" అంతామధ్యేమార్గం "

 

బ్రహ్మర్షి పత్రీజీ తో వ్యవహారం ఒక " రాయల్ బెంగాల్ టైగర్ " తో సహవాసం చేయడమే అనుకుంటారంతా ! అలాంటి పత్రీజీ యొక్క అప్పాయింట్‌మెంట్స్ గమనించటం, కన్‌ఫర్మ్ చేయడం, ధ్యానులు, సీనియర్లు, కొత్తవాళ్ళు పత్రీజీతో మాట్లాడాలనుకున్నప్పుడు పత్రీజీతో చెప్పగలగడం, పత్రీజీ చెప్పిన విషయాలను చక్కగా అందరికీ అందజేయగలగడం, ఏయే సెంటర్స్‌లో ప్రోగ్రామ్స్ ఉంటాయో వారందరికీ ముందే గుర్తుజేసి కావలసిన గైడెన్స్ నివ్వడం, మళ్ళి పత్రీజీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం .. ఇలా ఎన్నో ఎన్నో పనులు చేస్తూ గత 15 సం||లుగా పత్రీజీ కనుసన్నల్లో మెదులుతున్నారు డి. శివప్రసాద్. పబ్లికేషన్స్ వ్యవహారం చూస్తూ, పుస్తకాలు తర్జుమా చేయిస్తూ ఇంతై, వటుడింతై అన్నట్లుగా పెరిగే వామనావతారుడు మరి ఇంతవరకూ పోర్ట్‌పోలియో లేని మంత్రిగా వ్యవహరించిన శ్రీ శివప్రసాద్ గారి ని " ధ్యానాంధ్రప్రదేశ్ " చీఫ్ ఎడిటర్ గా నియమించి గౌరవించారు బ్రహ్మర్షి పత్రీజీ. వారిని అభినందిస్తూ పత్రీజీ యొక్క భావాలను, ఆలోచనా సరళిని వారి ద్వారా వివరంగా తెలుసుకుందాం.

- మారం శివప్రసాద్


మారం శివప్రసాద్ : డి. శివప్రసాద్ గారూ! ఆత్మ ప్రణామాలు.. ఆరు నెలలు ప్రయత్నం చేసిన తరువాత మాత్రమే మిమ్మల్ని ఇంటార్‌వ్యూ చేయడానికి నాకు ‘ కాస్మాస్ ’ నుంచి అనుమతి లభించింది. చాలా సంతోషంగా ఉంది. మీ గురించి, మీ కుటుంబం గురించి వివరించండి సర్, అలాగే మీ బాల్యం !

డి. శివప్రసాద్ : నా పూర్తిపేరు దువ్వూరి శివప్రసాద్. మాది తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం, కొత్తలంక గ్రామం. మా తల్లి సీతాలక్ష్మి, మా నాన్నగారు వెంకటేశ్వరశర్మ. 1970 సం|| వరకు హైదరాబాద్ బేగంపేటలో ఉండేవారు. P.W.D. లో సర్వీస్ చేస్తూన్నఆయన 1970 సం||లో అంటే .. నాకు 21/2 సం||ల వయస్సు ఉన్నప్పుడు, హార్ట్ఎటాక్‌తో చనిపోయారు. దాంతో మా కుటుంబమంతా మా సొంతగ్రామం కొత్తలంక వెళ్ళిపోయింది. మా అమ్మ, నానమ్మ ఎంతో శ్రమించి మమ్మల్నంతా పెంచారు. నా హైస్కూలు, ఇంటర్ అంతా ముమ్మడివరంలోనే జరిగింది. ప్రతిరోజు పోనూ రానూ ఇలా రోజు ఎనిమిది కి.మీ. ముమ్మడివరం నడుస్తూ, నా హైస్కూలు మరి ఇంటర్ చదువు సాగించాను.

చిన్నతనంలోనే నాకు తెలియకుండా విజువలైజేషన్ టెక్నిక్ అలవడింది. ఎంతో నన్ను పెంచిన అమ్మ, నానమ్మ అందరినీ గమనిస్తూ, " ఎవరిపైనా ఆధారపడకుండా జీవిస్తూ, నా కుటుంబాన్ని నేను పోషించాలి " లాంటి ఆలోచనలు నాకు వచ్చేవి. రాత్రిళ్ళు పడుకుని, నేనెక్కడికీ పెద్ద పట్టణాలకు, నగరాలకు వెళ్ళి ఏవేవో పెద్దపనులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తునట్లు ఊహించుకునేవాడిని. అలాంటి విజువలైజేషన్ నాలో తరచుగా జరిగేది. ఎరుకతో కూడిన నిద్ర ఉండేది.

ఇంటర్ అయిన తరువాత నాకా ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు. 1984 సం||లో ఒక జత బట్టలు ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టుకుని, అమలాపురంలో బస్సెక్కి విజయవాడ వచ్చేసాను. " వేసుకునే బట్ట, వేసుకున్న బట్ట .. మనిషికి ఇంక ఏమి కావాలి ? " అని పత్రీజీ క్లాసులో చెప్పే విషయం నా పట్ల 1984 సం||లోనే నిజమయ్యింది.

మారం : " భౌతిక జీవితం - ఆధ్యాత్మిక జీవితం " .. ఈ రెండూ మీరు చక్కగా తెలుసుకున్నారు. మీ అనుభవాలు, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడ్డ సందర్భాలు వివరించండి !

శివప్ప : నా అసలు జీవితాన్ని విజయవాడలో ప్రారంభించాను. 15 రోజులు విజయవాడ అంతా కలియదిరిగి, ఒక మెడికల్ కంపెనీలో రూ. 300/- లు ఇచ్చే ఉద్యోగం సంపాదించుకున్నాను. విజయవాడలోని గుణదలలో ఒక రూమ్ అద్దెకు తిసుకున్నాను. రూ. 125/- లు అద్దె, రూ. 175/- లు ఆహారం కోసం. సరిగ్గా సరిపోయేది. సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే, వీలయితే ఓవర్ టైం చేయడం, ఆ తరువాత ఊరంతా తిరగడం. పల్లె నుంచి వచ్చిన వాడిని కనుక, బాగా తిరుగుతూ అందరినీ, అన్నిటినీ చాలా శ్రద్ధగా గమనించేవాడిని. వీధులు, ఆఫీసులు, సినిమాహాళ్ళు, షాపులు, వివిధ స్థాయిల వ్యక్తులు అన్నీ, అన్నీ పరిశీలానాత్మకంగా పరికించేవాడిని. " నేను బాగా ఎదిగాను " అని నాకే అనిపించేది. ఇంటర్‌లో పోయిన సబ్జెక్టు మళ్ళీ పూర్తి చేసి, ఆ తరువాత విజయవాడలో టైప్, షార్ట్‌హ్యాండ్, బ్యాంకు రైల్వే, గవర్నమెంట్ ఉద్యోగాలకు, అన్నిరకాల వ్రాతపరీక్షలు వ్రాస్తూ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసాను.

గుణదల నుంచి బెంజ్‌సర్కిల్ వరకూ రోడ్డుమీద వెళ్తూ ఉంటే ఎంతమంది తెలుసున్న వాళ్ళే అందరినీ పలకరిస్తూ .. ఎంతోమందిని స్నేహితులుగా చేసుకున్నాను. ఎన్నో ఉద్యోగాలు మారుతూ " విజయవాడ ఆఫ్సెట్ ప్రింటర్స్ " లో జాయిన్ అయ్యాను. " జీతం ఇవ్వం, పని నేర్చుకోవాలనుకుంటే రా " అన్నారు ప్రెస్ వాళ్ళు. మరి ఎందుకు నేర్చుకోవాలనుకున్నానో తెలియదు జీతం కూడా లేకుండా. ఆఫ్సెట్ ప్రెస్లో D.T.P. దగ్గర్నుంచి, " ప్రింటింగ్ ఎలా చేస్తారు ? ఫిల్మ్ ఎలా తీస్తారు ? మ్యాగజైన్ కానీ, పుస్తకం కానీ ఎలా తయారుచేస్తారు ? " .. ఇలా అన్ని విషయాల్లో సమగ్ర అధ్యయనం చేసాను. ప్రింటింగ్ టెక్నాలజీ మొత్తం ఆరునెలల్లో నేర్చుకున్నాను. ఇప్పుడర్థమవుతోంది ఎందుకు ఆ ఉద్యోగం చేసానో ! మన డిజైన్లోనే ఇదంతా ఉందనీ, " ఆత్మ యొక్క ప్రణాళిక " క్రమ పద్ధతిలో మనసుకు తెలియకుండానే అమలు అవుతూ ఉంటుంది అనీ ! మనం ఆధ్యాత్మికతతో లేనప్పుడు జీవితానికున్న ప్రణాళిక తెలియకుండా జీవిస్తాం. ధ్యానం మన జీవితంలో ప్రారంభం అయినప్పుడు మన జీవిత ప్రణాళిక తెలిసి జివితాన్ని పండించుకుంటున్నాం. తెలియకుండానే ప్రింటింగ్, ప్రొసెసింగ్ టెక్నాలజీని నేర్చుకున్నాను నేను, ఇప్పుడు తెలిసి దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుంటున్నాను.

మారం : బ్రహ్మర్షి పత్రీజీ సాంగత్యానికి పూర్వం మీ జీవితం ఎలా ఉండింది ?

శివప్ప : ఒకరిక్రింద పనిచెయ్యటం నాకు అంతగా కుదిరేది కాదు. నేను పనిచేసేచోట వాళ్ళ విధానాలు నాకు నచ్చకపోతే నేను వేరే పనిలోకి మారిపోయేవాడిని. అలా చేయడం వలన ఎన్నో పనులు నేర్చుకోవడానికి వీలయింది. నా కాళ్ళ మీద నేను నిలబడే ధీశక్తి, అందరినీ ఆకట్టుకునే వాక్చాతుర్యం, వాగ్ధాటి నాకుంది. వాటిని మరింత అభివృద్ధి చేసుకోగల అవకాశం మార్కెటింగ్ ఫీల్డ్ లో మాత్రమే ఉందని నేను గమనించి, విజయవాడలో " ఉదయం " దినపత్రికలో చేరాను.

ఆ పత్రిక ఆఫీస్ లో సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్లో సేల్స్ ప్రమోటర్ గా ఉద్యోగం లభించింది. నెలకు రూ.450/- ల జీతం, రోజుకు ముఫ్ఫై రూపాయల బత్తా. బత్తా తిండికి సరిపోతుంది. ఉద్యోగరీత్యా ఊళ్ళు తిరగొచ్చు .. అని చేరిపోయాను. అప్పటికి రెండేళ్ళుగా ఆ ఉద్యోగం అక్కడ చేస్తున్న వాళ్ళు " ఎదుగూ బొదుగు లేకుండా ఉన్నాం " అని నిరుత్సాహ పరుస్తూన్నలెక్కచేయక సేల్స్ ప్రమోటర్‌గా జీవితం ప్రారంభించాను. మూడు రోజుల ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగం ప్రారంభం. ఒక ఇంటికి వెళ్ళి ఒక కొత్త వ్యక్తితో మాట్లాడి, నన్ను నేను పరిచయం చేసుకోవడం, " మీతో కాసేపు మాట్లాడవచ్చునా ? " అని అడగడం, " ఉదయం " దినపత్రిక గురించి చెప్పడం, వద్దంటే నచ్చజెప్పి చందా చేయించడం. ఉదయం 6 గం||ల నుంచి మధ్యాహ్మం 12 గం||ల వరకు మాత్రమే మొదటిరోజు నేను ఎన్‌రోల్ చేయించింది 13 మందిని.

మధ్యాహ్నం 1గం||కు అందరం కొత్త సేల్స్ ప్రమోటర్స్‌తో మీటింగ్ " ఉదయం " ఆఫీస్‌లో, మీటింగ్ ముందు అందరూ మాట్లాడుకుంటూ " నేను 50 మందిని, నేను 100 మందిని, నేను 70 మందిని ఎన్‌రోల్ చేసాను " అని ఇతరులకు చెప్పుకుంటున్నారు. నేననుకున్నాను " నేను అందరికంటే తక్కువ " అని. తీరా మీటింగ్లో ఉదయం ఆఫీస్లోని వాళ్ళు అనౌన్స్ చేసారు " డి. శివప్రసాద్ హయ్యస్ట్‌గా 13 మందిని ఎన్‌రోల్ చేసారు " అని అభినందనలు తెలియజేసి చప్పట్లు కొట్టించారు.

జీవితంలో, మొదటిసారి నాకు అర్థమయిందేమంటే మనుషులు గొప్పలు చెప్పుకుంటారనీ .. అలా చెప్పడానికీ, వాస్తవానికీ ఎంతో వ్యత్యాసం ఉంటుందనీ, ఇలా లేని గొప్పలు బయట వందమంది వందమాటలు మాట్లాడుతూంటారనీ. వాటితో మనకు పనిలేదు అనీ తెలుసుకున్నాను. అలా రెండు సం||రాల్లో సేల్స్ ప్రమోటర్ నుంచి సేల్స్ రిప్రజెంటేటివ్ మరి ఆ స్థాయి నుంచి డిస్ట్రిక్ సూపర్‌వైజర్, ఆ పైన సీనియర్ సేల్స్ సూపర్‌వైజర్, ఆపై మార్కెటింగ్ ఆఫీసర్, ఆ తరువాత తిరుపతిజోన్‌లోని అనంతపురంలో " జిల్లా మార్కెటింగ్ మేనేజర్ " గా నియమించారు. రూ.450/-ల జీతం నుంచి రూ.1000/- లకు పెరిగింది.

మా బంధువులందరూ, " రూ. 1000/- లకు అంతదూరంలో ఉద్యోగం ఎందుకు చేస్తున్నాడు " అని సందేహపడేవాళ్ళు. టోటల్గా సేల్స్ ప్రమోటర్ నుంచి డిస్ట్రిక్ మార్కెటింగ్ మేనేజర్‌గా ఎదగడానికి 3 1/2 సం||లు స్వల్పకాలమే అయినా రూ.2400/-, T.A, D.A. అన్నీ కలిసి నెలకు పన్నెండు, పదమూడు వేలు పొందేస్థాయికి, జీతం 5 లేక 6 స్థాయికి చేరుకున్నాను " ఇక ఎంతో సాధించేసా " ననుకున్నాను నేను జీవితంలో.

అది జీవితంలోని ఫస్ట్ ఇన్నింగ్స్! సెకెండ్ ఇన్నింగ్స్ బ్రహ్మర్షి పత్రీజీ సాంగత్య భాగ్యంతో ప్రారంభమయ్యింది. అయితే నేను చిన్నప్పటి నుంచి విజువలైజేషన్ చేసిన ఎన్నో విజయాలను పత్రీజీ పరిచయం ముందు భౌతికంగా నాకు తృప్తికరంగానే సాధించుకున్నాను. ఆ అనుభవాలు నా ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప పునాదిని వేసాయి.

