత్తరగీతా జ్ఞానసారం " పుస్తకం హైదరాబాద్ రవీంద్రభారతిలో రిలీజ్ చేసారు.

" చేయవలసినవి చేయవలసినప్పుడు చేస్తే రావలసినవి రావలసినప్పుడు అవే వస్తాయి " అనేదానికి మా జీవితాలే నిదర్శనం. ఇదే సత్యం. ఆ తరువాత మా అబ్బాయిపై కేసు కొట్టివేశారు.

మారం : " శ్రీకృష్ణామృతం ఉత్తరగీతాజ్ఞానసారం " ఈ పుస్తకం రావడానికి వెనుక నేపథ్యం ఏమిటి ? ?

ఆదిత్యకుమారి : " ఉత్తరగీత " బ్రోచర్‌ని చెయ్యమన్నారు. చేశాం. తర్వాత దాన్ని పుస్తకరూపంలో రావాలని కోరారు పత్రీజీ. పుస్తకం మరి బ్రోచర్ ఏది చేసినా పత్రీజీ ఫైనల్ ప్రూఫ్ "OK" అన్న తర్వాతనే ఏదైనా బయటకు ప్రింటింగ్‌కు వస్తుంది. అయితే అది తయారు కావడానికి జరుగుతున్న పనిలో ఈ బ్రోచర్ వర్క్‌లో నేను తెలుసుకుంది ఏమిటంటే మనల్ని ఒక ఉపకరణంగా చేసుకుని మనల్ని చేయిపట్టుకుని నడిపించే శక్తి పత్రీజీ. ఈ పని చేస్తున్నప్పుడు వందశాతం కష్టపడి, ప్రింట్ అయ్యాక " ఈ పనికంతా నేనొక సాక్షిని " మాత్రమే అనుకుంటాను.

మరి " ‘ ఉత్తరగీత ’ పుస్తకం రావాలి " అనుకున్నప్పుడు అది ఎలా రావాలి అంటే ఆ రకంగానే వస్తుందని తెలుసుకుని నేను నిమిత్తమాత్రంగా మాత్రమే పనిచేశాను. ఈ పుస్తకం కోసం సద్గురురాములు, శ్రీ పరమహంస, శ్రీ చందు వెంకటసుబ్రహ్మణ్యం గార్ల ఉత్తరగీతా వ్యాఖ్యానాలను నేను పరిశీలించడం జరిగింది. అయితే ఇది కేవలం ఉత్తరగీతగా కాకుండా మన ధ్యాన జ్ఞాన యోగాలతో అనుసంధానిస్తూ తయారు చేయడం జరిగింది.

మారం : ఎంతో అందంగా తీర్చిదిద్దిన ఈ ఉత్తరగీత పుస్తకం పూర్తి అయి మొదటి కాపీ చూసినప్పుడు పత్రీజీ ఏమన్నారు.

పాపారావు : పత్రీజీ తాము సంకల్పించిన వర్క్ " చేయండి " అని చెబుతారు. మరి అందులో సంపూర్ణ స్వేచ్ఛ ఇస్తారు. నేను మా మేడమ్‌కి ఒక సలహా ఇచ్చాను ఏమిటంటే " ఉత్తరగీత శ్లోకాలు మనం సబ్‌మిట్ చేసినవాటికి సంబంధించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు పూర్వాశ్రమంలో ఏం చెప్పారు అన్నవి కూడా పొందుపరిస్తే బాగుంటుంది " అని. అయితే మా మేడమ్‌కు మరొక ఆలోచన తోచింది. శ్రీకృష్ణుడు భగవద్గీతకు, ఉత్తరగీతకు కూడా మూలకారకుడు కాబట్టి శ్రీకృష్ణుని లైఫ్ స్టోరీని పుస్తకంలో ప్రతి పేజీలో చిత్రాలతో కూర్చి అందంగా చేయాలని సంకల్పించింది. దానికి తగినట్లుగా ఇంటర్నెట్ నుంచి ఎన్నో సైట్స్ నుంచి చిత్రాలు డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయడం జరిగింది. మొదటి కాపీ చూసినప్పుడు పత్రీజీ ఎంతగానో సంతోషించి " నా కోరికను నువ్వు తీర్చావయ్యా " అన్నారు నా కళ్ళల్లోకి చూస్తూ. సాక్షాత్తూ పరమగురువు ప్రశంసలు అందుకోవడంతో మా జన్మలు ధన్యమయ్యాయి. ఇంతకంటే మాకు కావలసింది ఏముంది.

మారం : " జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం " అనే శ్రీకృష్ణ సందేశం మీ కుటుంబానికి అతికినట్లుగా సరిపోయింది కదా ..

పాపారావు : అవును సార్, 23 ఆగస్ట్ 2008 న " ఉత్తరగీత " పుస్తకం వెలువడింది. 1 సెప్టెంబర్ 2008 న కోర్టు జడ్జ్‌మెంట్‌తో మా బాబుపైనా కూడా కేసు కొట్టివేయడం జరిగింది. ఆ విషయం గుంటూరు నుంచి పత్రీజీకి ఫోన్ చేసి చెప్పినప్పుడు పత్రీజీ చాలా ఆనందించారు. తన ప్రక్కన ఉన్నవాళ్ళకు చెప్పారట " ‘ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణాం ’ అంటే ఇదే ; ఆత్మజ్ఞాన మార్గంలో కృషిచేసేవాళ్ళ యోగక్షేమాలను విశ్వం చేసుకుంటుంది ; పాపారావు గారి యోగక్షేమాలను విశ్వం చేసుకుంటుంది ; పాపారావు గారి కుటుంబం కర్మలు దగ్ధం అయ్యాయి " అని.

Go to top