" పత్రీజీ ఒక పెద్ద నిలువుటద్దం "

 

 

రాజశేఖర్ : మేడమ్, మీ ధ్యాన పరిచయం గురించి తెలియజేయండి.

ప్రమీలాబాయి : నా పేరు ప్రమీలాబాయి. మీరందరూ బాగా ఇష్టపడే " నరేంద్రముదల్కర్ " నా రెండవ కుమారుడు. నా భర్త దుర్గాజీరావు ముదల్కర్. నేను నిరక్షురాలిని. నా భర్తే నాకు గురువు. ఆయనే తెలుగు అ, ఆలు .. అలాగే హిందీ నేర్పించారు. కేవలం ఆయన సహాయ సహకారాల వల్లనే నేను కొన్నివందల పుస్తకాలు చదివాను.

నేను 14 సంవత్సరాలపాటు ఒక చిన్న కిరణా షాపు నడిపాను. నాకు ముగ్గురు కొడుకులు రవీందర్, నరేందర్, దేవేందర్. ఒక కుమార్తె, చంద్రికాబాయి. వీళ్ళందరూ అప్పుడు చిన్నపిల్లలు. షాపు చూసుకుంటూనే .. పిల్లలను లాలిస్తూ, బుజ్జగిస్తూ వారికి చదువులు చెప్పించాను. వేదాంత గ్రంథాలసారాన్ని నాకు అర్థమైనంతమేరకు బోధిస్తూ మంచి సంస్కారవంతుల్లా చేసాను.

ఈ ప్రపంచ జీవితాన్ని హాయిగా సాగిస్తున్నా కూడా తెలియని మరో లోకాల గురించి తెలుసుకోవాలన్న తపనతో నా అంతరంగంలో ఎప్పుడూ మధనం జరుగుతూ వుండేది " ఈ ప్రపంచాన్నిసృష్టించిన సృష్టికర్త ఎవరు ? ఎక్కడ వుంటాడు ? ", " పగలు - రాత్రి, అమావాస్య - పౌర్ణమి, మంచి - చెడు, పేద - గొప్ప ఇలాంటి వ్యతిరేకశక్తులను ఇంత నైపుణ్యంగా ఎలా నడిపిస్తున్నాడు ? " ఎలా ప్రాణులను పుట్టిస్తూ వున్నాడు. ఎందుకు చంపేస్తున్నాడు ? ఎవరు నిద్రపుచ్చుతున్నారు ? ఎవరు లేపుతున్నారు ? ", " ఇదంతా ఏక వ్యక్తి వలన జరుగుతున్నాయా ? ఆయననే ‘ భగవంతుడు ’ అంటారా ? ఆయన ఆలయాలలో మాత్రమే వుంటాడా ? విగ్రహాన్ని దేవుడుగా భావించడం భావ్యమేనా ? " .. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు లేని సందేహాలతో సతమతమయ్యేదాన్ని. అప్పుడు లభ్యమయ్యారు మన ప్రియతమ పత్రీజీ ! ధ్యానం ద్వారా నాకు " భగవంతుడు వేరే ఎక్కడా లేడు మనలోనే వున్నాడు .. అసలు మనమే దేవుళ్ళం " అని అర్థమయ్యింది.

ఇలా పత్రిసార్ పరిచయం కాకముందు " ఈ ప్రపంచంలోని అస్తవ్యస్త జీవితాలనూ, అహంకారపూరితులనూ, పశుత్వంతోనే నిండిపోయినవారినీ బాగుచేయటానికి ఎందరో మహాత్ములు రావాలి వాళ్ళల్లో ఒక మహాత్ముడు నా కడుపున పుట్టాలి " అని ఆంజనేయస్వామిని పదేపదే కోరుకునేదాన్ని. ఒకసారి స్వామి నా కలలో వచ్చి " నా అంశలో సగభాగాన్ని నీకు కేటాయించి నీ కడుపునే జన్మ తీసుకుంటాను " అన్నారు. ఈ వాగ్దానం తర్వాత పుట్టినవాడే నరేంద్ర. పుట్టినప్పుడు నరేంద్ర శరీరం ధగధగ మెరిసేది. ఆయన ముఖంలో ఒక కాంతి తేజస్సు కనిపించేది. చిన్నప్పటినుంచి ఆయన జీవనవిధానమే వైవిధ్యంగా వుండేది. నా నుంచి డబ్బుని ఆశించకుండా ఆయనే కష్టపడి M.com వరకు చదువుకున్నాడు. ఇప్పుడు నేను ఊహించినదానికంటే లక్షవంతులు ఎక్కువగా ధ్యానప్రచారం నిర్విరామంగా చేస్తున్నాడు. ఈ రోజు కొన్నివేలమంది నరేంద్ర క్లాసు కోసం ఎదురుచూస్తూ ఉంటున్నారు. ఆయన ఉపన్యాసం వేలమందికి స్ఫూర్తినిస్తోంది.

