" అంతరంగాలను గ్రహించే ఆత్మీయులు .. పత్రీజీ "

 

" పత్రీజీ సాంగత్యం కోటి జన్మల యోగ ఫలం " అని తెలుసుకున్న లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్‌లలో నేను కూడా ఒకడిని కావడం నా అదృష్టం.

2010 .. జూన్ 10 వ తేదీ ప్రకాశం జిల్లా కందుకూరులో నా " సంగీత ధ్యానం " జరిగిన తరువాత పత్రీజీ గారి క్లాస్ మర్నాడు అదే వేదిక మీద జరుగనుంది సార్ .. చీరాల వాడ రేవు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిసి ముందురోజు కందుకూరు నుంచి కొంత మంది పిరమిడ్ మాస్టర్స్‌మి అక్కడికి చేరుకున్నాం. మమ్మల్ని చూసి సార్ ఆప్యాయంగా పేరు పేరునా పలుకరిస్తూ " అందరూ వెళ్ళి టిఫిన్ చేయండి " అని చెప్పారు.

టిఫిన్ చేసే గది పత్రిగారి గదికి కొంచెం దూరంగానే ఉంది. మేము టిఫిన్ చేస్తూ " సార్‌ని చూసాం కదా ఇక మనమందరం కందుకూరు వెళ్ళిపోదాం ... అక్కడ పనులు చూసుకోవచ్చు" అని నిర్ణయించుకుని " సార్‌కు చెప్పి వెళ్ళిపోదాం " అని సార్ రూమ్‌కి వచ్చాం. మమ్మల్ని చూసి సార్ " ఎక్కడికి వెళ్ళిపోవడానికి మంతనాలు జరుపుతున్నారు ? ఏం ప్రసాద్, రాము, వెంకయ్య సముద్రాన్ని చూడరా .. ఎంజాయ్ చేయరా ?" అంటూ అక్కడ వున్న సుమారు 15 మంది ధ్యానులను తీసుకుని సముద్రం వైపు నడిచారు. అందరం ఒడ్డున నిలబడ్డాం. సార్ మాత్రం సముద్ర కెరటాలను చేతొతో నిమురుతూ " సముద్రానికి కృతజ్ఞతలు " అంటూ వెనక్కి తిరిగి చూసి " మీరెవరూ ఎంజాయ్ చేయరా ? " అని అడిగారు. అవే మాటలు ఆజ్ఞగా స్వీకరించి అందరం ఆ నీళ్ళలోకి నడిచి పత్రీజీని చేరుకున్నాము. అ కెరటాల మధ్యలో మమ్మల్ని కూర్చోపెట్టి మా మధ్యలో సార్ కూర్చుని .. పాటలు పాడుతూ ఆత్మజ్ఞాన బోధచేస్తూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆ నీటిలోనే గడిపాం.

ఇంతలో పత్రీజీ ఒక్కసారిగా " మనం సగం వరకే తడుస్తున్నాం. ఈ సమయంలో వర్షం కూడా వస్తే మరింత బావుంటుందేమో " అంటూ ఆకాశం వైపు చూస్తూ " నాకు వర్షం కావాలి " అని రెండు సార్లు అన్నారు అంతే ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. అప్పటికే ఆశ్చర్యం, ఆనందంలో వున్న మాకు కంటి చూపే కానీ నోటి మాట లేదు. నాతో పాటు కందుకూరు మాస్టర్లు, చీరాల మాస్టర్లు కూడా పులకించిపోయారు. సార్ నన్ను చూసి " ఏం బాబూ ఎలా వుంది ? " అని అడిగారు " సార్, ఏం అదృష్టమంతులం మేము. మాకు వర్షం కావాలి అన్న వెంటనే వరుణుడు వచ్చాడు. ఇది మా పత్రీజీకే సాధ్యం " అన్నాను. అప్పుడు సార్ " నాకు వర్షం కావాలి అన్నప్పుడు వర్షం రావడం కాదు .. వర్షం రావడం చూసి నాకు వర్షం కావాలి అన్నాను " అని చమత్కరించారు. కానీ మా అందరికీ తెలుసు మాహాయోగీశ్వరులు అయిన పత్రీజీ శక్తి .. దటీజ్ పత్రీజీ ..

" ఇక ఈ రోజుకి చాలు " అని పత్రీజీ చెప్పడంతో ఆ నీళ్ళల్లోంచి బయటకు వచ్చి మమ్మల్ని మేము చూసుకుని .. " తడిచిన బట్టలతో ఎలాగ ? " అనుకుంటూ ఉండగానే .. పత్రీజీ తమ సెక్రెటరీని పిలిచి " నా బ్యాగులో ఉన్న బట్టలు ఒక్కొక్కటి .. అందరికీ ఇవ్వు " అన్నారు. ఆ బట్టలు కట్టుకుని పులకించి పోతూ మేం సార్ దగ్గరికి వచ్చి నిలబడగానే .. సార్ అందరితో ఫోటోలు దిగడం మాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. " నన్ను అంటుకోకు నామాల కాకి " అంటూ ఎందరో " గురువులం " అని చెప్పుకుంటూన్న ఈ రోజుల్లో .. ప్రపంచాన్ని శాంతిమయం చేయడానికి వచ్చిన జగద్గురువే మన పత్రీజీ .. దటీజ్ పత్రీజీ ..