మారం : మొట్టమొదటిసారి మీకు ధ్యానపరిచయం ఎలా ఎవరి ద్వారా జరిగింది?మీ మొదటి ధ్యాన అనుభవం ఏమిటి?

శివప్ప : మొదటి నుంచి నాకు భక్తిభావం ఎక్కువ. మా ఇంటి దగ్గరలో బ్రహ్మేశ్వరస్వామి ఆలయం ఉండేది. చిన్నతనం ఆటలూ, పాటలూ అంతా ఆలయంలోనే. అలా " శివుడు " అంటే ఒక గొప్ప అనుభూతి కలిగేది. " గాయత్రీ జపం " ఇంట్లో అందరితో పాటూ నేను కూడా చేసేవాడిని. క్రమంగా నా పరిశ్రమ, కృషి వల్ల నా అవసరాలకు తగిన డబ్బు నేను సంపాదించుకుంటూ ఉండడం అనారోగ్యమూ లేదు. గణపతి ఉత్సవాలు జరిగినా, సాయిబాబా ఉత్సవాలు జరిగినా, శివరాత్రి సందర్భంగానైనా ఎక్కడా, ఏ ఊర్లోనైనా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవాడిని.

అనంతపురం లో ఉన్నప్పుడు కన్నడ వారితో పరిచయం. మాట్లాడటం రాదు కానీ, ఏ కన్నడ ప్రాంతం వెళ్ళిన కమ్యూనికేట్ చేసే కనీస అవగాహన వచ్చింది. వారి ఇంటికి వచ్చే " శాస్త్రి " అని ఇంజనీరింగ్ చదివే వ్యక్తితో స్నేహం కుదిరి ఒకరోజు శాస్త్రిని మా రూమ్‌కి పిలిచాను.

మా ఇంట్లో ఉన్న ఫోటోలు, భక్తి క్యాసెట్లు, దేవతార్చన పుస్తకాలు, నా ప్రార్థనలు ఇవన్నీచూసాడు శాస్త్రి " మీకు దేవుడిపైన ఇంత భక్తి ప్రవృత్తులు ఉన్నాయి కదా .. మీరు ధ్యానం చేస్తే దేవుడు మీ ఇంటికి వచ్చి మీకు కనబడతాడు, మీతో మాట్లాడతాడు. నేను రోజూ ధ్యానం చేసి ఎంతోమంది దేవుళ్ళతో మాట్లాడాను " అన్నాడు. " అవునా ?! నేనింతవరకు ‘ ధ్యానం ’ అని వినడం మొదటిసారి. అదేంటో చెప్పండి, చేస్తాను. మరి ‘ దేవుడు కనబడతాడు ’ అంటే ఇంకేం కావాలి నాకు ?" అన్నాను.

" హాయిగా కూర్చోండి స్థిరంగా, శ్వాసను గమనించండి. ఇంతే " అని, భోజనం చేసి వెళ్ళిపోయాడు. ఇంకేం " దేవుడు కనబడతాడు కదా " అని స్నానం చేసి, ఇల్లంతా అగర్బత్తీలు పెట్టేను. " కాన్షియస్ బ్రెత్ " అన్నాడు. ఇంకేం చెప్పలేదు. రాత్రి 8.20 గం || లకు అనుకుంటాను కళ్ళు రెండు మూసుకుని చేతులు కలిపి కూర్చున్నాను .. నాలో నేను స్తోత్రాలు పాడుకుంటూ! గతంలో జరిగిన సంఘటనలు ఒకటొకటి గుర్తుకు వస్తున్నాయి. అలాగే కూర్చున్నాను. కదలలేదు. దాదాపు గంట, గంటన్నర పూర్తయింది. ఏ దేవుడూ రాలేదు. మాటిమాటికి శ్వాస మీదకు దృష్టి సారిస్తున్నాను.

నాకు ఏం చేసినా పట్టుదలగా చేయడం అలవాటు. అలాగే మొండిగా కూర్చున్నాను చాలాసేపు. దాదాపు ఏడు గంటలు ! " ఇంక లేచిపోదాం " అనుకుంటూండగా, ఒక గోల్డ్‌కలర్ రింగ్ నా ముఖం చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. చాలా బాగా అనిపించింది. అంతలోనే మాయం అయిపోయింది. " ఇంకేం లేదా ? " అనుకుంటూ ఉంటే దట్టమైన చీకటి .. అందులోంచి చిన్న వెలుగు, ఏదో వినిపిస్తున్న శబ్ధం, ఆ స్పార్క్ వేగంగా వచ్చి నా నుదుటిభాగాన్ని ‘ టచ్ ’ చేసింది. సినిమా ఇంటర్వెల్ అయిన తరువాత స్క్రీన్ రెండు భాగాలు అయినట్లు నాలో ఏదో తెర తొలగింది.

చీకటి అంతా తొలిగిపోయి బ్రహ్మాండమైన తేజస్సు. అందులో శివలింగం, నంది, ధ్వజస్తంభం, క్రిందగా చాలా చాలా లోతుగా నీళ్ళు కనబడుతున్నాయి. దృష్టి పైకి వెళ్ళింది. శివుడి దర్శనమైంది. అలా అయిదు నిమిషాలు ఆ దృశ్యాలు, ఆ ప్రకృతి చూస్తూంటే అకస్మాత్తుగా నా కళ్ళు వాటంతటవే తెరుచుకున్నాయి. తాపీగా టైమ్ చూస్తే తెల్లవారుఝామున 4 గం||లు అవుతోంది. అంటే 7.45ని ||లు నేను మొట్టమొదటి సిట్టింగ్‌లోనే ధ్యానం చేశాను !

మారం : రెండవరోజు ఏం జరిగింది ?

శివప్ప : ధ్యానం చేసి లేచిన తరువాత హాయిగా మంచం మీద పడుకుని నిద్రలోకి వెళ్ళిపోయాను. నిద్రలోకి వెళుతూ ఉన్నాను, సడన్‌గా ఎవరో భుజం మీద చేయివేసిన స్పృహ. తలుపులు, కిటికీలు అన్నీ తీసి చూసాను. ఎవ్వరూ లేరు. మళ్ళీ నిద్రలోకి వెళుతూ ఉన్నాను. మళ్ళీ ఎవరో తడుతూ ఉన్నారు. తెల్లవారేవరకూ ఇలాగే. నిద్రలోకి జారుకుంటూ ఉండడం, ఎవరో తట్టి లేపుతూండడం. భక్తితో పాటు చిన్నప్పటి నుంచి పెరిగిన భయం కూడా ఉంది దెయ్యాలంటే, ఇక నిద్రలేదు. అంతా గందరగోళం. లేచి కూర్చున్నాను. ఏమయిందో తెలియదు. ఏమీ కాకుండా లేదు. మొత్తం మీద ఏదో అయ్యింది !

స్నానం చేసి యధావిధిగా పూజ, సంధ్యావందనం చేసాను. తాపీగా బయటికి వెళ్ళి భోజనం చేసాను. టైమ్ మధ్యాహ్నం 2 గం||లు అయింది. మళ్ళీ రాత్రవుతుంది కదా. మళ్ళీ ఎవరో తడితే ఎలా ? శాస్త్రి కోసం వెతికితే " ఊరెళ్ళాడు, మూడురోజుల దాకా రాడు " అన్నారు. ఏమయితే ఏమయిందని ఇంటికి వచ్చి రాత్రి స్నానం చేసి మళ్ళీ ధ్యానానికి కూర్చున్నాను. దాదాపు 5 గం||లు కూర్చున్నాను !

ఇన్నర్ సైలెన్స్ వచ్చింది. దట్టమైన చిమ్మచీకటి. అంతలోనే పైన నుంచి వెలుగు పడింది. పంచకట్టుకున్న ఒక స్వామీజీ అటుప్రక్కకు తిరిగి కూర్చున్నాడు. అంతలో నాలోంచి నాలాంటి ఆకారం బయటకు వచ్చింది. నేను ఆ స్వామి ముందుకు వెళ్ళితే ఆయన " ఎవరు రమ్మన్నారు ? " అని అరుస్తూ .. వెనక్కి తిరిగారు. " " నేను వచ్చిందే మిమ్మల్ని చూడడం కోసం " అని ఆయన చెప్పి ఆయన ముందుకు వెళ్ళాము. అలా ఆయన తిరుగుతూ, తిరుగుతూ పైకి ఆ కాంతిలోకి ఊర్థ్వముఖంలో పైకి వెళ్ళిపోయారు. వెంటనే పెద్ద వర్షం. నామీద లోపలికి వెళ్తూ .. గొంతులో అడ్డుపడింది. బయటంతా వర్షం ఉంది. నా సూక్ష్మశరీరం (తర్వాత తెలిసింది అది సూక్ష్మశరీరం అని ) ఎక్కడెక్కడో తిరిగివచ్చింది. స్పృహ వచ్చిన తర్వాత వళ్ళంతా వేడిగా ఉంది. గొంతునొప్పిగా ఉండడం వల్ల " కోల్ట్‌లాక్ టాబ్లెట్ వేసుకుందాం " అనుకున్నాను. " ఎందుకులే అక్కడ వర్షంలో వచ్చింది కదా " అని టాబ్లెట్ వేసుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఏ టాబ్లెట్ వేసుకోలేదు. అలాగే మళ్ళీ పడుకున్నాను. ప్రశాంతంగా నిద్ర పట్టింది.

మరుసటి రోజు శాస్త్రీ కనబడితే, అతనికి నా అనుభవాలన్నీ చెప్పాను. " అవునా ? రెండేళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాను, నాకే అనుభవాలూ రాలేదు. నువ్వు చాలా అదృష్టవంతుడివి " అన్నాడు. నాకు కలిగిన సందేహాలు అన్నీ చెప్పాను.

సరే, ఈ రోజు సాయంత్రం ఫలానా " విజయకుమార్ గారింటికీ ‘ పత్రీజీ ’ అనే మాస్టర్ వస్తున్నారు ; వారిని వెళ్ళి కలువు ; అన్నీ ఆయనే చెపుతారు. ఆయన ధ్యానం నేర్పించిన గురువు గారు " అన్నారు. తీరా వెళితే ఆ సెంటర్ ఉన్న మేడ మీద మేము గతంలో " స్పోకన్ ఇంగ్లీష్ " క్లాసులకు వెళ్ళేవాళ్ళం. ఇదీ బ్రహ్మర్షి పత్రీజీ ని కలవకముందు మన జీవితం, మొదటి రెండురోజుల ధ్యాన అమోఘ అనుభవాలు, రెండవరోజే సూక్ష్మశరీరం రిలీజ్ కావడం.

మారం : మొట్టమొదటిసారి మీరు కలిసినప్పుడు జరిగిన సంభాషణ ఏమిటి ? ఎలా రిసీవ్ చేసుకున్నారు వారు ?

శివప్ప : ఆ రోజు ఇప్పటికీ నాకు బాగా జ్ఞాపకం. నా జీవితాన్నే మలుపుతిప్పిన రోజు కదా! అది 1994 ఆగస్టు 20 వ తేదీ. బ్రహ్మర్షి పత్రీజీ ని మొట్టమొదటిసారి చూసిన రోజు.

ఆ ఇంటి మేడమీద " అనంతపురం పిరమిడ్ ధ్యానకేంద్రం " లో ఫ్యాంట్, లాల్చీ వేసుకుని ముస్లింటోపి తెల్లది పెట్టుకుని కూర్చుని ఉన్నారు. నేను ఒక ప్రక్కన కూర్చోబోతూ ఉంటే, " ష్ ! " అని చిటికివేసి పిలిచి తన ప్రక్కన ఎవరో కూర్చుని ఉంటే వారిని లేపి, నన్ను తన ప్రక్కన కూర్చోమన్నారు. ఒక్కొక్కరినీ " నీ జీవితధ్యేయం ఏమిటి ? " అని అడుగుతున్నారు. ఒక్కొక్కరు సమాధానం చెపుతూంటే, దాన్ని పూర్వపక్షం చేస్తున్నారు. " ఇదేంట్రా బాబు! ఇలా దొరికిపోయాను! నన్నడిగితే నేనేం చెప్పాలి ? " అనుకున్నాను. నా వంతురానే వచ్చింది. " చెప్పండి సర్! మీ జీవితధ్యేయం ఏమిటి ? " అన్నారు. నాకంటే దాదాపు 20 ఏళ్ళు పెద్దవారు, ఒక గొప్పగురువు. నన్ను " సార్ " అని సంబోధించి, " మీరు " అని బహువచనంలో పిలిచారు. ఇలాంటి గౌరవమైన పిలుపు నా జీవితంలోనే మొట్టమొదటిది. బ్రహ్మర్షి పత్రీజీ నోటినుంచి మొట్టమొదటిసారి నన్ను సంబోధిస్తూ పిలిచిన ఆ గౌరవప్రదమైన పిలుపును నేను ఇప్పటికీ మరిచిపోలేను. మురిసిపోయాను, ఆశ్చర్యపోయాను!

" యస్! మీ జీవితధ్యేయం ఏమిటి " అని మళ్ళీ రెట్టించి అడిగారు. " ఏముందండీ ! భగవంతుడి దగ్గరగా ప్రార్థన చేసుకుంటూ ఉండడం " అన్నాను. నేను పత్రీజీతో సంభాషించిన మొదటి మాటలవి. " ప్రార్థన అంటే ఏమిటి ? " అని ప్రశ్నించారు పత్రీజీ. " దొరకిపోయాను " అనుకుని మౌనంగా ఉండిపోయాను. " ప్రార్థన అంటే అడుక్కోవడం ; మనిషై పుట్టినవాడు అన్నీ శ్రమించి సాధించుకోవాలి. ఎవ్వరినీ అడుక్కోకూడదు. ఎప్పుడు మనం మన స్వంతసాధన మీద నిలబడతామో, శ్రమిస్తామో అప్పుడే మనం నిజమైన మనుష్యులం " అని " ఆధ్యాత్మికతాపం ", " ఆదిదైవికతాపం ", " ఆదిభౌతికతాపం " అని మూడు రకాల తాపాలను గురించి విశేషంగా వివరించారు. ఆ తర్వాత అందరినీ ధ్యానం చేయించి, ఒక్కొక్కరి అనుభవాలు అడిగారు. నేను గత రెండు రోజులలో జరిగిన విశేష అనుభవాలు వివరించి చెప్పాను. అందరితో చప్పట్లు కొట్టించారు.

