" బ్రహ్మర్షి పుస్తకాలను హిందిలోకి అనువాదం చేస్తున్నాను "

 

నా పేరు జ్యోతిలక్ష్మి. మాది నెల్లూరు ధ్యానకుటుంబం. ఆనాపానసతి ధ్యానంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది. మా అబ్బాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అందువలన నేను, మావారు కూడా ఐదు సంవత్సరాల నుంచీ బెంగుళూరులోనే వుంటున్నాం.

మా ధ్యాన జీవితంలో అభివృద్ధి అంతా ఈ ఐదు సంవత్సరాలలోనే ఎక్కువగా వచ్చిందని చెప్పాలి. అంతకుముందు ధ్యానం మాత్రం చేస్తూండేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చాక ఎంతోమంది సీనియర్ మాస్టర్లతో దగ్గరి పరిచయం వలన చాలా, చాలా నేర్చుకున్నాం. పిరమిడ్ వ్యాలీలో ‘ వాలంటీర్ ’ గా చేసే అవకాశం కలిగింది. క్లాసులు చెప్పటం, ధ్యానప్రచారం, వంటశాలలో పని అవసరమైనప్పుడు ఇలా ఎన్నో విధాలుగా ఆనందం పొందుతున్నాను.

ధ్యానంలోకి రాకముందు చాలా అసంతృప్తిగా వుండేది. " వంట చేయటం, తినటం, నిద్రపోవటం తప్ప వేరే లక్ష్యం ఏమీ లేదా ? " అని ఏదో బాధగా వుండేది. చిన్నతనం నుంచి ధ్యానం అంటే ఇష్టంగా వుండేది. పద్ధతి తెలియకపోయినా ఊరికే ఐదునిమిషాలు అలా కళ్ళు మూసుకుని దేవుడి దగ్గర మౌనంగా కూర్చునేదాన్ని. నా నలభై సంవత్సరాల వయస్సులో ఆనాపానసతి ఒక ఫ్రెండ్ ద్వారా నేర్చుకున్నాను. అదేరోజు మా పిల్లలకూ, మా వారికీ కూడా నేర్పించాను. మొదటిరోజే గంటసేపు గాఢస్థితిలో ధ్యానం చేయగలిగాను. అప్పటినుంచి ఎన్ని అనుభవాలో, దానికన్నా " అద్భుతాలు " అంటే బాగుంటుంది. మా అందరి జీవితాల్లో మార్పులు మెల్లమెల్లగా రావటం మొదలుపెట్టాయి. అలా ఈ రోజుకి పత్రిసార్ పుస్తకాలను హిందీలోకి అనువాదం చేసే స్థితికి రాగలిగాను. ( నేను హిందీ టీచర్‌గా కొద్ది సంవత్సరాలు పనిచేసానులెండి).

ఈ సంవత్సరం జూన్ 26 న నేను, మావారు గుజరాత్‌లోని సూరత్‌కు ధ్యాన ప్రచారానికి వెళ్ళాం. అక్కడ అంజనా సెంటర్, దుర్గాప్రసాద్ సార్ సెంటర్, మాన్ దర్వాజా సెంటర్‌లలో తెలుగువారికి క్లాసులు చెప్పాను. చాలామంది పూర్తిగా క్రొత్తవారు. నాకెప్పుడూ క్రొత్తవారికే క్లాసులు చెప్పే అవకాశం ఎక్కువగా వస్తూంటుంది. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి ధ్యానప్రచారం చేస్తూండాలని నా కోరిక. ఇక్కడ బెంగళూరులో కూడా ఒక్కోరోజు ఒక్కో ప్రాంతంలోని పార్కు లేక గుడి దగ్గరికి వెళ్ళి కరపత్రాలు ఇస్తూ వుంటాను. అలా ఎంతోమంది క్రొత్తవారు ధ్యానం నేర్చుకుని మిత్రులు అయ్యారు. భీమవరం మేడమ్ రాజ్యలక్ష్మి గారు ఎప్పుడూ " నువ్వు ఇక్కడ కాదు ఉత్తర భారతదేశంలో హిందీలో ప్రచారం చేయాలి " అని చెబుతూండేవారు.

అక్కడ మన కుటుంబంతో ఉన్నట్లనిపించిందే కానీ ఏ మాత్రం క్రొత్తగా అనిపించలేదు. ఇంకా ఇల్లందు వెంకటేశ్వర్లు గారు, హైదరాబాద్ బాబూరావ్ గారు ఇద్దరు యువకులు సతీష్, స్వామి గార్లు రెగ్యులర్‌గా అక్కడే వుంటూ ధ్యానప్ర్రచారం చేస్తున్నారు. ఆరునెలల్లోనే 16 సెంటర్స్ స్థాపించారు. మేడమ్ రీటాగారు ఎంతో అద్భుతమైన సెంటర్ స్థాపించారు. పిరమిడ్ చాలా విభిన్నంగా " కౌట్ " మోడల్‌లో వుంది. క్రింద పిరమిడ్‌లు చాలా వున్నాయి. ఐదారుమంది కూర్చుని ఒకేసారి ధ్యానం చేయవచ్చు. అక్కడా సాక్షాత్తు పత్రిసార్ వున్నట్లు అనుభూతి చెందాను ధ్యానంలో.

సూరత్‌లో గుళ్ళూ, పార్కుల దగ్గర కూడా ప్రచారం చేసాం. ఉత్తరభారతదేశం అయినా కూడా సూరత్‌లో నాలుగులక్షలమంది తెలుగువారున్నారు ఇంచుమించు. మన ఆంధ్రాలో వున్నట్లే అనిపించింది. బాబా ఆసారామ్ గురూజీ ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ బరోడా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చిన వారికి హిందీలో ధ్యానం క్లాసు చెప్పి అక్కడే ధ్యానం చేయించాను. ఎంతో శ్రద్ధగా చేసారు.

సీనియర్ మాస్టర్లందరూ ఎవరికి వీలయితే వారు తప్పక ఉత్తర భారతదేశంలో ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి. అప్పుడే మన పత్రీజీ మహాసంకల్పం " 2012 కల్లా ధ్యానజగత్ " అనేది పూర్తయిపోతుంది. దీనికి మనందరం కూడా మనవంతు సహకారం అందించాలి అని నా కోరిక. ఇది నా ధ్యాన జీవితంలోని ఒక అద్భుతమైన ఆనందమైన అనుభవం కాబట్టి అందరితో పంచుకోవాలనిపించింది.

 

జ్యోతిలక్ష్మి
నెల్లూరు
సెల్ : +91 81234 44318

Go to top