" వ్యర్థమైన కర్మకాండలు పనికిరావు "

 

నా పేరు వెంకటసత్యనారాయణరావు. మాది ధ్యాన కుటుంబం. నేను 2002 సంవత్సరం విజయదశమి నుంచి ధ్యానం చేస్తున్నాను. జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ ఆదేశానుసారం 2005 లో మా ఇంటిపైన పిరమిడ్ నిర్మించి వారి చేతుల మీదుగా " శ్రీ వాసవీ పిరమిడ్ ధ్యానకేంద్రం " విశ్వానికి అంకితం చేసాము. నా సతీమణి శ్యామలాదేవి ప్రతినిత్యం ధ్యానం చేస్తూ ధ్యానప్రచారంలో చురుకుగా పాల్గొంటూ వుంటుంది ; ఎన్నో ధ్యానానుభవాలను పొందింది.

మా నాన్నగారు శ్రీ శరణం వెంకటరామకోటి గారు 3-7-2010 ఉదయం 5.00 గంటలకు తమ భూలోక యాత్రను పూర్తి చేసుకున్నారు. ఆయన వయస్సు అప్పటికి 83 సంవత్సరాలు. బ్రతికి ఉన్నప్పుడు ఆయన రోజూ మూడు గంటలు ధ్యానం చేసేవారు. ఆ వయస్సులో కూడా ఊరికే కూర్చోకుండా మా సెంటర్‍కు వచ్చేవాళ్ళకు పాంప్లెట్స్ పంచుతూ ఎప్పుడు ఎక్కడ ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయో, బ్రహ్మర్షి పత్రీజీ ఏ రోజున ఏ ఊళ్ళో ప్రోగ్రామ్స్ చేసేవారో వచ్చినవాళ్ళకు చెప్తూండేవారు.

మూడు సంవత్సరాల క్రితం ఒకరోజు విజయవాడ పిరమిడ్ మాస్టర్ J. పద్మ మేడమ్ మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారితో మాట్లాడుతూ " తాతగారూ, మీరు దేహవిరమణ చేసిన తరువాత మీ కర్మకాండలు ఎలా చేయాలి ? " అని అడిగారు. దానికి వారు " మా ఇళ్ళల్లో పదకొండురోజులు మైలపట్టి, రెండవరోజున ఎత్తిపోసి అస్థికలు కృష్ణానదిలో కలిపి, వేరేగా అస్థికలు తీసి అవి గంగానది త్రివేణి సంగమంలో కలుపుతాము. కానీ ‘ నేను శరీరం కాదు ఆత్మను ’ అన్న సత్యం తెలుసుకున్న నాకు ఆ కర్మకాండలు ఏమీ అక్కరలేదు. ఈ సత్యాన్ని అర్థం చేసుకుని మా అబ్బాయిని మా బంధువులు ఎవ్వరూ ఏమీ అనకుండా వుంటే చాలు " అని చెప్పారు. వారు చెప్పిన ప్రకారమే వారు తనువు చాలించిన రోజున ఏ విధమైన కర్మకాండలు చేయకుండా వారి భౌతికదేహాన్ని పంచభూతాలలో కలిపాము.

11-7-2010 ఆదివారం ఉదయం 11.00 గంటలకు కొత్తగుళ్ళు గ్రామంలో ఆయన సంస్మరణ వేడుకలు చాలా సంతోషంగా జరుపుకున్నాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్‌లు J. రాఘవరావుగారు, పద్మమేడమ్, వుయ్యూరు స్వర్ణలత మేడమ్, భీమవరం పిప్పళ్ళ ప్రసాదరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ తమ సందేశాలను వినిపించారు.

సుమారు 200 మంది ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో అద్భుతమైన పండుగ వాతావరణంలో మా నాన్నగారికి ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ వేడుక జరుపుకున్నాం. వచ్చిన బంధువులు అందరూ కూడా " ఆత్మ సత్యాన్ని " తెలుసుకుని చాలా సంతోషించారు మరి ఆ రోజున ప్రకృతి కూడా ఎంతో ఆహ్లాదకరంగా వుంది. ఇలా మూఢనమ్మకాలు నుంచి బయటకు తెచ్చి సరియైన ఆధ్యాత్మికతకు అర్థాన్ని తెలియజేసే నవీనయుగపు ఆధ్యాత్మకతను మనకు అందజేస్తోన్న జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీకి శతకోటి ధ్యాన వందనాలు.

 

శరణం వెంకటసత్యనారాయణరావు
విజయవాడ
సెల్ : +91 98481 74401

Go to top