బయటికి వచ్చాం. అక్కడ " గుణాకర్ ", " కృష్ణ " - అనంతపురం మాస్టర్లు కనబడ్డారు. " నువ్వే పుస్తకాలు చదివావు ? " అని అడిగారు. " ఏం చదవలేదు " అన్నాను. అప్పుడు ఆ దగ్గర్లోనే విశాలాంధ్ర బుక్‌హౌస్ ఉంది. అక్కడికి తీసుకువెళ్ళి " హిమాలయ యోగులు " పుస్తకం కనిపించారు. నేను కొన్న మొట్టమొదటి స్పిరిచ్యువల్ బుక్ అది!

ఆ పుస్తకం చదివిన తర్వాత ధ్యానంలో స్వామి రామా కనబడ్డారు. ధ్యానంలో ఒక ఆశ్రమం కనబడింది. లోపలికి వెళుతూంటే స్వామిరామా కనబడ్డారు. నేను లోపలికి వెళుతున్నాను. ఒక స్వామీజీ తెల్లగడ్డం పెట్టుకుని ఉన్నారు. చూడాలని వెళుతూంటే స్వామిరామా " ఎవరు నువ్వు ? ఎందుకు వెళుతున్నావు ? " అని తిడుతున్నారు! నేను వెనక్కి తిరిగి వెళ్తున్నాను. అంతలోనే ఒక స్త్రీ చేయి వచ్చి నా భుజం మీద పడింది. ఆమెను చూడలేదు. " ఆయన పైకి అలా అరుస్తూంటారు. కానీ చాలా కరుణామయుడు నువ్విటురా " అని నన్ను వెనుక నుంచి తిసుకువెళ్ళి ప్రక్కన ఉన్న ఇంకొక కాంపౌండ్లో కూర్చోబెట్టి " ఇక్కడ కూర్చో. అక్కడ ఏం జరుగుతుందో చూడు " అని చెప్పి వెళ్ళిపోయింది.

ఒక గ్రూప్ ఆడవాళ్ళు. చక్కటి బట్టలు కట్టుకుని నృత్యం, కీర్తనలు, భజనలు చేస్తున్నారు. ఇంకొక్క ప్రక్క మరో గ్రూప్ స్వామీజీలు, శిష్యులు అందరూ అభిషేకాలు చేస్తున్నారు. ఇంకొకగ్రూప్ యజ్ఞాలు, హోమాలు చేస్తూన్నారు. లోపల అంతకుముందు కనిపించిన ధవళవస్త్రాల స్వామీజీ ‘ ధ్యానం ’ చేస్తున్నారు.

నాకు అర్థమయ్యింది. నేను కీర్తనలు, హారతులు పాడతాను. అభిషేకాలు చేస్తాను. యజ్ఞయాగాదాలూ చేస్తాను. ఇప్పుడు ఆ స్వామీజీ లాగా ధ్యానమూ చేస్తున్నాను. " ఒకటొకటిగా నా స్థితులను చూపుతున్నారు " అని అర్థమయింది. " నేనెలా జీవించాలో ఇక నుంచి నాకు ఆస్ట్రల్ శిక్షణ ఇస్తున్నారు " అని తెలిసింది. అంతే ! ఆ రోజు నుంచి కీర్తన, ప్రార్థన, అభిషేకం, హోమం అన్నీ బంద్. ధ్యానం, ధ్యానప్రచారం ఇంతే.

మారం : మరి మీరు తిరుపతిలో సెటిలవ్వడం ఎలా జరిగింది ? ఆ తరువాత పత్రీజీ ని రెండవసారి ఎప్పుడు ఎక్కడ కలిసారు ? " ధ్యానలహరి " మ్యాగజైన్ మొదటిసారి ఎప్పుడు ఎక్కడ తీసుకువచ్చారు ?

శివప్ప : నన్ను కంపెనీ వారు ట్రాన్స్‌ఫర్ చేసి తిరుపతి వెళ్ళి రిపోర్ట్ చేయమన్నారు. అప్పటికే క్రమంగా విజయకుమార్, రంగా, గుణాకరరెడ్డి .. వీనస్ ప్లానెట్కి రెగ్యులర్గా ఆస్ట్రల్ ట్రావెల్ చేసే శ్రీనివాస్ (' VT ' అనేవారు ) .. ఇలా మాస్టర్లందరితో మంచి సర్కిల్ ఏర్పడింది. ధ్యానంలో ఒక్కొక్కరు ఒక్కొక్కదాంట్లో స్పెషలిస్టులుగా ఉండేవారు. " అప్పటికి ఒక పది పదిహేను రోజుల నుంచి అందరితో మంచి అనుభవాలు వినడం, పంచుకోవడం చేస్తూంటే, తిరుపతికి వెళ్ళమంటారేంట్రా బాబూ " అనుకున్నాను. " పత్రిసార్ తిరుపతి ‘ భీమాస్ డీలక్స్ ’ లో ఉన్నారు అని తెలిసి బస్సెక్కి తిరుపతి వెళ్ళిపోయాను.

భీమాస్‌లో పత్రీజీ ని కలిసి, నాకు తిరుపతి ట్రాన్స్‌ఫర్ అయినట్లు చెప్పారు. పత్రీజీ " కంగ్రాట్స్ " చెప్పి " మీరు సరియైన ప్లేస్‌కు వచ్చారు. మీ అవసరం ఇక్కడ చాలా ఉంది " అన్నారు. ఆ తర్వాత ఆఫీస్ వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు వర్క్ షెడ్యూల్ ఇచ్చారు. అవన్నీచిన్నఊళ్ళు. వారం రోజుల పని రెండురోజుల్లో పూర్తిచేసి, మిగతా రోజులు తిరుపతిలో మాస్టర్లందరినీ కలుస్తూ, ధ్యానప్రచారం చేస్తూ, స్పిరిచ్యువల్ బుక్స్ చదువుతూ గడిపేవాడిని.

అలా 1995 సం||వచ్చింది. తిరుమలలో బ్రోచర్స్ పంచాలని తిరుమల వెళ్ళాం. బ్రహ్మోత్సవాలకు వచ్చేవాళ్ళకు బ్రోచర్స్ పంచేవాళ్ళం. పత్రీజీ కూడా రెండురోజులు అక్కడే ఉన్నారు. అక్కడ మొదటిసారి ‘ మ్యాగజైన్ ’ గురించిన చర్చ వచ్చింది. క్రమంగా రెండు నెలల డిస్కషన్ తర్వాత 1996 సం|| గురుపౌర్ణమికి నందవరం సదానందయోగి ఆశ్రమంలో మొదటి ఇష్యూ " ధ్యాన " మ్యాగజైన్ విడుదల అయింది !

పత్రీజీ తో 1995 సం||లో ఎంతో బాగా గడిపాను ! 1996 సం|| లో ఆయన మౌనంలో ఉన్నారు. అప్పుడు కంచిరఘురాం, కేశవరాజు, కుప్పుస్వామి, సతీష్ ( ఇప్పుడు లేరు బాడీవెకేట్ చేసారు ). అందరం కలుసుకునే వాళ్ళం. అప్పుడే 1996 సం|| ఫిబ్రవరిలో జెమిని T.V. ఇంటర్‌వ్యూ కోసం యండమూరి వీరేంద్రనాధ్ గ్రూప్ కర్నూలు బుద్ధా పిరమిడ్ కి వచ్చారు. అప్పుడు కొన్ని గంటలు పత్రీజీ మౌనం వదిలారు. నందవరంలో మ్యాగజైన్ రిలీజ్ చేసినప్పుడు కాసేపు మౌనం విడిచారు. S.P.Y రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరయిన ఆ గురుపౌర్ణమి పొగ్రాంలో మొట్టమొదటి " ధ్యాన " మ్యాగజైన్ విడుదలయింది. అప్పుడు నన్ను పత్రిసార్ స్టేజీమీదకు పిలిచి చప్పట్లు కొట్టించి మాట్లాడమన్నారు.

మారం : మరి మీరు ఫుల్టైమ్ మాస్టర్‌గా ఎప్పటి నుంచి ఉన్నారు ?

శివప్ప : ఆ తరువాత ఒకరోజు పత్రీజీ తిరుపతిలో ఒకరింట్లో కూర్చుని "Messages from 40 Masters " ఇంగ్లీష్ బుక్ కరెక్షన్ చేస్తున్నారు. " రెండు నెలల నుంచి జీతం రాలేదు ; డబ్బులు ఇస్తారు నిదానంగానైనా " అని తలపోస్తూ పత్రీజీ దగ్గర కూర్చున్నాను. పత్రీజీ నన్ను చూస్తూనే " నీకు ఉద్యోగం వద్దయ్యా! నువ్వు ఈ భూమిమీదకు వచ్చిన పనివేరు. నేనెలా ఉన్నాను ? ఉద్యోగం వదిలిపెట్టాన లేదా ? నువ్వు అంతే ! " అన్నారు నేనేమీ చెప్పకుండానే. అంతే నేను మళ్ళీ ఆఫీస్‌కు వెళ్ళలేదు! ఉద్యోగమూ చేయలేదు! అలా ముగిసిపోయింది మన ఉద్యోగజీవితం!

ఆ తరువాత ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసారు. లెటర్ వ్రాసారు. అయినా నేను పట్టించుకోలేదు. ఆ రోజు నుంచి తిరుపతిలోనే ఫుల్‌టైమ్ మాస్టర్‌గా అయిపోయాను. తిరుపతిలో బాగా ధ్యాన కార్యక్రమాలు జరిగేవి. అక్కడే కాదు ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా ముందులైన్లో ఉండేవాడిని.

మారం : మరి క్యాసెట్లు రికార్డింగ్ మీరు చేయడం ఎలా జరిగింది?

శివప్ప : తిరుపతిలో ‘ రఘు ’ స్టూడియో ఉంది. పత్రీజీ తిరుపతికి వచ్చినప్పుడల్లా క్యాసెట్ రికార్డ్ చేయడం మొదలుపెట్టాం. మొదట రఘు స్టూడియోలో రెండు క్యాసెట్లు రికార్డు చేయించాం. రికార్డింగ్ ఖర్చులు తిరుపతి పిరమిడ్ మాస్టర్ S. ఉదయకుమార్ అందించారు. దాని ప్రొడక్షన్ నేను చూసేవాడిని. " అది మనకు ఖరీదు " అనిపించింది. అసలు ఈ క్యాసెట్లు రికార్డు చేయించాలనే ఆలోచన నాలో కలిగించిన వారు " శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ". వారు జెమిని T.V. కోసం కర్నూలులో రికార్డు అయిన క్యాసెట్ నాకు ఇచ్చారు. దానిని మద్రాసు తీసుకెళ్ళి 25 వీడియో క్యాసెట్లలో తయారు చేయించి, అందరితో కొనిపించడం జరిగింది. అప్పటికి గుంతకల్ విజయకుమార్ తయారు చేయించిన " భజగోవిందం " మరి ఇంకొక క్యాసెట్ " ధ్యానం " ఉండేవి.

తిరుపతిలో పత్రీజీ తో నేను రికార్డు చేయించిన మొదటి క్యాసెట్ " శ్రీ కృష్ణ సందేశం ", రెండవది " భజగోవిందం ", ఆ తర్వాత " లేదు మరణం ", " ధ్యానవేణువు ", ఇవన్నీ తిరుపతిలో రికార్డు చేయించడం చేసేవాడిని. ప్రతి పని జరగడానికీ మనకు అవసరమైన వాళ్ళు అవసరమైన సమయంలో తటస్థపడుతూ ఉంటారు. ఇది కూడా మన లైఫ్ డిజైన్ లో భాగమే. అలా ధ్యానలహరి శివప్రసాద్ నయ్యాను.

1997 సం||లో అయిదు సం||రాల ధ్యాన వారోత్సవాలు కర్నూలులో చేసారు పత్రీజీ. అప్పుడు వారి వెంటనే తిరగడం వల్ల పూర్తిగా పత్రీజీ సెక్రెటరీగా మారడం జరిగింది. 1997 సం||శివరాత్రి కార్యక్రమం హైదరాబాద్ " లలితా మనోహర్ కళ్యాణమండపం " లో జరిగింది. ఆ కార్యక్రమానికి నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ద్వారకానాథ్, శ్రీనివాసరెడ్డి, N.J.రావు, శ్రీనివాసరావు, రామమూర్తి ఇలా ఒకరొకరితో పరిచయాలు పెరగడం, పత్రీజీ మీటింగ్లో చీఫ్‌గెస్ట్‌లను ఆహ్వానించి పిలుచుకురావడం, ట్రెక్కింగ్‌లు, చిన్న పెద్ద ప్రోగ్రామ్‌లు, వన్డే వర్క్‌షాప్‌లు అలా క్రమంగా పూర్తికాలం పత్రీజీ తో ఉంటూ, సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. 1999 సం||మొదటి ధ్యానమహాయజ్ఞం తరువాత ‘ సీన్ ’ కర్నూలు నుంచి హైదరాబాద్‌కు మారింది.

మారం : పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో ట్రెక్కింగ్‌లది ఒక ముఖ్యపాత్ర, మరి ట్రెక్కింగ్ చేయాలనే ఐడియా ఎప్పుడు అంకురించింది ? మొట్టమొదటి ట్రెక్కింగ్ ఏది ?

శివప్ప : నవంబర్ 1995 సం || లో కార్తీక పౌర్ణమికి " తుంబురతీర్థం " మొట్టమొదటి పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ట్రెక్కింగ్. దీనికి మూలకారకులు M. మునుస్వామి, B.V. రమణ. అంతా కలిసి 64 మందిమి వెళ్ళాం. ఒకరోజు ట్రెక్కింగ్. నేను, మునుస్వామి రాత్రికి చపాతి, మరునాడు ఉదయం పులిహోర అందరికీ ప్యాకింగ్ చేయించి ఫుడ్ ప్యాకెట్ తిసుకెళ్ళాం.

మునుస్వామి ఫ్రెండ్ B.V. రమణ చెప్పిన మీదట పత్రీజీ రెండు నెలల ముందు నుంచే అనంతపురం విజయకుమార్, గుంతకల్ మురళీధర్ వీరందరితో డిస్కస్ చేసారు. వీరితో బాటు పాల్ విజయకుమార్, యల్. వీరారెడ్డి .. ఇలా ఎంతోమంది సీనియర్ మాస్టర్లు వచ్చారు. ప్రకృతితో సహజీవనం! వర్షంలో ధ్యానం! ధ్యానం .. అడవి.. చీకటి .. ! అలాంటి వాతావరణంలో ఆ చీకటిలో పాపవినాశనం డ్యామ్ నుంచి నీరు విడుదలవుతూంటే హోరున శబ్దం, అడవిలో జంతువుల అరుపులు, నక్కల ఊళలు. మౌనంగా పత్రీజీ చెట్టుక్రింద, రాత్రి చీకటిలో ఒక్కరే కూర్చున్నారు. అందరూ భయాన్నిపోగొట్టుకున్నారు. మరునాడు ప్రొద్దున నడుంలోతు నీళ్ళలో తుంబురతీర్థం చిట్టచివరి వరకూ తీసుకెళ్ళాక, అందరం స్నానాలు చేయడం, ఉదయం టిఫిన్ చేసాక సాయంత్రం వరకూ అందరూ ఆహారం లేకుండా ఉండడం, ‘ ఆకలి ’ అనేది లేకుండా అడవిలో ఎలా జీవించాలో అందరికీ ఓ గొప్ప అనుభవం!