2004 లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పత్రీజీ క్లాసు జరిగింది. " స్టీల్ ప్లాంట్‌కి ధ్యానాన్ని పరిచయం చేసిన మొదట వ్యక్తిని నేనే " అని అక్కడి పిరమిడ్ మాస్టర్లు నా సంగీత ధ్యానాన్ని .. పత్రీజీ క్లాస్‌లో ఏర్పాటు చేసారు. అదే పత్రీజీతో నా మొదటి ప్రోగ్రామ్. వేదిక మీద అన్ని వాయిద్యాలనూ సరి చేసుకుని " కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం " అనే సమయంలో సార్ వేదిక మీదకు వచ్చి .. బొబ్బలిపులిలా మధ్య భాగంలో కూర్చుని ఉన్నారు. అంతే .. నా పై ప్రాణాలు పైకి పోయినంత పని అయింది. ఇక మా బృందం, నేను ఏం పాడామో ఏం చేసామో తెలియకుండానే గంటన్నర కాలం గడిచింది. సార్ వేణు నాదంతో అందరి చేత ధ్యానం చేయించి .. కార్యక్రమం ముగించి .. అక్కడివారందరి చప్పట్లు మధ్యలో సార్ వెళ్ళిపోయారు.

కానీ మా బృందంలో కళాకారులెవ్వరికీ మా కార్యక్రమం తృప్తినివ్వలేదు. " సరే భోజనాలు చేసి వెళ్ళిపోదాం " అని వెళ్తే అక్కడ సార్ నన్ను చూసి " ఏం ప్రసాద్, బాగా పాడావయ్యా .. అద్భుతం " అంటూ అక్కడి వారి చేత చప్పట్లు కొట్టించారు అంతలో మా బృందంలో గాయని దుర్గా మేడమ్‌తో " మౌనంగానే ఎదగమని " అనే పాట పాడించుకుని .. మా బృందంలో వున్న ప్రతి కళాకారుడినీ తన చేతితో నిమురుతూ " వెరీ గుడ్ .. వెరీ గుడ్ " అన్నారు. ఆ రోజు .. సార్ మాకు ఇచ్చిన ఆ కొండంత ఆ ప్రోత్సాహమే .. ఈ రోజు నెలకు 25 రోజులపాటు సంగీత ధ్యాన కార్యక్రమాలు చేస్తూ ప్రక్క రాష్ట్రాలలో సైతం ధ్యాన ప్రచారం చేసే భాగ్యం నాకూ మరి నా బృందానికీ దక్కింది. దటీజ్ పత్రీజీ ..

నా బృందంలో ఉన్న కళాకారులు ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామం నుంచి వస్తారు. శ్రీనివాస్, గోపాలకృష్ణా, మావుళ్ళు, దుర్గా మేడమ్ నా బృందంలో కళాకారులు. వీరందరూ పూర్తి శాకాహారులుగా వుంటూ వారి వారి గ్రామాల్లో ఎంతో మంది ధ్యానుల్ని తయారు చేస్తూ .. ధ్యాన ప్రచారంలో నాకు చక్కని సహకారాన్ని అందిస్తున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.

ఒకసారి తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఒక పిరమిడ్ ప్రారంభోత్సవానికి సార్ రావడం మరి వారి ఇంటిలోనే సార్‌కి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఇంటి మహిళలు వంట చేసి " మేము స్వయంగా సార్‌కి వడ్డించటం చేసి తరించాలి " అని ఎదురుచూస్తున్న సమయంలో .. హడావిడిగా వేరొక మహిళ వచ్చి .. " సార్‌కి ఎలా వడ్డించాలో నీకు తెలియదు ; నాకు బాగా తెలుసు ; నేను వడ్డిస్తాను " అని కాస్త పెత్తనంగా చెప్పింది. దాంతో ఆ ఇంటి మహిళలు ఎంతో నిరుత్సాహనికి గురి అయ్యారు. ఇంతలో సార్ అక్కడికి రానే వచ్చి భోంచేస్తూ .. ఆ మహిళతో " నెయ్యి వడ్డించు " అన్నారు. ఆ మహిళ నెయ్యి వడ్డించడంలో .. చేయితొణికి ఒక బొట్టు నేలమీద పడింది. అంతే .. " వడ్డించడం రానిదానికి ఈ పనులెందుకు పో, పో " అంటూ .. వడ్డించాలని ఎంతో ఆశతో ఉన్న ఆ ఇంటి మహిళలను చూసి " ఏం మీరు వడ్డించ వచ్చుకదా, చూస్తూ నిలబడ్డారే ? " అన్నారు. " ఎంత భాగ్యం " అని ఆ మహిళలు సార్‌కి తనివితీరా వడ్డించి ఆనంద పరవశులయ్యారు. ఇలా అంతరంగాలను గ్రహిస్తూ అందరినీ ఆనందపరిచే జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ .. దటీజ్ పత్రీజీ ..

చెప్పుకుంటూ వెళ్తే సార్‌తో నాకు వున్న అనుభవాలు కోకొల్లలు. ఈ జన్మ ధ్యానానికి మరి ధ్యాన ప్రచారానికి అంకితం.

 

పిప్పళ్ళ ప్రసాద్‌రావు
పశ్చిమ గోదావరి
ఫోన్ : +91 94403 77555

Go to top