నరేంద్ర పుట్టుకతో గొప్పవాడిగానే పుట్టినా ఆ గొప్పతనాన్ని పూర్తిగా గుర్తించి నరేంద్రను " మణేంద్ర " గా మలచిన జగద్గురువు పత్రీజీకి శతకోటి ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి క్షణమూ మా కుటుంబానికి తోడుగా, నీడగా వుంటున్న మహానుభావుని ఋణం తీర్చుకోగలిగింది కాదు.

రాజశేఖర్ : మేడమ్, మీ ధ్యాన అనుభవాలు!

ప్రమీలాబాయి : 16-7-97 లో కర్నూలు బుద్ధా పిరమిడ్‌లో ధ్యానం చేస్తూ వుంటే ఒక తేజోవంతమైన చిన్న బాబు కనిపించాడు. పసితనం ఉట్టిపడుతున్న పసిడికాంతుల దేహం ఆయనది. ఆ వెంటనే సప్తఋషుల దర్శనం కలిగింది. నా అంతఃకరణం ఆనందంతో నిండిపోయింది. అంతటి ఆనందం నా జీవితంలో ఎప్పుడూ కలగలేదు. ఇదే ఆత్మానందాన్ని ప్రపంచమంతా పంచాలనిపించింది. కానీ నాకు చదువురాదు. " నరేంద్ర షాపు నేను చూసుకుంటే నేను చేయలేని పనిని తనతో చేయించవచ్చు కదా " అని " ప్రతి నెలా పదిరోజులు ధ్యానప్రచారానికి వెళ్ళు " అని నా కొడుకుని ప్రోత్సహించాను. కొన్నాళ్ళ తర్వాత " అన్నీ నేనే చూసుకుంటాను ; పూర్తి సమయం నువ్వు ధ్యాన ప్రచారానికి వినియోగించు ; యావత్ జగత్‌కు నీ అవసరం వుంది " అని నా కొడుకుని పదే పదే ప్రేరేపించాను. ఇది నేను చేసిన ఒక అత్యుత్తమమైన కార్యమని నాకు అనిపిస్తూ వుంటుంది. మరోసారి ధ్యానంలో వున్నప్పుడు ఓషో రజనీష్ వచ్చారు .. " నాకు ఆకలిగా వుంది " అన్నారు. నేను కొసరి, కొసరి వడ్డించి భోజనం పెట్టాను. ఆయన హాయిగా భోంచేసి వెళ్ళిపోయారు. అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.

నరేంద్ర ఒకసారి నాకు గౌతమబుద్ధుని జీవిత చరిత్ర తెలుగు పుస్తకం తెచ్చి ఇచ్చాడు. ఒక పుస్తకం చదివేటంత పరిజ్ఞానం నాకు తెలుగులో లేదు. " పత్రిసార్, మీరే చదివించాలి " అని సార్‌కి ఒక విజ్ఞప్తి చేసుకున్నాను. ధ్యానంలో సార్ కనిపించి " ముందు నువ్వు మొదలుపెట్టు " అన్నారు. ఆ వెంటనే నేను మొదలుపెట్టడం, మరి ఒక్క రోజులో దానిని పూర్తిచేయటం కూడా జరిగింది. పత్రిసార్ విశేష శక్తికి ఇదో తార్కాణాం. ఆ క్షణం నుంచి నేను తెలుగు పుస్తకాలే కాదు సంస్కృత శ్లోకాలు కూడా ఎలాంటి తొట్రుపాటు లేకుండా అనర్గళంగా చదవగలుగుతున్నాను. నా జ్ఞానాన్ని మరింతగా పెంచటానికి పత్రిసార్ చేసిన మహోపకారం ఇది.

రాజశేఖర్ : అహింసా ధ్యానప్రచారం గురించి చెప్పండి?