ఈ ట్రెక్కింగ్‌లో చాలా కాన్స్‌ప్ట్‌లు వచ్చాయి పత్రీజీ నుంచి, ఎన్నో మౌలికమయిన విషయాలు అందరికీ తెలిసాయి. దాదాపు అప్పటి సీనియర్ మాస్టర్లందరూ హాజరయిన గొప్ప ట్రెక్కింగ్. మొట్టమొదటి ఆ ట్రెక్కింగ్ మరిచిపోని, మరుపురాని అనుభవం. ప్రకృతితో సహజీవనం గురించి సీనియర్ మాస్టర్లు తెలుసుకుని, క్లాసులో అందరికీ చెప్పడం వల్ల అప్పటి నుంచి " ట్రెక్కింగ్ల పరంపర " మొదలైంది పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ లో! తమాషా ఏమింటే భారీ వర్షంలో కూడా చిన్న, పెద్ద 60 సం||లు పైబడినవారు కూడా ట్రెక్కింగ్‌లో పాల్గొనేవారు.

మారం : పత్రీజీ ని కలవక ముందు, కలిసిన తరువాత కూడా ఎంతోమంది గురువులను మీరు కలిసి ఉంటారు. ఆయా సందర్భాలలో మీ అనుభూతులను వివరించండి !

శివప్ప : పత్రీజీ కంటే ముందు ఒక గొప్ప ప్రముఖ స్వామీజీని కలిసాను. మా పత్రికలో పనిచేసే ఒక ప్రముఖుని వెంట వెళ్ళి కొంచెం దూరంలో కూర్చున్నప్పుడు ఆ స్వామీజీ నా మిత్రుడితో నన్ను గురించి " ఎవరు ? " అని అడిగారు. అంతేకానీ దగ్గరగా పిలిచి కూర్చోబెట్టుకోలేదు. నన్ను దూరంలో ఉన్నా గుర్తించి దగ్గరకు తీసుకున్నవారు పత్రిసార్ !

ఎన్నో కార్యక్రమాలకు ముఖ్యఅతిథులుగా పిలవడానికి ఎంతోమంది స్వామీజీలనూ, గురువులనూ వారి వారి ఆశ్రమాలలో, శిష్యుల గృహాల్లో, వారి ప్రోగ్రామ్స్‌లో నేను కలవడం ఎన్నోసార్లు జరిగింది. ప్రతివారిలోనూ ఉన్న గొప్ప విషయాలను గమనించాను నేను. తమాషా మరి గొప్పతనం ఏమంటే నేను గుర్తించిన గొప్పతనాలన్నీ పత్రీజీ లో చూసాను. అంత గ్రేట్‌మాస్టర్ వారు.

మారం : పత్రిసార్ కోపం గురించి, తిట్టడం గురించి, కొట్టడం గురించి కామెంట్ ప్లీజ్.

శివప్ప : పత్రీజీ కోపం ఇప్పుడు కాదు. ఆరు సం||ల క్రితం చూడాలి ! అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు కోపం చాలా చాలా తక్కువ. " అస్సలు కోపం లేదు " అని చెప్పాలి. ఆ రోజుల్లో అంతా అప్పటిది కోర్‌గ్రూప్. ఆయన ఎవరినయినా తిట్టారంటే, కొట్టారంటే దాన్ని గురించి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎంతో లోతుగా ఆలోచించేవాడు. ఒకే పాయింట్‌ని పట్టుకుని ఆయన గంటలు సేపు తిట్టిన సందర్భాలున్నాయి. అప్పుడు మాస్టర్స్ ఆయన తిట్లని, దెబ్బలని కాకుండా " పాయింట్ " ని గురించి ఆలోచించేవారు. ఆ లోపాన్ని సరిచేసుకునేవారు. ఎంత ఎక్కువ కోపాన్ని ఆయన ప్రదర్శించగలరో, అంతస్థాయిలో హ్యూమర్‌ని, అంతస్థాయిలో కరుణనూ, స్నేహాన్ని కూడా ప్రదర్శిస్తారు. అన్నీ ఏకకాలంలో పండించగలరు. అందుకే ఆయన చుట్టూ ఎంతోమంది ఎప్పుడూ ఉన్నారు, ఉంటారు.

పత్రీజీ సామీప్యం ఎంతో ఇష్టాన్నీ, ఎంతో భయాన్నీ సమపాళ్ళలో కలిగిస్తుంది ఎదుటివాళ్ళలో, మల్టీడైమన్షనల్ స్టేట్ పత్రీజీ ది. అసలు ఎదుటివారిలో రియలైజేషన్ ని తీసుకురావడమే ఆయన ప్రధాన ఉద్దేశ్యం. కొత్తవాళ్ళకూ, అర్థంకాని వాళ్ళకూ విచిత్రంగా అనిపిస్తుంది అది. ఒకసారి పత్రీజీ, ఇంకొకరు భోజనానికి ప్రక్కప్రక్కన కూర్చున్నారు. వడ్డించే వాళ్ళు ముందుప్రక్క వ్యక్తికి వడ్డించి, ఆ వ్యక్తి ముందునుంచే వంగి పత్రీజీ కి వడ్డించారు. " అలా ఆ వ్యక్తి విస్తట్లోంచి వంగి వడ్డించడమేంటి అసహ్యంగా, ఇటుప్రక్కకి తిరిగివచ్చి వడ్డించాలి " అంటూ విశేషంగా తిట్టారు. అలా తిట్టడంలో ఉద్దేశ్యం జీవితంలో మరొకసారి అలా చేయకుండా ఉండాలని. ఇలా ఎన్నో, ఎన్నెన్నో. ఇలాంటి ప్రతి సన్నివేశం ఒక ప్రశిక్షణే!

పత్రీజీ తో నా రెండవ పరిచయంలో .. ఎవరో ఏదో మాట్లాడుతూంటే, నేను కూడా కల్పించుకుని ఏదో చెప్పబోయాను. " నీకేం అవసరం ? నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు ? అసలు సీనియర్స్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడవచ్చా " అన్నారు. ఆ సందర్భంలో నేను తెలుసుకున్న పాఠం " సీనియర్లు మాస్టర్లు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించుకోకూడదు " అని .. అంతేకాదు " గురువుల సమక్షంలో ఎరుకతో ఉండాలి " అని తెలుసుకున్నాను.

మరుసటి రోజు 40 మాస్టర్స్ ఇంగ్లీష్ బుక్ వచ్చేవారం రిలీజ్ అవుతోంది అప్పుడు ఒక మాస్టర్ వచ్చి " సార్ ! నేనీ పుస్తకాన్ని తెలుగులో అనువదించి, ఇది కూడా వచ్చేవారంలో రిలీజ్ అయ్యేలా చూస్తాను " అన్నారు. " శభాష్ ! చప్పట్లు కొట్టండయ్యా " అని చప్పట్లు కొట్టించారు పత్రిసార్. అది ఒకవారంలో అసలు అనువదించడమే కుదరదు. అనువాదం చేయాలి. D.T.P. చేయించాలి. ఒక రెండు మూడు నెలల ప్రాసెస్. అయినా కొత్తవారికి వారిలో కలిగిన ఉత్సాహం ప్రోత్సహించడం ఆయనలోని గొప్ప సుగుణం. ఎప్పుడు ఎవరితో ఎలా మసలుకోవాలో, ఎలా ప్రవర్తించాలో సమయానికి తగిన రీతిలో వ్యవహరించడంలో ఆయన దిట్ట.

ఒకసారి కంచి రఘురామ్ ఇంట్లో అప్పుడు .. మౌనంలో ఉన్నారు. " యువర్ ఏ గ్రేటస్ట్ మాస్టర్ " అని వ్రాసి చూపించారు పత్రీజీ. మనకు తెలియదు అది, ఆయనకే తెలుసు మరి. తిరుపతిలో బ్యాచిలర్‌గా ఉంటూ రాత్రి విశేషంగా ధ్యానం చేసేవాడిని, ఎన్నో రోజులు. ఎంతో సాధన, దాని ఫలితం మరి.

మారం : పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ గురించి పత్రీజీ గురించి ఇంకొంచెం చెప్పండి.

శివప్ప : పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కాన్సెప్ట్ సహజంగానే మిగతా ఆధ్యాత్మిక సంస్థలన్నింటి కన్నా డిఫరెంట్. ఈ తేడా ఈ మూవ్‌మెంట్‌కు వచ్చేవాళ్ళకూ, వచ్చినవాళ్ళకూ త్వరగానే తెలిసిపోతుంది. పత్రీజీ దగ్గరకు వచ్చినవాళ్ళను లెక్కలేనంత మందిని నేను చూసాను. పత్రిసార్ వాళింట్లో అడుగుపెడితే వాళ్ళకు " ఎంతో మేలు చేకూరుతుంది " అనే భావనతో ఉన్నవాళ్ళు చాలామందు ఉన్నారు. ఎవరెవరు ఎలాంటి ఫలితాలు, ప్రతిఫలాలు పొందారో వాళ్ళు ఏ స్థాయి విశ్వాసంతో వచ్చారో, ఏం పొందారో నేనెంతో నిశితంగా గమనించాను. అయితే చాలామంది పత్రీజీ వద్దకు వచ్చేవారిలో నేను గమనించింది, మరి నాలో నేను గమనించింది ఏంటంటే, చాలామంది వాళ్ళలోని సరికాని వాటిని కరెక్ట్ చేసుకుని వెళ్ళే వాళ్ళే ఎక్కువ " పత్రిసార్ మాకేమో ఇస్తారు " అనే కోరికతో వచ్చేవాళ్ళు చాలా తక్కువ.

పత్రీజీ ఎప్పుడు ఒక ‘ మిరర్ ’ లాగా అందరికీ కనబడుతూంటారు. అందరూ " పత్రీజీ " అనే " అద్దం " లో తమను తాము చూసుకుని, తమను తాము సరిదిద్దుకుని వెళుతూ ఉంటారు ! పత్రీజీ " ఇచ్చే గురువు " కాదు ! పత్రీజీ ద్వారా ఎవరికైనా ఏదయినా రావలసి ఉంది అంటే, ఆయనతో ఉన్నవాళ్ళకు అది సహజంగా " ప్రకృతిధర్మం " ప్రకారం " గురుపరంపర ధర్మం " ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళందరికీ ఏదో ఇచ్చి మేలు చేయాలనే ఆకాంక్ష ఆయన మదిలో ఎట్టి పరిస్థితులలోనూ ఉండదు. ధ్యానసాధన, బోధన చేసి, అహింసను పాటించి ఎవరిని వారి ఉద్ధరించుకోవాలని మాత్రమే పత్రీజీ ఆశయం. ఇలా జివించేవాళ్ళు మాత్రమే ఆయన మైండ్లో ఉంటారు.

మారం : ధ్యానం చేయడానికీ, ధ్యానప్రచారం చేయడానికీ కలిగే ఫలితంలో తేడా గురించి వివరించండి !

శివప్ప : పత్రీజీ దగ్గరకు వచ్చినవాళ్ళు తాము చూసివచ్చిందో, చేసి వచ్చిందో చెప్పి, పత్రీజీ దగ్గర ఏదో కార్యక్రమాన్ని భుజాన వేసుకుని వెళుతూంటారు. వచ్చినవారు చెప్పిన దాన్ని విని చప్పట్లు కొట్టించి, పంపిస్తూంటారాయన.

రోజూ మూడు గం||ల చొప్పున నెలరోజులు మీరు ఇంట్లో సాధన చేసి ఒక మెట్టు పైకి ఎక్కితే పొందిన స్థితి కంటే, మీరు నాలుగురోజులు నాలుగు ఊళ్ళూ తిరిగి ఒక వంద మందికి ధ్యానం చేయిస్తే నాలుగు మెట్లు పైకి ఎక్కుతారు. ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి అతి తొందరగా అధిగమిస్తారు. తాను చేసే ఆ సొంత సాధన కన్నా, తాను ఏదైతే పొందుతాడో దానిని పదిమంది పొందేలా భౌతికకర్మ చేస్తాడో అప్పుడే దుష్కర్మలు దగ్ధం కావడం తొందరగా మొదలవుతాయి. అంటే మీరు సకర్మలు చేయడం ద్వారానే పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతారు. అలాంటేవాళ్ళే పత్రీజీ దగ్గరకు వస్తారు. పని ఇవ్వడానికి ఈయన సిద్ధంగా ఉంటారు. మళ్ళీ వస్తారు. " ఎంతవరకు చేసావు ? బాగా చేసావా ? " ఎలాంటి ఆరా ఉండదు " ఫలానా ఊరి నుంచి క్లాసు చెప్పి వస్తున్నాను " అనగానే చప్పట్లతో సన్మానం. " నువ్వు ఈ జిల్లాకు వెళ్ళు. ఈ ఫ్లెక్స్‌లు తయారుచేయి. ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయి " అని ఆ తరువాత స్థాయికి చెందిన పనులు చేయుస్తారు పత్రిసార్ !

ఆ పనులన్నీ అందరికీ ఇచ్చేది మనలను మనం ఉద్ధరింపజేసుకోవడం కోసమే కానీ ఆయన కోసం మాత్రం కాదు. సాధన చేస్తే మనం ఒక మెట్టు, రెండు మెట్లు మాత్రమే వెళ్తాం. ఆధ్యాత్మికతకు సంబంధించిన బాహ్యాకర్మలు చేస్తే ఎన్ని మెట్లైనా ఎక్కగలుగుతాం. ఎలాంటి పనులిస్తారో తెలుసా - వాళ్ళ వాళ్ళ స్థాయికి తగినట్లుగా వాళ్ళు చేయగలిగేలా ఆ స్థాయిలో, వారికి భారమూ కాదు, అలా ! మధ్యేమార్గం.. ఆయన బోధన మధ్యేమార్గం.. ఇచ్చే టీచింగ్ మధ్యేమార్గం .. పనీ మధ్యేమార్గం.. జీవింపజేసే జీవితమూ మధ్యేమార్గం.. ఆయనుండేదీ మధ్యేమార్గం...

