" మన జీవితం .. మన ఇష్టం "

 

నా పేరు వీరప్ప. మాది నిజామాబాద్ జిల్లా .. బోధన్‌కు 18 కిలోమీటర్ల దూరంలో గల జాకోరా గ్రామం. నేను గత మూడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను.

05-07-2010 రోజు ఉదయం 8:30 గంటలకు స్నానం చేసి ఓ పని మీద బయటకు వెళ్ళాలనే హడావుడిలో వుండి .. నేల మీద వున్న నీళ్ళ తడి చేసుకోక జారిపడ్డాను.

నాకు మాత్రం నేను పడింది మాత్రమే గుర్తు వుంది. పడగానే స్పృహ కోల్పోయి, నా శ్వాస కూడా ఆగిపోయిందట. ముక్కు దగ్గర శ్వాస లేదు. పొట్ట కదలడం లేదు. మా పెద్దమ్మాయి స్వాతి నా గుండె చప్పుడు వినాలని చెవి పెడితే గుండె చప్పుడు కూడా లేదట. ఇంట్లో అందరూ కంగారుపడిపోయి కేకలు, బొబ్బలు పెడుతూ ఏడుస్తున్నారు. చుట్టుప్రక్కల ఇళ్ళలో వున్న అందరూ వచ్చారు. ప్రక్క ఇంట్లో మా బావగారు కూడా వచ్చి నన్ను చూసి నిర్ఘాంతపోయారు. అందరూ నేను పడ్డప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చి గుండె ఆగిపోయిందని నిర్ణయించుకున్నారు. ఇంతలో మా అమ్మాయి ఛాతిపై బాదడం, నోట్లో, ముక్కులో గాలి ఊదడం చేయడం మరి కొంతసేపటికి నేను శ్వాస వదిలి తీసుకోవటం జరిగింది. అంటే సుమారు 15 నిమిషాల వరకు నా శ్వాస ఆగిపోయింది. అప్పుడు నాకు కొంత స్పృహ వచ్చి లేచి " నేను బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి కొద్దిసేపు పడుకుంటాను " అని వెళ్ళి పడుకున్నానట. తరువాత మా ఫ్యామిలీ డాక్టర్ గారు వచ్చి B.P. మీటర్ బట్ట చెయ్యి నుంచి తీస్తున్నప్పుడు మాత్రమే నాకు పూర్తి స్పృహ వచ్చింది. అక్కడి నుంచి మాత్రమే గుర్తుంది. ఇదంతా సుమారు 30 నిమిషాలు అయింది.

నా పరిస్థితి ఏమిటంటే .. ఇక్కడ నా భౌతికశరీరం పడ్డ దగ్గరి నుంచి నేను స్పృహలోకి వచ్చేవరకు ఏమీ తెలియదు. కానీ కలలో ఉన్నట్టు పైన జరిగేది నాకు స్పష్టంగా ఇప్పటికీ గుర్తుంది. నేను పైకి వెళ్ళాను. అక్కడ నాకు రెండు ఆకారాలు ఆస్ట్రల్ మాస్టర్స్ కలిసారు. వారు నా దగ్గరకు వచ్చి నాకు సహాయం చేస్తున్నారు. వారిని చూసి నేనేమీ భయపడలేదు. వారు నాకు ఏవో సందేశాలు ఇస్తున్నరు. వారికి నేను నా లైఫ్ డిజైన్ గురించి చెప్తున్నాను మరి వారు కూడా నాకు ఏదో చెప్తున్నారు. అంతలో సడన్‌గా పత్రిసార్ వచ్చి ఆ రెండు ఆకారాలకు " ఆయన లైఫ్ డిజైన్ ఆయన చేసుకున్నారు ; ఆయన ఇంకా ఇక్కడ చెయ్యవలసిన పనులు వున్నాయి " అని వారికి చెప్తూ నా భుజంపై రెండుసార్లు తట్టి నన్ను క్రిందకు వెళ్ళమని చెప్పారు. అక్కడ జరిగింది అంతవరకే నాకు గుర్తుంది. తర్వాత అక్కడి నుంచి నా భౌతిక శరీరం ఇక్కడ ఉన్నట్టు పూర్తిగా గుర్తువచ్చింది.

వెంటనే మా ఫ్యామిలీ డాక్టర్ గారు నన్ను హడావుడిగా నిజామాబాద్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి అన్ని పరీక్షలు చేయించారు. B.P.., బ్లడ్, యూరిన్, E.C.G., బ్రెయిన్‌కు సీటీ స్కాన్ అన్నిటిలో కూడా నాకు నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి.

మూడు రోజల తర్వాత " సావిత్రీదేవి పిరమిడ్ ధ్యానకేంద్రం " శక్కర్‌నగర్, బోధన్‌లో సేత్ వర్క్‌షాప్ మూడురోజుల కార్యక్రమం నిర్వహించాం. అక్కడ నాకు ధ్యానంలో కొన్ని బ్లాక్స్ మొత్తం క్లియర్ అయ్యి మరుసటిరోజు నుంచి నాకు మామూలుగానే వుంది.

గమ్మత్తైన విషయం ఏమిటంటే నేను పైలోకం వెళ్తున్నప్పడు క్రిందకు రావాలనిపించలేదు. పైలోకాలకు వెళ్ళాలనే వుంది. అక్కడ నాకు చాలా ఆనందంగా ఉన్నట్టు గుర్తించాను. " ఇంకా పూర్తిగా పైలోకాలకు వెళ్ళి రావలసింది " అని వుండింది కానీ పత్రిసార్ వచ్చి ఎందుకు నా భుజం తట్టి " నువ్వు చెయ్యవలసింది ఇంకా వుంది క్రిందకు వెళ్ళు " అని నన్ను క్రిందకు పంపారో ? " పత్రిసార్ ఆశయాలను పూర్తిచెయ్యటానికి నా కర్తవ్యం కూడా వుంది " అని తెలుసుకున్నాను.

మనందరి క్షేమం కోరే పత్రిసార్ ఆశీస్సులు మనకు వున్నాయి. కాబట్టి మిత్రులారా ! అందరికీ మనవి చేసేది ఏమిటంటే మన జీవితాన్ని మనం డిజైన్ చేసుకుంటే పత్రిసార్, మరి పైనున్న ఆస్ట్రల్ మాస్టర్స్ అందరూ మన సంకల్పాలను నెరవేర్చటానికి సంపూర్ణ సహకారం అందిస్తారు. మనం ఎలా కావాలంటే అలా, ఎన్ని రోజులు బ్రతకాలంటే అన్ని రోజులు మన నిర్ణయం ప్రకారం బ్రతకవచ్చు. మన మరణాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. బ్రతికినన్ని రోజులు ఎలాంటి జీవితం కావాలంటే అలాంటి అందమైన, ఆనందమైన జీవితం గడపవచ్చు.

 

వీరప్ప
వర్ని మండలం, నిజామాబాద్ జిల్లా
సెల్ : +91 94400 90704

Go to top