ప్రమీలాబాయి : ఒకప్పుడు మాంసాహారం నా ప్రియాహారం. కిరాణాషాపు నడిపేరోజుల్లో హోల్‌సేల్ షాపులలో పప్పులు లాంటివి తెచ్చి రిటైల్‌గా అమ్మేదాన్ని. ఆ రోజుల్లో కాగితాలలో కట్టిఇచ్చేవారు. నేను వాటిని ఊడదీసి నా షాపులో వున్న సీసాలలో పోసుకునేదాన్ని. కాగితాలన్నీ బయటపారవేసేదాన్ని. ఎప్పటిలాగానే ఒకసారి కాగితాలు బయటపారవేసి వస్తే ఒక కాగితం ఎగిరి షాపులోకి వచ్చింది. నేను దాన్ని బయటపారవేసి వస్తే మళ్ళీ ఎగిరి షాపులోకి వచ్చి నా ముఖానికి తగిలింది. అలా మూడుసార్లు జరిగేసరికి " ఏంటి ఈ కాగితం ? " అని పరికించి చూసాను. అది మన పిరమిడ్ సంస్థ ముద్రించిన కరపత్రం. మాంసాహారం ఎంత రాక్షస ఆహారమో .. దానివలన మనం ఎంతగా నాశనమైపోతున్నామో దానిలో వివరంగా వుంది. అది చదివిన వెంటనే నేను మాంసం మానివేసాను.

ఇలా ఒక కరపత్రం .. కర్రపెత్తనం చేసి మరీ నా కుటుంబాన్ని యావత్తూ శాకాహారుల్లా మార్చివేసింది.

1982 లో పెద్దబాబు రవీందర్‌కు చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. నాలుగురోజుల్లో ఆయన పెళ్ళి. ఎన్ని మందులు వేసినా ఏ మాత్రం తగ్గలేదు. ఆ రోజు రాత్రి దత్తాత్రేయుని తలచుకుని నిద్రపోయాను. ఒక కల వచ్చింది. కలలో నేను బోధన్‌లో వున్న దత్తాత్రేయుని మఠంకు వెళ్ళాను. ఆయన మా కులగురువు. ఆయన దర్శనం కోరి కళ్ళు మూసుకున్నాను. ఆయన కనిపించి " ఈ గ్లాసు పాలు నీ కుమారునికి త్రాగించు " అన్నారు. నేను కలలోనే రవీందర్‌కు పాలు త్రాగించాను. చట్టుక్కున మెలకువ వచ్చింది. వెంటనే నా ప్రక్కలోనే వున్న బాబు శరీరం పైన చేయివేసి చూసాను. అప్పటివరకు ఉష్ణమండలంలాగా వున్న శరీరం మంచుకొండలా అయ్యి లేచి హాయిగా కూర్చున్నాడు. మళ్ళీ అలాంటి జ్వరం తనకు ఏనాడు రాలేదు. ఇది ఒక మరుపురాని సంఘటన.

రాజశేఖర్ : పత్రీజీతో మీ అనుభవాలు ఇంకా చెప్పండి.

ప్రమీలాబాయి : పత్రిసార్ గురించి ఎవరు చెప్పినా .. ఎంత చెప్పినా .. ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగని మహాద్భుత ఆధ్యాత్మిక ఆనంద స్వరూపులు ఆయన. అంతరంగంలో అనుక్షణం ఆత్మానందస్థితిలో తేలియాడుతూ పైకి మాత్రం రకరకాల విభిన్న హావభావాలు ప్రదర్శిస్తూ మనకు ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకంగా కనిపిస్తూ వుంటారు. నిజానికి ఆయన ఒక పెద్ద నిలువుటద్దం ; మన మనస్సులో వున్న భావాలే .. అవి మంచివి అయితే మంచిగా - చెడ్డవి అయితే చెడ్డగా ఆయన ముఖంలో ప్రతిఫలిస్తూ వుంటాయి.

జగత్తు మొత్తం ధ్యానమయం కావాలి. మరి ప్రతి ఒక్కరూ తనను తాను తెలుసుకుని జన్మరాహిత్యం పొందాలి. ధ్యానానికి మించిన సత్యం లేదు .. ఆ సత్యాన్ని గుత్తగా పొందిన పత్రీజీ లాంటి జగద్గురువూ లేరు. ధ్యానం మరి ధ్యానప్రచారం ఎంత ఎక్కువ చేస్తే అంతకు పదింతల ఇహ, పర సౌఖ్యాలు లభిస్తాయి. అందరం కూడా ధ్యానప్రచారాన్ని ఆరో ప్రాణంగా భావించి ప్రపంచపటంలో సుస్థిర స్థానం పొందుతాం.

 

ప్రమీలాబాయి ముదల్కర్
హైదరాబాద్

Go to top