మారం : అహంకారులమని తెలియని అహంకారుల పట్ల పత్రీజీ ప్రవర్తించే తీరు విలక్షణంగా వుంటుంది ! దీన్ని వివరించండి !

శివప్ప : అహంకారం ఎవరికైతే మితిమీరిపోతుందో వారిపట్ల మూడవకన్ను తెరవడం పత్రీజీ సహజలక్షణం. మీకు ఒక ఉదాహరణ చెబుతాను. ఆయన మూడవకన్నుతెరిచేది వాళ్ళపైన కాదు, వారిలో వున్న అహంకారం పైన ! తిరుపతిలో ఒకసారి ఒక వేదపండితుడు పత్రీజీ దగ్గరకు వచ్చాడు. చాలా చిన్నవయస్సు. అమోఘమైన వేదజ్ఞాన సంపన్నుడు. బహుశా పత్రీజీ గురించి ఆయనకు తెలిసివుండకపొవచ్చు. సార్ మంచంపైన కూర్చుని వున్నారు. అతడు ప్రక్కన కాలు మీద కాలు వేసుకుని విలాసంగా ఊపుతూ కూర్చున్నాడు.

" చెప్పండి ! మీకు నేను ఏం చెయ్యగలను ? " అడిగారు పత్రీజీ. " నేనొక వేదపండితుడిని " అన్నాడతను. వెంటనే పత్రీజీ " నువ్వు వేదపండితుడివా ? ఒక గురువు ముందు ఎలా కూర్చోవాలో తెలియదు. లేచి ముందు క్రింద కూర్చో " అన్నారు. అంతే అతనిలోని అహంకారం అంతా దిగిపోయింది జీరో స్టేజికి. మామూలుగా అయితే ఎవరైనా క్రింద కూర్చుంటే కూడా, పత్రీజీ వారిలో వినయవిధేయతలను చూసి, లేపి మరీ ప్రక్కన కూర్చోబెట్టుకుంటారు. కానీ ఎవరిలో అయితే అహంకారం వుంటుందో, విర్రవీగుతాడో వాడిని దించేస్తారు !!

అలాంటి చర్యలు చేయడంలో ఎదుటివాడు " M.L.A. " నా, " M.P. " నా, " కలెక్టరా " అని పత్రీజీ దృష్టిలో ఏ మాత్రం వుండదు. ఇంటివాడు అయినా, బయటివాడు అయినా ఏ పక్షపాతమూ వుండదు ఆయనికి.

మారం : ఎవరైనా ముఖ్యమైన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెళ్ళిపోయారు సొసైటీలోంచి అన్నప్పుడు పత్రీజీ బాధపడిన సందర్భాలు ఏవైనా వున్నాయా ?

శివప్ప : పత్రీజీ ఎప్పుడూ బాధపడరు. ఎవరైనా వెళ్ళిపోయారంటే, " మంచిదే కదా ! తప్పేముంది ? ఆయన ‘ గురువు ’ కావాలనుకున్నాడు ; ఒక ఆశ్రమాన్ని పెట్టుకోవాలనుకున్నాడు. నేను తప్పకుండా మెచ్చుకుంటాను " అంటారు. Y.J. శర్మ సొసైటీలోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడు అందరూ " సార్ ! Y.J. " అన్నప్పుడు కూడా " తప్పేముందయ్యా ? మన దగ్గరే ఉండాలా ? " అన్నారు. " Y.J.శర్మ వేరేగా ఏదో ప్రారంభిస్తున్నాడు సార్ " అని చెప్పారు ఎవరో వచ్చి " ఆ ! అందులో తప్పేముంది ? పిరమిడ్ సొసైటీ ప్రారంభించకముందు నేను కూడా ఎన్నో సంస్థలు తిరిగాను. Y.J.శర్మ కూడా నాలాగే అన్నీ చదివాడు. అన్నీ చేశాడు. అన్నీ తిరిగాడు. స్వంతంగా ఒక సంస్థ ప్రారంభించాలనుకున్నాడు. Y.J.శర్మ 100% కరెక్టుగా చేస్తున్నాడు " అన్నారు పత్రీజీ.

మారం : " స్పిరిచ్యువల్ రియాలిటీ " అని తయారు చేసి ఇచ్చినవారు అనంతపూర్ " ప్రతాప్ " ఆయన సొసైటీలోంచి వెళ్ళిపోయారు అన్నప్పుడు పత్రీజీ స్పందన ఏమిటి ?

శివప్ప : అప్పుడూ అంతే ! ఎవరి ఇష్టం వారిది ! పత్రీజీతో ఉండడానికి ఇష్టం లేనివారు, అనుకూలం లేనివారు వెళ్ళిపోతూ వుంటారు. అప్పట్లో అనంతపూర్, ఉరవకొండ, గుంతకల్, ప్రొద్దుటూరు లకు వారం వారం వెళ్ళివస్తూ ఉన్నప్పుడు, చాలా కొద్దిమంది మాస్టర్లే ఉండేవారు. అనంతపూర్‌లో విజయకుమార్, సంపత్‌కుమార్, ప్రతాపరెడ్డి, గుణాకర్, గుంతకల్‌లో మురళీధర్, ఉరవకొండలో వెంకటేశ్వర్లు, రాయదుర్గంలో రవి ఉండేవారు. అప్పట్లో చాలా సింపుల్‌గా ఉండేవారు పత్రీజీ.

పత్రీజీ ఏదైతే ప్రణాళిక వేసుకుని వచ్చారో అదంతా స్థాపించడం అయిన తరువాత, ఆయన ప్రజల్లోకి వచ్చారు. 1997, 1998 లో చెప్పారు పత్రిసార్ " ఇక మనం ‘ మాస్ ’ లోకి వెళ్తున్నామయ్యా " అని. " పిరమిడ్ మాస్టర్స్ ఫ్యామిలీ " ఏదైతే వుందో అదంతా స్థాపించడం పూర్తి అయింది 1998 వరకు ! ఆ తరువాత ఉద్యమం విస్తరణ కావడం మొదలైంది. అదే ప్రజలలోకి వెళ్ళడం ! అందుకే 1999 సంవత్సరంలో మొట్టమొదటి ధ్యానయజ్ఞం కర్నూలులో ప్రారంభించడం. ప్రతిఒక్కరికీ ధ్యానం గురించీ, శాకాహారం గురించీ సువిస్తారంగా ధ్యానప్రచారం మొదలైంది.

ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి ధ్యానప్రచారం చేయడం నుండి ఒక్కొక్క ఊళ్ళో పబ్లిక్‌లో ఎంతోమందికి ధ్యానం చెప్పడం, అలా " ఇంతై, ఇంతింతై, వటుడింతై " అన్నట్లు క్రమంగా మాహావృక్షమైంది మన " పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍‌మెంట్ "

అనంతపూర్ " ప్రతాప్ " గురించి : " ఒక్క ప్రాజెక్ట్ మీద వచ్చాడయ్యా ఆయన. మంచి CD స్పిరిచ్యువల్ రియాలిటీ ప్రపంచానికి ఇచ్చాడు. ఆ CD చూసి ఎంతోమంది దిగ్భ్రాంతి పొందారు. ఆయన చారిత్రాత్మకమైన పని పూర్తిచేసారు " అన్నారు. పత్రీజీ ప్రతాప్‌ని ప్రశంసిస్తూ ..

మారం : పత్రీజీతో గడిపిన అప్పటి రోజులు మళ్ళీ రావు. ఎప్పటికప్పుడు ఆయన దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాం. అది మహాసముద్రం. అసలు పత్రీజీ నైజం ఏంటో చెప్పండి.

శివప్ప : ఆత్మజ్ఞానం పొందేవరకు ‘ స్థాయి ’ అంటూ వుండదు. మనం సాధన చేస్తూ ఉంటాం. ధ్యానంలో ముందుకు వెళ్తూ, 25% ధ్యానం కి, 75% ధ్యానం కి వస్తూ ఉన్నప్పుడు గురువు యొక్క అసలు జ్ఞానం కొద్దికొద్దిగా కనపడడం మొదలవుతూ ఉంటుంది. " ఎదుగుదల " అనేది ఒక విభిన్న స్థితి. పూర్వజన్మలో ఏదో వుంటే తప్ప సద్గురువు దగ్గరకు రాలేము. అయినా, " పొయిన జన్మలో నువ్వు ఎవడివైతే ఎవడికి కావాలి ? రా .. కూర్చో .. చేతులు కట్టుకో .. కాళ్ళు కట్టుకో .. కళ్ళు కట్టేయ్ .. నోరు కట్టేయ్ .. మనస్సును కట్టేయ్ .. నీ కర్మలు ఎలా దగ్ధం అవుతాయో చూడు .. 999 మందిని హత్యచేసి అంగుళిమాల వేసుకున్న రాక్షసుడి లాంటి ‘ అంగుళీమాలుడు ’ కూడా ధ్యానం వల్ల బుద్ధుడు అయ్యాడు. మరి నువ్వెందుకు కాలేవు ? తప్పక అవుతావు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం .. వర్తమానీ భవ .. ఈ జన్మే ముఖ్యం .. ఈ సమయం ముఖ్యం .. ఈ రోజు ముఖ్యం .. " ఇదే పత్రీజీ పాలసీ ..

అప్పట్లో పత్రీజీ వచ్చారంటే రాత్రుళ్ళు అసలు ‘ నిద్ర ’ అన్నది ఉండేది కాదు. పత్రీజీ దొరికితే చాలు. గుంతకల్ మురళీధర్, రాయదుర్గం రవి .. ఇక ప్రశ్నలే ప్రశ్నలు, తెల్లవార్లూ .. ముఖ్యంగా రాయదుర్గం రవి .. పత్రీజీ పై ప్రశ్నల పరంపర కురిపిస్తూనే ఉండేవాడు .. పత్రి సార్ విశ్లేషిస్తూనే ఉండేవారు.

" అనంతపూర్ " కానీ, " గుంతకల్ " కానీ, " ధర్మవరం " కానీ, " తిరుపతి " కానీయండి, పత్రీజీతో ఉన్నాం అంటే రాత్రి నిద్ర అనేది మాకెవరికీ తెలియదు. అలా వుండేవి ఆ రాత్రిళ్ళు .. అవి నిద్రలేని రాత్రిళ్ళు కావు. మన శక్తియుక్తులను జాగృతం చేసుకున్న రాత్రుళ్ళు. క్యాంప్‌ఫైర్ వేసుకుని కూర్చునేవాళ్ళం. " ప్రశ్న వేయండి " అనేవారు. ప్రశ్నల పరంపర. వినయంతో అడిగిన ప్రశ్నలకు రాత్రంతా కాన్స్‌ప్ట్స్, కాన్స్‌ప్ట్స్. రాత్రిళ్ళు టీ త్రాగుతూ డిస్కస్ చేసుకుంటూ వుంటే, ఆ రాత్రిళ్ళను ఎన్నో రోజులు మరిచిపోలేకపోయేవాళ్ళం.

ఎంతోమంది సీనియర్ మాస్టర్లు యుగంధర్, న్యూటన్, పాల్, ఆంజనేయశర్మ, T. మురళీధర్, K. రవి, అనంతపూర్ సంపత్, విజయకుమార్,ప్రతాపరెడ్డి, బళ్ళారి మస్కీ, తిరుపతి యోగానంద్, కంచి రఘురామ్, కేశవరాజు, B.V. రమణ, మునుస్వామి, శ్రీనివాసరెడ్డి, అల్వాల్ మురళీధర్, అప్పుడప్పుడూ ద్వారకానాధ్ .. ఇలా ఎంతోమంది, ఎంతోమంది, ఎన్నో ఊళ్ళు, ఎన్నో రాత్రులు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు, ఎన్నో కాన్స్‌ప్ట్స్.

పత్రీజీ పూర్తిగా సమయం కేటాయించిన ఆ ప్రత్యేక సమావేశాలు, అనంత రాత్రులు, జాగారాలు మళ్ళీ ఉదయం 9.00 గంటలకు కలుసుకోవడం ఇప్పుడు లేవు. ఆ రోజులు రావు.

మారం : 30 సంవత్సరాల నిర్విరామకృషి, అనంతజ్ఞానం .. చెప్పిన విషయాన్ని ఎన్నో కోణాలలో ఎన్నో దేశాల్లో మళ్ళీ మళ్ళీ చెప్పడం .. అనితరసాధ్యమైన ఈ మహాప్రయాణం ... వివరించండి సార్ ..

శివప్ప : భారతదేశం గొప్ప సత్యాన్నీ, గొప్ప సందేశాన్నీ ప్రపంచానికి అందిస్తూనే వచ్చింది.

* 1930 - 1950 దశాబ్దాలలో మహాత్మాగాంధీ ద్వారా " అహింస " అన్న సందేశానికి యావత్ భారతదేశం ప్రపంచానికి తన సందేశాన్ని ఇచ్చింది.

* 1950 తరువాతి కాలంలో B.K.S. అయ్యంగార్ గారి మరి మిగతా అనేకుల ద్వారా ద్వారా యావత్ ప్రపంచానికి " యోగా " అన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది - భారతదేశం

* 1960 తరువాతి కాలంలో మహేశ్ మహర్షి యోగి గారి ద్వారా " భావాతీత ధ్యానం " అన్న దివ్యసందేశాన్ని యావత్ ప్రపంచానికి తన సందేశాన్ని ఇచ్చింది - భారతదేశం.

* 1970 సంవత్సరం తరువాతి కాలంలో ఓషో రజనీష్ ద్వారా యావత్ ప్రపంచానికి " ప్రజ్ఞాధ్యానం ", " నిర్మొహమాటం ", " స్వేచ్ఛా భావాలతో జీవితం " మొదలైన సందేశాన్ని ఇచ్చింది - భారతదేశం

* ఇకపోతే 1980 తరువాతి కాలం లో .. " ఆనాపానసతి ", " శ్వాసే గురువు " అనే మాట ఒక నూతనత్వంతో కూడి వుంది. అందరూ " పిరమిడ్ ఎనర్జీ ", " న్యూఏజ్ స్పిరిచ్యువాలిటీ ", " శాకాహారం " గురించి విస్తారంగా విన్నారు .. బ్రహ్మర్షి పత్రీజీ ద్వారా, వెరసి యావత్ ప్రపంచానికీ " ముక్తి .. మోక్షం .. ఆధ్యాత్మిక శాస్త్రం " .. అన్న భవ్యమైన సందేశంను ఇచ్చింది - భారతదేశం.

పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ద్వారా " ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం - ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి " అన్న అసలైన నినాదం చేసారు పత్రీజీ. " అందరూ ముక్తిపధగాములు కావాలి " అన్నదే పత్రీజీ మిషన్.

" ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారానే ముక్తి " అని ఈ విశాల ప్రపంచానికి ఒక్క ప్రిస్కిప్షన్ ఇచ్చిన మాహానుభావుడు పత్రీజీ. " ఉద్ధరేదాత్మనాత్మానాం ", " అప్పో దీపో భవ ", " నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు ", " నీ నోటి మాటలే నీ నుదుటి వ్రాతలు ", .. ఒక వందల పేజీల గ్రంధంలో ఒక్కొక్క అంశాన్ని అందరూ వ్రాస్తే, వాటిని ఒక్కొక్క వాక్యంలో చెప్పినవారు పత్రిసార్.

పత్రీజీ ఒకసారి చెప్పారు : ఆనందుడు, బుద్ధుడు ఇద్దరూ అడవిలో వెళ్తూ ఉన్నారట. అప్పుడు ఆనందుడు అన్నాడట బుద్ధిడితో " భగవాన్, మీకు అన్నీ, సమస్తమూ, సర్వమూ తెలుసు కదా. ఇంకా మీరు బోధనలు చేస్తూ తిరగడం ఏమిటి ? ఎలాగూ మహాకారణలోకాలకు వెళతారు కదా " అన్నాడట. అప్పుడు బుద్ధుడు ఒక గట్టు మీద కూర్చుని ప్రక్కనున్న చిన్న గడ్డిపరకను తీసి అందులో చిన్నముక్క త్రుంచి చేతితో పట్టుకుని చూపుతూ " నేను నేర్చుకున్నది ఇంత - నేర్చుకోవలసింది ఇంత " అన్నారట ప్రక్కనే వున్న అడవిని చూపిస్తూ ..

ప్రతి స్థాయిలోనూ ప్రతి మనిషికి నేర్చుకోవలసిన కొండంత ఎప్పుడూ వుంటూనే వుంటుంది, " నేర్చుకోవడానికి అంతం అనేది అసలు లేదు " అన్నదే పత్రీజీ మనకు నేర్పే పరమసత్యం.

మారం : కొంతమంది పత్రీజీ కి ఎంతో ఆత్మీయంగా, దగ్గరగా ఉన్నవాళ్ళు " మాకేమి అనుభవాలు రాలేదు " అని బాధపడుతూంటారు. అయినా పత్రీజీని వదలరు. మరికొంతమంది ఆయన దగ్గర వస్తూనే అంతా గుర్తుచేసుకుని ఎన్‌లైటెన్ అయిపోతారు.

శివప్ప : చాలామంది తమకు ధ్యానంలో అనుభవాలు రాకపోయినా, పత్రీజీని వదిలిపెట్టి పోరు. అంటిపెట్టుకునే వుంటారు. కారణం అది ఈ జన్మ పరిచయం కాదు .. గతజన్మల్లో పత్రీజీ సామీప్యాన్ని వారు ఇదివరకే పొంది వున్నారు కాబట్టి.

ఈ వర్తమాన జన్మలో మనకు అనుభవం వచ్చినా రాకపోయినా, భావం కలిగినా కలగకపోయినా, మనలోని ‘ ప్రజ్ఞ ’ అన్నది, ఆ ‘ బుద్ధిపరమైన అవగాహన ’ అన్నది ఆ గురువునీ, ఆ శిష్యుడినీ కలిపి ఉంచుతుంది. ఎలాంటి అనుభవాలు రాకపోయినా, " మనం ఈ గురువుని వదలలేకపోతున్నాం " అనుకుంటాం. సర్వమూ, సకలమూ అవగతమవుతుంది. కానీ అనుభవం మాత్రం గత జన్మలది. అకస్మాత్తుగా ఎవరినో చూస్తాం, " మనది ఆ కుటుంబం " అని మనకు అర్థమవుతూ వుంటుంది. " మిమ్మల్ని ఇప్పుడు మొదట చూడడం కాదు, ఎప్పుడో చూడడం జరిగింది " అంటూ ఉంటాం. కారణం మనం గత జన్మలలో వారితో కలిసి ప్రయాణించి ఉంటాం. ఆ కారణంగానే గురువును అంటిపెట్టుకుని ఉంటాం.

పత్రిసార్ " గారపాటి లలితా మేడమ్ " ను 2004లో మొదటిసారి అమెరికాలో చూశారు. " తానా మహాసభ " లలో ప్రక్కన వున్న డాక్టర్ న్యూటన్ ఆవిడను పత్రీజీ కి పరిచయం చేశారు .. " సార్, గారపాటి లలితా మేడమ్ " అని. " నాకెందుకు తెలియదు ? ఆమె నాకెప్పుడో తెలుసు " అన్నారు పత్రీజీ. ఆమె ఇది విని ఆశ్చర్యపోయింది. " మిమ్మల్ని చూడడం కోసమే నేను అమెరికా వచ్చాను మేడమ్. నా పర్పస్ ఆఫ్ విజిట్ టు అమెరికా ఇప్పుడు పూర్తయిపోయింది " అన్నారట పత్రీజీ లలితా మేడమ్‌తో. లలితా మేడమ్‌కి అప్పుడేమీ అర్థం కాలేదు. ఇప్పుడు అడగండి మరి ఆవిడను .. అంతా పుంఖానుపుంఖాలుగా చెబుతారు.

బుద్ధుడి వద్ద 42 సంవత్సరాలు వున్న ఆనందుడు నీడలా ఆయనను అంటిపెట్టుకుని వున్నాడు ఎక్కడికీ పోకుండా, బుద్ధుడితో ఉన్నప్పుడు ఆయన అవసరాలు చూశాడు, ఆయనతోనే నిద్రించాడు, ఆయనతోనే కలిసి జీవించాడు. గౌతమబుద్ధుడు మహాపరినిర్వాణం పొందిన తర్వాత, మహాకశ్యపుడి ఆధ్వర్యంలో జరిగిన జ్ఞానుల సమావేశానికి ఆనందుడు అనుమతింప బడలేదు, " ఏ అనుభవాలూ లేవు " అని. " 42 సంవత్సరాలు తాను బుద్ధిడితో వున్నా తాను ఏమి జ్ఞానం పొందలేదు " అని తీవ్రమైన వేదనతో ధ్యానంలో కూర్చున్నాడు ఆనందుడు. తన అంతః ప్రపంచంలోని సూక్ష్మాతిసూక్ష్మమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. మూడురోజుల్లోనే ఆత్మజ్ఞాని అయ్యాడు. ఈ సంగతి గ్రహించిన మహాకశ్యపుడు తానే స్వయంగా వచ్చి ఆనందుడిని మళ్ళీ ఆ జ్ఞాన సమావేశాలకు తీసుకెళ్ళాడు. పత్రీజీతో సాహచర్యం " బ్రహ్మం గారి దగ్గర సిద్ధయ్య " లా తయారుచేస్తుంది మనల్ని.

మారం : 1994 నుంచి గత 16 సంవత్సరాలుగా మీరు పత్రీజీని అత్యంత సన్నిహితంగా, గమనించి వున్నారు. ఆయన వివిధ సందర్భాలలో ఎంతో మందితో, ఎన్నోచోట్ల, డిఫరెంట్‌గా ప్రవర్తించి వుంటారు. పత్రీజీ ఆ యా సందర్భాలలో తనను తాను " సెల్ఫ్ చెక్ " చేసుకున్న సందర్భాలు వున్నాయా ??

శివప్ప : ఎట్టి పరిస్థితుల్లో ఆయన అలా చేయరు. NEVER పత్రీజీ తనను తాను ఇష్టపడినట్లుగా, తనను తాను ప్రేమించుకున్నట్లు, తనతో తాను స్నేహం చేసినట్లుగా, ఆయన మాటల్ని ఆయన గౌరవించుకున్నట్లుగా, ఆయన చేష్టల్ని ఆయన ఎంజాయ్ చేసినట్లుగా, ఇతరులను ఎవ్వరినీ నా అనుభవంలో నేనెప్పుడు చూడలేదు. ఆయన యొక్క అత్యద్భుతమైన సుగుణం అది. మనం మాత్రం మనల్ని కించపరచుకుంటాం. మన ఆలోచనల్ని మనం కించపరుస్తాం ; మన భావాలను మనం కించపరచుకుంటాం, మన చేతులను మనం కించపరచుకుంటాం. అలాంటప్పుడు మన ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది ? అది ముఖ్యంగా పత్రీజీ నుంచి నేర్చుకోవాలి.

పత్రీజీ దగ్గర చేరిన తర్వాత, వారిని బాగా ఇష్టంతో గమనించిన తర్వాత, వారితో తరచుగా బోధింపబడుతూ ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలో నాకు అర్థమైంది. " నేను తప్పు మాట్లాడాను " అనో, " నేను తప్పు చేశాను " అనో మనం అనుకుంటూ వుంటాం. అయితే అలా మనం అనుకుంటూ ఉన్నప్పుడు, " నేను మాస్టర్ని ; నా నోట్లో నుండి తప్పు ఎందుకు వస్తుంది ? " అని మనం అనుకున్నప్పుడు క్రమంగా మనకు అర్థం అవుతుంది, మనం ఆ యా వ్యక్తులతో ప్రవర్తిస్తున్నప్పుడు, " మనకు తెలిసి కానీ, తెలియక కానీ సరిగ్గానే ప్రవిర్తించాం " అనీ, " సరిగ్గానే మాట్లాడాం " అనీ. అంతకు ముందు నేను కూడా అలాగే అనుకునేవాడిని. క్రమంగా ఈ విషయాలు పత్రిసార్‌తో చర్చించినప్పుడు :

" లవ్ యువర్ సెల్ఫ్ .. లవ్ యువర్ థాట్స్ .. లవ్ యువర్ యాక్షన్స్. లవ్ యువర్ డీడ్స్ " అని పత్రీజీ చెప్పిన తర్వాత నా చర్యల్ని నేను గౌరవించడం నేర్చుకున్నాను. చాలాసార్లు చాలామంది అడిగారు, " నువ్వు ఇలా తప్పుగా మాట్లాడడం వల్ల మేం ఫీలయ్యాం " అని నాతో. " నువ్వు ఫీల్ అవడం అనేది నా సమస్య కాదు. కాన్షియస్లీ, అన్కాన్షియస్లీ నాలోంచి ఆ మాట నీ పట్ల వచ్చేసింది. నిన్ను అనాలని నాకు ఏ ఉద్దేశ్యం లేదు. అనాలని ఏమీలేదు. అలా వచ్చింది. నాలోంచి వచ్చింది. నాలోంచి వచ్చింది నేను ఇష్టపడకపోతే ఎవరు ఇష్టపడతారు ? " అనే నా జవాబు ఉంటుంది.

పత్రీజీలోని విశిష్టమైన లక్షణం అదే. అయనను గమనిస్తూ వుంటే, మనలో ‘ అనుకరణ ’ అనే దోషం సదా తగ్గిపోతుంది. కృతిమత్వం తగ్గిపోతూ, మనలో సహజత్వం పెరిగిపోతూ వుంటుంది.

మారం : ధ్యాన మహాయజ్ఞాల విశిష్టత .. గురించి వివరించండి ?

శివప్ప : 1999 అక్టోబర్‌లో దసరా ముందు మీరు నిర్వహించారు శ్రీశైలం ట్రెక్కింగ్. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ట్ను స్థాపించి 1990 - 1999 ఒక దశాబ్దం. 1999కి వీడ్కోలు. 2000కి ఆహ్వానం. ఇరవైయ్యవ శతాబ్దం వెళ్ళిపోయి, ఇరవై ఒకటవ శతాబ్దం మొదలయింది. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ కి దశాబ్దం పూర్తయింది. ప్రపంచానికి మరొక శతాబ్దం పూర్తయింది. ఒక మహాకార్యం నిర్వర్తించాలని పత్రీజీ కి ఒక గొప్ప ఆలోచన ఫ్లాష్ అయింది. ట్రెక్కింగ్‌లో ఒకరోజు ఆయన అడవిలో నడుస్తున్నప్పుడు నన్ను పిలిచి " శివా .. ఒక ఆలోచన వచ్చిందయ్యా .. చెప్పనా ? " అడిగారు పత్రీజీ. " చెప్పండి సార్ " అన్నాను. " ఆహా, చెప్పను " అన్నారు. " చెప్పండి సార్ " అన్నాను ఎంతో ఉత్కంఠ.

ఈ డిసెంబర్ చివరికి ఏం చెయ్యాలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందయ్యా. ఇంతవరకు ఈ భూమి మీద ‘ జ్ఞానయజ్ఞాలు ’, ‘ శాంతియజ్ఞాలు ’ ఇంకా ఏవేవో జరిగాయి. కానీ ఈ భూమి మీద ‘ ధ్యాన యజ్ఞాలు ’ జరగలేదు. కనుక మనం ఈ డిసెంబర్ ఆఖర్లో ఏడురోజులపాటు కర్నూలులో ‘ ధ్యానమహాయజ్ఞం ’ నిర్వహిస్తున్నాం. 25 వ తేదీ క్రిస్ట్‌మ‌స్ సాయంత్రం ప్రారంభం చేస్తాం. 26 ఉదయం నుంచి రాత్రి దాకా పూర్తిగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. నువ్వు, ఆంజనేయశర్మ మాట్లాడుకుని ప్రణాళిక తయారుచేసి, పేపర్ మీద పెట్టండి " అన్నారు. అలా మొదలయ్యాయి " ధ్యానమహాయజ్ఞాలు ".

1999 డిసెంబర్‌లో మొదటి ధ్యాన మహాయజ్ఞం మొదలైంది. గంటగంటకూ కాసేపు ధ్యానం చేయిస్తూ ఉండేవారు పత్రీజీ ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఇలా అనేక పర్యాయాలు సామూహిక ధ్యానం చేయించారు పత్రీజీ. పక్కనే వెదురుతో పిరమిడ్ నిర్మాణం కూడా చేస్తూ అందులో కూడా నిరంతర ధ్యానసాధన జరిగేది.

పత్రిసార్ " మనిషి తన కోసం చేసేది కర్మ. లోకకళ్యాణం కోసం చెసేది యజ్ఞం " అన్నారు. " ఇంతమంది ఇక్కడ ధ్యానం చేస్తూంటే ఏం జరుగుతుందో చూడాలి " అని ధ్యానంలో కూర్చున్నాం. అప్పుడు గుణాకర్ కి వచ్చిన అనుభవం : " ఇద్దరు సూక్ష్మలోక వాసులు మన యజ్ఞవాటిక పైన ఉన్నారు. వారిచేతిలో పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి. యజ్ఞమండపంలో అందరూ ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చిన శక్తి పైకి వెళ్తోంది. అది వారు ఆ గంటలో నిక్షిప్తం చేస్తున్నారు. అవి నిండిన తర్వాత పైకి వెళుతున్నారు. ఆ మాస్టర్స్‌ని అడిగితే ‘ మాకు ఈ కర్తవ్యం మాత్రమే ఇచ్చారు, వీరు ’ అని మరో ఇద్దరు మాస్టర్స్ కి అప్పగించారు. వారిని అడిగితే ‘ ఈ ధ్యానయజ్ఞ మహాశక్తిని భూమిమీద జీవిత నిస్సారంతో, శక్తిహీనులై బ్రుతుకు భారమై ఎప్పుడు చచ్చిపోదామా అని నిస్సహాయతగా జీవిస్తూ కొట్టుమిట్టాడే వారికి, జీవితం విలువలు తెలుసుకోవడానికి, వారిలో నూతన ఉత్సాహం నింపడానికీ, చైతన్యస్ఫూర్తి కలిగించడానికీ వినియోగిస్తాం. అయితే, ఎక్కడ వినియోగించాలో ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు అందుతూ ఉంటాయి. వారి అద్భుత ఫలితాల వల్ల ఇక్కడ ధ్యానం చేసే వారి చెడుకర్మలు అన్నీ సమూలంగా నాశనమయ్యాయి ’ అన్నారు "

ఎన్నో లక్షలమంది చేసిన ధ్యానం వల్ల జ్ఞానం వల్లనే గత ఇరవై సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో హింస విపరీతంగా తగ్గిపోయింది. గూండాయిజం తగ్గుముఖం పట్టింది. ఈ రోజు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍‌మెంట్ ద్వారా పిరమిడ్ మాస్టర్స్ నిర్వహిస్తున్న పాత్ర ఇంతా అంతా కాదు.

మారం : 1999 నుండి 2009 వరకు జరిగిన ధ్యాన మహాయజ్ఞాలు, మొదటిదానికీ, శ్రీశైలంలో జరిగినదానికీ మధ్య డెవలప్‌మెంట్స్ వివరించండి.

శివప్ప : 1999 మొదటి ధ్యాన మహాయజ్ఞానికీ, 2009 శ్రీశైల ధ్యాన మహాయజ్ఞానికి జరిగిన ఎదుగుదల అన్నదే ధ్యాన విజయం. ఏదైతే పత్రీజీ విజన్ ఉండిందో అది పూర్తయింది " శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం " తో. ఏ సంకల్పంతోనైతే ధ్యానమహాయజ్ఞాలు మొదలయ్యాయో ఆ సంకల్పం నెరవేరింది. కుర్తాలం స్వామీజీ గారు, శ్రీధర్ స్వామీజీ అదే చెప్పారు శ్రీశైలంలో .. " పత్రీజీ సంకల్పం నెరవేరింది " అని.

ధ్యానమహాయజ్ఞాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ప్రారంభం అయ్యాయి. అక్కడి నుంచి బయలుదేరిన ధ్యాన మహాయజ్ఞాలు రథం .. కర్నూలు నుంచి విజయవాడ .. తిరుపతి .. హైదరాబాద్ ప్రయాణించి .. మహారాష్ట్రలోని షిరిడీ .. తమిళనాడులోని తిరువణ్ణామలై .. బెంగళూరు మహానగరం .. ఈ విధంగా ఉత్తర దక్షిణ భారతావనిలో ప్రయాణించి తిరిగి స్వరాష్ట్రం " ఆంధ్రప్రదేశ్ " చేరుకుంది. అందుకే శ్రీశైలమహాక్షేత్రంలో నిండుకుండలా, దేదీప్యమానంగా ఓ క్రొంగొత్త మంగళతోరణాన్ని కట్టింది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసి నెలరోజులు అయినా ఆ కార్యక్రమాలు అందరి కళ్ళముందు ఇప్పటికీ కదలాడుతూనే ఉన్నాయి.

మారం : " ధ్యానమహాయజ్ఞాలు " - శకం పూర్తయింది. ఇకపై " ధ్యాన చక్ర " - దీనిపై పత్రీజీ విజన్ ఏమిటి ?

శివప్ప : కాలచక్రం. పిరమిడ్ మాస్టర్లు ఇంతవరకు అన్నీ సాధించారు. ధ్యానం చేశారు. చేయించారు. సూక్ష్మశరీరయానం, కారణ శరీరయానం, మహాకారణశరీరయానం చేశారు. థర్డ్ ఐ విజన్స్ అనంతంగా దర్శించారు. దివ్యశ్రవణం చేశారు. ఏవేవి అయితే స్పిరిచ్యువల్ సైన్స్‌లోని అంశాలు ఉన్నాయో వాటిన్నింటినీ ఔపోసన పట్టి సర్వం అధ్యయనం చేశారు పిరమిడ్ మాస్టర్లు నూతన పౌనఃపున్యంలోకి అడుగుపెట్టే సమయం ఆసన్నమయింది. " ధ్యానచక్రం " - అంటే పిరమిడ్ మాస్టర్లు " ధ్యాన రారాజులు " అయిపోయారు, ధ్యాన మహారాజులు అయిపోయారు. " ఇక అందరూ ధ్యాన చక్రవర్తులు కావాలి " అనేది పత్రీజీ యొక్క ధ్యాన ఆశయం, దృఢసంకల్పం.

2009నవంబర్ లోనే పత్రీజీ నోటి నుండి ఈ మాట బయటకు వచ్చింది. అప్పుడే గుంటూరు లక్ష్మణరావు గారు వెంటనే " ఈ మొదటి ధ్యానమహాచక్ర కార్యక్రమాన్ని అమరావతిలో నేను నిర్వహిస్తాను " అన్నారు. ఆ మాట చెప్పడంతోనే " ఆయన ‘ చక్రవర్తి ’ అయిపోయాడు " అన్నారు పత్రీజీ. ఇలా ప్రతి పిరమిడ్ మాస్టర్‌నూ " ఆధ్యాత్మిక మహారాజు " స్థితి నుండి " ఆధ్యాత్మిక చక్రవర్తి " గా తీర్చిదిద్దబోతున్నారు పత్రీజీ. ఇదే " ధ్యానమహాచక్రం ".

పిరమిడ్ మాస్టర్స్ అంటే వర్తమానంలో వున్న భవిష్యత్ వ్యక్తులు. భవిష్యత్ కార్యకలాపాలు నిర్వర్తించే వర్తమానులు పిరమిడ్ మాస్టర్స్. అందుకే " పిరమిడ్ మాస్టర్లు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి వెళ్ళగలరయ్యా అంటారు " పత్రీజీ. " వర్తమానంలో ఉంటూ, వర్తమానాన్ని చూస్తూ, వర్తమానంలో పనులు చేస్తూనే భవిష్యత్తులో ఉండగలరయ్యా .. పిరమిడ్ మాస్టర్లు " అంటారు పత్రీజీ. అలా తీర్చిదిద్దారు అందరినీ.

మారం శివప్రసాద్ : " ప్రతి పిరమిడ్ మాస్టర్ బుద్ధుడే " అంటే బ్రహ్మర్షి పత్రీజీ. దీనిని వివరించండి?

శివప్ప : ధ్యానం ద్వారా పొందిన ఆత్మజ్ఞానం ద్వారా కలుగుతుంది బుద్ధి. బుద్ధత్వం అంటే " ఎన్‌లైటెన్‌మెంట్ " .. దివ్యజ్ఞానప్రకాశం. పుస్తకాలు చదివి సంపాదించినది బుద్ధి కాదు. బుద్ధిసూక్ష్మత, ఆత్మజ్ఞానం రెండూ కలిగి ఉన్న బుద్ధుళ్ళ సంఘానికి శరణం జొచ్చడం బుద్ధసాంప్రదాయం. అలాంటి బుద్ధుళ్ళను తీర్చిదిద్దాడు అలనాటి బుద్ధుడు; ఈనాడు తీర్చిదిద్దారు, తీర్చిదిద్దుతున్నారు పత్రీజీ.

ప్రక్కవాడి పనుల్లో తలదూర్చడం అధర్మం. అదే పరధర్మాన్ని ఆచరించడం. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం పరధర్మం. అలా జోక్యం చేసుకోకుండా, మన పనులు మనం చూసుకోవడమే స్వధర్మం. మూడవది సంఘం: ఈ బుద్ధిసునిశితతో జీవిస్తూ, ఆత్మజ్ఞానంతో ప్రవర్తిస్తూ, బోధిస్తూ, ఈ స్వధర్మాన్ని నిర్వర్తిస్తున్న సంఘమే " బుద్ధుళ్ళ సంఘం ". ఆ సంఘాన్ని శరణుపొందడమే " సంఘం శరణం గచ్ఛామి " అంటే. ఇదే బుద్ధుడు చెప్పింది, పత్రీజీ చెప్తూన్నది.

ప్రతిఒక్కరూ ఒక బుద్ధుడు కావడానికి కావలసిన శిక్షణ అంతా ఇస్తారు పత్రీజీ. ఈ క్షణంలో ఏం చేయాలో ఆ వర్తమానంలో ఉంటారు పత్రీజీ. అలాగే మనమూ ఉండాలనీ ఆశిస్తారు. ఇదే నిజమైన జెన్‌తత్వం. ఇప్పుడు, ఇక్కడ, ఇప్పుడు గురించి మాట్లాడడం, ఇప్పుడేం చేయాలో దానినే చేయించడం .. అది ఆయన నిత్యనూతన విన్నూతశైలి, నిన్నటిదాన్ని ఇప్పుడు చేయనివ్వరు. ఆయన దృష్టిలో, నిన్న అనేది నీటిమీద గీసిన గీత, భవిష్యత్తు తప్పక ఉంటుంది అయితే ఆ రేపటికి ఏం కావాలో ఇవాళ చేసేస్తారు పిరమిడ్ మాస్టర్స్. " అందుకే పిరమిడ్ మాస్టర్లు రెండు పడవలమీద కాళ్ళు పెట్టి ఈదగలరయ్యా " అంటారు పత్రీజీ.

మారం : పత్రీజీ ఆంధ్రప్రదేశ్‌లో జన్మించడం, ఈ పిరమిడ్ మహా మూవ్‌మెంట్, ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు .. ఇదంతా ఆంధ్రప్రదేశ్ భాగ్యం అని చెప్పవచ్చునా ?

శివప్ప : పత్రీజీ తీసుకున్న ప్రణాళికలో భాఅగం అది. ధ్యానం ఇక్కడ నుంచే పుట్టాలి. ఇక్కడ నుంచే పెరగాలి. అందుకునే ఆయన ఎంచుకున్న యోగులందరూ దాదాపు 80% ఇక్కడే పుట్టారు. ఎక్కడెక్కడికి ఎందుకు వెళ్ళారో వాళ్ళకు తర్వాతే తెలుస్తుంది.

గుణాకర్ అనంతపూర్‌లో ఉద్యోగం చేసేవాడు. ఆఫీస్ పనిమీద కర్నూలు వెళ్ళినప్పుడు, " ఇక్కడ ఒక పిరమిడ్ కట్టారు " అని ఒక సివిల్ ఇంజనీర్ చెపితే, తను స్వయంగా సివిల్ ఇంజనీర్ అయినందువల్ల వృత్తిమీద ఉన్న శ్రద్ధతో " ఆ పిరమిడ్ నిర్మాణాన్ని చూడాలి " అని వెళ్ళిచూసాడు. బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం ఆవరణ లోపలికి వెళ్ళిన తరువాత టీ షర్ట్, ప్యాంట్ వేసుకున్న ఒక ఆయనను చూసాడు. " పిరమిడ్ చూడ్డానికి వచ్చాను " అంటే, " లోపలికి వెళ్ళి ధ్యానం చేయండి " అన్నాడు. ధ్యానం చేసాడు గుణాకర్. భ్రూమధ్యంలో నుండి ఏడు నక్షత్రాలు క్రిందకు రావడం చూసాడు ధ్యానంలో .. బయటకు వచ్చిన తర్వాత గుణాకర్ ను లోపలికి పంపినవారు అడిగారు " ఏం జరిగింది? " అని. ఆయనే " బ్రహ్మర్షి పత్రీజీ ". గుణాకర్ తన అనుభవం చెపితే, అక్కడున్న వారందరితో చప్పట్లు కొట్టించి, " ధ్యానం కంటిన్యూ చేయండి " తాను వారం వారం అనంతపూర్ వస్తాననీ, అక్కడ కలవమనీ చెప్పారు పత్రీజీ.

ఇలా ఒక్కొక్క్కరూ ఒక్కొక్క ఊళ్ళో, ఒక్కొక్క సమయంలో ధ్యానంలోకి ప్రవేశించారు. మరి నేను ఎన్నో ఊళ్ళు తిరిగి అనంతపూర్‌లో పడి, పత్రిసార్‌ను కలిసి, ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇవన్నీ మన డిజైన్‌లో ఉన్న భాగం. అలాగే మీరు ఆత్మకూరులో పుట్టి, కర్నూలులో వ్యాపారం చేస్తూ, కర్నూలులో పత్రీజీని కలిసారు. ఇలాగే పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ..

తన తల్లినీ, తండ్రినీ మాత్రం ఆయన ఎంచుకుని పుట్టారు. చిన్నప్పటి నుంచి సాత్విక లక్షణాలు, ఆహార వ్యవహారాలు, సాంప్రదాయ పద్ధతులు, సంస్కృతి, భాష, నాట్యం, సంగీతం, కళలను ఆరాధించడం, ఉన్నతవిద్య, చిన్నప్పటి నుంచే రకరకాల భాషలు నేర్చుకోవడం, హిందీ, ఇంగ్లీషు బాగా నేర్చుకోవడం, విభిన్న రాష్ట్రాలు మరి విభిన్న సంస్కృతులు, వివిధ భాషలు మాట్లాడే ఆఫీసర్స్ కాలనీలో వారి తండ్రిగారి వృత్తిరీత్యా నివాసం ఉండడం. ఫ్లూట్ నేర్చుకోవడం .. అన్నిటినీ అలా అలవరచుకుంటూ రావడం జరిగింది.

కర్నూలుకు ఉద్యోగరీత్యా రావడం తోటి ఉద్యోగి రామచెన్నారెడ్డి గారి ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని, నేర్చుకోవడం, సదానందయోగి సాంగత్యం, " పద్మవిభూషణ్ " డాక్టర్ శ్రీపాద పినాకిపాణి గారి వద్ద సంగీతం అభ్యసించడం, కోరమండల్ వారి వ్యాన్లో తిరుగుతూ వివిధ జిల్లాల్లో గ్రామగ్రామాలు తిరగడం, ఉద్యోగరీత్యా నెలకు 20 రోజులు టూర్‌లో ఉండడం వల్ల కుటుంబంతో ఉండే రోజులు తక్కువగా ఉండడం, వివిధ రకాల తత్వాల మనుష్యులను ఉద్యోగరీత్యా కలవడం ఇదంతా కూడా ముందస్తు దైవప్రణాళికలో భాగమే.

మారం : క్రొత్తగా ధ్యానంలోకి వచ్చేవారి పట్ల పత్రీజీ ఎలా ఉంటారు?

శివప్ప : వచ్చినవారు " తన గతజన్మలో కలిసారు " అని తెలిసినా, " తన సాంగత్యం కోసం వచ్చారు " అని తెలిసినా, " గతజన్మలో నువ్వూ, నేనూ కలిసి తిరిగాం. ఇప్పుడు మనం కలిసి పనిచేయాలి " అనేలాంటి మాటలు పత్రీజీ అసలు మాట్లాడరు. ఎవరికివారే తమకు తాము ధ్యానం చేసి తన గతజన్మ కారణాన్ని తెలుసుకోవాలి, లేదా తన అనుభవాల ద్వారా అర్థం చేసుకోవాలి. చెప్పడం అవసరం అయితే .. లేక సందర్భోచితమో అయితే .. తప్ప ఆయన ఎవరి గురించీ చెప్పరు. చాలామంది పత్రీజీని అడిగినా, ఆయన అవసరమైతేనే ఏదైనా చెపుతారు.

మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన ఎప్పుడూ తలదూర్చరు. ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు మాస్టర్‌వి అయినట్లయితే, " ఇంకా నన్నడిగేదేంటయ్యా? నీకేంటి నేను చెప్పేది? నువ్వు తెలుసుకున్నావు అది కరెక్టు " .. అని చెపుతారు ఆయా సందర్భాన్ని బట్టి. ఆయన చెప్పే వ్యాఖ్యాలు, ఇచ్చే సందేశాలు ఎంత అర్థవంతంగా ఉంటాయో, మాటల్లో చెప్పలేం.

1995 సంవత్సరం తిరుపతిలో మునుస్వామి అనే సీనియర్ మాస్టర్ ఉన్నారు. ఆయన కూతురు మొట్టమొదటి బర్త్‌డే అని పత్రీజీ ని పిలిచారు. పత్రీజీ వెంట నేను, మిట్టా శ్రీనివాసులు, శేఖర్, రమణ ఇంకా కొందరు మాస్టర్లు మునుస్వామి గారి ఇంటికి వెళ్ళాం. ఆయన స్వీట్ ఇచ్చారు మొదటి బర్త్‌డే అని. స్వీట్ తీసుకుంటూ, " నీ కూతురు బర్త్‌డే అని స్వీట్ ఇచ్చావయ్యా. మరి నీ కూతురు రేపు చచ్చిపోతే కూడా స్వీట్ ఇస్తావా? " అని అడిగారు. చుట్టూ ఉన్న జనాలందరూ నిర్ఘాంతపోయారు.

" తప్పకుండా ఇస్తాను సర్ " అన్నాడు మునుస్వామి. " నువ్వు నిజమైన మాస్టర్‌వయ్యా " అని చప్పట్లు కొట్టించారు పత్రీజీ .. ఎంత సత్యపూరితమైన భావాలో చూడండి ఆయన అన్న ప్రతిమాటా ఎన్నో కోణాల్లో ఆలోచింపజేస్తుంది. ఎవ్వరైనా " ఎదుగుదాం, వీరిమాటల వెనుక అంతరార్ధం ఏమిటి ? " అని ఆలోచిస్తే, పత్రీజీ మాట మనల్ని ఎక్కడెక్కడికో తీసుకుపోయి, ఎన్నెన్నో విషయాలను ముడి విప్పిచూపిస్తుంది.

" పరమశివుడు సగం కళ్ళు ఎందుకు తెరుచుకుని ఉంటాడు " అని అడిగారొకరు పత్రీజీ ని. " దాన్ని ‘ అర్థ నిమీలిత నేత్రాలు ’ అంటారు. అంటే సగం చూపు భూమండలం పైన, సగం చూపు సూక్ష్మలోకాల పైన ఉంటుందన్నమాట " ఇదీ పత్రీజీ వ్యాఖ్యానం.

మారం : పత్రీజీ ని మీరు అతి దగ్గరగా, ఏకాంతంలో కూర్చున్నప్పుడో, ప్రకృతిలో కూర్చున్నప్పుడో, క్లాస్ చెప్పుతున్నప్పుడో, పాడుతున్నప్పుడో, ఫ్లూట్ వాయిస్తున్నప్పుడో, ఇతర ప్లానెట్ వాళ్ళు కానీ, సత్యలోకపు మాస్టర్లు కానీ వచ్చింది ఎప్పుడైనా గమనించి ఉంటారు. అటువంటి ఒక సందర్భం వివరించండి.

శివప్ప : చాలా సందర్భాల్లో గమనించాను. నెల్లూరులో, టౌన్‌హౌస్‍పేటలో పత్రీజీ స్టేజీమీద కూర్చున్నారు. నెల్లూరు రేవతీ మేడమ్ వాళ్ళు క్లాస్ ఏర్పాటు చేసారు. న్యూటన్ కూడా ఉన్నాడప్పుడు. స్టార్ స్టేజీమీద భజగోవిందం శ్లోకాలు పాడుతున్నారు. ఒకాయన తెల్లటిబట్టలు కట్టుకుని పెద్ద వేదపండితుడిలాగా ఉన్నాడు. లోపలికి నడుచుకుంటూ వచ్చాడు. " పండులాగా ఉన్నాడు " అంటూంటాం కదా. అలా ఉన్నాడు. " రండి లోపలికి " అన్నాను. వస్తున్నాను .. వస్తున్నాను.. చాలా అద్భుతంగా చెపుతున్నారు, పాడుతున్నారు భజగోవిందం గురించి, అమృతంలా ఉంది. చాలా గొప్పవాడాయన" అని వెనుదిరిగి రెండు అడుగులు వేసాడు. గేటు దగ్గరికి కూడా వెళ్ళలేదు. మనిషి కనబడలేదు. నా ప్రక్కనే డా|| న్యూటన్ ఉన్నారు. " వచ్చిందెవరో తెలుసా? ఆది శంకరాచార్యులు " అన్నారు న్యూటన్. అలా చాలా సందర్భాల్లో .. ఎంతోమంది మాస్టర్స్ ..

మారం : పత్రీజీ ఏదైనా సరికొత్తపని చేసినప్పుడు, గొప్పకార్యాన్ని మొదలుపెట్టినప్పుడు, ధ్యాన మహాయజ్ఞాలు నిర్వహణ సందర్భంగా కాస్మిక్ సిగ్నల్స్ రావడం గమనించారా?

శివప్ప : 1999 సంవత్సరంలో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో దాదాపు 1500 మందు ఉన్న క్లాస్‌లో పత్రీజీ క్లాస్ చెపుతూ ఉండగా, వారికి గొంతు పట్టేసింది. వాయిస్ రాక సార్ అందరినీ మెడిటేషన్‌లోకి వెళ్ళమని సైగచేసి, తాను స్టేజీ మీద అలాగే పడుకున్నారు. గంటన్నర తరువాత లేచి, మనం " బుద్ధా పిరమిడ్ పార్టీ పెట్టబోతున్నాం .. ఫిబ్రవరి 21వతేదీ .. తిరుపతిలో ప్రారంభోత్సవం. కొండాపురానికి కంచిరఘురాం ని పిలిపించు అన్నారు.

21వతేదీ, తిరుపతి త్యాగరాజు మండపం పత్రీజీ ఆధ్వర్యంలో సరిగ్గా మధ్యాహ్నం 3.30 గం||లకు చెన్నై నుంచి వచ్చిన T.N.శేషన్ .. భీమాస్ హోటల్ వద్ద " పిరమిడ్ జెండా " ను ఆవిష్కరించారు. ఆ తర్వాత నినాదాలు లేకుండా అందరం నడుచుకుంటూ పోలీస్ ఎస్కార్ట్‌తో మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ గుండా త్యాగరాజు గానసభకు వెళుతున్నాం.

వెళుతూ ఉంటే ఎదురుగా చాలామంది పోలీసులు వస్తున్నారు. వారి వెనుక T.T.D. అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఊరేగింపుగా తీసుకొస్తున్నారు. ఒక్కసారి స్వామి వజ్రాల ఆభరణాల ఊరేగింపుతో ఎదురుగా రావడం. ఎప్పుడూ అటువంటి సన్నివేశాన్ని చూసి ఉండలేదు. గుణాకర్, నేను ఇంకా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు. మా కళ్ళలో అంతులేని ఆనందం. ఎంతగొప్ప శకునం అది, స్పాంటేనియస్‌గా .. అలా పత్రీజీ ఏ గొప్పకార్యక్రమం మొదలుపెట్టినా, దానికి ఏదో ఒక ‘శకునం’ అనేది కనబడుతూనే ఉంటుంది.

మొన్న డిసెంబర్ 25 వతేదీ సాయంత్రం " తాండవ శివ, సంగీత, నృత్య ధ్యాన యజ్ఞం " సందర్భంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి గుడిలో మల్లికార్జునస్వామికి హారతి ఇచ్చిన కర్పూరంతో గర్భగుడిలో కాగడా వెలిగించి ఇచ్చి పత్రీజీ చేతికి ఇచ్చారు ఆలయ పూజారులు.

ఆ శివజ్యోతిని అలాగే తీసుకుని వచ్చి ధ్యానయజ్ఞం వేదిక వరకు మహా ఊరేగింపుగా తెచ్చి, స్టేజీపైన దీపం వెలిగించారు. ఇలా ఉంటాయి పత్రీజీకి కాస్మోస్ నుంచి వచ్చే సిగ్నల్స్.

మారం : పిరమిడ్ పార్టీ 2009 సంవత్సరం అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్‌లో పోటి చేసిన వారు కానీ, ప్రచారం చేసినవారు కానీ, ఎంతో శ్రమించారు వారు కానీ చాలామంది ఫలితాల పట్ల చాలా నొచ్చుకున్నారు. కామెంట్ చేసారు, బాధపడ్డారు.

శివప్ప : పిరమిడ్ పార్టీ 1999 సంవత్సరంలో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి ఎలక్షన్స్‌లో హింస అనేది దాదాపుగా తగ్గిపోయింది. నిరంతర ధ్యానం చేసే ఒక ధ్యాని ఆ పిరమిడ్ పార్టీ పాంప్లెట్ తీసుకుని, అది మురికివాడా, ధనవంతుల ఏరియానా, పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రమా, వ్యవసాయ క్షేత్రమా, వ్యాపార సంస్థా అనే బేధం లేకుండా, " అమ్మా ధ్యానం చేయండి, అయ్యా ధ్యానం చేయండి " అని అక్కడ ధ్యానసభలను నివహించాడంటే అది చాలా గొప్ప విషయం. ఈ సమాజానికి కానీ, తోటి మానవులకు కానీ పిరమిడ్ మాస్టర్లు, తమ అంతఃశరీరాలతో చేసిన సేవ ఎంతెంత అనేది స్థూలంగా కనపడదు. అదంతా సూక్ష్మంగా ఉంటుంది.

మనం కొంచెం సూక్ష్మంలోనూ, కొంచెం స్థూలంలోనూ, ఉంటాం కనుక సందేహాలు రావడం సహజం. పూర్తిగా సూక్ష్మంలోకి వచ్చే వరకు మాస్టర్స్‌కు కూడా ఈ సందేహాలు ఉంటాయి. పత్రీజీ ఏ పని చేసినా, ఆలోచన లేకుండా ఊరికే చేయించరు. ఊరికోసమే చేయిస్తారు.

మారం : " 2010 సంవత్సరం నుంచి పిరమిడ్ మాస్టర్లు సంపదలు పొంది, మహాలక్ష్ములుగా అవుతారు " అన్నారు శ్రీశైల ధ్యానమాహాయజ్ఞ వేదికలో పత్రీజీ. మరింత వివరించండి.

శివప్ప : ధ్యానం చేయడం అనేది వ్యక్తిగత కర్మ. ధ్యానప్రచారం చేయడం అనేదు గురుదక్షిణ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ధ్యానం ద్వారా పర్వతీతనయులు అయ్యారు. అందరూ శక్తివంతులయ్యారు. సరస్వతీపుత్రులయ్యారు. జ్ఞానం వచ్చింది. ఆత్మజ్ఞానంవచ్చింది. సిద్ధుళ్ళయ్యారు, బుద్ధుళ్ళయ్యారు. ఇక లక్ష్మీప్రసన్నం, లక్ష్మీకటాక్షం కావాలి. ఎందుకంటే విశేషమైన ప్రాజెక్టులున్నాయి. విశేషమైన ప్రణాళికలున్నాయి. వీటిన్నటికీ లక్ష్మీకటాక్షం కోసం మనం ఏ పనులు చేయం. మనం చేసే పనుల వల్ల లక్ష్మీకటాక్షం వస్తుంది. ఇంతవరకు బెంగళూరు " మైత్రేయ బుద్ధా పిరమిడ్ " కి పదివేలు, అయిదువేలు, వెయ్యి ఇలా ఎంతో శ్రమపడి పంపించాం మనం. ఇప్పుడు అగత్యం రాదు. లక్ష్మీకటాక్షం సిద్ధిస్తుంది.

ఇప్పుడు ఏ పిరమిడ్ మాస్టరయినా తానొక పిరమిడ్ కట్టాలి అంటే ఏ శ్రీమంతుడో, ఏ కర్మతీరిన వాడో వచ్చి " నేను కట్టిస్తాను " అంటాడు. ఇంతకు ముందు ఎంతో శ్రమతో, కష్టంతో మన ప్రాజెక్టుల కోసం శ్రమించాం; ఇప్పుడు మనం ఒక పిరమిడ్, ఒక ప్రాజెక్టు సంకల్పిస్తే దానికి అవసరమైన లక్ష్మి సంప్రాప్తిస్తుంది. ఇదీ " లక్ష్మీ కటాక్షం " అంటే .. " శ్రీ శైల ధ్యానమహాయజ్ఞం " జరగాలి. జరిగింది అద్భుతంగా, మహాద్భుతంగా, పరమాద్భుతంగా.. దీనికి తగిన డబ్బు శ్రమతో వచ్చింది. అమరావతిలో " ధ్యానమహాచక్రం " అని పత్రీజీ ప్రకటించిన వెంటనే గుంటూరు లక్ష్మణ్‌రావు వచ్చారు, " నేను చేస్తా " నని. అదీ లక్శ్మీ కటాక్షం అంటే. అంతేకానీ మొత్తం డబ్బంతా వచ్చి మన అకౌంట్‌లో పడిపోవడం కాదు.

Go to top